రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

"భవిష్యత్‌ యుద్ధాల్లో పోరాట పద్ధతులపై నవతర సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం" అంశంపై సెమినార్‌ నిర్వహించిన భారత సైన్యం

Posted On: 25 AUG 2020 7:15PM by PIB Hyderabad

నూతన యుద్ధ పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం రాకతో యుద్ధం చేసే విధానం భారీగా మారిపోయింది. సునామీలా వచ్చిపడుతున్న నవ సాంకేతికత, భవిష్యత్ యుద్ధాల కోసం పునర్వ్యవస్థీకరణ, పునర్నిర్మాణాల దిశగా మిలిటరీలను అడుగులు వేయిస్తోంది. నూతన సాంకేతికత ప్రభావాలను ఎదుర్కొనడానికి "భవిష్యత్‌ యుద్ధాల్లో మన పోరాట విధానాలపై నవతర సాంకేతిక పరిజ్ఞాన ప్రభావం" అంశంపై సెమినార్‌ నిర్వహించారు. మోహోలోని ఆర్మీ వార్‌ కాలేజీలో సోమ, మంగళవారాల్లో జరిగిన "డిఫెన్స్‌ అండ్‌ స్ట్రాటజీ సెమినార్‌-2020"లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. కొవిడ్‌ కారణంగా ఈ సెమినార్‌ వెబినార్‌ రూపంలో జరిగింది. దేశవ్యాప్తంగా 54 ప్రాంతాల్లోని 82 కేంద్రాల ద్వారా అధికారులు పాల్గొన్నారు.

    నవతర సాంకేతికతపై అవగాహన ఉన్న సైనిక, సాంకేతిక నిపుణులు, విద్యావేత్తలు, వక్తలు వెబినార్‌లో పాల్గొని తమ ఆలోచనలు పంచుకున్నారు. లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌ శుక్లా కీలక ఉపన్యాసంతో సెమినార్‌ ప్రారంభమైంది. నవతర సాంకేతికతలైన క్లౌడ్‌ కంప్యూటింగ్‌, కృత్రిమ మేథస్సు, వర్చువల్‌ రియాలిటీ, రోబోటిక్స్‌, బిగ్‌ డేటా అనలిటిక్స్‌, సైబర్‌, చిన్న ఉపగ్రహాలు, 5జీ/6జీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ యుద్ధంపై కూలంకషంగా చర్చించారు. జాతీయ ప్రాముఖ్యత గల వ్యూహాత్మక అంశాలపై అర్ధవంతమై చర్చతోపాటు, సంక్లిష్ట అంశాలపై భారత సైన్యం లోతుగా దృష్టి పెట్టేందుకు ఈ సెమినార్‌ ద్వారా వీలయింది.

    ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే సెమినార్‌ చివరి రోజు కార్యక్రమంలో పాల్గొని భారత సైన్యానికి విలువైన వ్యూహాత్మక మార్గదర్శనం చేశారు. యుద్ధంపై సాంకేతిక పరిజ్ఞాన ప్రభావాన్ని జనరల్‌ నరవణే ప్రముఖంగా ప్రస్తావించారు.  ఇప్పటికే ఉన్న ఆయుధ వ్యవస్థల బలోపేతంపై ప్రస్తుత ఆధునికీకరణ కార్యక్రమం దృష్టి పెట్టిందన్నారు. రెండు వైపులా పదును ఉన్న కొత్త సాంకేతికతలకు భారత సైన్యం తగిన ప్రాధాన్యమివ్వాలని సూచించారు. సైనిక అవసరాలు గుర్తించేందుకు, సాయుధ దళాల ఆధునీకరణ వ్యూహంలో 'విస్తృత జాతీయ మిషన్' భాగం కావాలని ఆర్మీ చీఫ్‌ సూచించారు.

    ఈ తరహా భారీ కార్యక్రమాన్ని వర్చువల్‌ పద్ధతిలో చేపట్టడం ఇదే ప్రథమం. సెమినార్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు ఆర్మీ వార్‌ కాలేజీని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఎం.ఎం.నరవణే అభినందించారు.

 

***


(Release ID: 1648699) Visitor Counter : 249