ప్రధాన మంత్రి కార్యాలయం
ఆగస్టు 15, 2020 తేదీన భారత 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పూర్తి పాఠం
Posted On:
15 AUG 2020 2:20PM by PIB Hyderabad
ప్రియమైన నా దేశవాసులారా,
పావనమైనటువంటి ఈ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భం లో దేశవాసులందరికి అనేకానేక శుభాకాంక్షలు మరియు అభినందనలు.
భారత మాత ముద్దుబిడ్డలైన లక్షలాది కుమారులు మరియు కుమార్తెల త్యాగఫలం గా మనమంతా ప్రస్తుతం స్వతంత్ర భారతదేశం లో నివసించగలుగుతున్నాము. స్వాతంత్ర్య సమర యోధుల కు, మాతృభూమి స్వేచ్ఛ కోసం మొక్కవోని దీక్ష తో, అంకిత భావం తో ప్రాణత్యాగం చేసిన సాహసవంతులకు మరియు త్యాగధనుల కు నివాళి ని అర్పించే ఒక సందర్భం ఇది.
పరాక్రమశాలురైన మన సాయుధ దళాలు, మన అర్థసైనికోద్యోగులు, మన రక్షకభట సిబ్బంది, మన భద్రత దళాలు- ప్రతి ఒక్కరు తల్లి భారతి ని పరిరక్షించడం లో నిమగ్నులై ఉన్నారు. వారు సామాన్య మానవుని రక్షణ లో తలమునకలై ఉన్నారు. ఈ దినం వారందరి త్యాగాల ను మరియు తపస్సు ను చిత్తశుద్ధి తోను, మన:పూర్వకంగాను స్మరించుకోవలసిన అటువంటి రోజు.
మరొక పేరు ఉంది: ఆ పేరే అరబిందో ఘోష్. క్రాంతికారుడి నుండి ఆధ్యాత్మికత‌్వ పథం వైపునకు పయనించిన అరబిందో ఘోష్ జయంతి నేడు. ఆయన ఆశీస్సుల ను మనం కోరుకుందాం, తద్ద్వారా మనం ఆయన యొక్క దార్శనికత తో పాటు మన యొక్క దృష్టికోణాన్ని కూడాను సాధించగలుగుతాము.
మనం అసాధారణమైనటువంటి స్థితి గుండా సాగుతున్నాము. ఈ రోజు న, బాలలు- భారతదేశం యొక్క ఉజ్వల భవిత కు ప్రతీక లు- నా ఎదుట లేరు. ఎందుకు? దీనికి కారణం ఏమిటంటే కరోనా ప్రతి ఒక్కరి ని ఆపివేసింది. ఈ కరోనా కాలం లో, లక్షలాది కరోనా యోధుల కు- డాక్టర్ లు, నర్సు లు, పారిశుధ్య సిబ్బంది, అంబులెన్స్ డ్రైవర్ లు, ఇంకా ఎందరెందరో- ఎవరినైతే నేను లెక్క పెట్టలేనో- వారందరి కి నేను వందనాన్ని ఆచరిస్తున్నాను.
‘సేవా పరమో ధర్మః’ అన్న మంత్రాని కి, అదే, సేవ చేయడమే సర్వోత్తమ ధర్మం అనే మాటలకు దీర్ఘకాలం గా కట్టుబడి, అదే ఉత్తమ మతంగా భావించి, దానికే కట్టుబడి మరి భారత మాత బిడ్డలకు పరిపూర్ణ సమర్పణ భావం తో సేవలను అందించిన కరోనా పోరాట యోధులందరికీ నేను నమస్కరిస్తున్నాను.
ఈ కరోనా కాలం లో మన సోదరీ సోదరులలో ఎందరో ఈ యొక్క విశ్వమారి బారిన పడ్డారు; ఎన్నో కుటుంబాలు ప్రభావితమయ్యాయి; చాలా మంది వారి యొక్క ప్రాణాలను సైతం కోల్పోయారు. అటువంటి పరివారాలన్నిటి కి నేను నా యొక్క సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను, మరి నేను నమ్ముతున్నది ఏమిటంటే 130 కోట్ల మంది భారతీయుల అజేయ సంకల్ప శక్తి, ఇంకా దృఢదీక్ష మనలను కరోనా పై విజయం సాధించేటట్టు చేస్తాయని, ఇంకా మనం తప్పక గెలుస్తామనీ నూ.
ఇటీవల కాలం లో మనం అనేక సంక్షోభాల ను ఎదుర్కొంటూ వస్తున్నాము. వరదలు, ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతాల ను, తూర్పు భారతావని ని, దక్షిణాది ని, ఇంకా పశ్చిమ భారతం లోని కొన్ని ప్రాంతాల ను కుదిపి వేశాయి; పలు ప్రాంతాల లో కొండచరియలు విరిగి పడ్డాయి; చాలా మంది వారి ప్రాణాల ను కోల్పోయారు. నేను ఆయా కుటుంబాలన్నిటి కి సంతాపాన్ని తెలియచేస్తున్నాను.
ఈ సంక్షోభ కాలం లో రాష్ట్ర ప్రభుత్వాలన్నిటి కి సంఘీభావం గా జాతి నిలబడుతోంది. అవసరం లో ఉన్న వారి కి సహాయ చర్యల ను చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వాలు గాని, లేదా కేంద్ర ప్రభుత్వం గాని ఏ అవకాశాన్ని జారవిడువడం లేదు.
ప్రియమైన నా దేశవాసులారా, స్వేచ్ఛ ను వేడుక గా నిర్వహించుకొనే రోజు స్వాతంత్ర్య దినోత్సవం. స్వాతంత్ర్య సమర యోధులందరినీ గుర్తు తెచ్చుకొని కొత్త శక్తి ని పొందే సందర్భం ఇది. కొత్త స్పూర్తి కి పొద్దుపొడుపు ఈ రోజు. మనలోని అగ్ని ని, విశ్వాసాన్ని, ఆసక్తి ని ప్రజ్వలింపచేసే దినం ఇది. ప్రత్యేకించి మనం ప్రయాణం సాగిస్తున్న ప్రస్తుత తరుణం లో మనందరం దృఢనిశ్చయం తో నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఏడాది ఇదే రోజు న మనం స్వేచ్ఛా వాయువులు పీల్చి 75 వ సంవత్సరం లోకి అడుగు పెట్టే సందర్భం లో ఈ రోజు ఎంతో పవిత్రత ను కూడా సంతరించుకొంది. ఆ రకం గా ఇది చాలా గుర్తుండిపోయే సందర్భం. ఈ రోజు న మనందరం, 130 కోట్ల మంది భారతీయులం, రాబోయే రెండేళ్ల కోసం విశేషమైన సంకల్పం తీసుకొని, ప్రతిజ్ఞ చేయాలి. భారతదేశం యొక్క స్వాతంత్ర్యపు 75 వ వార్షికోత్సవ వేడుకలు పూర్తి అయ్యే నాటికి ఆ ప్రతిజ్ఞలు అన్నీ నెరవేరడాన్ని మనం కనులారా చూడాలి.
ప్రియమైన నా దేశవాసులారా, మన పూర్వులు అకుంఠిత కట్టుబాటు, చెక్కు చెదరని సమగ్రత, తపోదీక్ష, పునరుజ్జీవం, త్యాగభావం లతో దేశమాత విముక్తి కోసం పోరాడారు. భారత మాత కోసం వారందరూ ప్రాణాలు పణం గా పెట్టిన ఆ క్షణాన్ని మనం ఎప్పుడూ మరచిపోకూడదు. వారందరూ దీర్ఘకాలం పాటు బానిసత్వం లో మగ్గిన రోజుల ను, ప్రత్యేకించి స్వాతంత్ర్యం కోసం కనీసం ప్రయత్నం చేయలేని చీకటి ఘడియల ను, మనం విస్మరించ కూడదు. జాతి ని బానిసత్వ శృంఖలాల నుండి విముక్తం చేసేందుకు ముందంజ వేయని భారతీయుడు ఒక్కరు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. వారంతా బానిసత్వం పై మడమ తిప్పని పోరాటాన్ని మొదలుపెట్టి, ఈ రోజు కోసం ఎన్నో త్యాగాలు చేయడానికి కూడా వెనుకాడలేదు. ఎందరో త్యాగధనులైన యువకులు వారి జీవితాల ను జైళ్ల కే అంకితం చేశారు. ఎందరో జీవితం లో వారు సాధించాలనుకున్న కలల ను కూడా వెనుకకు నెట్టివేసి ఉరికంబాల కు వేలాడారు. వారంతట వారు జాతి కోసం బలి పెట్టుకొన్న గౌరవనీయులైన ఆ అమర వీరులందరికీ నేను అభివాదం చేస్తున్నాను. నిజం గా ఎంత ఆశ్చర్యం! ఒకవైపు దేశం ప్రజా ఉద్యమాల దశ లో పయనిస్తుంటే మరో వైపు సాయుధ తిరుగుబాటులు దద్దరిల్లుతున్నాయి.
పూజ్య బాపూ నాయకత్వంలో మహోన్నతమైన జాతీయ చైతన్యం రగులుకొని ప్రజా ఉద్యమం గా మారింది. అది స్వాతంత్ర్య పోరాటాని కి కొత్త దిశ ను కల్పించింది. దానితోనే మనందరం ఈ రోజు న ఇంత ఆనందోత్సాహల తో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ను నిర్వహించుకొనేటటువంటి భాగ్యాన్ని పొందాము.
స్వాతంత్ర్య పోరాటం సమయంలోనే సమాజం లో ప్రజ్వరిల్లిన ఈ తిరుగుబాటు జ్వాల లు ఆర్పి వేసేందుకు, మన మాతృభూమి లో చైతన్య స్ఫూర్తి ని చల్లార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. భారత సంస్కృతి, సంప్రదాయం, ఆచారం, చారిత్రక ఔన్నత్యాల ను నాశనం చేసే ప్రయత్నాలు అనేకం జరిగాయి. ఇందుకోసం సామ దాన భేద దండోపాయాల ను ఉపయోగించిన, అవి పతాక స్థాయి కి చేరిన సందర్భాలు అనేకం ఉన్నాయి. సూర్యుడు ఉన్నంత కాలం చంద్రుడు కూడా మనుగడ సాగిస్తాడన్న స్ఫూర్తి తో, అపారమైన అంతర్గత విశ్వాసం తో పలువురు ఇక్కడ కు వచ్చారు. అయితే ఉక్కు సంకల్పం తో వాటన్నిటినీ మట్టి కరిపించడమైంది. దేశం బహుళ గుర్తింపు లు, కీర్తి ప్రతిష్ఠ లు, భాష లు, మాండలికాలు, ఆహారాలు, దుస్తులు, సంస్కృతుల పేరు తో విడిపోయిందని వారందరూ విశ్వసించారు. ఇన్ని విభిన్నత లు గల దేశం ఏ శక్తి కీ వ్యతిరేకం గా ఏ రోజూ నిలవలేదన్న అపోహ లో వారందరూ ఉన్నారు. కానీ వారందరి లోని ఆత్మ ను, దేశవాసుల నాడి ని, వారందరి ని ఏకీకరించే ఏకీకృత శక్తి ని వారు గుర్తించలేకపోయారు. స్వాతంత్ర్య కాంక్షతో ఈ శక్తి పూర్తి గా వెలుగు లోకి వచ్చినప్పుడు భారతదేశం బానిసత్వ శృంఖలాల నుండి విజయవంతం గా బయటపడగలిగింది.
విస్తరణవాదులు అన్ని భౌగోళిక ప్రదేశాలలో అడుగు పెట్టి ఆధిపత్యం, అధికారం సాధించినా మన భారత స్వాతంత్ర్య ఉద్యమం తో ప్రపంచం లోని స్వతంత్ర శక్తులన్నీ ఉత్తేజితమై ఈ శక్తుల కు వ్యతిరేకం గా నిలచాయి. భారతదేశం స్వాతంత్ర్య పోరాటానికి ఒక స్తంభం గా నిలిచింది. స్వతంత్ర కాంక్ష ను రగిలించింది.
