గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
‘‘ద నెక్ట్స్ ఫ్రాంటియర్: ఇండియాస్ స్మార్ట్ సిటీస్’’ భారత మేధో నగరాల సృజనశీల ప్రయాణాన్ని వివరించే లఘు చిత్రం
గృహ నిర్మాణ – పట్టణ వ్యవహారాల శాఖతో కలసి ‘నేషనల్ జియోగ్రాఫిక్’ ప్రకటించిన ఈ ప్రత్యేక చిత్రం ఆగస్టు 15న ప్రదర్శితం కానుంది
‘స్మార్ట్ సిటీస్ మిషన్’ రేపటి తరం నగరాలను ఎలా సృష్టిస్తోందో
ఈ డాక్యుమెంటరీ వివరిస్తుంది
Posted On:
14 AUG 2020 5:21PM by PIB Hyderabad
గ్రామాల నుంచి పట్టణాలకు వలసల రేటు నిమిషానికి 25 నుంచి 30 మంది వరకు ఉన్న నేపథ్యంలో, 2050 నాటికి భారత దేశ జనాభాలో 70 శాతం నగరాల్లోనే జీవించవచ్చని ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యు.ఇ.ఎఫ్) అంచనా వేసింది. ఇప్పుడు దేశం మార్పు ముంగిట నిలిచి ఉంది. ఆధునిక జీవనం, సాంకేతిక పరిజ్ఞానం, సాంస్కృతిక పట్టణ వలసల కోసం తలెత్తిన అవసరం ప్రాథమికంగా ఈ పరివర్తనకు దారి చూపింది. భారత నగరాల రూపు రేఖలను మార్చే లక్ష్యంతో చేపట్టిన ఓ జాతీయ కార్యక్రమం (స్మార్ట్ సిటీస్ మిషన్) ఎలా సాగుతోందో వెలుగులోకి తెచ్చేందుకు... నేషనల్ జియోగ్రాఫిక్ ఈ రోజు ‘ద నెక్స్ట్ ఫ్రాంటియర్: ఇండియాస్ స్మార్ట్ సిటీస్’ పేరిట ఓ డాక్యుమెంటరీని ప్రకటించింది. బలమైన దేశాన్ని నిర్మించడంలో వినూత్న ఆవిష్కరణల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడానికి... నాలుగు లైట్ హౌస్ స్మార్ట్ సిటీల గమనాన్ని ఈ డాక్యుమెంటరీ క్షుణ్ణంగా వివరించింది.
స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా 2020 ఆగస్టు 15 సాయంత్రం 6 గంటలకు ఈ డాక్యుమెంటరీ నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో ప్రదర్శితమవుతోంది. ఈ డాక్యుమెంటరీ చిత్రం... ఒక సామాన్య మానవుని జీవితంలో స్మార్ట్ సిటీస్ మిషన్ ప్రభావాన్ని చూపిస్తుంది. అదే సమయంలో దేశం మొత్తం గర్వపడుతుందని హామీ ఇస్తోంది. ఈ 44 నిమిషాల చిత్రం నాలుగు నగరాలపై (సూరత్, విశాఖపట్నం, పూణె, వారణాసి లపై) కేంద్రీకరించింది. మౌలిక సదుపాయాలు, రవాణా, సాంకేతికత, పునరుత్పాదక ఇంథనం, ప్రాచీన వారసత్వ పరిరక్షణ- పునరుద్ధరణ వంటి అనేక అంశాల్లో అనుసరణీయమైన కార్యక్రమాలు ఈ నగరాల్లో జరిగాయి. ఈ నాలుగు అపూర్వమైన నగరాల లోకి ఒక ప్రత్యేకమైన అంతర్దృష్టిని ఈ లఘు చిత్రం అందిస్తుంది. ప్రగతిశీల భారత దేశపు సవాళ్ళను ఎదుర్కోవడానికి ఆయా నగరాలు వినూత్నంగా ఆలోచించాయి.
‘‘భారత దేశ మేధో (స్మార్ట్) నగరాలపై ప్రపంచానికి ఉన్న అవగాహనను నేషనల్ జియోగ్రాఫిక్ లఘు చిత్రం పెంచుతుందని ఆశిస్తున్నాము. భారత దేశం వేగవంతమైన పట్టణీకరణ ముంగిట ఉంది. భారత పట్టణ పురోగమనంలో మన స్మార్ట్ నగరాలు సరికొత్త భావనలకు, పరివర్తనాత్మక ఆలోచనలకు మార్గదర్శకంగా ఉన్నాయి. వాటి పనికి ఈ లఘుచిత్రం సంక్షిప్తంగా దృశ్య రూపమిచ్చింది.’’ అని కేంద్ర గృహ నిర్మాణ- పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీ దుర్గా శంకర్ మిశ్రా (ఐఎఎస్) చెప్పారు.
స్టార్ ఇండియా ఇంగ్లీష్ ఇన్ఫోటైన్ మెంట్, పిల్లల విభాగం అధిపతి అనురాధా అగర్వాల్ ఈ లఘుచిత్రం గురించి మాట్లాడుతూ, ‘‘మా రాబోయే చిత్రం ‘ద నెక్ట్స్ ఫ్రాంటియర్: ఇండియాస్ స్మార్ట్ సిటీస్’లో నాలుగు లైట్ హౌస్ నగరాల్లో ప్రజల జీవితాలను ఓ జాతీయ కార్యక్రమం ఎలా మార్చివేసిందో చూపిస్తాం. జనాభా వేగంగా పెరుగుతున్నా, ఈ అభివృద్ధి నమూనాకు భారత దేశం కేంద్రంగా ఉంది. నవీన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం దేశాభివృద్ధికి ఎలా ఉత్ప్రేరకాలుగా పని చేస్తున్నాయో... సమీప భవిష్యత్ అవసరాలకు సిద్ధపడటంలో ఎలా సాధనాలుగా ఉపయోగపడుతున్నాయో వీక్షకులు తెలుసుకుంటారు.’’ అని పేర్కొన్నారు.
‘ద నెక్స్ట్ ఫ్రాంటియర్: ఇండియాస్ స్మార్ట్ సిటీస్’ అనే చిత్రం 2020 ఆగస్టు 15 సాయంత్రం 6 గంటలకు నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ లో ప్రసారమవుతుంది.
***
(Release ID: 1646038)
Visitor Counter : 158