సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వలస కార్మికుల స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తున్న హనీ మిషన్

- ప‌శ్చిమ యూపీ ప్రాంతంలో 700 తేనెటీగ పెట్టెల పంపిణీ

Posted On: 25 AUG 2020 4:01PM by PIB Hyderabad

 

'ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్' (కేవీఐసీ) “ఆత్మ నిర్భర్ భారత్” వైపు పెద్ద ఎత్తున అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తన ప్రధాన “హనీ మిషన్” కార్యక్రమం ద్వారా వలస కార్మికులకు స్థానికంగా ఉపాధిని క‌ల్పిస్తోంది. కేంద్ర ఎంఎస్‌ఎంఈ స‌హాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి ఈ రోజు ఉత్తర ప్రదేశ్‌లోని సహారాన్పూర్, బులాంద్‌షహర్ జిల్లాలకు చెందిన 70 మంది వలస కార్మికులకు దాదాపు 700 తేనెటీగ పెట్టెలను పంపిణీ చేశారు. తద్వారా వారికి హనీ మిషన్ కింద జీవనోపాధి అవకాశాన్ని కల్పించారు. కోవిడ్ -19 లాక్‌డౌన్‌ ప‌రిస్థితుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సహారాన్పూర్‌కు చెందిన దాదాపు 40 మంది, బులంద్షహర్ 30 మంది వలస కార్మికులు తమ త‌మ స్వగ్రామానికి తిరిగి వచ్చారు. వీరంతా కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల నుండి త‌మ స్వ‌స్థ‌లాల‌కు తిరిగి వ‌చ్చారు. “ఆత్మనిర్భర్ భారత్” దిశ‌గా ప్రధాన మంత్రి పిలుపు మేర‌కు కేవీఐసీ ఈ వ‌ల‌స కార్మికులను గుర్తించి, వారికి తేనెటీగల పెంపకంపై ఐదు రోజుల శిక్షణను ఇచ్చింది. దీనికి తోడు తేనెటీగల పెంపకం కార్యకలాపాలను నిర్వహించడానికి అవసరమైన ప‌రిక‌రాల కిట్ మరియు తేనెటీగ పెట్టెలను వారికి అందించింది. పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతం వివిధ రకాల పంటలు, వృక్ష జాలాన్ని క‌లిగి ఉంటుంది. ఇది  తేనె ఉత్పత్తికి గాను అనువైనది. పంజోకెరాలోని కేవీఐసీ శిక్షణా కేంద్రంలో వీరికి తేనెటీగల‌ పెట్టెలు పంపిణీ చేయబడ్డాయి. ఈ సందర్భంగా మంత్రి శ్రీ సారంగి మాట్లాడుతూ మిష‌న్ చొరవను ప్రశంసించారు. తేనెటీగల పెంపకంలోకి వ‌ల‌స కార్మికులను తీసుకురావ‌డం వ‌ల్ల స్థానికంగా ఉపాధి సృష్టించ‌బ‌డుతుంద‌ని అన్నారు; ఇది హనీ మిషన్ యొక్క ముఖ్య లక్ష్యమైన‌ భారతదేశపు తేనె ఉత్పత్తిని పెంచడానికి దోహదం చేస్తుంద‌ని వివ‌రించారు. “వలస కార్మికులకు వారి ఇంటి వద్దనే ఉపాధి కల్పించడం వారికి స్వావలంబన అందిస్తుంది. ఇది గొప్ప చొరవ ”అని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కేవీఐసీ చైర్మన్ శ్రీ విన‌య్‌ కుమార్ సక్సేనా మాట్లాడుతూ, తేనెటీగల పెంపకంతో వలస కార్మికులను తీసుకురావ‌డం వ‌ల్ల స్థానిక పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా ‘స్వావలంబన’ అనే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు సాకారానికి దోహ‌దం చేస్తుంద‌న్నారు. "తేనెటీగల పెంపకం భారతదేశ తేనె ఉత్పత్తిని పెంచడమే కాక, తేనెటీగల పెంపకందారుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. ఇంకా, తేనెటీగ మైనం, పుప్పొడి, రాయల్ జెల్లీ మరియు తేనెటీగల‌ విషం వంటి ఉత్పత్తులు కూడా విక్రయించదగినవే.. అందువల్ల స్థానికులకు లాభదాయకమైన ప్రతిపాదన” అని సక్సేనా వివ‌రించారు. తేనెటీగ పెట్టెలు మరియు టూల్ కిట్ అందుకున్న‌ వలస కార్మికులు, ప్రభుత్వం అందించిన తోడ్పాటుపై సంతోషం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉపాధి ల‌భించ‌డంతో ఉద్యోగాల కోసం తాము ఇకపై తమ ఇళ్లను విడిచి ఇత‌ర రాష్ట్రాల‌కు వెళ్లాల్సిన అవసరం లేదంటూ వారు త‌మ‌ అనుభవాలను పంచుకున్నారు. కర్ణాటక నుండి తన స్వస్థలమైన సహారాన్‌పూర్‌కు తిరిగి వచ్చిన అంకిత్ కుమార్ అనే వ‌ల‌స కార్మికుడు మాట్లాడుతూ.. లాక్‌డౌన్ స‌మ‌యంలో తాను నిరుద్యోగిగా ఉన్నానని తెలిపారు. అయినప్పటికీ, కేవీఐసీ మద్దతుతో తాను ఇప్పుడు మళ్ళీ స్వయం ఉపాధి పొందాన‌ని తెలిపారు. మహారాష్ట్రలో తిరిగి వచ్చిన మ‌రో వలస కార్మికుడు మోహిత్ మాట్లాడుతూ ఇతర నగరాల్లో ఉద్యోగం కోసం వెతుక్కొంటూ.. కు‌టుంబానికి దూరంగా ఉండాల్సిన‌ అవసరం ఇక త‌మ‌కు లేదని అన్నారు. హనీ మిషన్‌లో పాల్గొనడం ద్వారా తాను మంచి జీవనోపాధి పొందగలనని విశ్వాసం వ్య‌క్తం చేశారు. మూడు సంవత్సరాల కింద‌ట‌ కేవీఐసీ ప్రారంభించిన హనీ మిషన్ రైతులు, ఆదివాసులు, మహిళలు మరియు నిరుద్యోగ యువతకు తేనెటీగల పెంపకంలో భాగ‌స్వాముల‌ను చేయ‌డం ద్వారా మరియు భారతదేశ తేనె ఉత్పత్తిని పెంచడం.. త‌ద్వారా ఉపాధి కల్పించడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం మరియు త్రిపుర వంటి రాష్ట్రాల్లో కేవీఐసీ 1.35 లక్షల తేనెటీగ పెట్టెలను పంపిణీ చేసింది. ఇది దేశ వ్యాప్తంగా 13,500 మందికి ప్రయోజనం చేకూర్చింది. దాదాపు 8500 మెట్రిక్ టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తోంది.
 

******



(Release ID: 1648616) Visitor Counter : 208