ఉప రాష్ట్రపతి సచివాలయం
ఆయుర్వేదం మన జీవన విధానం: ఉపరాష్ట్రపతి
• సంపూర్ణ ఆరోగ్యరక్షణ దిశగా అన్వేషణ జరగాలి
• ఈ విజ్ఞానాన్ని సద్వినియోగ పరుచుకుని కరోనా నివారణపై దృష్టి పెట్టాలి
• సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ కోసం నిరంతర ఆయుర్వేద ప్రయోగాలు జరగాలి
• సంప్రదాయ, ఆధునిక వైద్యవ్యవస్థల సమన్వయంలోనే విశ్వమానవాళి శ్రేయస్సు
• ‘వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం’ అంతర్జాతీయ సదస్సులో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు
Posted On:
15 SEP 2020 5:38PM by PIB Hyderabad
అపారమైన జ్ఞానానికి ప్రతీకైన భారతీయ ఆయుర్వేదం సమగ్ర వైద్యవిధానమే గాక, భారతీయుల జీవన విధానమని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇంతటి విస్తృత జ్ఞానాన్ని వినియోగించుకుని వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం ద్వారా కరోనా మహమ్మారిని నివారించడంపై మరిన్ని ప్రయోగాలు జరగాల్సిన అవసరముందని ఆయన సూచించారు.
‘వ్యాధినిరోధకతకు ఆయుర్వేదం’ ఇతివృత్తంతో సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ ఆయుర్వేద సదస్సును మంగళవారం అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సహజంగా అందుబాటులో ఉండే వస్తువులతోనే అద్భుతమైన వైరస్‌తో పోరాడే శక్తిని ఆయుర్వేదం అందిస్తుందని తెలిపారు. భారతీయ జీవన విధానానికి ప్రతిబింబమైన ఆయుర్వేదాన్ని మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆధునిక వైద్య వ్యవస్థకు, ఆయుర్వేదం వంటి సంప్రదాయ పద్ధతులను జోడించి విశ్వమానవాళి శ్రేయస్సుకై మరిన్ని ప్రయోగాలు జరపాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
‘ఆయుర్వేదం.. మానవుడిని కూడా ప్రకృతిలో ఓ అభిన్న అంగంగానే భావిస్తుందని, అందుకే మానవుడికి వచ్చే సమస్యలకు తన చుట్టూ ఉన్న ప్రకృతిసిద్ధమైన మందులతోనే తగ్గిస్తుందని, అదే ఆయుర్వేదం ప్రత్యేకత అని ఆయన తెలిపారు. కఫ, వాత, పిత్త (త్రిదోష) దోషాలను, ప్రకృతిని సమన్వయం చేసుకుని ముందుకెళ్తే మానవ శరీరం ఎప్పటికీ ఆరోగ్యంగానే ఉంటుందని పేర్కొన్నారు.
అథర్వణ వేదం, చరకసంహిత, సుశ్రుత సంహిత మొదలైన పురాతన వైద్య గ్రంథాలను ప్రస్తావిస్తూ.. ప్రాచీనకాలంలో భారతదేశం క్రమపద్ధతిలో, శాస్త్రీయమైన, హేతుబద్ధమైన పద్ధతిలో వివిధ వ్యాధులకు చికిత్సనందించిన విషయాన్ని కూడా ఉపరాష్ట్రపతి తన ప్రసంగలో పేర్కొన్నారు. అప్పటినుంచి ప్రాథమిక, అత్యవసర వైద్యసేవలు అందించడంలోనూ ఆయుర్వేదం పాత్ర మరువలేనిదన్నారు.
ఆయుర్వేద ప్రాశస్త్యం ఇలాగే కొనసాగేందుకు ప్రైవేటు కంపెనీలు, ప్రభుత్వం కలిసి పనిచేస్తూ.. కొత్త ఔషధాలకోసం ప్రయోగాలు జరిపేలా అధునాత ఆర్&డీ సదుపాయాల కల్పనపై దృష్టిపెట్టడం తక్షణావసరమని సూచించిన ఉపరాష్ట్రపతి, ఇప్పటికే భారతదేశం నాణ్యమైన, అందుబాటు ధరల్లో ఔషధాలను ప్రపంచానికి అందిస్తోందని తెలిపారు. దీనితోపాటుగా దేశాన్ని సంపూర్ణ ఆరోగ్యానికి కేంద్రంగా మార్చడంతోపాటు మెడికల్ టూరిజాన్ని ప్రోత్సహించేలా మరిన్ని చర్యలు చేపట్టాలని సూచించారు.
లిఖిత పూర్వక శాస్త్రీయ ఆధారాల ద్వారా ఆయుర్వేద ఔషధాల లక్షణాలను మరింత అన్వేషించాల్సిన అవసరాన్ని గుర్తుచేసిన ఉపరాష్ట్రపతి ఆయుర్వేద ప్రయోజనాలను మనదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మానవాళికి అందుబాటులోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఆయుర్వేద వైద్యంలోని భాగస్వామ్య వర్గాలు.. నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్ వంటి సంస్థలో కలిసి పనిచేయడం ద్వారా సంప్రదాయ వైద్యానికి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చేలా కృషిచేయాలన్నారు. హెల్త్ స్టార్టప్‌లను ప్రోత్సహించడంపైనా దృష్టిపెట్టాలని ఆయన సూచించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకునేందుకు ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని, పౌష్టిక, ఆరోగ్యకరమైన భోజన పద్ధతులను అలవర్చుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ప్రపంచంలోనే పేదలకోసం అతిపెద్ద ఆరోగ్యబీమా అయిన ‘ఆయుష్మాన్ భారత్’ను ఆయుర్వేదానికి వర్తించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందన్నారు. దీంతోపాటుగా విస్తృతమైన ఉపాధి అవకాశాలు కల్పించే రంగమైన ఆయుర్వేదాన్ని ప్రోత్సహించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను కూడా నిర్వహించాలన్నారు.
ఈ కార్యక్రమంలోకేంద్ర మంత్రి శ్రీ వి.మురళీధరన్, సీఐఐ చైర్మన్ శ్రీ థామస్ జాన్ ముత్తూట్, సీఐఐ ఆయుర్వేద ప్యానల్ కో-కన్వీనర్ శ్రీ బేబీ మాథ్యూ, ఆయుర్వేద అసోసియేషన్ సభ్యులు, ఆయుర్వేద డాక్టర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1654624)
Visitor Counter : 235