ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

కరోనా కష్టకాలంలో ఆదుకుంటున్న అన్నదాతకు అభివందనాలు: ఉపరాష్ట్రపతి

- భారతీయ రైతుల సంప్రదాయ వ్యవసాయ జ్ఞానం భేష్
- దీనికి ఆధునిక సాంకేతికత జోడిస్తే మరిన్ని అద్భుతాలు సాధించగలం
- మహిళలకు భూమిపై సమాన హక్కులు కల్పించాల్సిన అవసరముంది
- పౌష్టికాహారం విషయంలో మన వ్యవసాయ ప్రాధామ్యాలను పునరావలోకనం చేసుకోవాలి
- వ్యవసాయ పరిశోధనశాలలు పంటపొలాలతో అనుసంధానమవ్వాల్సిన తరుణమిది
- ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఆధర్వ్యంలో నిర్వహించిన అంతర్జాతీయ అంతర్జాల సదస్సు ప్రారంభోత్సవంలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 07 AUG 2020 1:15PM by PIB Hyderabad

కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రజాజీవనానికి ఎన్నో ఇబ్బందులు ఎదరయ్యాయని.. ఇంతటి పరిస్థితుల్లోనూ మన అన్నదాతలు పోషించిన పాత్ర గొప్పదని ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు ప్రశంసించారు. రైతుల అంకితభావం, చిత్తశుద్ధి కారణంగానే ఆహార భద్రతకు సమస్యల్లేకుండా.. గతం కంటే ఎక్కువ ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగిందని ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. శుక్రవారం ఎమ్మెస్ స్వామినాథన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతదేశంతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల వ్యవసాయ శాస్త్రవేత్తలతో నిర్వహించిన ‘సైన్స్ ఫర్ రెజిలియంట్ ఫుడ్,న్యూట్రిషన్ అండ్ లైవ్లీహుడ్స్’ సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘భారతీయ అన్నదాతల శక్తిసామర్థ్యాలు, అంకితభావం, సంప్రదాయ వ్యవసాయపద్ధతులపై వారికున్న పరిజ్ఞానం ప్రశంసనీయం. అందుకే కరోనా మహమ్మారి సమయంలో చాలావరకు జనజీవనం స్తంభించిపోయినా.. అన్నదాత అలుపెరగకుండా చేసిన కృషికారణంగా గతంకంటే ఎక్కువ ఆహారధాన్యాల ఉత్పత్తి జరిగింది. ఇందుకోసం రైతులందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నా. రైతు బిడ్డగా ఇందుకు గర్విస్తున్నా’ అని ఆయన పేర్కొన్నరు.  భారతీయ సంప్రదాయ వ్యవసాయ పరిజ్ఞానానికి ఆధునిక సాంకేతికత, శాస్త్ర పరిశోధనలు తోడైతే భారతదేశం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. మన ఆహారం, వ్యవసాయం, వాణిజ్య విధానాలను, వ్యవసాయ ప్రాధామ్యాలను సమీక్షించుకుంటే పౌష్టికాహార లభ్యతను మరింత పెంచేందుకు వీలవుతుందన్నారు. ఆహారంలోని పోషకాహార విలువలను పొందే విధంగా ప్రాసెసింగ్ పద్ధతులపై దృష్టిపెట్టడంతోపాటు ఆహారధాన్యాల నిల్వల సామర్థ్యాని కూడా పెంచుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి సూచించారు. 

భారతదేశంలో హరితవిప్లవ నిర్మాత ప్రొఫెసర్ ఎమ్మెస్ స్వామినాథన్ చేసిన కృషిని ప్రశంసిస్తూ.. ఫౌండేషన్ ద్వారా ఆధునిక శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి వినియోగించేందుకు చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. దీంతోపాటుగా ఫౌండేషన్ ద్వారా.. పేదలు, మహిళలు, ప్రకృతి అనుకూల విధానాన్ని ప్రోత్సహించడం గొప్పవిషయమన్నారు. ‘భూ హక్కులు, పట్టాలతోపాటు ఇతర ఆస్తులపై  పురుషులతోపాటు మహిళలకు సంయుక్తంగా హక్కులు ఉండాలన్న డాక్టర్ స్వామినాథన్ గారి సూచనలు ఆమోదయోగ్యమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను సాధించే క్రమంలో మరింత ప్రగతి జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆకలి, పౌష్టికాహారలోపం, శిశు మరణాల రేటు తగ్గించే విషయంలో భారతదేశం గణనీయమైన ప్రగతి సాధించిందన్నారు. ఆరోగ్యం, పౌష్టికాహార సమస్యలను కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనివ్వడంపై ఉపరాష్ట్రపతి సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన విద్యావిధానంలో.. పాఠశాలల్లో చిన్నారులకు చక్కటి పోషకాహార అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించడాన్ని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు.

పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని ‘జనాభా ప్రణాళిక’పైనా రాజకీయ నాయకులు, విధాన నిర్ణేతలు దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ దిశగా ప్రజలు, పౌరసమాజం, పంచాయతీరాజ్ సంస్థలు, ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు.

2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు చేపడుతోందన్న ఉపరాష్ట్రపతి.. ఈ సదస్సులో జరిగే చర్చ తుది ఫలితం.. కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎమ్మెస్ స్వామినాథన్, భారత ప్రభుత్వం శాస్త్ర,సాంకేతిక సలహాదారు ప్రొఫెసర్ కె.విజయరాఘవన్ తోపాటు దేశ, విదేశాలకు చెందిన వ్యవసాయ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

***



(Release ID: 1644136) Visitor Counter : 170