ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

బలమైన సంకల్పం, సమిష్టి కృషితోనే వివిధ రంగాల్లో ఆర్థిక, సామాజిక అభివృద్ధి సాధ్యమౌతుంది - ఉపరాష్ట్రపతి

• గౌరవ ఉపరాష్ట్రపతి మూడేళ్ళ ప్రస్థానం మీద సచిత్ర పుస్తకం ఆవిష్కరించిన రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్

• పుస్తక డిజిటల్ వెర్షన్ ను ఆవిష్కరించిన కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్

• ఉపరాష్ట్రపతి పదవికి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు వన్నె తెచ్చారన్న శ్రీ రాజ్ నాథ్ సింగ్

• పర్యటనలు, ప్రసంగాలు, పరివర్తన కార్యక్రమాల వివరాలతో “కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్” పేరిట మూడో సచిత్ర పుస్తకం రూపకల్పన

• కీలకమైన మూడో ఏడాదిలో అనేక బిల్లులు ఆమోదం పొందడం తృప్తినిచ్చిందన్న ఉపరాష్ట్రపతి

Posted On: 11 AUG 2020 3:58PM by PIB Hyderabad

బలమైన సంకల్పం, సమిష్టి కృషితోనే ఆర్థికంగా, సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధ్యమౌతుందని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఉపరాష్ట్రపతిగా మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేస్తుకున్న సందర్భంగా “కనెక్టింగ్, కమ్యూనికేటింగ్, ఛేంజింగ్” పేరుతో రూపొందించిన సచిత్ర పుస్తకాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్ ఢిల్లీ ఉపరాష్ట్రపతి నివాసంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ సమావేశ మందిరంలో ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ వెర్షన్ ను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జావడేకర్ ఆవిష్కరించారు. ఈ మూడేళ్ళ ప్రయాణంలో ముఖ్యమైన పర్యటనలు, ప్రసంగాలు, పరివర్తన కార్యక్రమాల వివరాలతో ఈ పుస్తకాన్ని రూపొందించడం విశేషం. 334 చిత్రాలు, 251 పేజీలతో రూపొందించిన ఈ పుస్తకాన్ని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పబ్లికేషన్ విభాగం ముద్రించింది.

ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ, మూడేళ్ళ పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని, అన్నింటికీ మించి గతేడాది కాలంలో రాజ్యసభలో అనేక బిల్లులు ఆమోదం పొందడం మరింత సంతృప్తిని అందించిందని తెలిపారు. తన మూడో ఏడాదికి ఎంతో ప్రత్యేకత ఉందన్న ఆయన, ఆగష్టు 2019 నుంచి మార్చి వరకూ అనేక వరుస కార్యక్రమాల్లో పాల్గొని ప్రజలను కలవడం, మాట్లాడడం, దిశానిర్దేశం చేయడం లాంటివి చేశానని, ఆ తర్వాత కరోనా మహమ్మారి కారణంగా గతంలో వలే ప్రజల వద్దకు వెళ్ళడం కుదరలేదని తెలిపారు. ఎప్పుడూ నాలుగు రోజులకు మించి ఒకే చోట గడపని ఆయనకు, ఇంత కాలం ఒకే చోటకు పరిమితం కావడం ముఖ్యంగా ప్రజల్ని కలవలేకపోవడం కాస్తంత అసంతృప్తిగా అనిపించినా, ఇదో కొత్త అనుభవం అని తెలిపారు. మనసును సంసిద్ధం చేయడం ద్వారా ఇది సాధ్యమైందన్నారు.