విస్తరణవాదాన్ని గుడ్డి గా విశ్వసించిన వారి కారణంగానే రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. మానవత్వాన్ని, జీవితాల ను నాశనం చేశాయి. తమ కుతంత్రాలు సాధించుకొనేందుకు భూగోళాన్ని ముక్కలు చేశాయి.
అటువంటి విధ్వంసక యుద్ధం జరుగుతున్న సమయం లో కూడా స్వేచ్ఛ కాంక్ష ను భారతదేశం విడనాడలేదు, ఆ స్వాతంత్ర్య కాంక్ష, పోరాట స్ఫూర్తి తగ్గిన దాఖలాలు కనిపించలేదు.
అవసరం ఏర్పడినప్పుడల్లా భారతదేశం బాధల విముక్తి కి, ప్రజా ఉద్యమాల కు, త్యాగాల కు వెనుదీయలేదు. భారతదేశ స్వాతంత్ర్య పోరాటం ప్రపంచం లోనే స్వతంత్ర కాంక్ష ను, స్వాతంత్ర్యం కోసం పోరాడే వాతావరణాన్ని కల్పించింది. భారతదేశ శక్తి లో మార్పు వచ్చినప్పుడు ప్రపంచవ్యాప్తం గా విస్తరణ వాదాని కి సవాలు ఏర్పడింది. చరిత్ర ఎన్నటికీ దీనిని కాదనలేదు.
ప్రియమైన నా దేశవాసులారా,
ప్రపంచం మొత్తం మీద స్వాతంత్ర్య పోరాట సమయం లో భారతదేశం సంపూర్ణ ఐకమత్య బలం, సంఘటితత్వం, మహోజ్వలమైన భవిష్యత్తు ను సాధించే సంకల్పం, కట్టుబాటు, స్ఫూర్తి తో తలెత్తుకుని నిలబడింది.
ప్రియమైన నా దేశవాసులారా,
కరోనా సంక్షోభం తీవ్రస్థాయి లో ఉన్న సమయం లో 130 కోట్ల మంది భారతీయులు స్వయంసమృద్ధి ని సాధించాలన్న దీక్ష బూనారు. ఈ రోజు న భారతదేశం లో ప్రతి ఒక్కరి మనస్సులో స్వయంసమృద్ధి కాంక్ష రగులుతోంది. స్వయంసమృద్ధియుత భారత్ ("ఆత్మ నిర్భర్ భారత్") కల సాకారం అవుతున్న తరుణాన్ని కూడా మనందరం వీక్షిస్తున్నాం. "స్వయం సమృద్ధ భారత్" అనేది ఒక పదం కాదు, 130 కోట్ల మంది భారతీయుల మంత్ర జపం.
నేను స్వయంసమృద్ధి ని గురించి మాట్లాడినప్పుడు 25-30 సంవత్సరాల వయస్సు పైబడిన మనందరిలో 20-21 సంవత్సరాల ప్రాయం లో మన తల్లితండ్రులు స్వయంసమృద్ధి బాట లో మనందరిని నడిపించిన రోజులు గుర్తుకొచ్చాయి. 20-21 సంవత్సరాల వయస్సు గల తమ పిల్లలు స్వయంసమృద్ధం కావాలని ప్రతి ఒక్క కుటుంబం కోరుకుంటుంది. మనం భారతదేశ 75 వ స్వాతంత్ర్య వార్షికోత్సవానికి ఒకే ఒక్క అడుగు దూరం లో ఉన్న సమయం లో దేశం తన కాళ్లపైన తాను నిలబడవలసిన, స్వయంసమృద్ధి ని సాధించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఒక కుటుంబానికి ఏమి కావాలన్నది కూడా దేశాని కి ఎంతో ప్రధానం. భారతదేశం ఈ కల ను సాకారం చేసుకుంటుందన్న విశ్వాసం నాకు పూర్తిగా ఉంది. నాకు ఇంత విశ్వాసం ఏర్పడడానికి కారణం ప్రజల్లోని ప్రతిభాసామర్థ్యాలే. మన యువత, మహిళా శక్తి లో గల సాటి లేనటువంటి శక్తి ని నేను విశ్వసిస్తున్నాను. భారతదేశం ఆలోచన ధోరణి ని, వైఖరి ని నేను నమ్ముతున్నాను. ఏదైనా సాధించాలని భారతదేశం అడుగేసినప్పుడల్లా విజయాన్ని సాధించిందనేందుకు చరిత్రే నిదర్శనం.
ఈ కారణం గా, స్వయంసమృద్ధి ని గురించి మనం మాట్లాడితే ప్రపంచం అంతటా ఆసక్తి రేకెత్తుతుంది. భారతదేశం నుండి తాము ఆశిస్తున్న వాటిపై కూడా ప్రపంచం అంచనాలు పెరిగిపోతాయి. వారి అంచనాల కు దీటు గా మన సామర్థ్యాల ను పెంచుకోవలసి ఉంది. అందుకు మనం సమాయత్తం కావడం అవసరం.
భారత్ వంటి పెద్ద దేశం లో యువశక్తి పుష్కలం గా ఉంది. స్వయంసమృద్ధియుత భారత్ కు ప్రధానంగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. అదే స్వయంసమృద్ధి కి పునాది.
ఇది కొత్త ఆకాంక్షలకు శక్తి ని కల్పిస్తుంది, అభివృద్ధి సాధన కు కొత్త శక్తి ని సమకూర్చుతుంది.
‘‘ప్రపంచం యావత్తు ఒకే కుటుంబం’’(వసుధైవ కుటుంబకమ్) నానుడి ని భారతదేశం ఎప్పుడూ అనుసరిస్తుంది. ‘‘జయ్ జగత్’’ అంటే ప్రపంచానికి చెందినది అని వినోబా జీ చెబుతూ ఉండే వారు. అందుకే ప్రపంచం యావత్తు ఒక కుటుంబమే. అందుకే ఆర్థికాభివృద్ధి తో పాటు మానవాళి, మానవత కూడా మనకు ప్రధానమే. ఆ సూత్రాన్నే మనం అనుసరిస్తాము.
నేడు ప్రపంచం అనుసంధానమయింది, పరస్పర ఆధారనీయమయింది. ఈ నేపథ్యం లో భారతదేశం వంటి పెద్ద దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కు అందించే వాటా ను పెంచవలసిన సమయం ఇది. ప్రపంచ సంక్షేమం కూడా భారతదేశం బాధ్యత. భారతదేశం తన వాటా ను పెంచాలంటే ముందుగా సాధికారం కావాలి. స్వయంసమృద్ధం (ఆత్మనిర్భర్) కావాలి. ప్రపంచ సంక్షేమానికి వాటా ను అందించేందుకు మనలను మనం సిద్ధం చేసుకోవాలి. మన మూలాలు పటిష్ఠంగా ఉంటే మనం దానిని సాధించగలుగుతాం, ప్రపంచ సంక్షేమం దిశ గా ముందడుగే వేయగలుగుతాము.
మన దేశాని కి పుష్కలమైన ప్రకృతి వనరులు ఉన్నాయి. దేశాన్ని సరికొత్త శిఖరాల కు చేర్చాలంటే ఆ ప్రకృతి వనరుల కు, మానవ వనరులకు విలువ జోడించడాన్ని మనం ప్రారంభించవలసిన సమయం ఇది. మనం ఎంత కాలం ప్రపంచానికి ముడిసరకులు మాత్రమే ఎగుమతి చేస్తాం? ఎంత కాలం పాటు ముడిసరకు ఎగుమతి చేసి పూర్తి అయిన ఉత్పత్తుల ను దిగుమతి చేసుకుంటాం? అందుకోసమే మనం స్వయంసమృద్ధి ని సాధించాలి. ప్రపంచ అవసరాల కు దీటు గా మన సామర్థ్యాల కు పదును పెట్టి స్వయంసమృద్ధం కావాలి. అది మన బాధ్యత. మనం విదేశాల నుండి గోధుమ దిగుమతి చేసుకున్న రోజులు ఉన్నాయి. కానీ మన రైతులు అద్భుతం సాధించారు. వారి కృషితో వ్యవసాయ రంగం స్వయం సమృద్ధం అయింది. ఈ రోజు న భారత రైతాంగం దేశ పౌరుల కు ఆహార ధాన్యాలను సరఫరా చేయడమే కాదు, ఇతర దేశాల కు అవసరం అయిన ఆహార ధాన్యాలను కూడా అందించగల స్థితి లో ఉన్నారు. వ్యవసాయం లో స్వయంసమృద్ధి మన బలమే అయినా, విలువ జోడింపు కూడా అవసరమే. ప్రపంచ అవసరాల కు దీటు గా మన వ్యవసాయ రంగం పరిణతి చెందవలసిన అవసరం ఉంది. వ్యవసాయ రంగాని కి కూడా విలువ జోడింపు అవసరమే. ఈ రోజు దేశం పలు కొత్త చొరవలను తీసుకుంటోంది. మనం అంతరిక్ష రంగాన్ని కూడా తెరచాము. దేశ యువత అవకాశాల ను పొందుతున్నారు. వ్యవసాయ రంగాన్ని చట్టాల ఉక్కు చట్రం నుండి తప్పించి స్వయంసమృద్ధం చేసేందుకు ప్రయత్నించాము. భారతదేశం అంతరిక్ష రంగం లో శక్తివంతం అయినప్పుడు పొరుగు దేశాలు కూడా లాభపడతాయి. ఇంధన రంగం లో శక్తి ని పుంజుకుంటే ఇతర దేశాలు కూడా చీకట్ల ను నిర్మూలించడం లో మనం సహాయపడగలుగుతాం. భారతదేశం ఆరోగ్య మౌలిక వసతులు అభివృద్ధి చేసుకోగలిగితే హెల్థ్ టూరిజం కేంద్రం గా దేశం మారుతుంది. అందుకే ‘‘మేక్ ఇన్ ఇండియా’’ ఉత్పత్తుల ను ప్రపంచం యావత్తు ప్రశంసించేలా చేయాలి. మన నిపుణులైన మానవ వనరులు తయారుచేసిన వస్తువుల ను ప్రపంచం యావత్తు ప్రశంసించిన రోజు కూడా ఉందనేందుకు చరిత్ర నిదర్శనం.
మనం స్వయంసమృద్ధి ని సాధించాలని మాట్లాడుతున్నప్పుడు దిగుమతుల ఆధారనీయత ను తగ్గించుకునేందుకు మాత్రమే మనం ప్రస్తావించడంలేదు. స్వయంసమృద్ధి ని గురించి మాట్లాడుతున్నామంటే నైపుణ్యాల గురించి, మానవ వనరుల గురించి మాత్రమే ప్రస్తావించడం లేదు. మనం విదేశాల నుండి వస్తువుల ను పొందుతుంటే మన సామర్థ్యాలు కూడా తగ్గిపోతాయి. ఫలితం గా తరాల పాటు మన వనరులు అంతరించిపోతాయి. అందుకే మనం వాటిని పరిరక్షించుకోవాలి, మన సామర్థ్యాలు పెంచుకోవాలి. మనం నైపుణ్యాలు పెంచుకోవాలంటే మన సృజనాత్మకత పెరగాలి. మనం కొత్త శిఖరాల ను అందుకోగలగాలి. స్వయంసమృద్ధియుత భారత్ కోసం నైపుణ్యాభివృద్ధి ని శక్తివంతం చేసుకొని పోటీ సామర్థ్యాన్ని మెరుగుపరచుకోవాలి.
ప్రియమైన నా దేశవాసులారా, స్వావలంబన ను గురించి నేను మాట్లాడుతున్నానంటే ప్రజల కు చాలా అనుమానాలు వస్తాయని నాకు తెలుసు. స్వావలంబన మార్గం లో మనం ప్రయాణిస్తున్నప్పుడు ఈ పోటీ ప్రపంచం లో మనకు లక్షలాది సవాళ్ళు ఎదురవుతాయని నాకు తెలుసు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవలసిన వాస్తవం ఏమిటంటే మనకు ఎదురయ్యే లక్షలాది సవాళ్ళ కు కోట్లాది పరిష్కారాల ను చూపగల సామర్థ్యం మన దేశానికి ఉంది. సమస్యలు పరిష్కరించటానికి నా దేశ ప్రజలు సిద్ధం గా ఉన్నారు.
