వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

‘ఒక దేశం ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని జాప్యం లేకుండా అమలు చేయాలి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ విన్నపం

భారత ఆహార సంస్థ వద్ద తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు

పిఎంజికెఎవై-1 & 2, ఆత్మ నిర్భర్ భారత్, ఇతర సంక్షేమ పథకాల కింద

ఆహార ధాన్యాల పంపిణీ కొనసాగుతోంది: శ్రీ రాం విలాస్ పాశ్వాన్

Posted On: 07 AUG 2020 6:20PM by PIB Hyderabad

కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార & ప్రజా పంపిణీ శాఖల మంత్రి శ్రీ రాం విలాస్ పాశ్వాన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మీడియాతో మాట్లాడారు. ఆహార & ప్రజా పంపిణీ శాఖ అమలు చేస్తున్న ‘ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 1 & 2’, ‘ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’, ‘ఒక దేశం ఒకే రేషన్ కార్డు’ పథకాల అమలులో పురోగతిని మంత్రి మీడియాకు వివరించారు. పిడిఎస్, నాన్-పిడిఎస్ కార్డుదారులకు, వలస కూలీలకు, మరే ఇతర ఆహార ధాన్యాల పథకం పరిధిలోకి రాని వారికి ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాలు/ శెనగలు అందించడం ఈ కేంద్ర ప్రాయోజిత పథకాల ప్రధాన లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇంతకు ముందెన్నడూ చూడని ఈ అసాధారణ సంక్షోభ సమయంలో.. ఎన్.ఎఫ్.ఎస్.ఎ, ఇతర సంక్షేమ పథకాల పరిధిలో ఉండే పేదలు, దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఇతర లబ్దిదారులు ఆహార ధాన్యాలు అందుబాటులో లేని కారణంగా ఇబ్బంది పడకూడదని ఆయన పేర్కొన్నారు. ఆహార ధాన్యాలు, పప్పు ధాన్యాల పంపిణీకి సంబంధించిన డేటాను మంత్రి విలేకరులతో పంచుకున్నారు. భారత ఆహార సంస్థ (ఎఫ్.సి.ఐ), డి.ఒ.ఎఫ్.పి.డి. కింద ఉన్న ఇతర సంస్థల పనితీరును కొనియాడిన మంత్రి, ఎఫ్.సి.ఐ. వద్ద ఆహార ధాన్యాలు తగినంతగా నిల్వ ఉన్నాయని చెప్పారు. అట్టడుగు స్థాయిలో ఆహార ధాన్యాల పంపిణీ పని తీరును అధికారులు తరచూ తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు. ఆహార ధాన్యాల పంపిణీకి సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి స్థానికంగా సమావేశాలు నిర్వహించాలని కూడా ఆయన సూచించారు.

 

ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు

మరో నాలుగు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు – జమ్ము & కాశ్మీర్, మణిపూర్, నాగాలాండ్, ఉత్తరాఖండ్ – ను 2020 ఆగస్టు 1న జాతీయ పోర్టబిలిటీలో అనుసంధానం చేసినట్లు శ్రీ పాశ్వాన్ మీడియాకు చెప్పారు. అప్పటికే 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ పోర్టబిలిటీలో ఉన్నాయని.. ఇప్పుడు మొత్తం 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకంలో అనుసంధానమై ఉన్నాయని మంత్రి వివరించారు. దీంతో 65 కోట్ల మంది (జాతీయ ఆహార భద్రత చట్టం పరిధిలోని 80 శాతం) ప్రజలు.. రేషన్ కార్డుల జాతీయ పోర్టబిలిటీ పూర్తయిన రాష్ట్రాల్లో ఎక్కడి నుంచైనా ఆహార ధాన్యాలు పొందే వీలు కలుగుతుందని చెప్పారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 2021 మార్చి నాటికి అనుసంధానం అవుతాయన్న ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. 2.98 లక్షల రేషన్ కార్డుల నుంచి లబ్దిదారుల పేర్లను తొలగించిన ఉదంతంపై మాట్లాడుతూ, ఒకవేళ వారి పేర్లను పొరపాటున తీసివేసి ఉంటే.. మళ్లీ చేర్చాలని, వారికి రేషన్ కార్డులు జారీ చేయాలని శ్రీ పాశ్వాన్ చెప్పారు. ‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకంపై రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు, ఇతర భాగస్వాముల నుంచి డి.ఒ.ఎఫ్.పి.డి.కి సానుకూల స్పందన అందుతోందని మంత్రి పేర్కొన్నారు. ‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అప్పుడే రేషన్ కార్డుదారులు ఆలస్యం లేకుండా వారి వాటా ఆహార ధాన్యాలను పొందగలుగుతారని శ్రీ పాశ్వాన్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు విజ్ఞప్తి చేశారు.

