యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

2020 సంవత్సరపు జాతీయ క్రీడా, సాహస అవార్డును

రేపు ప్రదానం చేయనున్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్

ఆన్ లైన్ లో జరిగే కార్యక్రమంలో కేంద్రమంత్రి కిరెన్ రిజిజు ప్రసంగం

Posted On: 28 AUG 2020 7:37PM by PIB Hyderabad

 2020 సంవత్సరపు జాతీయ క్రీడా సాహస పురస్కారాన్ని ఆగస్టు 29 తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రధానం చేస్తారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్ లో కార్యక్రమం జరుగుతుంది. ఆన్ లైన్ ద్వారా వర్చువల్ గా జరిగే కార్యక్రమానికి కేంద్ర యువజన  వ్యవహారాలు క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు, భారతీయ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరేంద్ర ధ్రువ భాత్ర, పలువురు ప్రముఖులు హాజరవుతారు.   అవార్డులకు ఎంపికైన 65మంది,.. దేశంలోని వివిధ ప్రాంతాలనుంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది. బెంగుళూరు, పూణె, సోనేపట్, చండీగఢ్, కోల్కతా, లక్నో, ఢిల్లీ, ముంబై, భోపాల్, హైదరాబాద్, ఇటానగర్ ప్రాంతాలనుంచి వారు ఆన్ లైన్ ద్వారా కార్యక్రమంలో పాలుపంచుకుంటారు. 2020 సంవత్సరం ఆగస్టు 29 ఉదయం  11గంటలకు జరిగే   కార్యక్రమం దూరదర్శన్ ద్వారా ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది. https://webcast.gov.in/myas/sportsawards/ అనే వెబ్ క్యాస్ట్ లింక్ ద్వారా కూడా కార్యక్రమం ప్రత్యక్షంగా ప్రసారమవుతుంది.

   క్రీడల్లో ప్రతిభా పాటవాలను గుర్తించి, గౌరవించేందుకు ప్రతియేటా క్రీడా పురస్కారాలను ప్రదానం చేస్తూ వస్తున్నారు. నాలుగేళ్లలో క్రీడల్లో అద్భుతమైన, అత్యుత్తమమైన ప్రతిభా పాటవాలను ప్రదర్శించినందుకు గుర్తింపుగా రాజీవ్ ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేస్తారు. నాలుగేళ్లలో క్రీడల్లో స్థిరంగా  విశేష ప్రతిభను చూపే వారికి అర్జున అవార్డు ఇస్తారు. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ క్రీడాపోటీల్లో పతకాలను గెలిచే క్రీడాకారులను తయారు చేసినందుకు గుర్తింపుగా సంబంధిత కోచ్ లకు ద్రోణాచార్య పురస్కారం అందిస్తారు. క్రీడల అభివృద్ధికోసం జీవితకాలం చేసిన చేసిన సేవలకు, కృషికి గుర్తింపుగా ధ్యాన్ చంద్ అవార్డు ప్రదానం చేస్తారు. క్రీడలకు ప్రోత్సాహం, అభివృద్ధి అన్న అంశాల్లో ప్రశంసనీయమైన పాత్ర నిర్వహించినందుకు గుర్తింపుగా ప్రభుత్వ ప్రైవేటు రంగంలోని కార్పొరేట్ సంస్థలకు, వ్యక్తులకు రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ప్రదానం చేస్తారు

  వివిధ విశ్వవిద్యాలయాల మధ్య జరిగే అంతర్ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో మొత్తమ్మీద ఉత్తమ ప్రతిభ కనబరిచిన విశ్వవిద్యాలయానికి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ (మాకా) ట్రోఫీ ప్రదానం చేస్తారు. క్రీడా అవార్డులకు తోడు,..సాహస కృత్యాలను ప్రదర్శించే వారికి గుర్తింపుగా టెన్జింగ్ నార్గే జాతీయ సాహస అవార్డును ఇచ్చి సత్కరిస్తారు. అయితే,.. సారి, జాతీయ క్రీడా సాహస అవార్డుల ప్రదానాన్ని 2020 ఆగస్టు 29 తేదీన ఆన్ లైన్ ద్వారా వర్చువల్ కార్యక్రమంగా తొలిసారిగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతున్నప్పటికీ అవార్డుల ప్రదానం వర్చువల్ పంథాలో నిర్వహిస్తుండటం పట్ల క్రీడాకారులు, క్రీడా ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