కరోనా వంటి సవాళ్ళు ఎదురైనప్పుడు మీరు చూశారు.. మనకు ఎన్నో వస్తువులు అవసరమయ్యాయి. మనం దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. కానీ ప్రపంచం వాటిని అందించగలిగే స్థితి లో లేదు. దేశ యువత, ఔత్సాహిక వ్యాపార దక్షులు, పరిశ్రమ ఈ సవాలు ను స్వీకరించాయి. ఏనాడూ ఎన్ -95 మాస్కులు తయారు చేయని దేశం వాటి తయారీ ప్రారంభించింది. అంతకు ముందు తయారు చేయని పిపిఇ కిట్లూ తయారు చేయటం మొదలుపెట్టాం. అలాగే వెంటిలేటర్లూ మనమూ తయారు చేసుకుంటూ వచ్చాం. మనం మన అవసరాలు తీర్చుకోవటానికే పరిమితం కాలేదు, ప్రపంచానికి ఎగుమతి చేసే దశకూ చేరుకున్నాము. భారతదేశం స్వయం సమృద్ధమై ప్రపంచానికి సాయం చేయగలుగుతుందో చూపించాము. ఆ విధం గా ప్రపంచ సంక్షేమం కోసం పనిచేయటం కూడా మన విధిగా తయారైంది.
జరిగిందేదో జరిగిపోయింది. స్వతంత్ర భారత ఆలోచన విధానం ఎలా ఉండాలి? స్థానికత కోసం గొంతెత్తటం మన ఆలోచనావిధానం కావాలి. మన స్థానిక ఉత్పత్తులు మనకు గర్వకారణం కావాలి. మన స్వదేశీ ఉత్పత్తుల ను గౌరవించి మద్దతు ఇవ్వకపోతే అవి మెరుగుపడి పురోగతి సాధించేదెలా? అవి బలోపేతమయ్యేదెలా? రండి, మనం 75 ఏళ్ళ స్వతంత్ర భారతానికి చేరువవుతున్న సమయం లో స్థానికత కోసం గొంతెత్తటం (‘వోకల్ ఫార్ లోకల్’) మన మంత్రం గా మార్చుకుందాం. మనల్ని మనం బలోపేతం చేసుకోవటానికి కలసి నడుద్దాము.
ప్రియమైన నా దేశవాసులారా, మన దేశం ఎన్ని అద్భుతాలు చేయగలదో, ఎంత పురోగతి సాధించిందో మనం స్పష్టంగా చూశాము. లక్షలు, కోట్ల ధనం పేద ప్రజల జన్- ధన్ ఖాతాల లోకి నేరు గా బదలీ చేయగలమని ఎవరైనా ఊహించారా? రైతుల సంక్షేమం కోసం ఎపిఎంసి చట్టం లో ఇన్ని మార్పులు వస్తాయని ఎప్పుడైనా ఊహించామా? నిత్యావసరాల చట్టం కోరలలో చిక్కుకుపోయిన రైతులు ఇన్నేళ్ల తరువాత ఇలా బయటపడతారని ఎవరైనా ఆలోచించారా? ఈ రోజు న మనం జాతీయ విద్య విధానాన్ని చూస్తున్నాము, ఒక దేశం- ఒక కార్డు, ఒక దేశం -ఒక గ్రిడ్, ఒక దేశం - ఒక పన్ను చూస్తున్నాము. అప్పులపాలు- దివాలా నియమావళి, బాంకుల విలీనం చూస్తున్నాము. ఇవన్నీ వాస్తవ రూపం ధరించటం చూస్తున్నాము, అదే మన దేశపు వాస్తవం.
ఈ సమయం లో భారతదేశంలో సాగుతున్న సంస్కరణల పర్వాన్ని ప్రపంచం చూస్తూ ఉంది. ఒకదాని తరువాత మరొకటి గా ఒకదానికి అనుబంధం గా మరొకటి గా మనం తెస్తున్న సంస్కరణల ను ప్రపంచం నిశితగా పరిశీలిస్తోంది. ఫలితం గా మన దేశం లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డిఐ) ప్రవాహం నిరుటి రికార్డుల ను బద్దలుకొట్టింది.
నిరుడు భారతదేశం లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల లో 18 శాతం పెరుగుదల నమోదైంది. అందువలన కరోనా సంక్షోభ సమయం లో కూడా ప్రపంచం లోని అతి పెద్ద కంపెనీ లు కూడా భారతదేశం వైపు మళ్ళాయి. ఈ విశ్వాసం ఆషామాషీ గా ఏర్పడింది కాదు. అకారణం గా ప్రపంచానికి భారతదేశం పట్ల ఈ అద్భుతమైన ప్రేమ కలగలేదు. దేశం అనుసరిస్తున్న విధానాలు, ప్రజాస్వామ్యం, ఆర్థిక పునాదుల బలోపేతం వంటి అంశాలలో మన కఠోర శ్రమ మన పట్ల ఈ నమ్మకాన్ని పెంచింది.
ఈ రోజు న ప్రపంచంలోని అనేక వ్యాపారాలు భారతదేశాన్ని ఒక సరఫరా కేంద్రం గా చూస్తున్నాయి. అందుకే ఇప్పుడు మనం ‘మేక్ ఇన్ ఇండియా’ తో బాటు ‘మేడ్ ఫర్ ద వరల్డ్’ అనే మంత్రం కూడా పఠించవలసిన సమయం వచ్చింది. ఈ మధ్య జరిగిందేమిటో ఓ మారు గుర్తు చేసుకుందాం.
130 కోట్ల ప్రజల సామర్థ్యం చూసి గర్వపడదాం. కరోనా సంక్షోభ సమయం లో తూర్పు, పశ్చిమ తీరాల్లో తుపానులు వచ్చాయి. పిడుగుపాట్లు, కొండచరియలు విరిగిపడటం, భూకంపాలు అదే పని గా వస్తూనే ఉన్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇవి చాలవన్నట్టుగా మిడుతల దండు వచ్చి మన రైతుల ను సమస్యల్లోకి నెట్టింది. ఇలా ఎన్నో సమస్యలు ఒకదాని తరువాత మరొకటి వచ్చాయి. అయినా సరే, మన దేశం విశ్వాసం కోల్పోలేదు. ఆత్మవిశ్వాసం తో ముందుకు సాగుతూనే ఉంది.
ప్రస్తుతం మన దేశప్రజల ను, దేశ ఆర్థిక స్థితి ని ఈ కరోనా సంక్షోభం నుండి బయట పడేయటం మన తక్షణ కర్తవ్యం. జాతీయ మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టు ఈ క్రమం లో అత్యంత కీల పాత్ర పోషిస్తుంది. దీనిమీద రూ. 110 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాము. ఇందుకోసం వివిధ రంగాల కు చెందిన సుమారు ఏడు వేల ప్రాజెక్టులను గుర్తించాము. ఇది కూడా దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధికి వేగం, దిశ కల్పిస్తుంది. సంక్షోభ సమయాల్లోనే మౌలిక సదుపాయాలమీద దృష్టి పెడితే ఆర్థిక కార్యకలాపాలు వేగం పుంజుకుంటాయని అంటారు. అప్పుడే ప్రజలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడి దాని వలన ఇతర ప్రయోజనాలు కలుగుతాయి. చిన్న, పెద్ద వ్యాపారాలు, రైతులు, మధ్య తరగతి చాలావరకు లబ్ధి పొందుతారు.
ఈరోజు నేనొక సంఘటన ను గుర్తు చేద్దామనుకుంటున్నా. అటల్ బిహీరీ వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతో ప్రయోజనం చేకూర్చే స్వర్ణ చతుర్భుజి అనే కార్యక్రమం ప్రారంభించారు. ఆ విధంగా ఆయన రోడ్ల నెట్ వర్క్ మౌలిక వసతి ని ముందు తరానికి తీసుకువెళ్ళారు. ఈ రోజుకూ దేశం యావత్తూ ఆ స్వర్ణ చతుర్భుజి ని గర్వంగా చూస్తూ, మన దేశం మారుతోందని నమ్ముతుంది.
ప్రియమైన నా దేశవాసులారా,
అటల్ జీ తన కాలం లో ఈ పని చేశారు. కానీ ఇప్పుడు మనం దాన్ని ముందుకు తీసుకుపోవలసిన బాధ్య త ఉంది. సరికొత్త గా దానిని వాడుకోవటం మీద దృష్టి పెట్టాలి. మనం గోతుల మీద ప్రయాణించలేము. మౌలిక సదుపాయాల రంగం లో రోడ్ల కోసమే రోడ్లు, రైళ్ల కోసమే రైలుమార్గం అనే పరిస్థితి మనకొద్దు. రైల్వేలకూ, రోడ్డుమార్గానికీ మధ్య సమన్వయం లేదు. విమానాశ్రయాలకూ, నౌకాశ్రయాలకూ మధ్య సమన్వయం లేదు. రైల్వే స్టేషన్ కూ బస్ స్టేషన్ కూ అనుబంధం లేదు. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. అందుకే మౌలిక సదుపాయాలు సమగ్రంగా ఉండేటట్టు, సమీకృతం అయ్యేటట్టు చూసుకోవలసిన అవసరముంది. ఒకదానికొకటి అనుబంధం గా ఉండాలి. రైలుకూ రోడ్డుకూ అనుబంధం ఉండాలి. రోడ్డుకూ, నౌకాశ్రయానికీ సంబంధం, నౌకాశ్రయానికీ, విమానాశ్రయానికీ సమన్వయం ఉండాలి. మనం బహుళ నమూనా అనుసంధానం దిశ గా మన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసుకుంటూ కొత్త శతాబ్దం లోకి బాటలు వేసుకోవాలి. అప్పుడొక కొత్త ముఖం ఆవిష్కృతమవుతుంది. ఒక పెద్ద కల తో మనం ఈ కార్యక్రమం ప్రారంభించాము. ఈ గుంతలు పూడ్చుకుంటూ ఈ వ్యవస్థలన్నిటినీ బలోపేతం చేద్దాము.
దీంతోబాటు గా మన తీరప్రాంతాని కి ప్రపంచ వాణిజ్యం లో చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. రానున్న కాలం లో నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధి తో ముందుకు సాగుతూ అత్యాధునిక మౌలిక సదుపాయాల నిర్మాణం సాగిద్దాము. తీరప్రాంతం పొడవునా మొత్తం నాలుగు దారుల రహదారి నిర్మిద్దాము.
ప్రియమైన నా దేశవాసులారా,
మన పురాతన గ్రంధాలు ఎన్నో లోతైన విషయాలు చెప్పాయి.
‘సామర్థ్య మూలం స్వాతంత్ర్యం. శ్రమ మూలం వైభవమ్’ అని చెప్పబడింది.
ఈ మాటల కు.. స్వేచ్ఛ కు మూలం సమర్థత, వైభవానికి మూలం కృషి అని అర్థం. ఏ దేశ సంపద అయినా, పురోగతి అయినా వాటి మీదనే ఆధారపడి ఉంటుంది.
అందుకే, సామాన్యుడి కష్టాని కి మించింది మరేదీ లేదు. అది గ్రామం కావచ్చు, నగరం కావచ్చు. శ్రామిక సమాజానికి తగిన వసతులు ఉంటే జీవన పోరాటం సులభతరమవుతుంది. దైనందిన సమస్యలు తగ్గిపోతాయి. ఇది వాళ్ళ శక్తి ని పెంచి గొప్ప ఫలితాలనిస్తుంది.
గత ఆరేళ్ల లో ఈ దేశ పౌరులైన శ్రమ జీవుల జీవితాల ను మెరుగుపరచటానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అవి సొంత బ్యాంకు ఖాతాలు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, పెద్ద ఎత్తున మరుగుదొడ్ల నిర్మాణం కావచ్చు, ప్రతి ఇంటా విద్యుత్ సౌకర్యం కావచ్చు, మన తల్లుల ను, అక్కచెల్లెళ్ళ ను పొగ బారి నుండి కాపాడుతూ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం కావచ్చు, అత్యంత నిరుపేదల కు బీమా రక్షణ కవచం కల్పించటం కావచ్చు. ఆయుష్మాన్ భారత్ యోజన ద్వారా అత్యుత్తమ ఆస్పత్రుల లో ఐదు లక్షల రూపాయల దాకా విలువ చేసే వైద్య సదుపాయం కల్పించటం కావచ్చు, రేషన్ షాపుల ను డిఒజిటల్ టెక్నాలజీ తో అనుసంధానం చేయటమూ కావచ్చు. గడచిన ఆరేళ్ళ కాలం లో పారదర్శకత పాదుకొల్పి వివక్ష ను దూరం చేయటం లో చెప్పుకోదగినంత పురోగతి ని సాధించాము. దీని వలన సౌకర్యాలు ప్రతి పేదవాడికీ అందటం వీలవుతుంది.