‘ఒక దేశం.. ఒకే రేషన్ కార్డు’ అమలవుతున్న 24 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు

ఆంధ్రప్రదేశ్, బీహార్, దాద్రా & నగర్ హవేలి, డామన్ & డయ్యు, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ము & కాశ్మీర్, జార్ఖండ్, కర్నాటక, కేరళ, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, ఒడిషా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తెలంగాణ, త్రిపుర, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్.

 

ఎన్.ఎఫ్.ఎస్.ఎ. పథకం:

ఎన్.ఎఫ్.ఎస్.ఎ. పథకం కింద దేశంలోని 81 కోట్ల మంది కార్డుదారులకు సబ్సిడీ రేట్లపై ఆహార ధాన్యాలను (గోధుమలు/ బియ్యం/ తృణ ధాన్యాలు) అందిస్తున్నట్లు శ్రీ పాశ్వాన్ చెప్పారు. ఈ పథకం వల్ల పడే ఆర్థిక భారంలో 91 శాతాన్ని కేంద్ర ప్రభుత్వం భరిస్తుండగా.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేవలం 9 శాతం భరిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆహార ధాన్యాలు కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం సాయంతో పంపిణీ అవుతున్నాయన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలని, ఆహార ధాన్యాలను పంపిణీ చేసేటప్పుడు ఈ విషయమై లబ్దిదారులకు కూడా సమాచారమివ్వాలని మంత్రి పునరుద్ఘాటించారు.

 

మొత్తం ఆహార ధాన్యాల నిల్వలు:

ఆహార ధాన్యాల పంపిణీ ప్రక్రియపై మాట్లాడిన శ్రీ పాశ్వాన్, కొన్ని రాష్ట్రాల్లో వరదల కారణంగా పంపిణీ కార్యక్రమానికి అంతరాయం కలిగిందని చెప్పారు. ఎన్.ఎఫ్.ఎస్.ఎ, ఇతర సంక్షేమ పథకాల కింద తమకు కేటాయించిన కోటా ఆహార ధాన్యాలను ఎఫ్.సి.ఐ. నుంచి రాష్ట్రాలు ఒకేసారి తీసుకోవచ్చని పేర్కొన్నారు.

భారత ఆహార సంస్థ 2020 ఆగస్టు 6వ తేదీ రిపోర్టు ప్రకారం సంస్థ వద్ద ప్రస్తుతం 241.47 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 508.72 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు నిల్వ ఉన్నాయని, మొత్తంగా 750.19 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాల స్టాకు అందుబాటులో ఉందని మంత్రి వివరించారు. ఎన్.ఎఫ్.ఎస్.ఎ, పి.ఎం.జి.కె.ఎ.వై, ఇతర సంక్షేమ పథకాల కింద పంపిణీ చేయడానికి నెలకు 95 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు అవసరమవుతాయని ఆయన చెప్పారు.

‘లాక్ డౌన్’ నాటి నుంచి 139.97 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను గోడౌన్ల నుంచి తీసి 4,999 రైలు బోగీల ద్వారా రవాణా చేసినట్లు మంత్రి తెలిపారు. 2020 జూలైలో 42.39 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసి 1514 రైలు బోగీల ద్వారా రవాణా చేసినట్లు చెప్పారు.

రైలు మార్గంతో పాటు రోడ్డు, జల మార్గాల్లోనూ ఆహార ధాన్యాల రవాణా జరిగిందని శ్రీ పాశ్వాన్ పేర్కొన్నారు. మొత్తంగా 2020 జూన్ వరకు ఈశాన్య రాష్ట్రాలకు 13.89 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు రవాణా చేయగా... ఇతర ప్రాంతాలకు 285.07 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా అయ్యాయని తెలిపారు. 2020 జూలై నెలలో ఈశాన్య రాష్ట్రాలకు 3.85 లక్షల టన్నులు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు 87.62 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా అయ్యాయని, లాక్ డౌన్ నాటి నుంచి ఈశాన్య రాష్ట్రాలకు 18.26 లక్షల మెట్రిక్ టన్నులు, దేశంలోని మిగిలిన ప్రాంతాలకు మొత్తం 384.83 లక్షల మెట్రిక్ టన్నులు తరలించినట్లు మంత్రి వివరించారు.

