జల శక్తి మంత్రిత్వ శాఖ

స్వచ్ఛమైన నీటికి, ఉపాధి అవకాశాలకు ఆలవాలం జలజీవన్ మిషన్

పశ్చిమ బెంగాల్ లో కోటీ 63లక్షల గ్రామీణ గృహాల్లో
నీటి కుళాయిలు ఉన్నది 2.19లక్షల ఇళ్లకే

2020-21లో 55.60లక్షల ఇళ్లకు కుళాయి కనెన్షన్లు:
అదే రాష్ట్రప్రభుత్వ సంకల్పం

బెంగాల్ కు అందుబాటులో 2,760.76కోట్ల
కేంద్ర వాటా నిధులు, 5,770 కోట్ల రాష్ట్ర వాటా నిధులు

Posted On: 05 AUG 2020 4:08PM by PIB Hyderabad

  పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. సత్వరం చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేగంగా  పట్టణీకరణ, భూగర్భ జలాల దుర్వినియోగం తీవ్రతరం కావడంతో నీటి ఎద్దడి మరింత విషమించింది. గ్రామీణప్రాంతాల్లోని ఇళ్లకు శుద్ధమైన నీటి సరఫరా చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి నీటి నాణ్యత బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో, రసాయనాలు కలిసిన విషతుల్యమైన నీరు, ఫ్లోరైడ్ ప్రభావం, దుర్భిక్షం నెలకొన్న ప్రాంతాల్లో సత్వరం చర్య తీసుకోవలసి ఉంది.

  దేశంలోని పలు ప్రాంతాల్లో పరిశుద్ధమైన తాగునీటి కొరత గురించి తెలుసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జలజీవన్ మిషన్ పథకాన్ని ప్రారంభించారు. పథకం ద్వారా పశ్చిమబెంగాల్ భారీ ప్రయోజనం పొందింది. జలజీవన్ మిషన్ అనేది ప్రాధాన్యతా ప్రాతిపదికన ప్రభుత్వం చేపట్టిన ఫ్లాగ్ షిప్ కార్యక్రమం. నీటి కుళాయి కనెక్షన్ల ద్వారా గ్రామీణ ప్రాంతంలోని ప్రతి ఇంటికీ 2024 సంవత్సరానికల్లా సురక్షితమైన తాగునీటిని కల్పించి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే పథకం లక్ష్యం. ఫెడరల్ వ్యవస్థలో ఇమిడిఉన్న సిసలైన సహకార స్ఫూర్తికి పథకం నిదర్శనం. గ్రామంలోని ప్రతి కుటుంబానికీ వారి ఇంటికే  నీటిని అందించేకుళాయి కనెక్షన్ కల్పించడమే కీలకమైన సూత్రం. ‘సమానత్వం, సమ్మిళితంఅనే సూత్రాల ప్రాతిపదికన పథకం చేపట్టారు. కేవలం మౌలిక సదుపాయాల కల్పనకే కాక, సేవలందించే అంశానికే జలజీవన్ మిషన్ ప్రాధాన్యం ఇస్తోంది.

     పశ్చిమ బెంగాల్ లో జలజీవన్ మిషన్ కార్యాచరణ ప్రణాళిక అమలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని ఇళ్లకు వందశాతం మంచినీటి కనెక్షన్ల సదుపాయం కల్పించాలని పశ్చమబెంగాల్ ప్రభుత్వం సంకల్పించింది. పశ్చిమ బెంగాల్ లోని కోటీ 63లక్షల గ్రామీణ ఇళ్లకు గాను 2లక్షలా 19వేల ఇళ్లకు మాత్రమే మంచినీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేశారు. 2020-21లో 55.60లక్షల ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