ఈ సౌకర్యాలన్నీ కరోనా సంక్షోభ సమయంలోనూ నిరాటంకం గా అందటానికి దోహదపడ్డాయి. ఈ సమయంలోనూ మనం కోట్లాది పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు అందించగలిగాం. వాళ్ళకు రేషన్ కార్డ్ ఉందా లేదా అనేది పట్టించుకోకుండా దేశం లో 80 కోట్ల మందికి ఆహార పదార్థాలు అందజేస్తూ వంట చేసుకుని తినే సౌకర్యం ఆగకుండా చూడగలిగాం. దాదాపు 90 వేలకోట్ల మందికి నేరుగా బాంకు ఖాతాల్లో డబ్బు జమచేశాం. కొద్ది సంవత్సరాల కిందట దిల్లీ నుండి పంపిన రూపాయి లోని వంద పైసలూ పేదవాడి ఖాతాలోకి వెళతాయన్నది అనూహ్యం. ఎవరి ఊహలకూ అందని విషయమిది.
వాళ్ల సొంత గ్రామాల లోనే ఉపాధి దొరికేలా ‘గరీబ్ కల్యాణ్ రోజ్ గార్ అభియాన్’ ను రూపొందించాము. మన కార్మిక సోదరులు తమ నైపుణ్యాన్ని పెంచుకుంటారని నమ్ముతున్నాము. వాళ్ళ కృషిమీద పూర్తి నమ్మకంతో, వాళ్ళ నైపుణ్యాలమీద ఆధారపడుతూ, గ్రామీణ వనరుల మీద ఆధారపడుతూ, స్థానికత కోసం గొంతెత్తండి (‘వోకల్ ఫార్ లోకల్) అనే నినాదాన్ని ఇచ్చాము. నైపుణ్యాలు పెంచుకోండి అని సూచించాము. దీనివలన మన దేశపు పేద కార్మిక శక్తి బలోపేతమవుతుంది.
ఆర్థిక కార్యకలాపాల కు నగరమే కేంద్రబిందువు గనుక వీధి వర్తకుల కోసం ఒక పథకం రూపొందించాం. వాళ్ళంతా జీవనోపాథి కోసం గ్రామాలనుంచి నగరాలకు తరలి వచ్చిన వారే. వాళ్లకు నేరు గా బ్యాంకుల నుంచే సహాయం అందేలా చూస్తున్నాము. అతి తక్కువ సమయం లోనే ఈ కరోనా కాలం లోనూ లక్షల మంది దీనిని ఉపయోగించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద వడ్దీల కు ప్రైవేటు అప్పులు తీసుకోవలసిన అవసరం లేదు. గౌరవం గా అధికార స్వరం తో అప్పు తీసుకునే వెసులుబాటు వాళ్లకు అందుబాటులోకి వచ్చింది.
అదే విధం గా, మన కార్మికులు నగరానికి వలస వెళ్ళినప్పుడు వాళ్లకు ఉండటానికి తగిన వసతి దొరికితే వాళ్ల పని సామర్థ్యం కూడా పెరుగుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని మనం ఒక ప్రధాన పథకాన్ని రూపొందించాము. సరసమైన ధరలకే నగరంలో అద్దె ఇల్లు దొరకటానికి ఈ పథకం వీలుకల్పిస్తుంది. అందువలన కార్మికులు నగరానికి వలస వస్తే వాళ్ళు తమ పని మీద ప్రగతి మీద దృష్టి సారించి అంకితభావం తో పనిచేయగలుగుతారు.
ప్రియమైన నా దేశవాసులారా,
సమాజం లోని కొన్ని సమూహాలు వెనుకబడి ఉన్నాయన్నది కూడా నిజం. దేశం అభివృద్ధి పథం లో పయనిస్తున్నా వారు పేదరికం నుండి బయటపడలేపోవడాన్ని మనం చూశాము. అలాగే వెనుకబడిన కొన్ని ప్రాంతాలు, ప్రదేశాలు, భూభాగాలు ఉన్నాయి. భారతదేశాన్ని స్వయంసమృద్ధియుత దేశం గా రూపుదిద్దడానికి సమతుల అభివృద్ధి సాధించడం చాలా అవసరం. అందుకే అభివృద్ధి ని ఆకాంక్షించే 110కి పైగా జిల్లాల ను గుర్తించాం. అవి ఇతర సగటు జిల్లాల కంటే వెనుకబడి ఉన్నాయి. ఆయా జిల్లాల ను ప్రతి కొలమానం లోనూ దేశ సగటు తో సమానం గా తీసుకు రావలసి ఉంది. వెనుకబడి
ఉన్న ఈ 110 జిల్లాల ప్రజల కు నాణ్యమైన విద్య, మైరుగైన వైద్య సదుపాయాలు, స్థానికం గా ఉపాధి పొందే అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము.
ప్రియమైన నా దేశవాసులారా,
స్వయంసమృద్ధ భారతదేశపు ప్రాధాన్యం ఏమిటంటే ఒక స్వయంసమృద్ధ వ్యవసాయ రంగం, స్వావలంబన సాధించిన రైతులు. వారిని మనం విస్మరించలేము. రైతుల స్థితిగతుల ను మనం చూశాము. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి అనేక సంస్కరణల ను చేపట్టారు. వారిని అన్ని
బంధనాల నుండి విముక్తులను చేయవలసి ఉంది. మేము అదే చేశాము.
మీరు ఇది ఊహించలేరు. మీరు ఒక సబ్బు, బట్ట లేదా పంచదార ఎక్కడో ఓ మూల తయారు చేసినా.. దేశంలోని ఏ ప్రాంతంలోనైనా దాన్ని అమ్ముకోవచ్చు. అయితే, రైతులు వారికి ఇష్టం వచ్చినట్లుగా దేశంలో ఎక్కడైనా తమ ఉత్పత్తి ని అమ్ముకోజాలరని చాలా మందికి తెలియదు. నోటిఫై చేసిన ప్రాంతం లో మాత్రమే రైతు తన ఉత్పత్తి ని అమ్ముకునే వాడు. ఇటువంటి అన్ని హద్దుల ను
మేము చెరిపేశాము.
ఇప్పుడు రైతు దేశంలోని లేదా ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనైనా తన ఉత్పత్తి ని తన సొంత నియమాల కు అనుగుణం గా విక్రయించుకోవడం ద్వారా స్వేచ్ఛ గా ఊపిరి పీల్చుకోగలడు. రైతు ఆదాయాన్ని పెంచడానికి అనేక ప్రత్యామ్నాయ చర్యల ను మేము నిర్ధేశించాము. వ్యవసాయం లో ఉత్పాదనల ధరలు తగ్గించేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నాము. రైతు కు డీజిల్ పంపునకు బదులు సౌర విద్యుత్ పంపు ను ఎలా ఇవ్వవచ్చు? ఆహారాన్ని ఉత్పత్తి చేసే వ్యక్తి ఇంధన ఉత్పత్తిదారు గా ఎలా మారగలడు? తేనెటీగల పెంపకం, చేపల పెంపకం, కోళ్ల పెంపకం వంటి మార్గాల ద్వారా రైతు ఆదాయం రెట్టింపు చేసే దిశ గా మేము పని చేస్తున్నాము.
మన వ్యవసాయ రంగం ఆధునికంగా మారాలని, విలువ జోడింపు పెరగాలని, ఆహార ప్రోసెసింగ్, ఆహార ప్యాకేజింగ్ జరగాలని కాలం డిమాండ్ చేస్తోంది. వాటికి మెరుగైన మౌలిక సదుపాయాలు అవసరం.
కరోనా మహమ్మారి కాలంలోనూ భారత ప్రభుత్వం వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు 1,00,000 కోట్ల రూపాయలను మంజూరు చేయడం మీరు చూసే ఉంటారు. ఈ మౌలిక సదుపాయాలు రైతుల సంక్షేమం కోసమే.. రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరల ను పొందగలుగుతారు. విదేశీ విపణులలోనూ వారి ఉత్పత్తులను అమ్ముకోగలుగుతారు. విదేశీ విపణుల కు వారు బాగా చేరువ అవుతారు.
గ్రామీణ పరిశ్రమల ను బలోపేతం చేయవలసిన అవసరం ఇక్కడ ఉంది. గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేక ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయడం జరుగుతుంది. వ్యవసాయ, వ్యవసాయేతర పరిశ్రమల జాలం సృష్టించబడుతుంది. మేము రైతు ఉత్పత్తి సంఘాల (ఎఫ్ పిఒ స్)ను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించాము. రైతుల ఆర్థిక స్వావలంబన లో అవి సుదీర్ఘ పాత్ర ను పోషిస్తాయి.
సోదర సోదరీమణులారా,
గత ఏడాది నేను ‘జల్ జీవన్ మిశన్’ కోసం ఒక ప్రకటన చేశాను. ఏడాది పూర్తి కావస్తోంది. ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి తేవాలన్న మన కల సాకారం అవుతోందని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. చాలా ఆరోగ్య సమస్యలకు పరిష్కారం నేరు గా స్వచ్ఛమైన తాగునీటి తో ముడిపడి ఉంది. అది దేశ ఆర్థిక వ్యవస్థకూ దోహదపడుతుంది. ఈ కారణం వల్లనే మేము జల్ జీవన్ మిశన్ ను ప్రారంభించాము.
ఇప్పుడు ప్రతి రోజూ ఒక లక్ష ఇళ్లకు పైపుల ద్వారా నీరు అందించగలుగుతున్నామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. గత ఏడాది కాలం గా రెండు కోట్ల కుటుంబాల కు - ముఖ్యంగా అడవుల్లో, మారు మూల ప్రాంతాల్లో నివసిస్తున్న గిరిజనుల కు నీటిని అందించగలిగాము. దీని కోసం ఓ భారీ ప్రచారోద్యమం జరిగింది. ఈరోజు ‘జల్ జీవన్ మిశన్’ దేశంలో ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణాన్ని సృష్టించినందుకు సంతోషం గా ఉంది. జిల్లాల మధ్య, నగరాల మధ్య... అలాగే రాష్ట్రాల మధ్య కూడా ఒక ఆరోగ్యకరమైన పోటీ నెలకొంది. ప్రధాన మంత్రి కల ‘జల్ జీవన్ మిశన్’ తమ ప్రాంతం లో ముందుగా నెరవేరుతుందని ప్రతి ఒక్కరూ ఆశాభావం తో ఉన్నారు. సహకార, స్పర్ధాత్మక సమాఖ్య తత్వం లోని సరికొత్త శక్తి ‘జల్ జీవన్ మిశన్’తో ముడిపడి ఉంది. దాంతోనే మేము ముందడుగు వేస్తున్నాము.
