ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

పెరిగిపోతున్న అపరిష్కృత కేసులపై మరింత దృష్టి కేంద్రీకరించాలి: ఉపరాష్ట్రపతి సూచన

- సత్వర న్యాయం అందేలా.. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు చొరవతీసుకోవాలి

- ప్రజలకు న్యాయవ్యస్థపై మరింత గౌరవం పెరిగేలా చర్యలు చేపట్టాలి

- సమాజంలో మార్పు తీసుకురావడంలో యువ న్యాయవాదుల పాత్ర కీలకం

- ఆంధ్ర విశ్వవిద్యాలయం అంబేడ్కర్ న్యాయ కళాశాల 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఉపరాష్ట్రపతి
శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

- పేదలు, అణగారిన వర్గాలకు న్యాయం చేయడంలో ముందుండాలని సూచన

Posted On: 04 AUG 2020 12:52PM by PIB Hyderabad

అత్యున్నత న్యాయస్థానం నుంచి కిందిస్థాయి కోర్టులవరకు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతున్న అపరిష్కృత కేసుల విషయంలో ప్రభుత్వంతోపాటు, సుప్రీంకోర్టు, హైకోర్టులు, న్యాయ మంత్రిత్వ శాఖలు ఈ విషయంపై దృష్టిపెట్టాలని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు సూచించారు. అన్ని స్థాయిల్లో 3 కోట్లకు పైగా కేసులు అపరిష్కృతంగా ఉండటం విచారకరమని ఆయన పేర్కొన్నారు. కేసుల సంఖ్య ఇలా పెరుగుతున్నందున కీలకమైన కేసుల్లోతీర్పు కూడా ఆలస్యమవుతోందన్నారు. తద్వారా సామాన్యులకు న్యాయప్రక్రియ చాలా ఖరీదైన వ్యవహారంగా మారుతోందన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ న్యాయకళాశాల (ఆంధ్రయూనివర్సిటీ) 76వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటుచేసిన వెబినార్‌లో ఉపరాష్ట్రపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. న్యాయస్థానాల్లో పెరుగుతున్న కేసులపై ఆవేదన వ్యక్తం చేశారు. కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా న్యాయ ప్రక్రియ ఆలస్యమవుతోందని.. తద్వారా సత్వర న్యాయం అందించలేమన్నారు. ‘జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అన్న మాటను ప్రస్తావిస్తూ.. కొన్ని సందర్భాల్లో అనవసరంగా కేసులను పొడగించడం, వాయిదా వేయడం జరుగుతోందన్నారు. దీనిపై న్యాయవాదులతోపాటు ఈ రంగంతో సంబంధమున్న ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ఇది ఎవరినీ విమర్శించేందుకు అనడం లేదని.. న్యాయశాస్త్రాన్ని అభ్యసించినవాడిగా, రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నందున.. తన దృష్టికి వచ్చిన అంశాలను ప్రస్తావిస్తున్నన్నారు. 

దీంతోపాటుగా క్లిష్టమైన చట్టాలను సరళీకృతం చేయాల్సిన అవసరముందని ఉపరాష్ట్రపతి అన్నారు. వినియోగంలో లేని 1600కు పైగా చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందని ఆయన గుర్తుచేశారు. ఈ దిశగా మరింత కృషి జరగాల్సి ఉందన్నారు. చట్టాల రూపకల్పన కూడా.. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా, స్పష్టంగా ఉండాలన్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరముందన్నారు. 

ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పీఐఎల్) ఇటీవల.. ప్రయివేటు (వ్యక్తిగత) ప్రయోజన వ్యాజ్యాలుగా మారిపోతున్నాయని అభిప్రాయపడ్డ ఉపరాష్ట్రపతి.. ఈ విషయంలోనూ చర్చ జరగాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. విశాల ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వేసే వ్యాజ్యాలు అవసరమేనని ఇందులో వ్యక్తిగత ప్రయోజనాలను జోడించడం సరికాదని.. ఇది న్యాయస్థానాల విలువైన సమయాన్ని వ్యర్థం చేసినట్లే అవుతుందన్నారు. 

సమాజంలోని పేద, అణగారిన, వర్గాలకు న్యాయపరమైన సహాయం చేయాలని.. వారి జీవితాలను మెరుగుపరిచేందుకు కృషిచేయాలని లా విద్యార్థులకు, యువ న్యాయవాదులకు ఉపరాష్ట్రపతి సూచించారు. నైతిక ప్రవర్తనను అలవర్చుకుని, నిర్భీతితో.. విధులు నిర్వహించాలన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో న్యాయవాదుల పాత్ర కీలకమనే విషయాన్ని గుర్తించాలని.. ప్రజల్లోచైతన్యం తీసుకురావడంలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన నూతన విద్యావిధానాన్ని ఉటంకిస్తూ.. ప్రాథమిక, ప్రాథమికోతన్న స్థాయి వరకు తప్పనిసరిగా విద్యావిధానం మాతృభాషలోనే కొనసాగాల్సిన అవసరం ఉందన్నారు. ‘రానున్న రోజుల్లో న్యాయ, పరిపాలన, విద్య, తదితర రంగాల్లో మాతృభాషలోనే కార్యకలాపాలు జరిగేలా చొరవతీసుకోవాలి. అప్పుడే ప్రజలు తమ ఆలోచనలను, తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరచడంతోపాటు ప్రభుత్వ ఉత్తర్వులు, న్యాయస్థానాల తీర్పులను సరిగ్గా అర్థం చేసుకోగలరు. మన దైనందిన జీవితంలోనూ మాతృభాషనే ఎక్కువగా వినియోగించాల్సిన అవసరముంది’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ కాలేజీ, విశ్వవిద్యాలయ వ్యవస్థాపకుడైన డాక్టర్ కట్టమంచి రామలింగారెడ్డితోపాటు నాటి న్యాయకోవిదుల కృషిఫలితంగా ఏర్పడిన ఈ కళాశాల పూర్వవిద్యార్థిగా తను గర్వపడుతున్నానన్నారు. ఈ కళాశాలలో చదువుకున్న రోజుల్లోనే తన రాజకీయ, ప్రజాజీవితానికి పునాదులు పడ్డాయని ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. ‘వెయ్యిమైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో మొదలుపెడతాం అన్నట్లుగా.. ఎమ్మెల్యేగా, రాజ్యసభ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, అధికార పార్టీ జాతీయాధ్యక్షుడిగా.. రాజకీయంగా ఎన్నో మెట్లెక్కి రాజ్యాంగబద్ధమైన ఉపరాష్ట్రపతి స్థానానికి చేరుకోవడంలో నా మొదటి అడుగు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచే మొదలైందని చెప్పేందుకు ఏమాత్రం సందేహించను’ అని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జస్టిస్ టి.రజని, జస్టిస్ బట్టు దేవానంద్, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి, న్యాయ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ సుమిత్ర, న్యాయ విభాగం డీన్ ప్రొఫెసర్ డీఎస్ ప్రకాశ్ రావు, అంబేడ్కర్ న్యాయ కళాశాల వ్యవస్థాపక ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కె. గుప్తేశ్వర్, ఖతార్ ప్రభుత్వ అటార్నీ జనరల్ కార్యాలయ ప్రత్యేక సలహాదారు డాక్టర్ పీఎస్ రావుతోపాటు పలువురు న్యాయకోవిదులు, న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



(Release ID: 1643370) Visitor Counter : 246