ఉప రాష్ట్రపతి సచివాలయం
వ్యవసాయరంగంలో ఆవిష్కరణలపై పరిశోధకులు మరింత దృష్టి సారించాలి - ఉపరాష్ట్రపతి
• పంట ఉత్పత్తులను భద్రపరచుకోవడం, ప్రాసెసింగ్, రవాణా తదితర అంశాల్లో వినూత్న పద్ధతుల దిశగా పరిశోధనలు సాగాలి.
• వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం, నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలి.
• యువ శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు ఉపరాష్ట్రపతి సూచన
• విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు మరింత ప్రాధాన్యతనివ్వాలి
• అప్పుడే విద్యార్థుల్లో ఉన్నతమైన ఆలోచనలకు తద్వారా కొత్త ఆవిష్కరణలకు బీజం పడుతుంది
• అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నొవేటివ్ అచీవ్‌మెంట్స్ - 2020 అవార్డుల ప్రదానోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన అంతర్జాల వేదిక ద్వారా గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచన*
Posted On:
18 AUG 2020 1:56PM by PIB Hyderabad
భారతీయ వ్యవసాయ రంగానికి మరింత తోడ్పాటునందించేందుకు సరికొత్త ఆవిష్కరణల దిశగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. వ్యవసాయాన్ని లాభసాటి చేయడం కోసం, నూతన వ్యవసాయ ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని, ఈ దిశగా ఆవిష్కర్తలు, యువ శాస్త్రవేత్తలు, పరిశోధకులు ప్రత్యేక దృష్టిపెట్టాల్సిన అవసరముందని ఆయన సూచించారు. ఈ దిశగా విద్యావిధానంలో ఆవిష్కరణలు, సృజనాత్మకతకు ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అటల్ ర్యాంకింగ్స్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ ఆన్ ఇన్నొవేటివ్ అచీవ్‌మెంట్స్ (ఏఆర్ఐఐఏ) – 2020 అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా అంతర్జాల వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.
అన్నదాత ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే దిశగా ఆవిష్కరణలు అవసరమన్న ఉపరాష్ట్రపతి, సమయానికి వాతావరణ మార్పులను వారికి తెలియజేయడం, పంట ఉత్పత్తి పెంచేందుకు అవసరమైన కొత్త పద్ధతులు సూచించడం, ఉత్పత్తులను భద్రపరుచుకునే మార్గాలు, ఫుడ్ ప్రాసెసింగ్ విధానాలు, రవాణా సౌకర్యాలు, మార్కెట్‌లో ఉత్పత్తుల గిట్టుబాటు ధర... ఇలా అన్ని వివరాలను ఎప్పటికప్పుడు అందజేసేలా సృజనాత్మకమైన ఆవిష్కరణలకు యువ శాస్త్రవేత్తలు ముందుకు రావాలని సూచించారు. ఈ దిశగా అఖిలభారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ), జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐఆర్డీ), భారత వ్యవసాయ పరిశోధనాసంస్థ (ఐసీఏఆర్), వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విద్యామంత్రిత్వ శాఖ, వ్యవసాయ శాఖ ఇతర భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో కృషిచేయాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. 52 శాతం మంది రైతులున్న దేశంలో వ్యవసాయానికి మరింత ప్రాధాన్యత పెంచాలన్న ఉపరాష్ట్రపతి, కోవిడ్ మహమ్మారి అన్ని వర్గాల వారిని అతలాకుతలం చేసినా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా రైతులు మాత్రం మొక్కవోని ధైర్యంతో వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం శ్లాఘనీయమన్నారు. ఈ నేపథ్యంలో సమాజంలో ప్రతి ఒక్కరూ రైతులకు జేజేలు పలకాల్సిన అవసరసం ఉందని, అలాంటి రైతుల కోసం నూతన ఆవిష్కరణల దిశగా కృషి చేయాల్సిన అవసరం ఉందని సూచించారు.
రైతుల ఆదాయాన్ని పెంచడంతోపాటు.. దళారుల దోపిడీ వ్యవస్థనుంచి వారిని బయటకు తీసుకురావడం, ఫుడ్ ప్రాసెసింగ్ దిశగా కూడా విస్తృతంగా ఆవిష్కరణలు జరగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు.
సృజనాత్మక ఆలోచనలను ప్రజాఉద్యమంగా తీసుకెళ్లాలని సూచించిన ఉపరాష్ట్రపతి, భారతీయ యువతలో నిగూఢమైన శక్తి సామర్థ్యాలను, ఆలోచనలను వెలికితీసి, వాటికి ప్రోత్సాహం కల్పించి యావద్దేశానికి తద్వారా యావత్ ప్రపంచానికి మార్గదర్శనం చేసే దిశగా ముందడుగు వేసేందుకు ఇదే సరైన తరుణమన్నారు. ఆవిష్కరణలను ప్రోత్సహించేలా, విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచేలా విద్యావ్యవస్థలో మార్పులు రావాల్సిన అవసరాన్ని గుర్తు చేసిన ఆయన, మరోసారి భారత్ విశ్వగురుగా ప్రపంచానికి మార్గనిర్దేశనం చేయాలంటే.. ఈ మార్పులు తప్పనిసరని పేర్కొన్నారు. నూతన విద్యావిధానం ద్వారా ఈ లక్ష్యాలను చేరుకునేందుకు వీలవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచంలోని ఉత్తమ విధానాలనుంచి నేర్చుకుని.. ఆ ఉత్తమపద్ధతులకన్నా మరింత సమున్నతమైన ఆవిష్కరణలకు బీజం వేయాలని ఉపరాష్ట్రపతి సూచించారు.
భారతదేశం ‘అపార విజ్ఞాన ఖని’ అని పేర్కొన్న ఉపరాష్ట్రపతి.. పింగళుడు, ఆర్యభట్ట, బ్రహ్మగుప్తుడు వంటి నాటి భారత శాస్త్రజ్ఞులు సున్నాను, దశాంశపద్ధతిని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు. అలాంటి వారి స్ఫూర్తితో నేటి యువత.. సరికొత్త ఆవిష్కరణల దిశగా అడుగు ముందుకేయాలని తెలిపారు.
వివిధ రంగాల్లో సృజనాత్మక ఆవిష్కరణలకు బాటలు వేస్తున్న సంస్థలకు అందించిన ర్యాంకింగ్ లలో చోటు దక్కించుకున్న (హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి టాప్-10లో చోటు దక్కింది) సంస్థలను అభినందించిన ఉపరాష్ట్రపతి, ఆయా సంస్థలు తమ కృషిని మరింతగా పెంచాల్సిన బాధ్యతను ఈ అవార్డులు గుర్తుచేస్తాయని తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వచించిన ఆత్మనిర్భర భారత్ లక్ష్యాలను చేరుకునేందుకు మరిన్ని వినూత్న ఆవిష్కరణలు, సమాజం ఎదుర్కొంటున్న సమస్యలకు సృజనాత్మక పరిష్కారాలు కనుగొనాల్సిన బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేశ్ పోఖ్రియాల్ నిశంక్, సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్రబుద్ధి, విద్యాశాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే, ఏఆర్ఐఐఏ కమిటీ చైర్మన్ డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డితోపాటు వివిధ విశ్వవిద్యాయాల ఉపకులపతులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
***
(Release ID: 1646718)
Visitor Counter : 209