ప్రియమైన నా దేశవాసులారా,
వ్యవసాయ రంగం లో గానీ, చిన్న తరహా పరిశ్రమల రంగం లేక సేవల రంగం లో గానీ ఉన్న ప్రజలు ఓ భారీ మధ్య తరగతి వర్గాన్ని సృష్టించారు. ఈ మధ్య తరగతి నుండి వచ్చిన వృత్తి నిపుణులు నేటి ప్రపంచంలో తమకంటూ ఒక పేరును పదిలపరుచుకున్నారు. మధ్య తరగతి నుండి వచ్చిన మన వైద్యులు, ఇంజనీర్లు, లాయర్లు, శాస్త్రవేత్తలు ప్రపంచంలో తమదైన ముద్ర వేశారు. మధ్య తరగతి కి ఏ అవకాశాలు వచ్చినా వాటి నుండి గరిష్ఠం గా ప్రయోజనం రాబడతారన్నది నిజం. అందువల్ల ప్రభుత్వ జోక్యం నుండి మధ్య తరగతి కి స్వేచ్ఛ అవసరం. మన మధ్య తరగతి కి మరిన్ని కొత్త అవకాశాలు, స్వేచ్ఛా వాతావరణం కావాలి. మధ్య తరగతికి ఉన్న ఈ కలల ను నెరవేర్చడానికి మా ప్రభుత్వం నిరంతరం పని చేస్తోంది. అద్భుతాలు చేసే శక్తి మధ్య తరగతి కి ఉంది. ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ద్వారా మధ్య తరగతి కుటుంబాలు గొప్ప ప్రయోజనాల ను పొందుతాయి. చౌక ఇంటర్ నెట్, అందుబాటు ధరల్లో స్మార్ట్ ఫోన్లు, ‘ఉడాన్’ కింద తక్కువ విమాన ఛార్జీలు లేదా మన రహదారులు లేదా సమాచార వారధులు.. ఇలాంటి అన్నీ మధ్య తరగతి బలాన్ని పెంచుతాయి. పేదరికం నుండి బయటపడిన ఓ మధ్య తరగతి వ్యక్తి ప్రధానమైన కల సొంత ఇల్లు కలిగి ఉండటం మీరు చూసే ఉంటారు. ఇతరులతో సమానం గా జీవించాలని ఆ వ్యక్తి కోరుకుంటాడు. దేశం లో ఇఎంఐ విషయం లో మేము చాలా పని చేశాము. దాని ఫలితం గా ఇంటి రుణాల పై వడ్డీ రేట్లు చౌక అయ్యాయి. ఒక వ్యక్తి ఇంటి కోసం లోను తీసుకుంటే, దాన్ని తిరిగి చెల్లించే సమయానికి 6 లక్షల రూపాయల వరకు రిబేటు పొందవచ్చు. ఇటీవల చాలా మధ్య తరగతి కుటుంబాలు ఇల్లు కొనడానికి డబ్బు పెట్టుబడిగా పెట్టినా... ప్రాజెక్టులు పూర్తి కాని కారణం గా వారి చేతికి తాళాలు రాకపోవడం వల్ల బాధితులు గా మారడం గమనించాము. వారు ఇప్పటికీ అద్దె ఇంట్లోనే నివసిస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలు ఇళ్ళ ను పొందేందుకు వీలు గా పూర్తి కాని ఇళ్ళ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి భారత ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల తో ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది.
వస్తువులు, సేవల పన్ను (జిఎస్ టి), ఆదాయ పన్ను రేటు లు తగ్గాయి. ఈరోజు ఈ కనీస వ్యవస్థాపన సదుపాయాల తో దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. సహకార బ్యాంకుల ను భారతీయ రిజర్వు బ్యాంకు పరిధి లోకి తేవడం, మధ్య తరగతి కుటుంబాల డబ్బు భద్రత కు భరోసా
ఇవ్వడమే.
ఎంఎస్ఎంఇ రంగం, వ్యవసాయ రంగం లో చేపట్టిన సంస్కరణ లు కష్టించి పని చేసే మధ్య తరగతి కుటుంబాల కు నేరు గా ప్రయోజనం చేకూరుస్తాయి. పర్యవసానం గా, వేల కోట్ల రూపాయల ప్రత్యేక నిధి ద్వారా మన వ్యాపారులు, చిన్న పారిశ్రామికవేత్తలు ప్రయోజనాలు పొందుతారు. స్వయంసమృద్ధ భారత దేశపు విస్తృత పునాదే సగటు భారతీయుడికి బలమూ, శక్తి. ఈ బలిమి ని నిలబెట్టుకోవడానికి అన్ని స్థాయిలలోనూ నిరంతర కృషి జరుగుతోంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
స్వయంసమృద్ధియుత, ఆధునిక, సరిక్రొత్త, సుసంపన్న, సంతోషమయ భారత దేశాన్ని నిర్మించడం లో దేశ విద్య వ్యవస్థ కు గొప్ప ప్రాధాన్యం ఉంది. ఈ ఆలోచనతోనే, మూడు దశాబ్దాల తర్వాత నూతన జాతీయ విద్య విధానాన్ని దేశానికి అందించడంలో మేము విజయవంతమయ్యాము.
భారతదేశం లోని ప్రతి ప్రాంతమూ నూతన ఆసక్తి, రెట్టించిన ఉత్సాహం తో ఈ విధానాన్ని స్వాగతిస్తోంది. ఈ జాతీయ విద్యా విధానం మన విద్యార్ధులను మూలాల తో కలుపుతుంది. దాంతోపాటే ప్రపంచ పౌరులు గా మారడానికి వారికి సహకరిస్తుంది. విద్యార్ధులు మూలాల తో బలం గా పెనవేసుకునే సమున్నత శిఖరాల ను తాకుతారు. నేశనల్ రీసెర్చ్ ఫౌండేశన్ కి జాతీయ విద్యా విధానం లో ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం మీరు గమనించే ఉంటారు. ఎందుకంటే.. ప్రగతి సాధించాలంటే దేశం లో ఆవిష్కరణ లు అవశ్యం. ఆవిష్కరణ లు- పరిశోధనల కు అధిక ప్రాధాన్యం ఇస్తే.. ఈ పోటీ ప్రపంచం లో భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి గొప్ప బలం చేకూరుతుంది.
గ్రామీణ ప్రాంతాలలో ఆన్ లైన్ తరగతులు ఉంటాయని, అటువంటి ఒరవడి ఇంత వేగంగా రూపుదిద్దుకొంటుందని ఎవరు అనుకున్నారు? కొన్నిసార్లు, ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు, నూతన విప్లవాత్మకమైన చర్యలు బలంగా ముందుకొస్తాయి. ఈ మహమ్మారి పరిస్థితుల్లో ఆన్ లైన్ తరగతుల సంస్కృతి ఎలా ఆవిర్భవించిందో మనం చూశాము.
ఎంత వేగం గా ఆన్ లైన్ డిజిటల్ లావాదేవీ లు పెరుగుతున్నాయో మీరు చూడవచ్చు. భీమ్ యుపిఐ యాప్ ను చూడండి... గత ఒక్క నెలలోనే భీమ్ యుపిఐ యాప్ ద్వారా 3 లక్షల కోట్ల రూపాయల మేరకు లావాదేవీలు చేయగలిగామని తెలుసుకుంటే ఎవరైనా గర్వం గా భావిస్తారు. మారుతున్న పరిస్థితుల ను మనం ఎలా స్వీకరిస్తున్నామో తెలుసుకోవడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ.
2014వ సంవత్సరాని కంటే పూర్వం మీరు చూస్తే... ఐదు డజన్ ల పంచాయతీల లో మాత్రమే ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ ఉండేది. అయితే గత ఐదేళ్లలో లక్షన్నర పంచాయతీ లు ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తోటి అనుసంధానమయ్యాయి. అది ఈ రోజు మనకు అమితంగా ఉపయోగపడుతోంది. ఈ నెట్ వర్క్ ను ప్రతి పంచాయతీ కీ తీసుకెళ్లాలన్న లక్ష్యం తో మేము పని చేస్తున్నాము. మరో లక్ష పంచాయతీల లో ఆ పనుల్లో పురోగతి ఉంది. మారుతున్న ఈ కాలానికి అనుగుణం గా గ్రామీణ భారతాన్ని కూడా ‘డిజిటల్ ఇండియా’ పరిధి లోకి తీసుకు రావడం తప్పనిసరి. గ్రామీణ ప్రజల నుండి ఆన్ లైన్ సదుపాయాల కోసం డిమాండ్ వెల్లువలా పెరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని, ఇంటర్ నెట్ అనుసంధానాన్ని ప్రతి పంచాయతీకీ విస్తరించాలని ఇంతకు ముందే ప్రతిపాదించాము. ఈ రోజు మీకు హామీ ఇస్తున్నాను. దేశం లోని 6 లక్షల గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ నెట్ వర్క్ తో అనుసంధానించాలని నిర్ణయించాము. అవసరాలు మారినందున మా ప్రాధాన్యాలు కూడా అందుకు అనుగుణంగానే ఉంటాయి. ఆరు లక్షల గ్రామాలలో వేలు లక్షల కిలోమీటర్ల పొడవున ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ వేయడం జరుగుతుంది. 1000 రోజుల లోపల ఆరు లక్షల గ్రామాలనూ ఆప్టికల్ ఫైబర్ వలయంతో అనుసంధానించాలని మేము నిర్ణయించాము.
ఈ సాంకేతిక యుగం లో, మనం ఇంటర్ నెట్ పై ఆధారపడటం అనేక రెట్లు పెరగనుంది. అయితే, సైబర్ స్పేస్ తనవైన ప్రత్యేక ప్రమాదాలు, నష్టాలనూ తెచ్చి పెడుతుంది. ప్రపంచానికి ఈ అంశాలు బాగా తెలుసు. ఆ ప్రమాదం మన దేశ సామాజిక ఛట్రానికి, ఆర్థిక వ్యవస్థకు కావచ్చు... దేశ అభివృద్ధి ని సైతం సవాలు చేయవచ్చు; మనకు ఆ విషయం బాగా తెలుసు. భారతదేశం చాలా జాగురూకత తో ఉంది. ఈ ప్రమాదాల ను ఎదుర్కోవడానికి తీసుకోవలసిన చర్యల పై ప్రణాళిక రచిస్తోంది. ఇదొక్కటే కాదు. నూతన వ్యవస్థల అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంది. కొద్ది కాల వ్యవధిలోనే, సైబర్ సెక్యూరిటీ విధాన ముసాయిదా పత్రాన్ని దేశాని కి సమర్పించబోతున్నాము. రానున్న కాలం లో మనం అన్నిటినీ అనుసంధానించి... ఆనక ఈ సైబర్ సెక్యూరిటీ చట్రం లోపల పని చేయవలసి ఉంటుంది. అలా ముందుకు సాగేందుకు మేము వ్యూహాల ను రచిస్తాము.
ప్రియమైన నా దేశవాసులారా,
భారతదేశం లో మహిళాశక్తి కి అవకాశాలు ఇచ్చినపుడల్లా వారు మన దేశాని కి కీర్తిప్రతిష్ఠ లు ఆర్జించి పెట్టడమేగాక దేశాన్ని బలోపేతం చేస్తూనే ఉన్నారు. ఇవాళ మహిళల కు ఉపాధి తో పాటు స్వతంత్రోపాధి దిశ గా సమానావకాశాల కల్పన కు దేశం కట్టుబడి ఉంది. నేడు దేశం లో మహిళ లు భూగర్భ బొగ్గు గనులలో కూడా పనిచేస్తున్నారు. ఈ రోజు న భరత మాత పుత్రికారత్నాలు ఆకాశమే హద్దు గా యుద్ధ విమానాల లో దూసుకుపోతున్నారు. నావికా, వైమానిక పోరాట దళాల్లో మహిళల కు భాగస్వామ్యం కల్పించిన ప్రపంచ దేశాల జాబితా లో నేడు భారతదేశం కూడా చేరింది. గర్భిణులైన మహిళల కు వేతనం తో కూడిన 6 నెలల సెలవు ను ఇవ్వడం, మన దేశంలోని ముస్లిమ్ సోదరీమణుల ను ‘ముమ్మారు తలాక్’ వేదన నుండి విముక్తుల ను చేయడం, మహిళల కు ఆర్థిక సాధికారిత ను కల్పించడం పై అనేక నిర్ణయాల ను అమలు చేశాము.
