విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కొత్త వంతెన నేపథ్యంలో కుద్గి బొగ్గు ధరను తగ్గించనున్న ఎన్‌టీపీసీ

Posted On: 19 AUG 2020 8:36PM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్‌ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్‌టీపీసీ, దేశంలోనే అతి పెద్ద విద్యుత్‌ ఉత్పత్తి సంస్థ. కర్ణాటకలోని ఎన్‌టీపీసీ కుద్గి బొగ్గు ఆధారిత విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రానికి ప్రోత్సాహం ఇచ్చేలా రవాణా ఖర్చులను ఆ సంస్థ తగ్గించనుంది. మెట్రిక్‌ టన్నుకు రూ.200-500 వరకు ఖర్చు దిగిరానుంది. దీనివల్ల విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చుతోపాటు, రవాణా సమయం కూడా 8-15 గంటలు తగ్గుతుంది.

    ఎన్‌టీపీసీ విడుదల చేసిన ఓ ప్రకటన ప్రకారం, నైరుతి రైల్వే పరిధిలో నిర్మించిన 670 మీటర్ల పొడవైన వంతెన, విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చును తగ్గించడంలో ఎన్‌టీపీసీ కుద్గి కేంద్రానికి ఉపయోగకరంగా మారిందని, అందుబాటులో ఉన్న వనరులతోనే మరింత ఎక్కువ ముడిపదార్థాలను తరలించడంలో రైల్వేలకు కూడా సాయపడుతోందని వెల్లడించింది. మహారాష్ట్రలోని షోలాపూర్‌ నుంచి కర్ణాటకలోని గడగ్‌ వరకు ఉన్న డబుల్‌ లైన్లు ప్రయాణ సమయాన్ని తగ్గిస్తున్నాయని ప్రకటనలో తెలిపింది. 

    మహారాష్ట్రలోని హోత్గి నుంచి కర్ణాటకలోని కుద్గి వరకు ఉన్న 134 కి.మీ. మార్గం డబ్లింగ్‌లో; భీమ నదిపై రెండు వంతెనల నిర్మాణంలో రైల్వేలకు ఎన్‌టీపీసీ సాయం అందించింది.

***

    ప్రస్తుతం, 50 ఏళ్ల పైబడిన ఓ వంతెనపై నుంచి గూడ్స్‌ రైళ్లను అనుమతించడం లేదు. గుంతకల్‌ నుంచి బరేలీ-గడగ్‌ మార్గంలో వాటిని మళ్లిస్తున్నారు. నైరుతి రైల్వే తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్న ఎన్‌టీపీసీ, అనుమతి దక్కగానే కార్యకలాపాలు ప్రారంభించనుంది.
 


(Release ID: 1647123) Visitor Counter : 147