 

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన -1

పి.ఎం.జి.కె.వై-1 పథకానికి 2020 ఏప్రిల్, మే, జూన్ మూడు నెలలకు కలిపి మొత్తం 119.5 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు (104.3 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 15.2 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు) అవసరమని సమాచారం ఉండగా... అందులో 117.08 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను (101.51 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం, 15.01 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను) రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తీసుకున్నట్లు శ్రీ పాశ్వాన్ చెప్పారు. 2020 ఏప్రిల్ మాసంలో 75 కోట్ల మంది లబ్దిదారులకు 37.50 లక్షల మెట్రిక్ టన్నులు (94 శాతం), మే నెలలో 75 కోట్ల మంది లబ్దిదారులకు 37.43 లక్షల మెట్రిక్ టన్నులు (94 శాతం), జూన్ నెలలో 73 కోట్ల మంది లబ్దిదారులకు 36.54 లక్షల మెట్రిక్ టన్నులు (92 శాతం) మేరకు ఆహార ధాన్యాల పంపిణీ జరిగిందని మంత్రి వివరించారు. మూడు నెలల సగటు పంపిణీ శాతం 93.5 శాతంగా మంత్రి పేర్కొన్నారు.

పప్పు ధాన్యాల విషయానికి వస్తే.. మూడు నెలలకు 5.87 లక్షల మెట్రిక్ టన్నుల అవసరానికి గాను 5.83 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపినట్లు శ్రీ పాశ్వాన్ చెప్పారు. అందులో 5.80 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రాలకు చేరగా 5.23 లక్షల మెట్రిక్ టన్నుల పంపిణీ పూర్తయినట్లు ఆయన తెలిపారు. పప్పు ధాన్యాల సగటు పంపిణీ శాతం 90 శాతంగా ఉందని పేర్కొన్నారు.

 

ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన- 2:

ఆహార ధాన్యాలు (బియ్యం/ గోధుమలు):

2020 జూలై 1 నుంచి ప్రధాన్ మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన 2 పథకం అమలవుతోంది. 2020 నవంబర్ వరకు ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో 81 కోట్ల మంది లబ్దిదారులకు 201 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఆహార ధాన్యాల పంపిణీ జరుగుతుంది. అలాగే 19.4 కోట్ల కుటుంబాలకు 12 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు శెనగలు పంపిణీ అవుతాయి.

పిఎంజికెఎవై-2 గురించి శ్రీ పాశ్వాన్ మాట్లాడుతూ, 2020 జూలై నుంచి నవంబర్ వరకు గడిచే ఐదు నెలల కాలానికి మొత్తం 201.08 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను (నెలకు 40.27 లక్షల టన్నుల చొప్పున) ఈ పథకానికి కేటాయించినట్లు చెప్పారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ మొత్తం సరఫరా అవుతాయన్నారు. అందులో 91.14 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు, 109.94 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఉంటాయన్నారు. ఇప్పటివరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 49.82 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయని, 25.66 లక్షల టన్నుల వరకు పంపిణీ చేశాయని మంత్రి పేర్కొన్నారు. జూలై నెలలో 49.87 కోట్ల లబ్దిదారులకు 24.94 లక్షల మెట్రిక్ టన్నుల (62 శాతం) మేరకు ఆహార ధాన్యాల పంపిణీ జరిగిందని, ఆగస్టులో ఇప్పటి వరకు 1.45 కోట్ల లబ్దిదారులకు 72,711 టన్నుల మేరకు పంపిణీ పూర్తయిందని (జూలై, ఆగస్టు నెలల పంపిణీ ఇంకా కొనసాగుతోంది) శ్రీ పాశ్వాన్ తెలిపారు. పిఎంజికెఎవై-2 పథకానికి అవసరమైన రూ. 76,062 కోట్ల నిధుల మొత్తాన్ని 100 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని చెప్పారు. 4 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు గోధుమలు సరఫరా చేయగా, 15 రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాలకు బియ్యం సరఫరా అయ్యాయని, 17 రాష్ట్రాలు - కేంద్ర పాలిత ప్రాంతాలకు బియ్యం, గోధుమలు రెండూ కేటాయించామని మంత్రి వివరించారు.

శెనగలు:

ఐదు నెలల కాలానికి 9.70 లక్షల మెట్రిక్ టన్నుల శెనగలు అవసరం అని అంచనా వేయగా... ఇప్పటివరకు 2.10 లక్షల టన్నుల శెనగ పప్పును విడుదల చేసినట్లు శ్రీ పాశ్వాన్ చెప్పారు. అందులో 1.56 లక్షల టన్నులు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చేరిందని, ఇప్పటివరకు 11,979 టన్నుల మేరకు పంపిణీ పూర్తయిందని ఆయన వెల్లడించారు. ఈ పథకానికి అయ్యే రూ. 6,849 కోట్ల వ్యయంలో 100 శాతాన్నీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. 2020 ఆగస్టు 6వ తేదీ వరకు 10.01 లక్షల మెట్రిక్ టన్నుల పప్పు ధాన్యాలు (కంది పప్పు – 5.24 లక్షల టన్నులు, పెసలు – 1.12 లక్షల టన్నులు, మినుములు – 2.10 లక్షల టన్నులు, శెనగలు – 1.27 లక్షల టన్నులు, మసూర్ – 0.27 లక్షల టన్నులు) అందుబాటులో ఉన్నాయని వివరించారు. మొత్తం 27.72 లక్షల మెట్రిక్ టన్నుల శెనగ పప్పు పిఎస్ఎస్ స్టాకులోనూ, 1.27 లక్షల శెనగలు పిఎస్ఎఫ్ స్టాకులోనూ అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.

