యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌'లో పాల్గొనాలని అర్జున పురస్కార గ్రహీత మధురిక పట్కర్‌ పిలుపు

Posted On: 07 SEP 2020 7:09PM by PIB Hyderabad

టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి మధురిక పట్కర్‌తో, ముంబయిలోని భారత క్రీడల అథారిటీ ప్రాంతీయ కేంద్రం ఆన్‌లైన్‌ ముఖాముఖి నిర్వహించింది. ఈ ఏడాది అర్జున పురస్కార గ్రహీతల్లో మధురిక పట్కర్‌ ఒకరు. ప్రస్తుతం కొనసాగుతున్న 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌' ప్రాధాన్యత గురించి ఆమె మాట్లాడారు.

    రన్‌ కార్యక్రమాన్ని కేంద్ర క్రీడల మంత్రిత్వ శాఖ గత నెల 14వ తేదీన ప్రారంభించింది. దేశవ్యాప్తంగా పరుగు కొనసాగి, వచ్చేనెల 2వ తేదీన ముగుస్తుంది. ఎందరో క్రీడా, క్రీడాయేతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆకర్షణ తెచ్చారు.

    "మనదేశాన్ని ఆరోగ్యంగా మార్చడానికి ఇదొక అడుగు. దేశాన్ని ఆరోగ్యవంతంగా మార్చడానికి మనమంతా ఇందులో పాల్గొనాలి. లాక్‌డౌన్‌ తర్వాత ఇప్పుడిప్పుడే ఇళ్ల నుంచి బయటకు వస్తున్నాం. వ్యాయామాలకు ఇదే గొప్ప సమయం. పరుగు అనేది ప్రాథమిక కసరత్తు. ఈ సమయంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కేంద్ర క్రీడల శాఖకు, మంత్రి కిరణ్‌ రిజిజుకు ధన్యవాదాలు. 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌'లో అందరూ పాల్గొనాలని అభ్యర్థిస్తున్నా" అని మధురిక చెప్పారు.

    సమూహంలో కలిసి పరిగెత్తడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని మధురిక తెలిపారు. "పరిగెత్తడానికి నేను బయటకు వెళ్లినప్పుడు ప్రకృతితో కలిసిపోయినట్లు భావిస్తా. అదొక గొప్ప అనుభూతి. మొదట మనం ఇందులో పాల్గొని, తద్వారా ఇతరులకు స్ఫూర్తినివ్వాలి. స్నేహితులకు ఇష్టం లేకపోయినా వారిని ఆహ్వానిద్దాం. ఒకసారి పరిగెత్తడం మొదలుపెడితే, వారు దానిని ఇష్టపడతారు. అంతా కలిసి సమూహంగా ఏర్పడితే, కసరత్తులు ఆహ్లాదకరంగా మారతాయి" అని వెల్లడించారు. 

    మధురిక మాటలను ముంబయి శాయ్‌ కేంద్రం ప్రాంతీయ డైరెక్టర్‌ సుమిత్ర జ్యోత్సి ప్రశంసించారు. మనం ఎప్పుడూ ఇతరులను నాలుగింతలు ప్రేరేపించాలన్నారు.

    "మధురిక, మీ మాటలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. మిమ్మల్ని చూసి చాలామంది స్ఫూర్తి పొందుతారు. ఆరోగ్యంగా ఉండడానికి, కరోనాతో పోరాడడానికి పుష్ఠిగా ఉండడం ఒక్కటే మార్గం. క్రీడాకారులు జాతీయ చిహ్నాలు. 'ఫిట్‌ ఇండియా ఫ్రీడమ్‌ రన్‌'లో పాల్గొనేలా వారు మరో నలుగురిని ప్రేరేపించాలి. 100 మంది స్ఫూర్తిపొందితే, వారు 400 మందిలో స్ఫూర్తి నింపుతారు." అని చెప్పారు.

***



(Release ID: 1652106) Visitor Counter : 136