రైల్వే మంత్రిత్వ శాఖ
"రియల్ మ్యాంగో" సాఫ్ట్‌వేర్ ద్వారా రైళ్లలో అక్రమంగా సీట్లు రిజర్వ్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేసిన ఆర్‌పీఎఫ్ సాఫ్ట్‌వేర్ పూర్తిగా నిర్వీర్యం
ఇప్పటివరకు 50 మంది అరెస్టు, రూ.5 లక్షలకు పైగా విలువైన టిక్కెట్లు రద్దు
Posted On:
08 SEP 2020 4:48PM by PIB Hyderabad
అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి రైళ్లలో సీట్లను రిజర్వ్ చేస్తున్న ముఠాను రైల్వే రక్షక దళం పట్టుకుంది. ఇందుకోసం జాతీయ స్థాయి దర్యాప్తు జరిపింది. "రియల్ మ్యాంగో" అనే సాఫ్ట్‌వేర్ ద్వారా అక్రమార్కులు అడ్డదారిలో సీట్లు రిజర్వ్ చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించింది.
ప్రయాణీకుల రైళ్ల సంఖ్యను పెంచిన తర్వాత అక్రమార్కుల ఆగడాలు కూడా పెరుగుతాయన్న ఆలోచనతో రైల్వే రక్షక దళం రంగంలోకి దిగింది. "రేర్ మ్యాంగో" అనే అక్రమ సాఫ్ట్‌వేర్ ద్వారా దళారులు టిక్కెట్లు బుక్ చేస్తున్న సంగతి పసిగట్టి, గతనెలలోనే కొందరిని అరెస్ట్ చేసింది. రేర్ మ్యాంగో పేరునే దళారులు తర్వాత రియల్ మ్యాంగో అని మార్చారు. ఉత్తర మధ్య రైల్వే, తూర్పు రైల్వే, పశ్చిమ రైల్వే పరిధిలో అధికారుల దర్యాప్తు కొనసాగింది. కొంతమంది అనుమానితులను పట్టుకున్నాక, ఈ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టారు.
1. వీ3, వీ2 క్యాప్చాలను రియల్ మ్యాంగ్ సాఫ్ట్‌వేర్ దాటవేస్తుంది.
2. మొబైల్ యాప్ ద్వారా బ్యాంక్ ఓటీపీని దానంతట అదే నమోదు చేస్తుంది.
3. ప్రయాణీకులు, చెల్లింపు వివరాలను కూడా దానంతట అదే నమోదు చేస్తుంది.
4. వివిధ ఐడీల ద్వారా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లోకి ఈ సాఫ్ట్‌వేర్ లాగిన్ అవుతుంది.
5. ఈ అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఐదు అంచెల ద్వారా విక్రయించారు. సిస్టం అడ్మిన్&అతని బృందం, నిపుణులు, పెద్ద విక్రేతలు, విక్రేతలు, ఏజెంట్లు.
6. సిస్టం అడ్మిన్‌కు బిట్ కాయిన్ల రూపంలో చెల్లింపులు జరిగాయి.
సాఫ్ట్‌వేర్‌ను సృష్టించిన వ్యక్తి, కీలక సూత్రధారులతోపాటు ఇప్పటివరకు 50 మందిని ఆర్‌పీఎఫ్ అరెస్ట్ చేసింది. ఇప్పటికే రిజర్వ్ చేసిన రూ.5 లక్షలకు పైగా విలువైన టిక్కెట్లను రద్దు చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఐదుగురు కీలక వ్యక్తులు దొరికారు. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఆర్‌పీఎఫ్ అధికారులు పూర్తిగా నిర్వీర్యం చేశారు.
2019 డిసెంబర్, 2020 మార్చి మధ్య దేశవ్యాప్తంగా ఆర్‌పీఎఫ్ దాడులు నిర్వహించింది. ఏఎన్‌ఎంఎస్, రెడ్ మిర్చి, బ్లాక్ టీఎస్, టిక్‌టాక్, ఐ బాల్, రెడ్ బుల్, మ్యాక్, ఎన్ గెట్, సైకిల్, స్టార్ వీ2 వంటి అక్రమ సాఫ్ట్‌వేర్లను గుర్తించి, అక్రమార్కులను అరెస్టు చేసింది. ఆర్‌పీఎఫ్ అందించిన సమాచారంతో, రైల్వే టిక్కెట్ల రిజర్వేషన్ భద్రతను ఐఆర్‌సీటీసీ మరింత మెరుగు పరుచుకుంది.
***
(Release ID: 1652450)
Visitor Counter : 210