సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
ప్రభుత్వ ప్రకటనల్లో సమాచార నియంత్రణపై సుప్రీంకోర్టు నిర్దేశిత త్రిసభ్య కమిటీ 19వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు
Posted On:
07 SEP 2020 4:34PM by PIB Hyderabad
ప్రభుత్వ ప్రకటనల్లో సమాచార నియంత్రణపై సుప్రీంకోర్టు నిర్దేశిత త్రిసభ్య కమిటీ (సీసీఆర్‌జీఏ) 19వ సమావేశం ఈనెల 4వ తేదీన జరిగింది.
భారత ఎన్నికల విశ్రాంత ప్రధాన కమిషనర్ శ్రీ ఓం ప్రకాశ్ రావత్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఐఏఏ మాజీ అధ్యక్షుడు, ఏసియన్ ఫెడరేషన్ ఆఫ్ అడ్వర్‌టైజింగ్ అసోసియేషన్స్‌కు చెందిన రమేశ్ నారాయణ్, ప్రసారభారతి బోర్డు తాత్కాలిక సభ్యుడు అశోక్ కుమార్ టాండన్ సభ్యులుగా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం, ప్రభుత్వ ప్రకటనల్లో సమాచార నియంత్రణపై రాష్ట్రాలన్నీ త్రిసభ్య కమిటీలను నియమించాలి. కర్ణాటక, గోవా, మిజోరం, నాగాలాండ్ ఇప్పటికే రాష్ట్రస్థాయి కమిటీలను నియమించాయి. తమ ప్రభుత్వ ప్రకటనల్లో సమాచారాన్ని పర్యవేక్షించేందుకు కేంద్ర కమిటీకి ఛత్తీస్‌గఢ్ అంగీకారాన్ని తెలియజేసింది.
ఇంకా రాష్ట్రస్థాయి కమిటీలను నియమించని రాష్ట్రాలను సీసీఆర్‌డీఏ తీవ్రంగా పరిగణించింది. సీసీఆర్‌డీఏ దృష్టిలో ఇది సుప్రీంకోర్టు ఆదేశాల ధిక్కారం. కమిటీకి వచ్చిన ఫిర్యాదులపై కొందరు వ్యక్తులకు ఇచ్చిన నోటీసులకు ఇంకా సమాధానాలు రాలేదన్న విషయాన్ని కూడా కమిటీ గుర్తించింది. కరోనా దృష్ట్యా వారికి మరికొంత సమయం ఇవ్వాలని నిర్ణయించింది.
తమ నిర్ణయాలను రాష్ట్రాలు పాటించకపోడాన్ని సీసీఆర్‌జీఏ తీవ్రంగా తీసుకుంది. సీసీఆర్‌జీఏ ఆదేశాలను పాటించకపోతే, సంబంధిత ప్రభుత్వాల నోడల్ సంస్థలు ఇకపై ప్రకటనలు ఇవ్వకుండా నిషేధం విధించాలని కూడా కమిటీ భావిస్తోంది. నోటీసులకు స్పందించకుండా కాలయాపన చేసే ప్రభుత్వాధికారులను, అవసరమైతే తమ ముందు హాజరయ్యేలా ఆదేశించాలని కూడా కమిటీ నిర్ణయించింది.
2015 మే 13వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, 2016 ఏప్రిల్ 6వ తేదీన... సంబంధిత రంగాల్లో నిపుణులు, నిష్పాక్షికంగా వ్యవహరించే ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఖర్చుతో అన్ని మీడియాల్లో వచ్చే ప్రకటనల్లోని సమాచారాన్ని పర్యవేక్షించడం ఈ కమిటీ కర్తవ్యం. 2015 మే 13న వెలువడిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం "ప్రభుత్వ ప్రకటనల్లోని సమాచారం రాజ్యాంగ, చట్టబద్ధ బాధ్యతలకు, పౌరుల హక్కులు, అర్హతలకు సంబంధించి ఉండాలి", " ప్రకటనలోని సమాచార ఉద్దేశం, అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాలను తీర్చేదిగా ఉండకూడదు", "ప్రకటన ద్వారా చేసే ప్రచారం న్యాయబద్ధంగా, సమర్థవంతంగా, తక్కువ ఖర్చుతో ఉండాలి", "చట్ట, ఆర్థిక నిబంధనలు, విధానాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రకటనలు ఉండాలి".
ప్రభుత్వ ప్రకటనలు సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో ప్రజలు ఫిర్యాదులు చేస్తే స్వీకరించి పరిష్కరించడానికి, ప్రభుత్వాలకు తగిన సిఫారసులు చేయడానికి ఈ కమిటీకి సుప్రీంకోర్టు అధికారం ఇచ్చింది. కమిటీకి ఫిర్యాదులు చేయాలనుకుంటే చిరునామా: ది మెంబర్ సెక్రటరీ, కమిటీ ఆన్ కంటెంట్ రెగ్యులేషన్ ఇన్ గవర్నర్‌మెంట్ అడ్వర్‌టైజింగ్ (సీసీఆర్‌జీఏ), రూమ్ నం.469, ఫోర్త్ ఫ్లోర్, సూచన భవన్, సీజీవో కాంప్లెక్స్, లోధీ రోడ్, న్యూదిల్లీ-110003. ఫోన్ నంబర్: 011-24367810, వాట్సాప్ నంబర్: +91 9599896993, ఈ మెయిల్: ms.ccrga[at]gmail[dot]com.
*****
(Release ID: 1652064)
Visitor Counter : 227