 

వలస కార్మికులకు ఆహార ధాన్యాల పంపిణీ: (ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్)

8 కోట్లుగా ఉంటారని అంచనా వేసిన వలస కార్మికులకు, వేర్వేరు చోట్ల చిక్కుకుపోయిన, అవసరంలో ఉన్న కుటుంబాలకు, ఎన్.ఎఫ్.ఎస్.ఎ. లేదా రాష్ట్రాల ప్రజా పంపిణీ పథకాల పరిధిలోకి రానివారికి ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ కింద 8 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు ఆహార ధాన్యాలు పంపిణీ చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వలస కార్మికులు అందరికీ ఉచితంగా ఒక్కొక్కరికి నెలకు 5 కేజీల బియ్యం చొప్పున మే, జూన్ మాసాల్లో పంపిణీ చేయవలసి ఉంది. కాగా... ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకం కింద రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు 6.39 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తీసుకున్నాయని, అందులో 2.46 లక్షల మెట్రిక్ టన్నుల మేరకు (మే నెలలో 2.42 కోట్ల మంది, జూన్ మాసంలో 2.51 కోట్ల మంది) లబ్దిదారులకు పంపిణీ చేశాయని శ్రీ పాశ్వాన్ తెలిపారు.

దాంతో పాటు 1.96 కోట్ల వలస కార్మిక కుటుంబాలకు 39,000 మెట్రిక్ టన్నుల శెనగలు పంపిణీ చేయడానికి కూడా భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 8 కోట్ల వలస కార్మికులకు, వేర్వే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, అవసరంలో ఉన్న కుటుంబాలకు, కేంద్ర, రాష్ట్రాల ఆహార భద్రతా పథకాల పరిధిలోకి రానివారికి కుటుంబానికి కేజీ చొప్పున పప్పు ధాన్యాన్ని మే, జూన్ మాసాలలో ఉచితంగా ఇవ్వవలసి ఉంది. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా పప్పుల కేటాయింపు జరిగింది. కేటాయించిన మొత్తంలో 33,745 టన్నుల శెనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపగా.. 33,388 టన్నులను ఆయా ప్రభుత్వాలు తీసుకున్నాయని, అందులో 15,681 మెట్రిక్ టన్నుల శెనగలను లబ్దిదారులకు పంపిణీ చేశాయని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆహార ధాన్యాలకు అయ్యే రూ. 3,109 కోట్లు, అపరాలకు అయ్యే రూ. 280 కోట్ల వ్యయంలో 100 శాతం ఆర్థిక భారాన్ని కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది.

 

ఆహార ధాన్యాల సేకరణ:

ఆహార ధాన్యాల సేకరణ విషయమై కేంద్ర మంత్రి శ్రీ పాశ్వాన్ మీడియాతో మాట్లాడుతూ.. 2020 ఆగస్టు 6వ తేదీ వరకు 389.81 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను (2020-21 రబీ మార్కెటింగ్ సీజన్), 752.96 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని (2019-20 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్) సేకరించినట్లు చెప్పారు.

వివిధ పథకాల పురోగతిని సవివరంగా వెల్లడించిన శ్రీ పాశ్వాన్ చివరిగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, కేంద్ర నౌకాయాన శాఖ పాత్రపై ప్రశంసలు కురిపించారు. ఎఫ్.సి.ఐ, సి.డబ్ల్యు.సి, సి.ఆర్.డబ్ల్యు.సి, రాష్ట్రాల గిడ్డంగుల సంస్థలు, రాష్ట్రాలు- కేంద్ర పాలిత ప్రాంతాల పౌర సరఫరాల శాఖలు, కార్పొరేషన్లు, ఆయా సంస్థల అధికారులు, ఉద్యోగుల కృషిని కొనియాడారు. కోవిడ్-19 కష్ట కాలంలో ప్రజలకు ఆహార ధాన్యాల పంపిణీని సాకారం చేసేందుకు వారంతా కచ్చితమైన సమన్వయంతో పని చేశారని మంత్రి పేర్కొన్నారు.

*****



(Release ID: 1644364) Visitor Counter : 235