   “కోవిడ్ వైరస్ మహమ్మారి  వ్యాప్తిలో ఉన్నప్పటికీ, జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా అవార్డుల ప్రదానం జరగుతూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. అనేక ఇబ్బందులు ఎదురైనా, కార్యక్రమాన్ని వర్చువల్ గా నిర్వహించాలని భారతీయ క్రీడా ప్రాధికార సంస్థ ఎంతో సానుకూల నిర్ణయం తీసుకుంది.” అని పారా అథ్లెట్ సందీప్ చౌధరి వ్యాఖ్యానించారు. అర్జున పుసర్కారానికి ఎంపికైన వారిలో ఆయన ఉన్నారు

   టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా సారి ప్రతిష్టాత్మకమైన ఖేల్ రత్న అవార్డును అందుకోనున్నారు. అర్జున అవార్డును అందుకున్న రెండేళ్లకు ఆమె అవార్డును స్వీకరించబోతున్నారు.

 “కోవిడ్ మహమ్మారి ప్రజా జీవనాన్ని స్తంబింపజేసిందన్న వాస్తవాన్ని మనం అంగీకరించి తీరాలి. అయితే, కార్యక్రమంపట్ల నాలో భావోద్వేగం మాత్రం తగ్గడంలేదు.” అని ఆమె అన్నారు

   ద్రోణాచార్య అవార్డుకు ఎంపికైన జాతీయ ఉహూ జట్టు కోచ్,.. కుల్ దీప్ హాండూ కూడా కార్యక్రమ నిర్వహణ పట్ల ప్రశంసలు వ్యక్తం చేశారు. “ప్రస్తుత కష్ట సమయంలో కూడా చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం సంతోషం. కిరణ్ రిజిజు కు నేను సెల్యూట్ చేస్తున్నానుకార్యక్రమం డ్రెస్ రిహార్సల్ లో నేను పాల్గొన్నపుడు ఇది సాదాసీదా కార్యక్రమంగా నాకు అనిపించింది. అయితే, సాంకేతికంగా ఎంతో కచ్చితత్వంతో దీన్ని నిర్వహించడం అంత సులభం కాదు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉంటున్న అవార్డు విజేతలను ఆన్ లైన్ ద్వారా రాష్ట్రపతితో అనుసంధానం చేయడం చాలా శ్రమతో కూడిన పని. గొప్ప కార్యక్రమంకోసం తెరవెనుక పనిచేస్తున్న  వారందరికీ హ్యాట్సాఫ్ చెబుతున్నానుఅని జమ్ము కాశ్మీర్ కు చెందిన కుల్ దీప్ హ్యాండూ అభిప్రాయపడ్డారు.

  . అవార్డుల ప్రదాన కార్యక్రమంపై అస్సాంకు చెందిన,.. సూపర్ స్టార్ గా ఎదగబోతున్న మహిళా బాక్సర్, లవ్లీనా బోర్గోహెయిన్ కూడా స్పందించారు. పరిస్థితులు చక్కబడిన తర్వాత తాను రాష్ట్రపతితో కలసి దిగే ఫొటో కోసం తాను ఎదురుచూస్తున్నానని ఆమె అన్నారు. “ఒలింపిక్ క్రీడల్లో పతకం గెలిచేందుకు నేను ఎదురుచూస్తున్నాను. రాష్ట్రపతితో కలసి ఫొటో దిగాలన్న నా లక్ష్యాన్ని తప్పకుండా సాధిస్తా”  అని లవ్లీనా ధీమా వ్యక్తం చేశారు.

   ప్రతి సంవత్సరం ఆగస్టు 29 దేశంలో జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహిస్తారు. అలనాటి సుప్రసిద్ధ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ గౌరవార్థం కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. కార్యక్రమానికి ముందుగానే న్యూఢిల్లీలోని ధ్యాన్ చంద్ స్టేడియటంలో రేపు ఉదయం జరగనున్న కార్యక్రమంలో  కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజిజు,..  మేజర్ ధ్యాన్ చంద్ కు నివాళులర్పిస్తారు.

<><><><>



(Release ID: 1649392) Visitor Counter : 216