మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉన్నతవిద్యా సదస్సు లో ప్రారంభోపన్యాసం చేసిన ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ
నూతన విద్యా విధానం,లక్ష్యం ప్రస్తుత, భవిష్యత్ తరాలను భవిష్యత్‌కు సిద్ధం చేయడం: ప‌్రధానమంత్రి
నూతన విద్యావిధానం, నవ భారతానికి పునాది : ప‌్రధానమంత్రి
నూతన విద్యా విధానం సమగ్ర విధానంపై ఆధారపడినది: ప‌్రధానమంత్రి
Posted On:
07 AUG 2020 4:19PM by PIB Hyderabad
నూతన విద్యావిధానం కింద ఉన్నత విద్యలో పరివర్తనాత్మక, సంస్కరణలు అనే అంశంపై ఏర్పాటైన సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈరోజు ప్రారంభోపన్యాసం చేశారు. ఈ సమావేశాన్ని కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ, యూనివర్సిటీ గ్రాంట్సు కమిషన్ నిర్వహించాయి. కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్, కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఉన్నత విద్యా కార్యదర్శి శ్రీ అమిత్ ఖరే లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. యుజిసి ఛైర్మన్ శ్రీ డి.పి.సింగ్, నూతన విద్యా విధాన ముసాయిదా రచనా కమిటీ ఛైర్మన్ శ్రీ కె.కస్తూరి రంగన్ ,కమిటీ లోని ఇతర సభ్యులు, ప్రముఖ విద్యావేత్తలు శాస్త్రవేత్తలు ఈ సమావేశంలో నూతన విద్యా విధానంలోని వివిధ కోణాలపై మాట్లాడారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ , ప్రధానమంత్రి , నూతన విద్యావిధానంపై మూడు నాలుగు సంవత్సరాల పాటు విస్తృతంగా చర్చించి, లక్షలాది సూచనలపై మేధోమధనం చేసి దీనిని ఆమోదించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానంపై ఆరోగ్య కరమైన చర్చ జరుగుతున్నదని ఆయన అన్నారు. జాతీయ విద్యావిధానం జాతీయ విలువలు, జాతీయ లక్ష్యాలపై దృష్టిపెడుతూ యువతను భవిష్యత్తుకు సిద్ధం చేసే లక్ష్యంతో కృషి చేస్తుందని చెప్పారు.
నూతన విద్యా విధానం నవభారతానికి, 21 వ శతాబ్ది భారతదేశానికి పునాది వేస్తుందని శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.ఇది భారతదేశాన్ని బలోపేతం చేసేందుకు యువతకు అవసరమైన విద్యను,నైపుణ్యాలను అందిస్తుందని చెప్పారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ఉన్నతస్ధాయికి తీసుకు వెళ్లేందుకు,దేశ పౌరులకు మరింత సాధికారత కల్పించేందుకు , గరిష్ఠస్థాయిలో అవకాశాలు అందిపుచ్చుకునేందుకు వారిని సిద్ధం చేసేలా ఇది పునాది వేస్తుందన్నారు.
ఏళ్ల తరబడి మన విద్యావ్యవస్థలో మార్పులు లేకుండా ఉండడం వల్ల , సరైన తీరులేని ప్రాధాన్యతలకు కారణమైందని, ప్రజలు డాక్టరో, ఇంజనీరో లేక లాయర్ కావడంపైనే దృష్టిపెడుతున్నారన్నారు. ఆసక్తి, సామర్ధ్యం, డిమాండ్ కు సంబంధించిన అంచనాలేవీ ఉండడం లేదని అన్నారు.
మన విద్యా వ్యవస్థలో విద్యపట్ల , విద్యా తాత్వికత పట్ల, విద్య ప్రయోజనం పట్ల ఆసక్తి లేకపోతే విశ్లేషణాత్మక దృష్టి, వినూత్న ఆలోచనలు ఎలా పుట్టుకు వస్తాయని ప్రధానమంత్రి ప్రశ్నించారు. నూతన విద్యా విధానం , విద్యపై గురు రవీంద్రనాథ్ ఆలోచనలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. విద్య సమస్త అస్థిత్వంతో సామరస్య మనుగడకు మన జీవితాలను సుసంపన్నం చేసేదిగా ఉండాలన్నారు. విద్య విషయంలో సమగ్ర వైఖరి అవసరమని , దీనిని జాతీయ విద్యా విధానం విజయవంతంగా నెరవేర్చిందని ఆయన చెప్పారు.
