నీతి ఆయోగ్

భారత ఎం ఎస్ ఎం ఇ లు, స్టార్టప్ లు నవకల్పనల దిశగా సాగేందుకు చర్య

ఇస్రోతోబాటు నాలుగు మంత్రిత్వశాఖలకు బాధ్యతలు

Posted On: 09 SEP 2020 7:55PM by PIB Hyderabad

నీతి ఆయోగ్ లోని అటల్ ఇన్నొవేషన్ మిషన్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ ఎరైజ్-అటల్ న్యూ ఇండియా చాలెంజెస్ ను ఆవిష్కరించింది. దీనివలన భారతదేశంలోని ఎం ఎస్ ఎం ఇ లు, స్టార్టప్ లు ఆచరణాత్మక పరిశోధనలకు, నవకల్పనలకు పూనుకుంటాయని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఇస్రో తోబాటు రక్షణ, ఫుడ్ ప్రాసెసింగ్, ఆరోగ్య, కుటృంబ సంక్షేమ, గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖలు ముందుకు నడిపిస్తాయి. ఆయా రంగాల సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవటానికి ఈ మంత్రిత్వశాఖలు సహాయపడతాయి.

వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖామంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ దేశ ప్రగతి చోదకాలైన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల మీద ఎన్నో ఆశలున్నాయన్నారు. ఈ రంగాన్ని అభివృద్ధి పరచటానికి అవసరమైన నవకల్పనలను గుర్తించి ప్రోత్సహించటానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. శాస్త్రీయ పరిశోధనమీద దృష్టిపెట్టాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముందు చూపును ప్రస్తావిస్తూ, సామాజిక, ఆర్థిక సమస్యల పరిష్కారానికి సైన్స్ ఉపయోగపడాలని, శాస్త్రపరిశోధనలు ప్రయోగశాలలనుంచి పొలాలకు చేరాల్సిన అవసరముందని గుర్తుచేశారు.

గౌరవ మంత్రి మాటలతో నీతి ఆయోగ్ ఉపాధ్యక్షులు డాక్టర్ రాజీవ్ కుమార్ ఏకీభవించారు.  ఈ చొరవ వలన టెక్నోప్రెన్యూర్లు తయారవుతారన్నారు. భారత్ ను ముందుకు నడిపించటానికి అలాంటి వారిలో దాగిన సామర్థ్యాన్ని వెలికి తీయాల్సిన అవసరముందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక వ్యక్తులు కలసి ముందుకు వచ్చి ఎం ఎస్ ఎం ఇ రంగానికి జవసత్వాలు కల్పించటానికి సిద్ధం కావటం చరిత్రాత్మకమన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం పరిశోధనతో కూడిన నవకల్పనలను ప్రోత్సహించటానికి రూ. 50 లక్షల వరకు సహాయంగా అందజేస్తుంది. దీనివలన టెక్నాలజీ పరిష్కారం లేదా ఉత్పత్తి సిద్ధమవుతాయి.

టెక్నాలజీని ప్రోత్సహించే ఇస్రో తప్ప భారత విభాగాలు, పెద్ద కంపెనీలు ఇంత భారీ స్థాయిలో  విశిష్టమైన కృషి చేసే కొత్త స్టార్టప్ సంస్థలను ప్రోత్సహించలేదు. ఈ సవాళ్ళను ఎదుర్కోవటంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ విజయం సాధిస్తుందని , కొత్త భారతీయ ఉత్పత్తులను తయారు చేస్తుందని నీతి ఆయోగ్ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు. ఇస్రో చాలా విస్తృతంగా ఎం ఎస్ ఎమ్ ఇ రంగానికి సహాయం అందిస్తూ వస్తున్నదని సంస్థ చైర్మన్ డాక్టర్ కె శివన్ అన్నారు. ఎన్నో స్టార్టప్ లు, ఎం ఎస్ ఎం ఇ లు తమ ఆలోచనలను లాభదాయకమైన ఉత్పత్తులుగా మార్చటానికి దగ్గరుండి చేయిపట్టి నడిపించే సంస్థల సాయం కోరుకుంటున్నాయని, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ వల్ల వాటి ఆశయాలు సాకారమవుతాయని అన్నారు.

అటల్ ఇన్నొవేషన్ మిషన్ డైరెక్టర్ శ్రీ ఆర్. రమణ మాట్లాడుతూ, ఎం ఎస్ ఎం ఇ  చాలా చురుగ్గా అతి వేగంగా ఎదుగుతున్న రంగమని, నిర్ద్వంద్వంగా అవి ప్రధాని ఆశిస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ సాధనలో కీలకపాత్ర పోషిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మేకిన్ ఇండియా నవకల్పనలకు ప్రేరణ ఇవ్వటానికి 15వ ఆత్మ నిర్భర్ భారత్ ఎరైజ్ సవాళ్ళు ఒక అద్భుతమైన చొరవగా ఆయన అభివర్ణించారు. ఇది ఎం ఎస్ ఎం ఇ రంగానికి విశిష్టమైన అవకాశమని, అత్యాధునిక పరిశోధనకు, మార్కెట్ లో లాభదాయకమైన ఆలోచనలకు బీజం వేస్తుందని అభిప్రాయపడ్దారు. ఈ ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయవచ్చునని కూడా ఆయన సూచించారు.

ప్రత్యేకాంశాలు:

అటల్ ఇన్నొవేషన్ మిషన్ కు చెందిన 100 అటల్ టింకరింగ్ లాబ్స్ తీసుకోనున్న ఇస్రో

మహాత్మా గాంధీ ఛాలెంజ్ తరహాలో నవకల్పనల ఆలోచనాపరులను ఆకట్టుకోవాలని అధికారుల సూచన

అటల్ ఇన్నొవేషన్ కింద ఎం ఎస్ ఎం ఇ లను అభివృద్ధి చేయటం మీద దృష్టిపెట్టాలని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖామంత్రి వ్యాఖ్య

***



(Release ID: 1652847) Visitor Counter : 271