ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

భారతీయ కుటుంబ వ్యవస్థను పటిష్టపరుచుకోవాలి: ఉపరాష్ట్రపతి

- జనాభా నియంత్రణ పైనా ప్రతి ఒక్కరూ దృష్టిపెట్టాలి

- ఈ దిశగా ప్రజలను చైతన్య పరచటం.. రాజకీయపార్టీలు, ప్రజాప్రతినిధుల బాధ్యత

- లింగ వివక్ష, పేదరికం, నిరక్ష్యరాస్యత వంటి సామాజిక సవాళ్ల పరిష్కారం దిశగా ముందుకు సాగాలి

- పెద్దలను విస్మరించడం, వారిని అగౌరవపరచడం లాంటి సంఘటనలు ఆందోళనకరం

- యువజన శక్తి లాభం చేకూర్చేది, పెద్దల అనుభవ శక్తి అదనపు బలం అని అభివర్ణించిన ఉపరాష్ట్రపతి
శ్రీముప్పవరపు వెంకయ్యనాయుడు

- పార్లమెంటరీ వ్యవస్థలో మహిళలకు తగినంత భాగస్వామ్యం కల్పించడంపై దృష్టిపెట్టాలని సూచన

- ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఏపీపీడీ) రూపొందించిన ‘దేశంలో శిశు లింగ నిష్పత్తి మరియు పెద్దల జనాభా స్థితి’ నివేదికలను విడుదల చేసిన ఉపరాష్ట్రపతి

Posted On: 20 AUG 2020 1:31PM by PIB Hyderabad

భారతీయ సనాతన సంప్రదాయంలో భాగమైన కుటుంబవ్యవస్థను పటిష్టపరుచుకోవాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పెద్దలను గౌరవించుకోవడం మన సంప్రదాయమని గుర్తు చేశారు. ప్రపంచదేశాలన్నీ భారతీయ కుటుంబవ్యవస్థ గురించి గొప్పగా చెప్పుకుంటూ దీన్ని ఆచరించేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో.. మన సమాజంలో అక్కడక్కడా చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పార్లమెంటేరియన్స్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్‌మెంట్ (ఐఏపీపీడీ) భారతదేశంలోని శిశువుల లింగ నిష్పత్తి, దేశంలో పెద్దల జనాభాకు సంబంధించి నిర్వహించిన సంపూర్ణ అధ్యయన నివేదికలను గురువారం ఉపరాష్ట్రపతి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతదేశ జనాభాకు యువజన శక్తి లాభం చేకూర్చేదే అయినా... పెద్దల అనుభవ శక్తి అదనపు బలం అని భావిస్తున్నట్లు తెలిపారు. అలాంటి పెద్దల ఆర్థిక భద్రత, ఆరోగ్యాన్ని, వారి ఇతర సమస్యలను పరిష్కరిస్తూ.. వారి అనుభవాలను గౌరవిస్తూ ముందుకు వెళ్లడంపై దృష్టిసారించాలని, ఇందుకోసం మన కుటుంబాల్లో పెద్దలను గౌరవించుకోవడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇటీవలి కాలంలో పెద్దలను ఆశ్రమాలకు పంపించడం పెరిగిందంటూ వస్తున్న పలు నివేదికల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, పెద్దలను విస్మరించడం, వారిని అగౌరవపరచడం వంటి అంశాలు తన దృష్టికి వచ్చినపుడు చాలా బాధకలుగుతోందని, ఇలాంటి ధోరణి ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. వయసులో ఉన్న తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవడం వారి పిల్లల కర్తవ్యమన్న ఆయన, దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు.

బాల్యంలోనే తల్లిని కోల్పోయిన శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు, తర్వాత అమ్మమ్మ, తాతయ్యల వద్దే పెరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.  వారు నేర్పించిన ప్రాపంచిక జ్ఞానమే తనను ఇంతవాడిని చేసిందన్నారు. తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో పాటు పెద్దల వద్ద పెరగడం వల్ల చాలా విషయాలను నేర్చుకునేందుకు వీలవుతుందన్నారు. ఇది నేటి సమాజానికి అత్యంత అవసరమన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ మన కుటుంబవ్యవస్థను తిరిగి పటిష్టపరుచుకోవాలని ఆయన సూచించారు.

ఏటేటా పెరుగుతున్న జనాభా కూడా ఆందోళనకరమైన అంశమన్న ఉపరాష్ట్రపతి.. జనాభా నియంత్రణపైనా ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. జనాభా నియంత్రణ లేకపోవడం వల్ల, అభివృద్ధి వేగం పుంజుకోవడం కష్టమవుతుందని.. తద్వారా సమాజానికి ఎదురయ్యే సవాళ్లను కూడా గుర్తించాలని ఆయన అన్నారు. ఈ దిశగా ప్రజలను చైతన్యపరిచి వారిలో సానుకూల ఆలోచనలను రేకెత్తించేందుకు రాజకీయ పార్టీలతోపాటు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, పౌరసమాజం, సామాజికవేత్తలతో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలు కృషిచేయాల్సిన అవసరం ఉందని సూచించారు. 

2036 నాటికి భారతదేశ జనాభా 152కోట్లకు చేరుకుంటుందన్న నిపుణుల అంచనాలను ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, గతేడాది ప్రధానమంత్రి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో పేర్కొన్న ‘చిన్నకుటుంబం నినాదాన్ని పాటించండి. దేశాభివృద్ధిలో భాగస్వాములు కండి’ అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేశారు.

స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా 20% ప్రజలు పేదరికంలో ఉన్నారని, 20% మంది నిరక్షరాస్యులుగా ఉన్నారని, పలుచోట్ల లింగ వివక్షత ఆందోళనకరమని ఉపరాష్ట్రపతి అన్నారు. వీటిని వీలైనంత త్వరగా పరిష్కరించుకుని ప్రగతిపథంలో ప్రపంచంతో పోటీపడేందుకు ప్రభుత్వాలు చేస్తున్న కార్యక్రమాలతో పాటు ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. 

పార్లమెంటరీ వ్యవస్థలో మహిళలకు తగినంత రిజర్వేషన్లను కల్పించడం ద్వారా సమాజంలో మహిళలకు సరైన గౌరవాన్ని అందించాల్సిన అవసరాన్నీ ఉపరాష్ట్రపతి పునరుద్ఘాటించారు. ‘మహిళలకు రాజకీయ సాధికారత కల్పించకుండా దేశప్రగతి సాధ్యం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.

లింగ నిష్పత్తి విషయంలో వస్తున్న మార్పుల పైనా ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి, దీని కారణంగా సామాజిక స్థిరత్వం దెబ్బతింటుందన్నారు. అబార్షన్లను నిరోధించే పీసీ-పీఎన్డీటీ చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ఆయన నొక్కిచెప్పారు. లింగ వివక్షత అనైతికమన్న ఆయన.. చిన్నతనం నుంచే నైతికవిద్యను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో ఎలాంటి సమస్యల్లేకుండా చూడవచ్చన్నారు. 

ఐఏపీపీడీ నివేదికతో పాటు, కమిటీ చైర్మన్, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ ప్రొఫెసర్ పీజే కురియన్‌ను ఇతర సభ్యులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. కూలంకషమైన అధ్యయనంతో రూపొందించిన ఈ నివేదికను చదివి అర్థం చేసుకోవడంతోపాటు లింగ నిష్పత్తిలో మార్పులు, పెద్దలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజల్లో చైతన్యం కల్పించడంలో ప్రసార, ప్రచార మాధ్యమాలు ప్రత్యేక చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు.

***



(Release ID: 1647393) Visitor Counter : 236