నూతన విద్యా విధానం, రెండు ప్రధాన ప్రశ్నలను మనసులో ఉంచుకుని రూపొందించడం జరిగిందన్నారు. మన విద్యావ్యవస్థ మన యువతను సృజనాత్మక, ఉత్సుకత, నిబద్ధతతో కూడిన జీవితం కోసం మన యువతను ప్రేరేపిస్తుందా? మన విద్యావ్యవస్థ మన యువతకు సాధికారత కల్పిస్తుందా?, దేశంలో సాధికారితతో కూడిన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడుతుందా? ఈ కీలక ప్రశ్నలను మన జాతీయ విద్యా విధానం దృష్టిలో పెట్టుకున్నదని ప్రధానమంత్రి సంతృప్తివ్యక్తం చేశారు.
భారతీయ విద్యావిధానం మారుతున్న కాలానికి అనుగుణంగా మారాల్సి ఉందని ప్రధానమంత్రి చెప్పారు.
5+3+3+4 పాఠ్యప్రణాళిక ఈ దిశగా పడిన అడుగు అని ఆయన అన్నారు. విద్యార్ధులు ప్రపంచ పౌరులుగా ఎదగాలని, అయితే తమ మూలాలకు అనుసంధానమై ఉండాలని ఆయన అన్నారు.
నూతన విద్యావిధానం ఎలా ఆలోచించాలన్న దానిపై దృష్టిపెడుతున్నదని చెప్పారు. పరిశీలన ఆధారంగా,అన్వేషణ ఆధారంగా, చర్చ ఆధారంగా, విశ్లేషణ ఆధారంగా పిల్లలు నేర్చుకునే పద్ధతులు, నేర్చుకోవడం పట్ల వారికి ఆసక్తిని పెంపొందించి తరగతిలో వారు చురుకుగా పాల్గొనేట్టు చేస్తాయని ఆయన అన్నారు.
నూతన విద్యా విధానం ఒక క్రెడిట్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నదని, దీనివల్ల విద్యార్ధి కోర్సు మధ్యలో వదిలివేయడానికి, ఆతర్వాత తిరిగి కోర్సు చేయాలనుకున్నప్పుడు దీనిని వాడుకోవడానికి వీలు కలుగుతుందన్నారు. వ్యక్తి నైపుణ్యాలు పెంచుకొవడం, నూతన నైపుణ్యాలను అందిపుచ్చు కోవడం నిరంతరం సాగే కాలం దిశగా మనం ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు.
సమాజంలోని ప్రతి ఒక్క వర్గం వారి గౌరవప్రదమైన జీవనం , ఏదేశ ప్రగతిలో అయినా కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.అందువల్ల విద్యార్థి విద్య, గౌరవప్రదమైన శ్రమ వంటి వాటిపై జాతీయ విద్యా విధానం పెద్ద ఎత్తున దృష్టిపెట్టిందని ఆయన చెప్పారు.
ప్రపంచానికి ప్రతిభతో కూడిన పరిష్కారాలు, సాంకేతికతను అందించగల సామర్ధ్యం ఇండియాకు ఉందని, జాతీయ విద్యా విధానం ఈ బాధ్యతను దృష్టిలో ఉంచుకుంటున్నదని చెప్పారు. ఇది ఎన్నో సాంకేతిక ఆధారిత అంశాలను , కోర్సులను అభివృద్ధి చేయడానికి నిర్దేశించినదని ఆయన చెప్పారు.
వర్చువల్ ల్యాబ్‌లు కోట్లాది మందికి మెరుగైన విద్య కలను నెరవేర్చనున్నాయని చెప్పారు. ల్యాబ్‌సదుపాయం అవసరమైన ఇలాంటి కోర్సులను గతంలో చాలామంది చదవలేకపోయేవారని ఆయన తెలిపారు. దేశంలో విద్య, పరిశోధనమధ్యగల అంతరాన్ని తొలగించడంలో నూతన విద్యా విధానం కీలక పాత్ర పోషించనున్నదని ఆయన అన్నారు.
నాణ్యమైన విద్య కోసం గట్టి కృషి చేసే సంస్థలకు మరింత స్వేచ్ఛనివ్వాలని ప్రధానమంత్రి అన్నారు. ఇది నాణ్యతకు ఒక ప్రోత్సాహంగా ఉంటుందని, ఇది ప్రతి ఒక్కరూ ఎదగడానికి ప్రేరణగా ఉంటుందని చెప్పారు.నూతన విద్యా విధానం విస్తరించే కొద్దీ, విద్యా సంస్థలకు స్వయం ప్రతిపత్తి కూడా వేగంగా సమకూరుతుందన్నారు.
మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలామ్ విద్య గురించి చెప్పిన మాటలను ప్రస్తావిస్తూ, ప్రధానమంత్రి, నైపుణ్యం, ప్రావీణ్యంగల ఒక మంచి మానవుడిగా రూపొందించడమే విద్య లక్ష్యమని అన్నారు. జ్ఞానవేత్తలను ఉపాధ్యాయులు సృష్టించగలరన్నారు.