  జలజీవన్ మిషన్ కార్యక్రమం అమలు చేసేందుకు తగిన నిధులు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 993.88కోట్ల రూపాయల కేంద్ర నిధులు రాష్ట్రానికి విడుదలయ్యాయి. వాటిలో 428.37కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. మిగిలిన నిధులు అలాగే ఉన్నాయి. దీనికి తోడు రసాయనాలతో కలుషితమైన, ఫ్లోరైడ్ ప్రభావం కల ప్రాంతాలకు పరిశుద్ధమైన నీటిని అందించేందుకు 1,305.70 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంలో 573.36కోట్ల రూపాయలు ఖర్చే కాలేదు. అంటే, గ్రామీణ ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు ఏర్పాటు చేయడానికి 2020 సంవత్సరం ఏప్రిల్ ఒకటి నాటికి 1,146.58 కోట్ల రూపాయల కేంద్ర వాటా నిధులు అందుబాటులో ఉన్నాయి. ఇక 2020-21లో నిధుల కేటాయింపు 1,610.76కోట్ల రూపాయలకు పెరిగింది. ప్రారంభ మొత్తం 1,146.58 కోట్లతో కలుపుకుంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి 2,760.76కోట్ల రూపాయల కేంద్రవాటా నిధులు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. అంటే, 2020-21లో జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర వాటాతో కలిపితే, దాదాపు 5,770 కోట్ల రూపాయలు పశ్చిమ బెంగాల్ కు అందుబాటులో ఉన్నాయి. పైగా, పథకం అమలులో ప్రగతి ఉన్న పక్షంలో పనితీరుపై ప్రోత్సాహకం  ప్రాతిపదికగా అదనపు నిధులు కూడా అందే అవకాశాలున్నాయి. నేపథ్యంలో వివిధ పథకాల కలయిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టే అవకాశం ఉంది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎం.జి.ఎన్.ఆర్..జి.ఎస్.), జలజీవన్ మిషన్, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణం), పంచాయతీ రాజ్ సంస్థలకు ఇచ్చే 15 ఆర్థిక సంఘం నిధులు, జిల్లా ఖనిజాభివృద్ధి సంస్థ నిధులు, అటవీ అభివృద్ధి నిధి నిర్వహణ, కార్పొరేట్ సామాజిక బాధ్యతా నిధి, స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి వంటి వాటి ద్వారా పనులు చేపట్టవచ్చు. గ్రామ స్థాయిలో తాగునీటి భద్రత లక్ష్యంగా నీటి పొదుపు కార్యకలాపాలను చేపట్టేలా, ఇలాంటి నిధులన్నింటినీ వినియోగించేందుకు  గ్రామీణ కార్యాచరణ ప్రణాళిక (వి..పి.)ను ప్రతిగ్రామంలో రూపొందించాల్సి  ఉంటుంది.

   జలజీవన్ మిషన్ లక్ష్యాలను గడువులోగా సాధించేందుకు రాష్ట్రాలతో కలసి భారత ప్రభుత్వం పనిచేస్తున్న నేపథ్యంలో,,.ప్రస్తుతం వినియోగంలో ఉన్న నీటి సరఫరా వ్యవస్థలను మరింత బలోపేతం చేసి, మిగిలిన ఇళ్లకు కూడా కుళాయి కనెక్షన్లు కల్పించేందుకు దృష్టిని కేంద్రీకరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్.లో 41,357 గ్రామాలు ఉఁడగా, 22,155ఇళ్లకు అంటే 54శాతం ఇళ్లకు ఇప్పటికే పైపుల ద్వారా నీటి కనెక్షన్లు ఉన్నాయి. నీటి కనెక్షన్లు లేని ఇళ్లుసమాజంలోనిపేదలకు, అల్పాదాయ వర్గాలకు చెందినవి మాత్రమే. గ్రామాల్లో కోటీ 8లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు కల్పించేందుకు వనరులు అందుబాటులో ఉన్నాయి. రాబోయే నాలుగు లేక ఆరునెలల్లో ఉద్యమ తరహాలో అతివేగంగా ఇళ్లకు నీటి కుళాయిల కనెక్షన్లు కల్పించేందుకు రాష్ట్రాలు తమ అజెండాను గట్టిగా అమలు జరపాల్సి ఉంది. నీటి నాణ్యత సమస్య కలిగిన గ్రామాల్లో, ఆశావహ జిల్లాల్లో, ఎస్.సి., ఎస్.టి. జనాభా ప్రాబల్యం ఉన్న ఆవాసాలు, గ్రామాల్లో సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద పనులకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది.

     ఫ్లోరైడ్ ప్రభావం, తదితర కారణాలవల్ల పశ్చిమ బెంగాల్ లో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొని ఉంది. ఇది తీవ్రమైన అనారోగ్యాలకు కారణమవుతోంది. పరిశుద్ధమైన తాగునీటిని బాధిత గ్రామాలకు, ఆవాసాలకు అందించే కార్యక్రమానికి జలజీవన్ మిషన్ కింద ప్రాధాన్యం ఇస్తున్నారు. 1,566 బాధిత గ్రామాల్లోని అన్ని ఇళ్లకు 2020 డిసెంబరు నెలాఖరులోగా పైపుల ద్వారా నీటి సరఫరా వ్యవ్థను ఏర్పాటు చేయడానికి రాష్ట్రప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవలసి ఉంది.

  రాష్ట్రంలో మెదడువాపు వ్యాధి కూడా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిణమించింది. బాధిత 10 జిల్లాల్లో ప్రాధాన్యతా ప్రాతిపదికపై శుద్ధమైన తాగునీటి సదుపాయం కల్పించవలసి ఉంది. జిల్లాల్లో 2020-21 సంవత్సరంలో 25.46లక్షల ఇళ్లకు నీటి కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సంకల్పించింది. మెదడు వాపు వ్యాధి కారణంగా పిల్లల్లో ఇతర రకాల రుగ్మతలు, వైకల్యాలు, మరణాలు సంభవించకుండా చూసేందుకు 2022నాటికల్లా వందశాతం ఇళ్లకు సురక్షితమైన తాగునీటిని కల్పించాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది.

