రైల్వే మంత్రిత్వ శాఖ

విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న 83 మంది మహిళా ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐలు మౌలా అలీలో పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌

Posted On: 10 AUG 2020 5:30PM by PIB Hyderabad

దేశంలోని వివిధ రైల్వే జోన్లకు చెందిన 83 మంది మహిళా ఆర్‌పీఎఫ్‌ ఎస్‌ఐల (9A బ్యాచ్‌) పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ విజయవంతంగా జరిగింది. తెలంగాణలోని మౌలా అలీలో ఉన్న రైల్వే రక్షణ దళం (ఆర్‌పీఎఫ్‌) శిక్షణ కేంద్రంలో ఈ కార్యక్రమం జరిగింది. 

    "బెస్ట్‌ క్యాడెట్", "బెస్ట్‌ ఇన్‌ ఇండోర్‌"గా చంచల్ శెఖావత్ ఎంపికగా, "బెస్ట్‌ ఇన్‌ ఔట్‌డోర్‌"గా స్మృతి బిశ్వాస్ నిలిచారు. పరేడ్‌కు చంచల్‌ శెఖావత్‌ నాయకత్వం వహించారు.

    పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌కు దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ గజానన్‌ మాల్యా హాజరయ్యారు. పనిని దైవంలా భావించాలని, రైల్వే ఆస్తులు, ప్రయాణీకుల భద్రత కోసం విధులు నిర్వర్తించాలని కొత్త ఎస్‌ఐలకు సూచించారు. మహిళలు, చిన్నారుల అక్రమ రవాణా పెరిగిపోతున్న నేపథ్యంలో అసాంఘిక శక్తులు, మహిళలు, చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. యువ ఎస్‌ఐలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నైపుణ్యం, దయతో విధులు నిర్వర్తించాలని మాల్యా ఆకాంక్షించారు.

    కొత్త సవాళ్లను ఎదుర్కొనేలా అంతర్గత, బహిర్గత అంశాలపై ఎస్‌ఐ అభ్యర్థులందరికీ 9 నెలల శిక్షణ ఇచ్చారు. తుది పరీక్ష తర్వాత పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ నిర్వహించారు. ఉద్యోగ ప్రతిజ్ఞ చేశాక, వారంతా రైల్వే రక్షక దళంలో సభ్యులయ్యారు. కొవిడ్‌-19 ప్రొటోకాల్‌ను అనుసరించి పాసింగ్‌ ఔట్‌ పరేడ్‌ జరిగింది.



(Release ID: 1644875) Visitor Counter : 145