ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

స్వర్ణభారత్ ట్రస్టు సేవాకార్యక్రమాల గురించి ఉపరాష్ట్రపతి వాకబు ట్రస్టు నిర్వాహకులు, అధ్యాపకులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పలకరింపు


ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యున్నతమన్న ఉపరాష్ట్రపతి

అక్షర విద్యాలయం ఉపాధ్యాయులతోనూ ఉపరాష్ట్రపతి మాటామంతి

పేరుపేరునా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న ఉపరాష్ట్రపతి

కరోనా ఆంక్షల నేపథ్యంలో ఆన్‌లైన్ విద్యాబోధన, వివిధ కోర్సుల ప్రగతిపై వివరాలందించిన ఉపాధ్యాయులు

కరోనా నేపథ్యంలో స్వర్ణభారత్ ట్రస్ట్ సహాయ కార్యక్రమాలపై ప్రశంస

వలస కార్మికులకు, పేదలకు భోజన వితరణ, నిత్యావసర వస్తువులు, కూరగాయలు, పండ్ల అందజేతను అభినందించిన ఉపరాష్ట్రపతి

Posted On: 05 SEP 2020 4:06PM by PIB Hyderabad

ప్రతి ఒక్కరి జీవితంలో ఉపాధ్యాయులు పోషించే పాత్ర అత్యంత కీలకమని, అందుకే భారతీయ సంప్రదాయం ఆచార్యదేవోభవఅని చెప్పి తల్లిదండ్రులతో సమానంగా గురువులను గౌరవించడాన్ని నేర్పించిందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ నిర్వాహకులతోపాటు స్వర్ణభారత్ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అక్షర విద్యాలయం ఉపాధ్యాయులతోనూ ఉపరాష్ట్రపతి అంతర్జాల వేదిక ద్వారా మాట్లాడారు. వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా తన విద్యార్థి జీవితాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి, ప్రతి తరగతిలోనూ.. ఉపాధ్యాయులు చేసిన మార్గదర్శనం, ప్రోత్సాహం కారణంగానే తాను అంలంచెలుగా ఎదిగి రాజ్యాంగబద్ధమైన పదవిలో కొనసాగుతున్నానని పునరుద్ఘాటించారు. తన అభివృద్ధికి బాటలు వేసిన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాని ఆయన పేర్కొన్నారు.

తన జీవిత గమనంలో మార్గదర్శనం చేసిన గురువులందరినీ.. మొన్నటి గురుపూర్ణిమ సందర్భంగా గుర్తుచేసుకున్నానన్న ఉపరాష్ట్రపతి, అందులో కొందరు గురువులతో మాట్లాడానని.. పరమపదించిన గురువుల కుటుంబ సభ్యులతో మాట్లాడి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నానని తెలిపారు. గురువులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడటం, పాత విషయాలను గుర్తుచేసుకోవడం తనలో నూతన స్ఫూర్తిని నింపిందని పేర్కొన్నారు.

ఉన్నతమైన పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్రగొప్పదని తెలిపిన ఉపరాష్ట్రపతి, విద్యార్థుల్లో సేవాభావాన్ని పెపొందించాలని, తద్వారా వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యలను చేయాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని గుర్తు చేశారు. భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్న శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, వారు గొప్ప పండితులే గాక, తత్వవేత్తగానూ, రాజనీతిజ్ఞుడిగా మార్గనిర్దేశం చేశారని తెలిపారు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యాలను అనువదించటమే గాక, ఆధునిక దృష్టికోణంలో వ్యాఖ్యానాన్ని అందించిన మార్గదర్శి అని తెలిపారు. ఈ సందర్భంగా  అక్షర విద్యాలయ ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని, విద్యార్థుల పట్ల చూపుతున్న ప్రేమానురాగాలను కూడా ఆయన ప్రశంసించారు.

అనంతరం, స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు, సాంకేతిక సంస్థల సహకారంతో నిర్వహిస్తున్న కౌశల్య అభివృద్ధి కేంద్రాల్లో జరుగుతున్న కార్యక్రమాల ప్రగతిని, సేవా కార్యక్రమాలు జరుగుతున్న తీరును ఉపరాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులు తాత్కలికమేనని.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వారందరికీ భరోసా ఇచ్చారు. నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతను స్వయం ఉపాధికి ప్రోత్సహించడంతోపాటు.. మరికొందరికి ఉపాధి కల్పించేలా వారిని తీర్చిదిద్దే దిశగా ట్రస్టు ద్వారా జరుగుతున్న కార్యక్రమాలను ఆయన ప్రశంసించారు. ఆన్‌లైన్ క్లాసుల నిర్వహణ, ట్రస్టుల ఆవరణలో పచ్చదనం, పరిశుభ్రత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ కోర్సు మెటీరియల్ ను రూపొందించి, కొన్ని కోర్సులను ఆగకుండా ముందుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేసిన ఉపాధ్యాయుల చొరవను ఆయన అభినందించారు.

కరోనా మహమ్మారి కారణంగా ఇబ్బందులు పడ్డ పేదలు, వలస కార్మికులకు నిత్యావసర వస్తువులు అందించడంతోపాటు.. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ ట్రస్టుల చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కూరగాయలు, పండ్లు, నిత్యావసరవస్తువులను అందించిన వివరాలను తెలుసుకుని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ ప్రాంతాల్లోని అత్యవసరమైన వారికి వైద్యసేవలు కూడా అందించారని తెలిసి అభినందించారు. సేవాకార్యక్రమాల ద్వారా కలిగే మానసిక ప్రశాంతత ద్వారా జీవితం గమనానికి అవసరమైన ఉత్సాహం అందుతుందని.. సేవాకార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల ద్వారా విద్యార్థులను ఆత్మనిర్భర’, ‘సశక్తభారతనిర్మాణంలో భాగస్వామ్యం చేయాలన్న స్వర్ణభారత్ ట్రస్టు, ముప్పవరపు ఫౌండేషన్ లక్ష్యాలకు అనుగుణంగా కార్యక్రమాలకు, కోర్సులకు రూపకల్పన, కార్యక్రమాల నిర్వహణలో సహకరిస్తున్న ఈ సంస్థలను ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు.

****



(Release ID: 1651601) Visitor Counter : 176