నూతన విద్యా విధానం దేశంలో బలమైన బోధనా వ్యవస్థను ఏర్పాటు చేయడంపై దృష్టిపెడుతున్నదని, ఇది మంచి పౌరులను, మంచి నిపుణులను తయారుచేయ గలదన్నారు. జాతీయ విద్యా విధానంలో ఉపాధ్యాయ విద్య గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించడం జరిగిందని, వారు నిరంతరం నైపుణ్యాలు పెంచుకుంటూ ఉన్నారని, దీనిపైన చాలా ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందని తెలిపారు.
జాతీయ విద్యావిధానాన్ని అమలు చేసేందుకు ప్రజలు కలసికట్టుగా కృతనిశ్చయంతో పనిచేయాలని ప్రధానమంత్రి ప్రజలను కోరారు. యూనివర్సిటీలు, కాలేజీలు, పాఠశాల విద్యా బోర్డులు, వివిధ రాష్ట్రాలు, సంబంధిత పక్షాలతో మరో రౌండు చర్చలు, సమన్వయం ఇక్కడి నుంచే ప్రారంభం కానున్నాయని ప్రధానమంత్రి చెప్పారు. జాతీయ విద్యా విధానంపై వెబినార్ కొనసాగించాలని, దీనిని చర్చిస్తూ ఉండాలని చెప్పారు. ఈ సమావేశంలో, నూతన విద్యా విధానం సమర్దంగా అమలు చేసేందుకు మెరుగైన సూచనలు, పరిష్కారాలు లభించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
ఈ సమావేశంలో పాల్గొన్న వారిని ఉద్దేశించి మాట్లాడుతూ కేంద్ర మంత్రి శ్రీ పోఖ్రియాల్, ఈ సమావేశంలో ప్రధానమంత్రి, నూతన విద్యా విధానం 2020 పైన, విద్యలో ఇండియాను ప్రపంచ నాయకత్వ స్థాయిలో నిలబెట్టేందుకు సాగిస్తున్న ప్రయాణంపై తన ఆలోచనలను పంచుకున్నందుకు కృతజ్ఞలు తెలిపారు. జాతీయ విద్యా విధానం 2020, 21 వ శతాబ్దపు తొలి విద్యా విధానమని, ఇది దేశ పురోగతికి సంబంధించిన ఎన్నో అవసరాలను తీరుస్తుందన్నారు. జాతీయ విద్యా విధానం 2020 లో విద్యకు సంబంధించి పలు దృక్కోణాలకు రూపకల్పన చేయడం జరిగిందని చెప్పారు. పాఠశాల స్థాయిలోఅభ్యాసం, వివేక వికాసం, ఉన్నత విద్యా స్థాయిలో విభిన్న అంశాల నైపుణ్యాలు అందించడం, ఇబ్బందులు లేని తగిన విద్యా వాతావరణాన్ని కల్పించడం, సమాచారం, విజ్ఞానాన్ని నవభారతంలో నేర్చుకునే వారికి అందించడం వంటివి ఇందులో ఉన్నాయని ఆయన అన్నారు. ఇది కేవలం ఒక పాలసీ డాక్యుమెంట్ కాదని, భారతదేశంలో విద్యను అభ్యసించే వ్యక్తి ఆకాంక్షలకు ప్రతిరూపమని ఆయన అన్నారు.
21 వశతాబ్దం ప్రపంచీకరణ శకమని,ఎప్పటికప్పుడు సంస్థాగత పోటీతత్వం పెరుగుతున్నదని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. అభ్యసన, పరిశోధన, నవకల్పనలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి ఇది తగిన సమయమని , కచ్చితంగా దీనినే నూతన విద్యా విధానం 2020 చేస్తున్నదని చెప్పారు.ఇది దేశంలో నాణ్యమైన విద్యపై దృష్టిపెడుతున్నదని, భారతీయ విద్యా వ్యవస్థను అత్యంతమెరుగైనదిగా ,ఆధునికంగా మన దేశ విద్యార్ధులకు తీర్చిదిద్దుతుందని ఆయన అన్నారు. 34 సంవత్సరాల క్రితం 1986లో తీసుకువచ్చిన నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ స్థానంలో వస్తుందని, పాఠశాల, ఉన్నత విద్యా వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పును తీసుకువచ్చి ఇండియాను ప్రపంచ విజ్ఞాన సూపర్ పవర్‌గా తీర్చిదిద్దుతుందన్నారు.
మానవ, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో , రాజ్యాంగంలో పేర్కొన్నవిధంగా ఇండియా అభివృద్ధి చెందేలా చేయడంలో ఉన్నత విద్య అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.