దేశం లోని మొత్తం 40 కోట్ల జన్ ధన్ బ్యాంకు ఖాతాల లో 22 కోట్ల ఖాతాలు మన సోదరీమణులవే. కరోనా మహమ్మారి సమయం లో వీరి ఖాతాల లో సుమారు 30,000 కోట్ల రూపాయలు జమయ్యాయి. అలాగే ఇప్పటి దాకా మంజూరు చేసిన దాదాపు 25 కోట్ల ‘ముద్ర’ రుణాల లో 70 శాతం రుణాలు మన తల్లులు, సోదరీమణుల కు దక్కాయి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో గరిష్ఠం గా నమోదులు మహిళల పేరిట చేయబడ్డాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
ఈ ప్రభుత్వం పేద సోదరీమణులకు, కుమార్తెల కు మెరుగైన ఆరోగ్య సంరక్షణ కల్పించడం పై నిరంతరం దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగం గా జన్ ఔషధి కేంద్రాల ద్వారా రూపాయి కే శానిటరీ ప్యాడ్ లను అందించేందుకు ఎనలేని కృషి చేశాము. ఆ మేరకు అత్యంత స్వల్ప వ్యవధిలో 6000 జన్ ఔషధి కేంద్రాల ద్వారా 5 కోట్ల కు పైగా శానిటరీ ప్యాడ్ లు పేద మహిళల కు పంపిణీ అయ్యాయి.
కుమార్తె లు ఇకపై పోషకాహార లోపం తో బాధ పడకుండా, వారు యుక్త వయస్సు లో వివాహం చేసుకొనేలా చూడటం లక్ష్యం గా మేము ఒక కమిటీ ని ఏర్పాటు చేశాము. అది నివేదిక సమర్పించగానే, కుమార్తె ల వివాహ ప్రాయం పై తగిన నిర్ణయాలు తీసుకొంటాము.
ప్రియమైన నా దేశవాసులారా,
ప్రస్తుత కరోనా మహమ్మారి సమయం లో అందరి దృష్టీ ఆరోగ్యం పై కేంద్రీకృతం కావడం సహజం. ఈ సంక్షోభ సమయాన స్వావలంబన ప్రాముఖ్యం గురించి ఆరోగ్య రంగం మనకు గొప్ప పాఠం నేర్పింది. ఆ మేరకు లక్ష్యసాధన కోసం మేం ముందడుగు వేశాము.
లోగడ మన దేశం లో కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహించగల ప్రయోగశాల కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది. కానీ, నేడు దేశంలో ప్రతి మూల 1400కు పైగా ప్రయోగశాలల నెట్ వర్క్ అందుబాటు లోకి వచ్చింది. అలాగే కరోనా సంక్షోభం ఆరంభమైనపుడు రోజు కు 300 పరీక్షలు మాత్రమే నిర్వహించే స్థితి లో ఉన్న మనం అతి తక్కువ వ్యవధి లో ఇవాళ రోజువారీ 7 లక్షల కు పైగా పరీక్షలు నిర్వహించగలమని దేశవాసులు రుజువుచేశారు. ఆ విధం గా 300 పరీక్షల తో మొదలైన మనం ఈ రోజు న 7 లక్షల స్థాయి ని దాటి మరింత ముందుకు పోతున్నాము.
ఆధునికీకరణ దిశగానూ నిరంతరం కృషి చేస్తున్నాం. ఆ మేరకు కొత్త ‘ఎయిమ్స్’, కొత్త వైద్య కళాశాలల ను దేశంలోని వివిధ ప్రాంతాల లో నిర్మిస్తున్నాం. గడచిన ఐదేళ్ల లో అదనం గా 45,000 మంది విద్యార్థులకు ఎంబీబీఎస్, ఎండీ వైద్య కోర్సుల లో సీట్లు అందుబాటు లోకి వచ్చాయి. దేశవ్యాప్తం గా గ్రామాల లో 1.5 లక్షలకు పైగా శ్రేయోకేంద్రాలు ఏర్పాటవగా వాటిలో మూడో వంతు ఇప్పటికే పనిచేస్తున్నాయి. దీనివల్ల కరోనా మహమ్మారి సమయం లో ప్రజలకు అవెంతగానో తోడ్పడ్డాయి. ముఖ్యం గా గ్రామీణ ప్రాంత ప్రజల ఆరోగ్య అవసరాలు తీర్చడం లో కీలక పాత్ర పోషించాయి.
ఇక ఇవాళ్టి నుండి ఆరోగ్య రంగంలో ఒక భారీ కార్యక్రమం ప్రారంభం కాబోతోంది. అందులో సాంకేతిక పరిజ్ఞానం ప్రధాన పాత్ర ను పోషించనుంది.
అలాగే జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం కూడా ఇవాళ శ్రీకారం చుట్టుకోనుంది. భారత ఆరోగ్య రంగం లో ఇది సరికొత్త విప్లవాన్ని తెస్తుంది. తద్ద్వారా సాంకేతిక విజ్ఞాన సముచిత వినియోగం తో చికిత్స లో సవాళ్ల ను తగ్గించగలుగుతాము.
భారతదేశం లో ప్రతి ఒక్కరికి ఆరోగ్య గుర్తింపు (Health ID) ఇవ్వబడుతుంది. ఇది ప్రతి పౌరుడికీ/పౌరురాలికి ఆరోగ్య ఖాతా వంటిది అవుతుంది. మీరు చేయించుకొనే ప్రతి వైద్య పరీక్షల, వ్యాధుల
వివరాలు, మీరు సంప్రదించిన వైద్యుల పేర్లు, మీరు వాడిన మందులు, చేయించుకున్న రోగ నిర్ధారణ పరీక్షల సమాచారమంతా ఈ ఖాతా లో నమోదు అవుతుంది. ఏ వైద్య నివేదిక ఎప్పుడు రూపొందించిందీ వంటి వివరాలు కూడా ఆరోగ్య గుర్తింపు (Health ID) లో నమోదు అవుతాయి.
ఆ మేరకు డాక్టర్ తో సంప్రదింపు కోరడం, సొమ్ము చెల్లించడం, ఆస్పత్రిలో చీటీ తీసుకోవడం వంటి ఇక్కట్లన్నీ ఇక జాతీయ డిజిటల్ ఆరోగ్య కార్యక్రమం తో తీరిపోతాయి. ప్రతి పౌరుడూ ఆరోగ్యానికి సంబంధించి మెరుగైన, సకల సమాచారం తో కూడిన నిర్ణయం తీసుకోగలిగే విధం గా ఒక వ్యవస్థను రూపొందిస్తున్నాం.
ప్రియమైన నా దేశవాసులారా, కరోనా వైరస్ టీకా ఎప్పుడు అందుబాటు లోకి వస్తుందా అన్న ఆసక్తి అందరిలో కనిపిస్తోంది- ఈ ఉత్సుకత అత్యంత సహజం. ఇది ప్రపంచవ్యాప్తం గా ప్రతి ఒక్కరినీ ఆదుర్దా తో ఎదురుచూసేలా చేస్తున్న అంశమే.
నా దేశవాసుల కు నేనొక విషయం చెప్పదలిచాను. మన శాస్త్రవేత్తలు ప్రయోగశాలల్లో ఎంతో నిబద్ధత తో ఈ కృషి లో నిమగ్నమై ఉన్నారు. శక్తివంచన లేకుండా నిర్విరామం గా శ్రమిస్తున్నారు. ఇప్పటికే దేశంలో మూడు టీకాల పై పరీక్షలు వివిధ దశల లో ఉన్నాయి. మన శాస్త్రవేత్తల నుండి వీటి కి ఆమోదం లభించగానే సదరు టీకా ను భారీస్థాయి లో ఉత్పత్తి చేయడానికి సర్వసన్నద్ధంగా ఉన్నాము. అలాగే టీకా ల ఉత్పత్తి పెంచడానికీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము... వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా టీకా అందుబాటు లోకి తీసుకువస్తాము.
ప్రియమైన నా దేశవాసులారా, దేశం లోని వివిధ ప్రాంతాల లో ప్రగతి విభిన్న దశల లో కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాలు బాగా ముందంజ వేయగా, మరికొన్ని వెనుకబడ్డాయి. భారతదేశం స్వయం సమృద్ధం కావడంలో ఈ అసమతౌల్యమే ఒక సవాలు కాగలదని నేను భావిస్తున్నాను. ఇంతకుముందు నేను చెప్పినట్లుగా మేమిప్పుడు 110 ప్రగతి కాముక జిల్లాల పై దృష్టి సారించాము. ఈ జిల్లాలు ఇప్పటికే అభివృద్ధి సాధించిన జిల్లాల లో సమానం కావాలన్నది మా ధ్యేయం. తదనుగుణం గా అభివృద్ధి కి తగిన పర్యావరణ సృష్టితో పాటు అనుసంధానం మెరుగుపరచడం ప్రస్తుత మా ప్రాథమ్యాలు.
ఉదాహరణ కు పశ్చిమ, మధ్య, తూర్పు భారత ప్రాంతాల ను చూడండి... అది తూర్పు ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఈశాన్యం లేదా ఒడిశా కావచ్చు.. అన్నిచోట్లా అపార సహజ వనరులు ఉన్నాయి. ఆ ప్రాంతాల ప్రజలు ఎంతో దృఢమైన వారు, సమర్థులే గాక ప్రతిభావంతులు. కానీ, ఈ ప్రాంతాల లో అవకాశాలు లేనందువల్ల అసమతౌల్యం నెలకొంది. అందువల్ల మేము అనేక చర్యలు తీసుకున్నాము. అందులో భాగంగా తూర్పు ప్రాంత ప్రత్యేక రవాణా నడవా ను రూపొందిస్తున్నాము. తూర్పు ప్రాంతాన్ని గ్యాస్ పైప్‌లైన్ ను సంధానించడం కొత్త రైల్వే, రేవు మౌలిక సదుపాయాల కల్పన చేపట్టాము. ఆ విధంగా ప్రగతి కోసం అత్యంత సంపూర్ణ రీతిలో మౌలిక సదుపాయాల ను అభివృద్ధి చేస్తున్నాము.
అదేవిధం గా లేహ్- లద్దాఖ్, జమ్ము కశ్మీర్‌ల ను రాజ్యాంగం లోని 370 వ అధికరణం నుండ విముక్తం చేశాం. అటుపైన ఇప్పటికే ఏడాది గడచిపోయింది. ఈ సంవత్సర కాలం లో జమ్ము కశ్మీర్ సరికొత్త ప్రగతి పయనం ఒక మైలురాయి ని అధిగమించింది. మహిళ లు, దళితుల కు ప్రాథమిక హక్కులు కల్పించిన సంవత్సరమిది. అలాగే శరణార్థులు ఆత్మగౌరవం తో జీవనం సాగించిన ఏడాది ఇది. గ్రామీణుల కు లబ్ధి దిశ గా ‘స్వగ్రామ పునఃప్రవేశం’ వంటి అనేక కార్యక్రమాల ను ప్రారంభించాం. ఇవాళ జమ్ము కశ్మీర్, లద్దాఖ్‌ల లోని వివిధ ప్రాంతాలలో ఆయుష్మాన్ పథకం అత్యుత్తమ రీతి న ఉపయోగపడుతోంది.
ప్రియమైన నా దేశవాసులారా, మన ప్రజాస్వామ్యాని కి నిజమైన బలం ఎన్నికైన స్థానిక పాలన సంస్థలే. ఆ మేరకు నవ్యాభివృద్ధి శకం లో జమ్ము కశ్మీర్ లోని స్థానిక సంస్థల ప్రతినిధులు ఇప్పుడు సగర్వంగా, చురుగ్గా, అవగాహన తో పాలుపంచుకుంటున్నారు. ప్రగతి పథం లో క్రియాశీలం గా పాల్గొంటున్న వారి ‘పంచ్’, ‘సర్పంచ్’ (గ్రామపెద్ద)లను అభినందిస్తున్నాను.
జమ్ము కశ్మీర్ లో ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం విశ్రాంత న్యాయమూర్తి ఆధ్వర్యం లో సరిహద్దుల నిర్ణయ సంబంధి కసరత్తు కొనసాగుతోంది. దీన్ని సత్వరం పూర్తిచేసి, వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నాము. జమ్ము కశ్మీర్ సొంత ఎమ్మెల్యేలు, వారి సొంత మంత్రిమండలి, సొంత ముఖ్యమంత్రి నాయకత్వం లో నవ్యోత్సాహంతో ప్రగతివైపు ముందంజ వేయాలని ఆకాంక్షిస్తున్నాము. ఈ మేరకు భారతదేశం చిత్తశుద్ధి తో అన్నివిధాలు గా కృషి చేస్తోంది.
