మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
నిరంతర విద్య, అందరికీ భద్రతను కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన జి 20 సభ్య దేశాలు
నిరంతర విద్య కొనసాగింపు, ప్రాథమిక స్థాయిలో విద్యాభ్యాసం, విద్యలో అంతర్జాతీయీకరణ వంటి రంగాలలో కలిసి పనిచేయాలని జి20 విద్యామంత్రుల వర్చ్యువల్ సమావేశంలో తీర్మానం
భారత్ జాతీయ విద్య విధానం 2020 ద్వారా ఈ లక్ష్యాలను సాధించే దిశగా నిబద్దతతో కృషి చేస్తున్నామని స్పష్టం చేసిన శ్రీ రమేష్ పోఖ్రియాల్
Posted On:
06 SEP 2020 11:07AM by PIB Hyderabad
జి 20 దేశాల విద్యా మంత్రులు విద్యారంగంలో కలిసి పనిచేయడానికి, ఉత్తమ ఆలోచనలు, పద్ధతులను పంచుకోవాలని సంకల్పించారు. తద్వారా సభ్య దేశాలు సమ్మిళిత, సమధర్మంతో కూడిన నాణ్యమైన విద్యను నిర్ధారించగలవని, సంక్షోభ సమయాల్లో కూడా అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహిస్తాయని వారు అభిప్రాయపడ్డారు. సంక్షోభ సమయంలో నిరంతర విద్య, ప్రాథమిక స్థాయిలోనే విద్య, విద్య అంతర్జాతీయీకరణ, ఈ మూడు రంగాలలో సభ్య దేశాల అనుభవాలను చర్చించడానికి, పరస్పరం ఆలోచనలను పంచుకునేందుకు జి 20 విద్యా మంత్రుల వర్చువల్ సమావేశం నిన్న జరిగింది.
భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ మాట్లాడుతూ ఈ ఇతివృత్తాలు కూడా భారత ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రాధాన్యతఅంశాలని అన్నారు. వీటి పట్ల భారతదేశం నిబద్ధత కొత్త జాతీయ విద్యా విధానం 2020 లో ప్రతిబింబిస్తుందని, ఇది దేశ విద్యా రంగంలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. భారతదేశం తన విద్యావ్యవస్థను సంస్కరించడానికి, మార్చడానికి, కోవిడ్ 19 మహమ్మారి ఎదుర్కొంటున్న సవాలును తగ్గించడానికి చర్యలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు. విద్యారంగంలో జి 20 సభ్య దేశాలతో కలిసి పనిచేయడానికి భారత్ కట్టుబడి ఉందని ఆయన అన్నారు.
విద్యా మంత్రులు సమావేశం ముగింపులో ఒక ప్రకటనను ఆమోదించారు. సంక్షోభ సమయాల్లో నిరంతర విద్య నిర్ధారించడానికి సంబంధించి, దూర బోధనా, సమ్మిళిత బోధన, అభ్యాసం విలువను ఈ ప్రకటన ద్వారా గుర్తిస్తున్నట్టు చెప్పారు. అధిక-నాణ్యత విద్య, విద్యావంతులలో వృత్తిపరమైన అభివృద్ధి, డిజిటల్ మౌలిక సదుపాయాలు, కంటెంట్, సైబర్ సెక్యూరిటీ అవగాహన, తగిన బోధనా పద్దతుల ప్రాముఖ్యతను ఈ ప్రకటన నొక్కి చెబుతుంది.
ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్ (ఇసిఇ) ప్రాముఖ్యతను కూడా ఈ ప్రకటనలో ప్రముఖంగా ప్రస్తావించారు. పిల్లలందరికీ, ముఖ్యంగా హాని కలిగించే సమూహాలలో ఉన్నవారికి నాణ్యమైన ఇసిఇ ప్రాప్యతను ఈ ప్రకటనలో నొక్కి చెప్పారు. ప్రతి దశలో పిల్లల అభివృద్ధి అవసరాలకు అనుగుణంగా అందించబడే నాణ్యమైన ఇసిఇ కీలక పాత్ర గురించి కుటుంబ, సమాజ అవగాహన పెంచాల్సిన అవసరాన్ని కూడా ఇది స్పష్టం చేస్తుంది.
జి -20 లీడర్స్ సమ్మిట్ సౌదీ అరేబియా 2020 నిర్వహిస్తోంది. అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్ మరియు యూరోపియన్ యూనియన్ (ఇయు) జి20 సభ్యులుగా ఉన్నారు.
జి20 విద్యామంత్రుల వర్చ్యువల్ సమావేశంలో భారతదేశ పూర్తి ప్రకటనను ఈ లింక్ లో లభ్యమవుతుంది:
మంత్రుల సమావేశం డిక్లరేషన్ గురించి ఈ లింక్ లోకి వెళ్ళండి:
*****
(Release ID: 1651849)
Visitor Counter : 178