గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

'సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ' 51వ సమావేశం

Posted On: 07 AUG 2020 7:05PM by PIB Hyderabad

ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (పట్టణ) పథకం కింద, 'సెంట్రల్‌ శాంక్షనింగ్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ' ‍(సీఎస్‌ఎంసీ) 51వ సమావేశం జరిగింది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. 

    కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌యూఏ) కార్యదర్శి శ్రీ దుర్గాశంకర్‌ మిశ్రా మాట్లాడుతూ, "పీఎంఏవై(యు) ప్రగతి సంతృప్తికరంగా ఉంది. 2020 ముగిసేనాటికి, 60 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి, 
80 లక్షల గృహాల పనుల ప్రారంభం లక్ష్యాన్ని సాధించాలని రాష్ట్రాలను కోరుతున్నా” అని అన్నారు. 'భరించగలిగిన అద్దె ఇళ్ల సముదాయాలను' (ఏఆర్‌హెచ్‌సీలను) సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన సూచించారు. “ఏఆర్‌హెచ్‌సీ అనేది పరిణామాత్మక పథకం. ఇది లబ్ధిదారుల జీవనాన్ని మెరుగుపరుస్తుంది” అని చెప్పారు.

    కొవిడ్‌-19 సమయంలో జరిగిన తొలి సమావేశం ఇది. "అందరికీ ఇళ్లు"లో భాగంగా, 2022 నాటికి అర్హులైన పట్టణ లబ్ధిదారులందరికీ పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్న లక్ష్యానికి కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తోందో ఈ సమావేశం ప్రతిబింబించింది. ఇళ్ల నిర్మాణాల వేగాన్ని పెంచడానికి, నిర్ణీత గడువులోగా పూర్తి చేయడానికి ఈ పథకం ప్రాధాన్యతను 'ఎంవోహెచ్‌యూఏ' మరింత పెంచింది.

    10.28 లక్షల ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి, రాష్ట్రాలు సమర్పించిన 1589 ప్రతిపాదనలకు ఈ సమావేశంలో ఆమోదం లభించింది. "లబ్ధిదారు నేతృత్వ నిర్మాణం, భాగస్వామ్య పద్ధతిలో భరించగలిగిన నిర్మాణం" పద్ధతిలో ఈ ఇళ్లను నిర్మిస్తారు.

    భూమి, స్థలాకృతి, వలసలు, ప్రాధాన్యతల్లో మార్పులు, ప్రాణనష్టం వంటి కారణాల వల్ల ప్రాజెక్టుల పునఃసమీక్ష కోసం కూడా రాష్ట్రాలు ప్రతిపాదనలు సమర్పించాయి.

    దేశవ్యాప్తంగా 1.12 కోట్ల ఇళ్లకు అర్హతగల డిమాండ్‌ ఉంటే, ఇప్పటివరకు 1.06 కోట్ల ఇళ్లను పీఎంఏవై(యు) కింద మంజూరు చేశారు.

    దేశవ్యాప్తంగా 67 లక్షలకు పైగా ఇళ్లు నిర్మాణంలో ఉండగా, 35 లక్షలకు పైగా ఇళ్లు పూర్తయ్యాయి, లబ్ధిదారులకు అందాయి. ఈ పథకం కింద మొత్తం పెట్టుబడి 6.31 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో కేంద్ర సాయం రూ.1.67 లక్షల కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.72,646 కోట్లు విడుదలయ్యాయి.

    పీఎంఏవై(యు) కింద ఉప పథకంగా, పట్టణ వలస పేదల కోసం ప్రవేశపెట్టిన 'ఏఆర్‌హెచ్‌సీ'ల పట్ల రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి మంచి స్పందన లభించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ పథకం పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని, సమర్థవంత అమలుకు చర్యలు తీసుకోవాలని మంత్రిత్వ శాఖ కార్యదర్శి దుర్గాశంకర్‌ మిశ్రా అభ్యర్థించారు. ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఏఆర్‌హెచ్‌సీలు ముఖ్యమైన అడుగులవుతాయి.

***



(Release ID: 1644210) Visitor Counter : 212