రైల్వే మంత్రిత్వ శాఖ
రైల్వే భద్రత కోసం డ్రోన్ ఆధారిత నిఘా వ్యవస్థ
భద్రత బలాన్ని పెంచడం, విధుల్లో ఉన్న బలగాలకు సమర్ధవంత సాయం అందించేలా డ్రోన్ వ్యవస్థ
రైల్వే పరిధిలో ఉత్తమ భద్రత, నిఘా కోసం ఇటీవల రెండు నింజా యూఏవీలను కొనుగోలు చేసిన ముంబై డివిజన్
ఇప్పటివరకు తొమ్మిది డ్రోన్లను కొన్న ఆర్‌పీఎఫ్
Posted On:
18 AUG 2020 8:08PM by PIB Hyderabad
ఎక్కువ ప్రాంతంలో తక్కువ మానవశక్తితో భద్రత చేపట్టాల్సిన సందర్భాల్లో, డ్రోన్ నిఘా పరిజ్ఞానం అత్యంత కీలకంగా మారింది. మానవశక్తితో పోలిస్తే దీనికయ్యే వ్యయం తక్కువ. రైల్వే స్టేషన్, ట్రాక్ సెక్షన్లు, యార్డులు, వర్క్‌షాపులు వంటి ప్రాంతాల్లో నిఘా కోసం, మధ్య రైల్వేలోని ముంబై డివిజన్ ఇటీవల రెండు నింజా యూఏవీలను కొనుగోలు చేసింది.
డ్రోన్లను ఎగరవేయడం, నిఘా, నిర్వహణపై నలుగురు సభ్యుల ముంబయి ఆర్పీఎఫ్ బృందానికి శిక్షణ ఇచ్చారు. ఈ డ్రోన్ల కెమెరాతో, ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఆయా ప్రాంతాలపై నిఘా ఉంచవచ్చు. 'ఆటోమేటిక్ ఫెయిల్ సేఫ్ మోడ్' ద్వారా వీటిని నిర్వహించవచ్చు.
ఆగ్నేయ రైల్వే, మధ్య రైల్వే, రాయబరేలీలోని ఆధునిక బోగీల ఫ్యాక్టరీ, నైరుతి రైల్వే కోసం ఇప్పటివరకు తొమ్మిది డ్రోన్లను ఆర్‌పీఎఫ్ కొనుగోలు చేసింది. ఇందుకు రూ.31.87 లక్షలు వెచ్చించింది. రూ.97.52 ఖర్చుతో మరో 17 డ్రోన్లను కొనడానికి ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటికే 19 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బందికి డ్రోన్లను ఎగురవేయడం, నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. వీరిలో నలుగురికి లైసెన్స్ కూడా వచ్చింది. మరో ఆరుగురు శిక్షణలో ఉన్నారు.
భద్రత బలాన్ని పెంచడం, విధుల్లో ఉన్న బలగాలకు సమర్ధవంత సాయం అందించడం డ్రోన్ వ్యవస్థ ఉద్దేశం. రైల్వే ఆస్తులు, యార్డులు, కార్ షెడ్ల వంటి ప్రాంతాల్లో తనిఖీలకు ఇది సాయపడుతుంది. రైల్వే ప్రాంతాల్లో తిరిగే సంఘ వ్యతిరేక శక్తులు, చెత్తను పారవేసే వ్యక్తులపై నిఘాకూ ఉపయోగపడుతుంది. సమాచార సేకరణ కోసం డ్రోన్లను ఉపయోగించవచ్చు. ప్రమాదకర శక్తుల బారిన పడకుండా రైళ్లను సురక్షితంగా నడిపేలా ఈ సమాచార విశ్లేషణ పనికివస్తుంది.
ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ కార్యక్రమాల కోసం, రైల్వే ఆస్తులు ఆక్రమణకు గురైనపుడు, ప్రయాణీకులు భారీగా గుమికూడితే వారిని చెదరగొట్టి రాకపోకలను నియంత్రించడానికి డ్రోన్లు ఉపయోగపడతాయి. కొవిడ్ లాక్‌డౌన్ అమలు చేయడానికి, వలస కార్మికుల కదలికలను పర్యవేక్షించడానికి డ్రోన్లను ఉపయోగించారు.
8-10 మంది ఆర్‌పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షించే ప్రాంతాన్ని ఒక్క డ్రోన్ కెమెరా పర్యవేక్షిస్తుంది. తద్వారా, మానవశక్తిని మెరుగ్గా ఉపయోగించుకోవచ్చు. రైల్వే ఆస్తులు, ప్రాంత సున్నితత్వం, నేరస్తుల కార్యకలాపాలు వంటి అంశాల ఆధారంగా డ్రోన్లను రూపొందించారు. 'ఆకాశ నేత్రం'లా డ్రోన్ వ్యవహరిస్తుంది. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపం డ్రోన్ కంటబడితే, దగ్గరలోని ఆర్‌పీఎఫ్ కేంద్రానికి సమాచారం పంపి, అనుమానితులను అప్పటికప్పుడే అదుపులోకి తీసుకునేలా చేస్తుంది. ఇదే తరహాలో, ముంబైలోని వాడిబందర్ యార్డులో నిలిపివుంచిన రైల్వే బోగీలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని రియల్ టైమ్‌లో డ్రోన్ పట్టించింది.
***
(Release ID: 1646909)
Visitor Counter : 275