లద్దాఖ్ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు సాహసోపేత నిర్ణయం తీసుకున్నాం. తదనుగుణంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలన్న వారి దీర్ఘకాలిక డిమాండ్‌ను తీర్చాం. సమున్నత హిమాలయ సానువుల్లోని లదాఖ్ నేడు సరికొత్త ప్రగతి శిఖరాల ను అధిరోహిస్తోంది. అక్కడ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కొత్త పరిశోధన కేంద్రాలు, ఆతిథ్యం, నిర్వహణ రంగాల లో కొత్త కోర్సు లు వంటివి త్వరలో సాకారం కానున్నాయి. వీటితో పాటు 7,500 మెగావాట్ల సౌరశక్తి పార్కు ఏర్పాటు పనులు కూడా సాగుతున్నాయి. కానీ, నా ప్రియమైన దేశవాసులారా, లద్దాఖ్ కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం పరిరక్షించుకోవడం మాత్రమే గాక మరింత పెంచి పోషించాలి. సేంద్రియ వ్యవసాయంలో ఈశాన్య భారత రాష్ట్రం లో సిక్కిమ్ తనదైన ముద్ర వేసిన రీతి లో లద్దాఖ్, లేహ్, కార్గిల్ ప్రాంతాలు కర్బన ఉద్గార రహిత సముదాయం గా తమదైన ప్రత్యేకత ను చాటుకోవాలి. ఈ ఆశయ సాధన కోసం కేంద్ర ప్రభుత్వం ఆ ప్రాంత స్థానికులతో చేయికలిపి వారి అవసరాలకు తగిన నవ్యాభివృద్ధి నమూనా సృష్టి కి కృషి చేస్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా, పర్యావరణ సమతౌల్యం తో ప్రగతి పథంలో ముందడుగు వేయడం సాధ్యమేనని భారత్ నిరూపించింది. ఆ మేరకు ప్రత్యేకించి సౌరశక్తి విషయం లో ‘ఒకే ప్రపంచం- ఒకే సూర్యుడు - ఒకే గ్రిడ్’ అనే దార్శనికతతో భారత్ ఇవాళ ప్రపంచం మొత్తానికీ స్ఫూర్తినిస్తోంది.
ప్రపంచం లోని ఐదు పునరుత్పాదక ఇంధన సంపన్న దేశాల జాబితా లో భారతదేశం స్థానాన్ని సంపాదించింది. కాలుష్య పరిష్కార కృషిలో వ్యష్టిగానూ, సమష్టిగానూ నిమగ్నమైంది. ఆ మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం, పొగ లేని వంటగ్యాస్, ఎల్‌ఇడి కార్యక్రమం, సహజవాయు/విద్యుత్ ఆధారిత రవాణా ల వంటి ఏ అవకాశాన్నీ వదలకుండా సద్వినియోగం చేసుకుంటోంది. పెట్రోలు వల్ల కలిగే కాలుష్యం తగ్గించే దిశ గా ఇథనాల్ వినియోగం పెంపు పై దృష్టి ని సారిస్తున్నాము. ఐదేళ్ల కిందట దేశం లో ఇథనాల్ పరిస్థితి ఏమిటి? దేశం లో ఐదేళ్ల కు ముందు కేవలం 40 కోట్ల లీటర్ల ఇథనాల్ ఉత్పత్తి అయ్యేది. కానీ, గడచిన ఐదేళ్ల కాలం లో ఐదు రెట్లు పెరిగింది. ఆ మేరకు పర్యావరణ పరిశుభ్రత కు ఎంతో సహాయకారి కాగల ఇథనాల్ ను నేడు మన 200 కోట్ల లీటర్ల మేర ఉత్పత్తి చేస్తున్నాము.
ప్రియమైన నా దేశవాసులారా, ప్రజల భాగస్వామ్యం తో సమగ్ర విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎంచుకున్న 100 నగరాల లో కాలుష్యాన్ని తగ్గించడానికి మనం సమగ్ర విధానం ద్వారా శ్రమిస్తున్నాము.
ప్రియమైన నా దేశవాసులారా,
అడవుల లో విస్తరిస్తున్న అతి కొద్ది దేశాల లో భారతదేశం ఒకటి అని, గర్వంగా చెప్పుకోగలదు. భారతదేశం తన జీవవైవిధ్యం యొక్క ప్రోత్సాహానికి మరియు పరిరక్షణ కు కట్టుబడి ఉంది. మనం ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ లను విజయవంతంగా ముందుకు తీసుకుపోయాము. భారతదేశం లో పులుల జనాభా పెరిగింది. రాబోయే రోజులలో, మనం ఆసియా సింహాల కోసం ‘ప్రాజెక్ట్ లయన్’ ను ప్రారంభిస్తున్నాము. ప్రాజెక్ట్ లయన్ లో భాగం గా భారతీయ సింహాల రక్షణ మరియు భద్రత ల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలు, ముఖ్యం గా, అవసరమైన ప్రత్యేక రకాల ఆరోగ్య మౌలిక సదుపాయాల ను చేపట్టడం జరుగుతోంది. ఆవిధం గా, ప్రాజెక్ట్ లయన్ కు ప్రాధాన్యం ఇవ్వబడుతోంది.
అలాగే, మనం ప్రోత్సహించదలచిన మరో కార్యం ‘ప్రాజెక్ట్ డాల్ఫిన్’. నదుల లో మరియు సముద్రాల లో నివసించే రెండు రకాల డాల్ఫిన్ లపై మనం దృష్టి పెడుతున్నాము. ఇది జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది, ఉపాధి అవకాశాల ను కూడా సృష్టిస్తుంది. పర్యాటకానికి ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ కేంద్రం గా కూడా ఉంటుంది. కాబట్టి, మనం కూడా ఈ దిశ లో ముందుకు సాగబోతున్నాము.
ప్రియమైన నా దేశవాసులారా,
మనం అసాధారణమైన లక్ష్యం తో అసాధారణమైన ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు, మార్గం కూడా సవాళ్ల తో నిండి ఉంటుంది మరియు ఈ సవాళ్లు కూడా అసాధారణమైనవి గా ఉంటాయి. ఇటీవలి కష్టాల ను తట్టుకోలేక, సరిహద్దు వెంబడి కొన్ని దురదృష్టకర ఘటన లు జరిగాయి, ఇవి దేశానికి సవాలు గా మారాయి. ఎల్ఒసి నుండి ఎల్ఎసి వరకు, మన దేశ సార్వభౌమత్వాన్ని బెదిరించడానికి ఎవరు ప్రయత్నించిన వారు ఎవరైనా, వారికి, మన దేశ సైన్యం, మన ధైర్య సైనికులు తగిన సమాధానాన్ని ఇచ్చారు.
యావత్తు దేశం ఉత్సాహం తో నిండి ఉంది, నమ్మకం తో నడుపబడుతోంది, భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడటానికి అచంచలమైన భక్తి తో ముందుకు సాగుతోంది. లద్దాఖ్ లో మన వీర సైనికులు ఏమి చేయగలరో, దేశం తన నిర్ణయాన్ని కాపాడుకోవడానికి ఏమి చేయగలదో, ప్రపంచం చూసింది. మాతృభూమి కోసం ప్రాణాలను అర్పించిన ధైర్యవంతులైన పురుషులు మరియు సైనికులందరికీ, ఈ రోజు న నేను ఎర్రకోట యొక్క బురుజుల నుండి నమస్కరిస్తున్నాను.
అది ఉగ్రవాదం అయినా, విస్తరణవాదం అయినా, దానికి వ్యతిరేకం గా భారతదేశం పోరాడుతోంది. నేడు, భారతదేశం పై ప్రపంచ విశ్వాసం బలం గా మారింది. ఇటీవల, ఐక్యరాజ్యసమితి భద్రత మండలి లో భారతదేశానికి శాశ్వతేతర సభ్యత్వం కోసం మొత్తం 192 దేశాలలో 184 దేశాలు వాటి మద్దతు ను ప్రకటించాయి. ఇది ప్రతి భారతీయునికీ ఎంతో గర్వకారణం. ప్రపంచంలో మన స్థానాన్ని ఎలా సంపాదించామో అనే దానికి ఇది ఒక ఉదాహరణ. భారతదేశం బలంగా ఉన్నప్పుడు, భారతదేశం శక్తివంతమైనది మరియు సురక్షితమైనప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ ఆలోచనతోనే, ఈ రోజు అనేక రంగాల్లో పనులు జరుగుతున్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా,
సముద్రం లేదా భూమి ద్వారా అనుసంధానించబడిన మన పొరుగు దేశాల తో భద్రత, అభివృద్ధి మరియు నమ్మకం ఆధారం గా లోతైన సంబంధాల ను ఏర్పరుచుకుంటున్నాము. భారతదేశం తన పొరుగు దేశాల తో దశాబ్దాల నాటి సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక సంబంధాలను మరింత గా పెంచుకోవడానికి నిరంతర ప్రయత్నాలు చేస్తోంది.
యావత్తు ప్రపంచ జనాభా లో నాలుగో వంతు జనాభా దక్షిణ ఆసియా లో నివసిస్తోంది. సహకారం మరియు భాగస్వామ్యం ద్వారా ఇంత పెద్ద జనాభా సంక్షేమం కోసం లెక్కలేనన్ని అవకాశాల ను మనం సృష్టించవచ్చును. ఇంత విస్తారమైన జనాభా యొక్క పురోగతి మరియు అభివృద్ధి కి ఈ ప్రాంతం లోని దేశాల నాయకులందరికీ భారీ మరియు ముఖ్యమైన బాధ్యత ఉంది. దక్షిణాసియా లోని ప్రజలు, రాజకీయ నాయకులు, పార్లమెంటు సభ్యులు, మేధావులందరూ వారి బాధ్యత ను నెరవేర్చాలని నేను పిలుపునిస్తున్నాను. ఈ మొత్తం ప్రాంతం లో శాంతి మరియు సామరస్యం మానవత్వం యొక్క సంక్షేమానికి ఎంతో సహాయపడుతుంది. యావత్తు ప్రపంచం యొక్క ప్రయోజనాలు దీనితో ముడిపడి ఉన్నాయి.
ఈ రోజు మనం ఎవరితో భౌగోళిక సరిహద్దుల ను పంచుకుంటామో వారు మాత్రమే, పొరుగువారు కాదు, ఎవరి తో మనకు సన్నిహిత మరియు సామరస్య సంబంధాలు కలిగి ఉన్నామో, వారందరూ కూడా మన పొరుగువారి కిందే లెక్క. గత కొన్నేళ్లు గా భారతదేశం తన విస్తరించిన పరిసరాల్లోని అన్ని దేశాల తో తన సంబంధాల ను బలోపేతం చేసుకోవడం నా అదృష్టం గా భావిస్తున్నాను. పశ్చిమ ఆసియా లోని దేశాల తో రాజకీయ, ఆర్థిక మరియు మానవ సంబంధాలు చాలా రెట్లు పెరిగాయి. నమ్మకం అనేక రెట్లు పెరిగింది. ఈ దేశాల తో ఆర్థిక సంబంధాలు, ముఖ్యం గా ఇంధన రంగం లో సంబంధాలు చాలా ముఖ్యమైనవి. వీటిలోని అనేక దేశాల లో భారతదేశం నుండి పెద్ద సంఖ్య లో ప్రజలు పనిచేస్తున్నారు. కరోనా కాలం లో భారతదేశ అభ్యర్థనను గౌరవించడం ద్వారా భారత సమాజానికి వారు చేసిన సహాయానికి, ఈ దేశాలన్నిటికీ భారతదేశం రుణపడి ఉంది. నేను వ్యక్తిగతం గా వారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను.
అదేవిధం గా, తూర్పు వైపు మన ఆసియాన్ దేశాలలో మన సముద్రతీరానికి పొరుగున ఉన్న దేశాలు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ను కలిగి ఉన్నాయి. ఈ దేశాల తో భారతదేశానికి వేల సంవత్సరాల పురాతనమైనటువంటి ధార్మిక సంబంధాలు, సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. బౌద్ధ ధార్మిక సంప్రదాయాలు మనతో వాటిని కలుపుతాయి. నేడు, భారతదేశం భద్రత రంగంలోనే కాకుండా, ఈ దేశాల తో సముద్ర సంపద రంగం లో కూడా తన సహకారాన్ని బలపరచుకుంటోంది.