   జలజీవన్ మిషన్ కింద నీటి నాణ్యతను నిఘాతో పరిశీలించేందుకుగాను, ముందువరసలో పనిచేసేందుకు మహిళలకు సాధికారత కల్పించారు. నీటి నాణ్యత పరీక్ష ప్రక్రియలో గ్రామపంచాయతీలో ఐదుగురికి చొప్పున శిక్షణ ఇవ్వనున్నారు. ఇందులో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. సామాన్య ప్రజలకోసం కూడా నీటి నాణ్యతా పరీక్షల పరిశోధనశాలలను ప్రారంభించాలని రాష్ట్రప్రభుత్వం యోచిస్తోంది.

    పరిశుద్ధమైన తాగునీరు ఇంటికి అందుబాటులో ఉంచడం చాలా అవసరం. తద్వారా గ్రామీణ ప్రజల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమేకాక, నీటి సంబంధమైన వ్యాధులను నియంత్రించవచ్చు. గ్రామీణ మహిళల విలువైన సమయాన్ని ఆదా చేసి వారికి తగిన ఆర్థిక కార్యకలాపాలు కల్పించవచ్చు. మరో ముఖ్యమైన విషయం ఏమంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు నీటి కుళాయిలు ఏర్పాటు చేయడంవల్ల, మహిళలకు, ప్రత్యేకించి బాలికలకు సుదూర ప్రాంతాలనుంచి నీటిని మోసుకువచ్చే ప్రయాస తగ్గుతుంది.

   జలజీవన్ మిషన్ అనేది ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. అది ప్రజా ఉద్యమం వంటిది. పథకాన్ని అమలుచేయాలంటే సమాజంలోని వివిధ వర్గాలను సమీకరించేందుకు అవసరమైన సమాచార, కమ్యూనికేషన్ ప్రణాళిక అవసరం. అందువల్ల గ్రామాలన్నింటిలో సమాచార, కమ్యూనికేషన్ ఉద్యమాన్ని మారుమూలలకు కూడా చేరే విధంగా రూపొందించవలసి ఉంది. గ్రామాల్లో నీటి సరఫరా మౌలిక సదుపాయాలను కల్పించేందుకు, వాటి నిర్వహణను చూసేందుకు వివిధ గ్రామీణ సంఘాల సమీకరణకోసం మహిళా స్వయం సహాయక బృందాలను, సామాజిక రంగంలో పనిచేసే స్వచ్ఛంద సేవాసంస్థలను రాష్ట్రం వినియోగించుకోవలసి ఉంది.

   ప్రతి జనావాసం, గ్రామంలో ఇంటింటికీ  దీర్ఘకాలిక ప్రాతిపదికపై నీటి కుళాయి కనెక్షన్ కల్పించాలన్న జలజీవన్ మిషన్ ప్రధాన లక్ష్యానికి అతీతంగా రాష్ట్రప్రభుత్వం యోచించవలసి ఉందినైపుణ్యం కలిగిన, మోస్తరు నైపుణ్యం కలిగిన వారికి ఉపాధి అవకాశాలు కల్పించే వనరుగా కార్యక్రమాన్ని పరిగణించవలసి ఉంది. తాపీ మేస్త్రీ, ప్లంబింగ్, ఫిట్టింగ్, విద్యుత్ పనుల్లో ఉపాధి అవకాశాలు కల్పించే పథకంగా దీన్ని చూడవలసి ఉంటుంది. గ్రామాల్లో నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణ రంగాల్లో వీరి పాత్ర ఎక్కువగా ఉంటుంది. నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం కలిగిన, మోస్తరు నైపుణ్యం కలిగిన వారితో ఒక వ్యవస్థను రాష్ట్రం ఏర్పాట చేసుకోవడం అవసరం. వివిధ గ్రామాల స్వావలంబనకు కూడా ఇది దోహదపడుతుందిమరో మాటలో చెప్పాలంటే జలజీవన్ మిషన్ పథకం రాష్ట్ర ఆర్థిక అభ్యన్నతికి ఆవశ్యకం.

   గత కొన్ని దశాబ్దాలుగా పశ్చిమ బెంగాల్ లోని పలు ప్రాంతాలు అనావృష్టి, నీటి ఎద్దడి సమస్యలను ఎదుర్కొన్నాయి. నీటి ఎద్దడిని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో కలసి పనిచేయాల్సి ఉంది. కోవిడ్-19 వైరస్ మహమ్మారి  వ్యాప్తితో సంక్షోభం నెలకొన్న ప్రస్తుత తరుణంలో తగినంత పరిశుద్ధమైన నీటిని, మన ఇంటి ఆవరణలోనికే అందుబాటులోకి తెచ్చుకోవడం అత్యంత ఆవశ్యకం. భౌతిక దూరం పాటించేందుకు ఇది ఎంతో అవసరం. ప్రతిరోజూ నీటి కోసం మహిళలు, బాలికలు భారీ క్యూలలో నిలుచి ఉండాల్సి రావడం చాలా ఆందోళనకరం. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన జలజీవన్ మిషన్ పథకాన్ని రాష్ట్రం చక్కగా అమలు చేస్తే బాధిత మహిళల ఆనందానికి అది దారులు వేస్తుంది.

*******



(Release ID: 1643611) Visitor Counter : 155