రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఈ ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని దాదాపు ప్రతిచోటా యూరియా అమ్మకాలు పెరుగుతున్నాయి: శ్రీ గౌడ
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రి శ్రీ సదానంద గౌడను కలిసిన కర్ణాటక వ్యవసాయ మంత్రి
Posted On:
27 AUG 2020 3:57PM by PIB Hyderabad
ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో దేశంలోని దాదాపు ప్రతిచోటా యూరియా అమ్మకాలు పెరుగుతున్నట్టుగా కనిపిస్తోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ అన్నారు. అవసరం మేరకు దేశీయ యూనిట్ల నుండి, దిగుమతుల ద్వారా సరఫరాను మరింతగా బలోపేతం చేయడానికి గాను భారత ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆయన వివరించారు. కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ మంత్రి శ్రీ బి.సి. పాటిల్ ఈ రోజు న్యూఢిల్లీలో శ్రీ గౌడను కలిశారు.
ఈ సందర్భంగా ఆయన కర్ణాటకలో యూరియా లభ్యతను గురించి వివరించారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క నిరంతర కృషి మరియు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిరంతర మద్దతు కారణంగా దేశవ్యాప్తంగా యూరియా నిల్వలు సౌకర్యవంతంగానే ఉన్నాయని శ్రీ గౌడ అన్నారు. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినంత వరకు, మొత్తం ఖరీఫ్ -2020 సీజన్‌కు 8.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని అంచనా వేయడమైనది. తదనుగుణంగా, ఏప్రిల్ 1 నుండి ఆగస్టు 26 వరకు 6.46 లక్షల మెట్రిక్ టన్నులు అవసరం. దీనికి తగ్గట్టుగానే ఎరువుల శాఖ 10.24 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల లభ్యత నిర్ధారించింది. ఇందులో 3.16 లక్షల మెట్రిక్ టన్నుల ప్రారంభ నిల్వ కూడా కలిసి ఉంది. ఇదే సమయంలో.. యూరియా అమ్మకాలు 8.26 ఎల్‌ఎమ్‌టీలుగా నిలిచింది, గత ఏడాది ఇదే కాలంలో యూరియా అమ్మకాలు 5.20 లక్షల మెట్రిక్ టన్నులుగా మాత్రమే నిలిచింది. సీజన్‌లో యూరియాకు అపూర్వమైన అధిక డిమాండ్ ఉన్నప్పటికీ యూరియా లభ్యత రాష్ట్రంలో సౌకర్యవంతంగానే ఉంది. యూరియా నల్లమార్కెట్ విక్రయదారులకు వ్యతిరేకంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న చర్యలను శ్రీ గౌడ ప్రశంసించారు. అవసరాలకు అనుగుణంగా రాబోయే రోజుల్లో యూరియా సరఫరా తగినట్లు పెరుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ఫెర్టిలైజర్స్ శాఖ ఎరువుల లభ్యత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని, కర్ణాటక రైతులకు తగిన యూరియా సకాలంలో అందుబాటులోకి ఉండేలా తమ శాఖ చర్యలు తీసుకుంటుందన్నారు. ఎరువులు సకాలంలో రాష్ట్రానికి సరఫరా చేసినందుకు శ్రీ గౌడ మరియు ఎరువుల శాఖ అధికారులకు శ్రీ పాటిల్ కృతజ్ఞతలు తెలిపారు. అయితే కర్ణాటక రాష్ట్రంకు యూరియా సరఫరాను మరింత పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ సీజన్‌లో రాష్ట్రంలో నికర పంటల విస్తీర్ణంలో దాదాపుగా 11.17 లక్షల హెక్టార్లకు చేరుకుంది. ఇది గణనీయమైన పెరుగుదలను చూస్తోంది. గత ఐదేండ్ల సగటు కంటే ఇది 20% మేర ఎక్కువ. కర్ణాటకలో యూరియా లభ్యతను పెంచడంలో కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని ఆయన అభ్యర్థించారు.
*****
(Release ID: 1649007)
Visitor Counter : 140