జల శక్తి మంత్రిత్వ శాఖ
జల జీవన్ మిషన్ అమలుపై అరుణాచల్ ముఖ్యమంత్రితో చర్చలు జరిపిన కేంద్ర జల శక్తి శాఖ మంత్రి
2023 నాటికి 100% కవరేజీ సాధించడానికి అరుణాచల్ ప్రదేశ్ ప్రణాళికలు
Posted On:
31 AUG 2020 3:47PM by PIB Hyderabad
అరుణాచల్ రాష్ట్రంలో జల జీవన్ మిషన్ అమలుపై కేంద్ర జల శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ అరుణాచల్ ముఖ్యమంత్రిశ్రీ పేమా ఖండూతో సోమవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా చర్చలు జరిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాధికి చికిత్స పొందుతున్న శ్రీ షెకావత్ ఆసుపత్రినుంచి చర్చల్లో పాల్గొన్నారు. జల శక్తి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ రతన్ లాల్ కూడా చక్షుష సమావేశంలో పాల్గొన్నారు. మంత్రిత్వ శాఖకు చెందిన అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్ శ్రీ రతన్ లాల్ మరియు ఇతర అధికారులు కూడా సమావేశానికి హాజరయ్యారు. అరుణాచల్ ప్రదేశ్ నుంచి రాష్ట్ర మంత్రి, చీఫ్ సెక్రెటరీ మరియు ఇతర సీనియర్ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో వారికి అన్ని మౌలిక సౌకర్యాలు కల్పించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. మంచినీటి సరఫరా కోసం ప్రభుత్వం ప్రధానంగా జల జీవన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో పరిశుభ్రమైన మంచినీరు క్రమం తప్పకుండా సరఫరా చేస్తున్నది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఇంటింటికీ కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయడం.
2023 నాటికి రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు కుళాయి ద్వారా మంచి నీరు సరఫరా చేయాలని అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రగతిపై గురించి రాష్ట్ర ముఖ్యమంత్రితో కేంద్ర మంత్రి సవివరంగా చర్చలు జరిపారు. గ్రామీణుల జీవితాలను మెరుగుపరిచే ఈ కార్యక్రమం ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న నీటి సరఫరా పథకాలను పెంచాలని కేంద్రమంత్రి గట్టిగా చెప్పారు. రాష్ట్రంలో 5,457 గ్రామాలలో 3,823 గ్రామాలకు పైపులైన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. రాష్ట్రంలోని 2.17 లక్షల కుటుంబాలలో కేవలం 42,244 (20%) కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా మిగిలి ఉన్న పేద మరియు అణగారిన వర్గాల చెందిన కుటుంబాలకు వీలయినంత త్వరగా కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి ఆ పనిని ఉద్యమ రీతిలో చేపట్టాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
ఈ లక్ష్య సాధనలో రాష్ట్రప్రభుత్వానికి అన్ని రకాల సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శ్రీ షెకావత్ ఉద్ఘాటించారు. జరుగుతున్న పని, ఇచ్చిన కనెక్షన్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వ నిధుల ఖర్చుతో సరితూగే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు సమకూరుస్తుంది. అరుణాచల్ ను అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్న రాష్ట్రంగా మార్చేందుకు కేంద్రం అన్ని రకాల మద్దతు ఇవ్వగలదని ముఖ్యమంత్రికి జల శక్తి మంత్రి హామీ ఇచ్చారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని 2.17 లక్షల గ్రామీణ కుటుంబాలలో కేవలం 43,244 (20%) కుటుంబాలకు మాత్రమే కుళాయి కనెక్షన్లు ఉన్నాయి. 2020-21 సంవత్సరంలో 76,912 కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని సంకల్పించారు.
***
(Release ID: 1650226)
Visitor Counter : 200