ప్రియమైన పౌరులారా, శాంతి మరియు సామరస్యాన్ని నెలకొల్పడానికి భారతదేశం తన భద్రత ఉపకరణాలు మరియు సైన్యాల ను బలంగా చేయడానికి చాలా నిబద్ధత ను కలిగివుంది. స్వావలంబన భారతదేశం గా మారడానికి రక్షణ ఉత్పత్తి రంగం లో ముమ్మరం గా చర్యలు తీసుకోవడం జరిగింది. ఇటీవల, 100 కి పైగా సైనిక పరికరాల దిగుమతి ని నిలిపివేయడం జరిగింది. క్షిపణుల నుండి తేలికపాటి సైనిక హెలికాప్టర్ ల వరకు, అసాల్ట్ రైఫిల్స్ నుండి రవాణా విమానాల వరకు - అన్నీ భారతదేశం లోనే తయారవుతున్నాయి. ఆధునిక అవసరాల కు అనుగుణం గా, దాని ఘనత ను, వేగాన్ని మరియు బలాన్ని ప్రదర్శించడానికి మన తేజస్ సిద్ధం గా ఉంది. మన సరిహద్దులు మరియు తీరప్రాంత మౌలిక సదుపాయాలు జాతీయ భద్రత లో కీలక పాత్ర పోషిస్తాయి. అది హిమాలయ శిఖరాల వద్ద కావచ్చు, లేదా హిందూ మహాసముద్రం ద్వీపాల లో కావచ్చు.. ఈ రోజు దేశం లో ప్రతి చోట అనుసంధానాని కి ప్రాధాన్యాన్ని ఇవ్వడం జరుగుతోంది. జాతీయ భద్రత ను దృష్టి లో ఉంచుకుని లద్దాఖ్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు ప్రతి చోట కొత్త రహదారుల ను నిర్మిస్తున్నారు.
ప్రియమైన పౌరులారా, మనకు చాలా విస్తారమైన తీరప్రాంతం ఉంది. వీటిని ఆనుకుని మనకు 1300 పైగా ద్వీపాలు ఉన్నాయి. గుర్తించిన కొన్ని ద్వీపాల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, మనం వాటిని చాలా వేగంగా అభివృద్ధి చేస్తున్నాము. మీరు చూసే ఉంటారు, గత వారం, ఐదు రోజుల క్రితం, అండమాన్, నికోబార్ దీవుల లో ఒక సబ్ మరీన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్టు దేశ ప్రజల కు అంకితం చేయడమైంది. అండమాన్, నికోబార్ దీవుల లో కూడా ఇప్పడు, దిల్లీ, చెన్నై మాదిరి గానే ఇంటర్ నెట్ సౌకర్యం ఉంటుంది. త్వరలోనే లక్షద్వీప్ దీవుల ను కూడా, ఇదే పద్ధతి లో అనుసంధానించడం జరుగుతుంది.
రాబోయే 1000 రోజుల్లో లక్షద్వీప్ దీవుల కు హై స్పీడ్ ఇంటర్ నెట్ కనెక్టివిటీ ని అందించాలని లక్ష్యం గా పెట్టుకున్నాము. భద్రత మరియు అభివృద్ధి తో పాటు, తీరప్రాంతం లో మరియు సరిహద్దుల సమీపం లో నివసిస్తున్న యువత ప్రయోజనం కోసం అభివృద్ధి ప్రాజెక్టుల పై కృషి జరుగుతోంది, పెద్ద ఎత్తు న ప్రచారం ప్రారంభిస్తున్నాము.
మన సరిహద్దు ప్రాంతాల లో సుమారు 173 జిల్లాలు, తీర ప్రాంతాలు తమ సరిహద్దుల ను కొన్ని ఇతర దేశ సరిహద్దులు లేదా తీరప్రాంతం తో పంచుకొంటున్నాయి. రాబోయే రోజుల లో, అక్కడి యువత కోసం ఆ సరిహద్దు జిల్లాల లో ఎన్ సిసి సేవల ను విస్తరించడం జరుగుతుంది. సరిహద్దు ప్రాంతాల నుండి సుమారు లక్ష మంది కొత్త ఎన్ సిసి క్యాడెట్ల కు శిక్షణ ఇస్తాము, వారిలో మూడింట ఒక వంతు మన కుమార్తెల కోసం కేటాయించాలనే ఆలోచన లో ఉన్నాము. ఈ సరిహద్దు ప్రాంత క్యాడెట్ల కు సైన్యం శిక్షణ ఇస్తుంది. తీర ప్రాంతాల కు చెందిన క్యాడెట్ల కు నావికాదళం శిక్షణ ఇస్తుంది, వైమానిక స్థావరం ఉన్న చోట, వైమానిక దళం ఆ క్యాడెట్ల కు శిక్షణ ఇస్తుంది. సరిహద్దు మరియు తీర ప్రాంతాల లో విపత్తు నిర్వహణ కోసం శిక్షణ పొందిన సిబ్బంది ని నియోగిస్తారు. సాయుధ దళాల లో ఉపాధి పొందడానికి వీలుగా యువత కు నైపుణ్య శిక్షణను అందిస్తారు.
ప్రియమైన నా దేశవాసులారా, గత సంవత్సరం ఎర్ర కోట నుండి నేను చేసిన ప్రసంగం లో, మునుపటి ఐదేళ్ళు అవసరాల ను తీర్చడం కోసం, మరియు వచ్చే ఐదేళ్ళు ఆకాంక్షల నెరవేర్చడం కోసం అని చెప్పాను. గత సంవత్సరం లోనే, దేశం చాలా పెద్ద మరియు ముఖ్యమైన మైలురాళ్ల ను సాధించింది. గాంధీ జయంతి 150 వ సంవత్సరం లో, భారతదేశం తన గ్రామాల ను బహిరంగ మలమూత్రాదుల విసర్జన కు తావు ఉండనటువంటి గ్రామాలు గా మార్చింది. వీటితో పాటు, వారి నమ్మకాల వల్ల బాధపడుతున్న శరణార్థుల కు పౌరసత్వ సవరణ చట్టం, దళితులు / వెనుకబడిన వారు / ఎస్సీలు / ఎస్టీలు / ఓబిసిల కు రిజర్వేశన్ హక్కు లు, అసమ్ లో మరియు త్రిపుర లో చరిత్రాత్మక శాంతి ఒప్పందం, సైన్యాల సమష్టి శక్తి ని మరింత సమర్థవంతం గా చేయడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ నియామకం, రికార్డు సమయం లో కర్తార్ పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం వంటివి చాలా ఉన్నాయి. భారతదేశం చరిత్ర ను సృష్టించింది, చరిత్ర ను సృష్టిస్తోంది, అసాధారణమైన విజయాల ను సాధించడం జరిగింది.
పది రోజుల క్రితం, అయోధ్య లో భగవాన్ శ్రీరాముని భవ్య ఆలయ నిర్మాణం మొదలైంది. రామ జన్మభూమి యొక్క పురాతన సమస్య కు శాంతియుత పరిష్కారం సాధించబడింది. భారతదేశ పౌరులు ఈ విషయం లో ఆదర్శప్రాయమైన సంయమనాన్ని మరియు వివేకాన్ని చాటారు, బాధ్యతాయుతం గా వ్యవహరించారు. ఇది చాలా అపూర్వమైంది, భవిష్యత్తు ను ప్రేరేపించే అంశం కూడాను. శాంతి, ఐకమత్యం, ఇంకా సామరస్యం- ఇవే, స్వావలంబన భారతదేశం యొక్క బలాలు కానున్నాయి. ఈ సామరస్యం, సద్భావన - ఇవి భారతదేశ సంపన్న భవిష్యత్తు కు హామీ. ఈ సామరస్యం తో మనం ముందుకు సాగాలి. ప్రతి భారతీయుడు అభివృద్ధి కోసం ఏదో ఒకదాని ని త్యాగం చేయాలి.
భారతదేశం కొత్త విధానం, కొత్త ఆచారాల తో ఈ దశాబ్దం లో ముందుకు సాగుతుంది. ఇప్పుడు సాధారణ విధానాలు పనిచేయవు. సాధారణం వైఖరి సరిపోయే సమయం గడచిపోయింది. మేము ప్రపంచం లో ఎవరి కంటే కూడా తక్కువ కాదు. మనం ప్రపంచం లో ఎవరి కంటే కూడా తక్కువ కాదు. ఇందుకోసం, మన 75 స్వాతంత్య్రం దినోత్సవం నాటికి మన దేశం తయారీ రంగం లో ఉత్తమమైందిగా , మానవ వనరుల లో ఉత్తమమైంది గా, పరిపాలన లో అత్యుత్తమమైందిగా మరియు ప్రతి రంగంలో ఉత్తమమైన వాటిని సాధించే దిశ గా మనం కృషి చేయాలి.
మన విధానాలు, ప్రక్రియలు, ఉత్పత్తులు - ప్రతిదీ సమాన శ్రేష్ఠత కలిగినవి, ఉత్తమమైనవి, అప్పుడే ‘ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్’ ఆలోచన ను సాధించవచ్చు. మన స్వేచ్ఛ కోసం ప్రాణాల ను అర్పించిన వారి యొక్క కలల ను నెరవేరుస్తామనే సంకల్పాన్ని మనం ఈ రోజు మళ్ళీ చేపట్టాలి. ఈ ప్రతిజ్ఞ 1.3 బిలియన్ పౌరుల కోసం, మన భవిష్యత్తు తరాల కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం, స్వావలంబి భారతదేశం కోసం తీసుకోవాలి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి సహకరిస్తామని మనం ప్రతిజ్ఞ చేయాలి, శపథం స్వీకరించాలి. మన చిన్న-తరహా పరిశ్రమలకు అధికారం ఇవ్వాలి. ‘‘వోకల్ ఫార్ లోకల్’’ కోసం ప్రచారం చెయ్యాలి. మనం మరింత ఆవిష్కరించుకుందాము. మన యువత కు, మహిళలు, షెడ్యూల్డ్ తెగలు, షెడ్యూల్డ్ కులాలు, దివ్యాంగులు, ఆర్థికం గా బలహీనమైన వర్గాల కు, గ్రామాలు, వెనుకబడిన తరగతులు మరియు ప్రతి ఒక్కరికి సాధికారిత ను కల్పిస్తాము.
నేడు భారతదేశం అసాధారణమైన వేగం తో అసాధ్యాన్ని, సుసాధ్యం చేసింది. అదే సంకల్ప శక్తి తో, అదే అంకితభావం తో, అదే అభిరుచి తో, ప్రతి భారతీయుడు ముందుకు సాగాలి.
త్వరలో మన స్వాతంత్య్రం 75 వ సంవత్సరం పండుగ ను 2022 సంవత్సరం లో జరుపుకోనున్నాము. మనం కేవలం ఒక అడుగు దూరం లో ఉన్నాము. మనం అహర్నిశలు పాటుపడాలి. 21వ శతాబ్దం యొక్క ఈ మూడో దశాబ్దం మన కలల ను నెరవేర్చిన దశాబ్దం అయి ఉండాలి. కరోనా ఒక పెద్ద అడ్డంకి, అయితే, అది స్వావలంబి భారతదేశం యొక్క విజయవంతమైన మార్గం లో ముందుకు సాగకుండా నిరోధించగలిగే అంత పెద్దది కాదు.
భారతదేశం నవ శకాన్ని ప్రారంభించడాన్ని నేను చూడగలను, అదే, నూతన ఆత్మవిశ్వాసం పెరుగుదల, స్వావలంబన భారతదేశం యొక్క ప్రతిధ్వని యొక్క బాకా. మరోసారి, మీ అందరి కి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను. అందరం ఒక చోటు కు చేరి, చేతులు పైకెత్తి, మన ఆదేశానుసారం పూర్తి శక్తి తో పలకండి : -
భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్, భారత్ మాతా కీ జయ్,
వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం.
జయ్ హింద్, జయ్ హింద్.
***
(Release ID: 1646220)
Visitor Counter : 5517
Read this release in:
Punjabi
,
Gujarati
,
Assamese
,
Tamil
,
Hindi
,
Kannada
,
Odia
,
Malayalam
,
Bengali
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri