సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యావిధానం 21వ శతాబ్దపు విప్లవాత్మక సంస్కరణ: ప్రకాశ్ జావడేకర్
ఉన్నత విద్యలో చేరికల నిష్పత్తి రెట్టింపవుతుందని ప్రభుత్వ విశ్వాసం
బాల్యపు విద్యమీద దృష్టి సారించటం ఈ విధానంలో అత్యంత కీలకం
Posted On:
05 SEP 2020 2:17PM by PIB Hyderabad
జాతీయ విద్యా విధానం - 2020 ఈ 21వ శతాబ్దపు విప్లవాత్మకమైన సంస్కరణ అవుతుందని కేంద్ర మంత్రి శ్రీ ప్రకాశ్ జావడేకర్ అభివర్ణించారు.
ముంబయ్ పార్లే తిలక్ విద్యాలయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఉపాధ్యాదినోత్సవ శతాబ్ది వేడుకలలో ఆయన వీడియో లింక్ ద్వారా కీలకోపన్యాసం చేశారు. బాల్యపు తొలినాళ్లలో నేర్పాల్సిన చదువు మీద, ప్రశ్నించటం ఆధారంగా సాగే చదువుమీద, ఉపాధ్యాయుల శిక్షణమీద, సంఖ్యా శాస్త్ర పరిజ్ఞానం మీద ప్రత్యేకంగా దృష్టిపెట్టటం ఈ కొత్త విద్యావిధానంలో ప్రత్యేకతలుగా నిలుస్తాయన్నారు. మన యువతలో సాధికారత నింపటం ద్వారా దేశాన్ని ఈ 21వ శతాబ్దంలో ముందుకు నడపటానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదన్నారు. బోధన, అభ్యసనం రెండూ ఉపాధ్యాయులకూ, విద్యార్థులకూ చాలా ఆసక్తికరంగా ఉంటాయన్నారు.
ప్రస్తుతం ఉన్నత విద్యాభాసంలో విద్యార్థుల చేరిక సుమారు 25% మాత్రమే ఉండగా నూతన విద్యా విధానం వలన వచ్చే పదేళ్లలో అది రెట్టింపు అవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. దేశ వ్యాప్తంగా విద్యార్థులలో ఆకాంక్షలు పెరిగాయని, ఆర్థిక ఎదుగుబాటు కారణంగా తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు మంచి విద్య అందించాలని కోరుకుంటున్నారని ఆయన అన్నారు. భౌగోళీకంగా ఉన్నత విద్యా సంస్థలు దేశమంతటా వ్యాపించాయని, మరీముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించటంవలన రానున్న కాలంలో స్థూల చేరుకల నిష్పత్తి పెరగటానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
అవగాహన పెంచటానికి చదువు ఒక మార్గమన్న లోక మాన్య తిలక్ మాటలతో మంత్రి తన ప్రసంగం ప్రారంభించారు. చదువు పునాదులమీద, సంఖ్యా పరమైన అక్షరాస్యత మీద కొత్త విద్యావిధానం దృష్టిపెడుతుందని చెబుతూ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ లాంటి సంస్థలు అందరికీ విద్య అందుబాటులో ఉండటానికి దోహదం చేస్తాయన్నారు. బాల్యపు చదువు ఈ విధానంలో ఎంతో ముఖ్యమని మంత్రి పునరుద్ఘాటించారు. 3 -8 ఏళ్ళ వయోవర్గంలోని వారి జ్ఞాపకశక్తి, ఆసక్తి, మానసిక సామర్థ్యం పెంచాలసిన అవసరాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఈ విద్యావిధానంలో ఆ అంశాలకు ప్రాధాన్యమిచ్చారన్నారు. బట్టీ పట్టే చదువులకు స్వస్తి చెప్పి అంర్థం చేసుకోవటం ద్వారా ముందుకు సాగటానికి ఇప్పుడు వీలు కలుగుతుందన్నారు.
ఆసక్తికరమైన కార్యకలాపాల ఆధారంగా బాల్యంలో చదువు చెప్పటంతో బాటు 9 నుంచి 12 వ తరగతి వరకూ వివరణాత్మకమైన, సరికొత్త పరిజ్ఞానాన్నిచ్చే చదువు అందుబాటులోకి వస్తుందన్నారు. దీని వలన పిల్లలకు చిన్న తనం నుంచే శాస్త్రీయత అలవడుతుందన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మన వారు పరిశోధనల పరంగా, నవకల్పనలలో పోటీపడగలిగేలా జాతీయ విద్యావిధానం అన్ని జాగ్రత్తలూ తీసుకుందని చెప్పారు. కొత్త అంశాలు కనుక్కోవటమే ధ్యేయంగా పరిశోధనలను ప్రోత్సహించటానికి 3,000 అటల్ టింకరింగ్ లాబ్స్ విజయవంతంగా నడుస్తున్నాయన్నారు. ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి అది ఎంతగానో అవసరమన్నారు. ్
సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గురించి మాట్లాడుతూ, ఉపధ్యాయుడు అంటే కేవలం పుస్తకాల నుంచో, నల్లబల్ల ద్వారానో బోధించేవాడు కాదని, ఆదర్శ ఉపాధ్యాయుడు ఎప్పుడూ తన ప్రవర్తన ద్వారా విద్యార్థులలో ఆదర్శాలు పాదుకొల్పుతాడని అన్నారు. ఉపాధ్యాయులకు సంపూర్ణంగా శిక్షణ ఇచ్చేందుకే నాలుగేళ్ళ బి ఎడ్ డిగ్రీని ఈ విధానం ప్రతిపాదించిందన్నారు. ఇందులో ప్రయోగాత్మకమైన బోధనా నైపుణ్యాలు కూడా ఉంటాయన్నారు. దీనివ్చలన ఏరికోరి మరీ బోధనావృత్తిలోకి వచ్చే వాళ్ళు పెరుగుతారన్నారు. ఏదీ కుదరక ఈ రంగంలోకి రావటం బాగా తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. సమగ్రంగా చర్చించిన మీదటే జాతీయ విద్యావిధాన రూపకల్పన జరిగిందని, అప్పట్లో డాక్టర్ కె, కస్తూరిరంగన్ నేతృత్వంలో దాదాపు13-14 మంది సబ్జెక్ట్ నిపుణులు ఎంతో నిబద్ధతతో ఈ పాలసీ కోసం పనిచేయటాన్ని గుర్తు చేసుకున్నారు.
పార్లే తిలక్ విద్యాలయ సంఘం గురించి:
ప్రధానంగా ముంబై శివారు ప్రాంతాలలో పనిచేసే విద్యా సంస్థ పార్లే తిలక్ విద్యాలయ సంఘం. 2020 జూన్ 9 న ఈ సంఘం శతాబ్ది సంవత్సరంలోకి అడుగుపెట్టింది. మహనీయుడైల లోకమాన్య తిలక్ స్ఫూర్తితో విలే పార్లే ప్రాంతానికి చెందిన కొంతమంది దేశభక్తులైన పౌరులు ఈ సంస్థను ప్రారంభించారు. మొదటి మరాఠీ పాఠశాల పార్లే తిలక్ విద్యాలయ 1921 జూన్ 9 న ప్రారంభమైంది. అప్పట్లో మొదట్ కేవలం నలుగురు విద్యార్థులే ఉండేవారు. ఈ రోజు ఈ సంస్థ కింద ఐదు పాఠశాలలు, మూడు కళాశాలలు, ఒక మేనేజ్ మెంట్ ఇన్ స్టిట్యూట్ ఉన్నాయి. మొత్తం విద్యార్తుల సంఖ్య 20,000 కు చేరింది. మహారాష్ట్రకు చెందిన పేరుమోసిన రచయిత పు.ల. దేశ్ పాండే, షేట్కారీ సంఘటన్ వ్యవస్థాపకుడు శరద్ జోషి, మాజీ భారత వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ప్రదీప్ నాయక్ తదితరులంతా ఈ విద్యాసంస్థల పూర్వవిద్యార్థులే. ఎంతోమంది రాజకీయ నాయకులను, సామాజిక కార్యకర్తలను, వ్యాపారవేత్తలను, నటులను అందించిన ఘనత కూడా ఈ విద్యాలయాలు దక్కించుకున్నాయి
Follow us on social media: @PIBMumbai /PIBMumbai /pibmumbai pibmumbai[at]gmail[dot]com
*****
(Release ID: 1651669)
Visitor Counter : 262