ఇండియా జ్ఞాన సమాజంగా, విజ్ఞాన ఆర్థికవ్యవస్థగా ముందుకు వెళ్లేకొద్దీ, మరింత మంది భారతీయ యువకులు ఉన్నత విద్యను కోరుకుంటారని చెప్పారు. నూతన విద్యావిధానం విద్యా సంస్థలను మూడు రకాలుగా వర్గీకరిస్తున్నదని, అవి, పరిశోధనపై దృష్టిపెట్టే విశ్వవిద్యాలయాలు, బోధనపై దృష్టిపెట్టే విశ్వవిద్యాలయాలు, స్వతంత్రకళాశాలలు. ఇది అత్యంత నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు , సమానత్వంతో కూడిన, సమ్మిళిత విద్యను అందించేందుకు మార్గసూచిని ఏర్పరుస్తుందని, వ్యవస్థను పునరుత్తేజితం చేస్తుందని ఆయన పేర్కొన్నారు.
సమావేశంలో పాల్గొన్న వారినుద్దేశించి మాట్లాడుతూ శ్రీ ధోత్రే, నాణ్యమైన ఉన్నత విద్యకు పునాది పాఠశాల విద్య లో ఉందని చెప్పారు. ఇది మన విద్యా వ్యవస్జలోని ఎన్నో అడ్డంకులను తొలగించిందని చెప్పారు. ఇక ఇప్పుడు అకడమిక్, కో-కరికులర్, ఎక్స్‌ట్రాకరికులర్ కార్యకలాపాల మధ్య వ్యత్యాసం ఏదీ లేదని అన్నారు. విద్యార్థులు బోధన, క్రీడలు, కళలు, మ్యూజిక్, వృత్తివిద్య ఇలా అన్నింటిలో అభివృద్ది చెందే వీలు నూతన విద్యావిధానం కల్పిస్తుందని అన్నారు. ఇది ఉన్నత విద్యలో కూడా కొనసాగుతుందని చెప్పారు. ఈ పాలసీ ద్వారా ఇలాంటి ఎన్నో పరివర్తనాత్మక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని ఆయన చెప్పారు. ఉన్నత విద్యను సంఘటిత పరచడం, మల్టీడిసిప్లినరీ విధానం, సులభతరమైన ప్రవేశ, నిష్క్రమణ విధానం, సాంకేతిక పరిజ్ఞాన సులభతర వినియోగం, నాణ్యత, సమానత్వం, సమ్మిళితత్వం పై దృష్టి , తేలికైన కానీ పటిష్టమైన నియంత్రణలు, తిరుగులేని రీతిలో అత్యున్నత నాణ్యత కలిగిన విద్య వంటి ఎ న్నో పరివర్తనాత్మక అంశాలు ఈ నూతన విద్యా విధానంలో ఉన్నాయి.
ఈ సందర్భంగా శ్రీ ఖరే మాట్లాడుతూ ప్రారంభ సమావేశంలో, ఎన్.ఇ.పిపై సవివరమైన ప్రజెంటేషన్ ఇచ్చారు. యువతరం ఆలోచనలను రూపుదిద్దడంలో ఉన్నత విద్యా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని , తద్వార అవి రాష్ట్ర , దేశ అభివృద్ధికి దోహదం చేస్తాయని అన్నారు. ఆధునిక భారతదేశ వాస్తవాలను పరిగణనలోకి తీసుకునిఈ నూతన విద్యా విధానం ద్వారా ఒక కొత్త ఉన్నత విద్యా వ్యవస్థ రూపుదిద్దుకుంటున్నదని , నూతన విద్యా విధానం 2020 పటిష్ట అమలుతో ఇండియా అంతర్జాతీయంగా నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చే అంతర్జాతీయ విద్యాభ్యాస గమ్యస్థానంగా మారుతుందని ఆయన అన్నారు.
ఈ సమావేశంలో పలు సవివరమైన సెషన్‌లు నిర్వహించారు. జాతీయ విద్యా విధానం 2020లోని పలు కీలక కోణాలపై చర్చించారు. సంపూర్ణవిద్య, మల్టీ డిసిప్లినరీవిద్య, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విద్య, నాణ్యమైన పరిశోధనలు, విద్యను మరింత చేరువ చేసేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞాన వినియోగం వంటి వాటిపై సెషన్‌లు జరిగాయి. వివిధ విశ్వవిద్యాలయాల ఛాన్సలర్లు, వివిధ సంస్థల డైరక్టర్లు, కళాశాలల ప్రిన్సిపాళ్లు, విద్యారంగానికి చెందిన పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
*****
(Release ID: 1644256)
Visitor Counter : 142