ఈ ఏడాది మొదటి దశలో నెలకు సుమారు 20కి పైగా సందర్భాల్లో ప్రజలను కలిశానని, 70కి పైగా ప్రసంగాలు చేశానని, 14 స్నాతకోత్సవాల్లో యువతకు మార్గనిర్దేశం చేశానని, 6 దేశాల్లో పర్యటనలు సాగించానని ఉపరాష్ట్రపతి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో తానెంతో అభిమానించే రైతులు, మన దేశ భవిష్యత్ విధాతలైన విద్యార్థులు సహా యువకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, నిర్వాహకులు, పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయుల్ని కలిశానని తెలిపారు. అనంతరం కోవిడ్ కారణంగా సామాజిక మాథ్యమాల ద్వారా ప్రజలకు చేరువ అయ్యానన్న ఉపరాష్ట్రపతి, ఏప్రిల్ నుంచి 350 ట్వీట్లు, 55 ఫేస్ బుక్ పోస్ట్ ల ద్వారా ప్రజలతో మనోగతాన్ని పంచుకున్నానని, అదే విధంగా దాదాపు 1600 మందితో ఫోన్ ద్వారా సంభాషించి, ప్రజలకు దూరంగా ఉన్నా, ఫోన్ ద్వారా చేరువ అయ్యానన్నారు. అందుబాటులో సమయాన్ని ఉపయోగించుకోవడం భాగంగా విస్తృతంగా పుస్తకాలు చదవడానికి సమయం సద్వినియోగం చేసుకున్నానని, విస్తృతంగా వ్యాసాలు రాసేందుకు ఇదెంతో సహాయపడిందని తెలిపారు. కరోనా గురించి ఎవరూ భయందోళనకు గురి కావద్దని త్వరలోనే సాధారణ పరిస్థితులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మూడో ఏడాదిలో రాజ్యసభ నిర్వహణ గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి, రాజ్యసభలో శాసనపరమైన సగటు వార్షిక పనితీరు పెరగడం, అదే విధంగా అనేక కీలకమైన బిల్లులు ఆమోదం పొందడం సంతృప్తిని అందించిందని తెలిపారు. గత మూడేళ్ళలో రాజ్యసభ శాసనపరమైన వార్షిక సగటు పని తీరు 63 శాతం పెరగగా, 249 మరియు 250వ సెషన్లలో ఇది నూరుశాతం సగటును నమోదు చేసిందన్నారు. ఈ కాలంలో రాజ్యసభలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆయన, ముఖ్యమైన బిల్లుల మీద సమగ్ర చర్చకు అవకాశం లభించిందని తెలిపారు. రాజ్యసభ కమిటీల సమావేశాలకు హాజరు శాతం మొదటిగా సారిగా 50 శాతాన్ని దాటడం ఆశించదగిన పరిణామమన్నారు.

2022లో భారతదేశంలో స్వరాజ్యాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు నిండబోతోందని, ఈ సందర్బంగా ప్రతి పౌరుడు, ముఖ్యంగా యువకులు స్వరాజ్య సంగ్రామం నుంచి ప్రేరణ పొంది నవీన భారత నిర్మాణంలో తమవంతు పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. భారతదేశాన్ని ప్రపంచ యవనిక మీద తలఎత్తుకుని నిలబడేందుకు ఆవసరమైన శక్తిని ఆర్థిక శక్తి అందిస్తుందన్న ఆయన, కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రతికూల మార్గంలో పయనిస్తున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు సమిష్టి ప్రయత్నాలు ఆవసరమని తెలిపారు. వివిధ రంగాల్లో నిర్దేశించుకున్న లక్ష్యాలను 2022 నాటికి, అదే విధంగా ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను 2030 నాటికి పూర్తి చేయాల్సిన అవసరాన్ని ఉపరాష్ట్రపతి నొక్కి చెప్పారు.

పాలన, ఆవిష్కరణ, పారిశ్రామిక రంగాల్లో సానుకూల వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభుత్వ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. ఈ సందర్భంగా నూతన జాతీయ విద్యావిధానం -2020 గురించి ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి ప్రాథమిక స్థాయిలో మాతృభాషను బోధనా మాధ్యమంగా ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసేందుకు విజ్ఞానశాస్త్రాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని సూచించారు. స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చుకునే క్రమంలో పట్టణ-గ్రామీణ అంతరాలను తగ్గించడం, పేదరికాన్ని నిర్మూలించడం, అవినీతిని అంతం చేయడం, అంతరాలను తగ్గించడం, అదే విధంగా అభివృద్ధి ఫలాలను అందరికీ చేరువ చేయాలని నొక్కి చెప్పారు. దేశాభివృద్ధిలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోడీ అకుంఠిత దీక్ష, అవిశ్రాంత కృషిని ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి శ్రేష్ఠ భారత్, స్వస్థ భారత్, ఆత్మనిర్భర్ భారత్ సాకారం కోసం బలమైన సంకల్పం, సమిష్టి కృషితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ, ఉపరాష్ట్రపతి పదవికి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు వన్నె తెచ్చారని కొనియాడారు. వారి వాక్చాతుర్యం అద్భుతమని, వారి ఉపన్యాసాలు కళాత్మకంగా ఉంటాయన్నారు. ఇతరులకు సూచనలు, సలహాలు అందించడంలో ఆయన స్పందించే తీరు ఎంతో హుందాగా ఉంటుందని, అనేక విషయాల మీద పట్టు సంపాదించిన ఆయన ఉపరాష్ట్రపతి పదవికే వన్నె తెచ్చారని తెలిపారు. చాలా సందర్భాల్లో సంయమనంతో వ్యవహరించిన ఆయన, కీలక సమయాల్లో స్ఫూర్తి వంతమైన వ్యవహార శైలితో ఆకట్టుకున్నారని, వారి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శనీయమని కొనియాడారు.

కోవిడ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమానికి పరిమిత సంఖ్యలో అతిథులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి సచివాలయ కార్యదర్శి శ్రీ ఐ.వి.సుబ్బారావు, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే సహా పలువురు సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

***



(Release ID: 1645075) Visitor Counter : 196