రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత వైమానిక దళంలో చేరిన రఫేల్‌ యుద్ధ విమానాలు

Posted On: 29 JUL 2020 7:48PM by PIB Hyderabad

భారత వైమానిక దళం శత్రు భయంకరంగా మారింది. తొలి దశ రఫేల్‌ యుద్ధ విమానాలు అంబాలా వైమానిక స్థావరంలో దిగాయి. ఇవి ఫ్రాన్స్‌ మెరిగ్నాక్‌లోని డసాల్ట్‌ వైమానిక కేంద్రం నుంచి ఈనెల 27వ తేదీన ఉదయం బయలుదేరి బుధవారం మధ్యాహ్నం భారత్‌ చేరుకున్నాయి. మార్గంమధ్యలో అబుదాబిలోని అల్‌ దఫ్రా వైమానిక స్థావరంలోనూ ఆగాయి.

    రఫేల్‌ యుద్ధ విమానాల ప్రయాణం రెండు దశల్లో సాగింది. భారత పైలెట్లే వీటిని నడిపారు. ఫ్రాన్స్‌ నుంచి భారత్‌ చేరుకోవడానికి 8500 కి.మీ. దూరం ప్రయాణించాయి. తొలి మజిలీలో భాగంగా, ఏడున్నర గంటల్లో 5800 కి.మీ. ప్రయాణించాయి. ఫ్రెంచ్‌ వైమానిక ట్యాంకర్‌ ద్వారా గాలిలోనే ఇంధనం నింపుకున్నాయి. చెప్పిన గడువులోగా యుద్ధ విమానాలను అప్పగించినందుకు ఫ్రాన్స్‌ ప్రభుత్వానికి, పరిశ్రమకు ఐఏఎఫ్‌ అభినందనలు తెలిపింది. ప్రయాణ సమయంలో ఫ్రెంచ్ వాయుసేన తన ఇంధన ట్యాంకర్ ద్వారా అందించిన మద్దతుతో ఇంత సుదూర ప్రయాణం గడువులోగా విజయవంతంగా ముగిసింది. 

    17వ స్క్వాడ్రన్‌ అయిన "గోల్డెన్‌ యారోస్‌"లో రఫేల్‌ యుద్ధ విమానాలు భాగమయ్యాయి. ఈ స్క్వాడ్రన్‌ను 1951లో ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నో తొలి ఘనతలు ఉన్నాయి. 1955లో, మొదటి దిగ్గజ యుద్ధవిమానం 'డి హవిల్లాండ్ వాంపైర్' 1957లో 'హాకర్‌ హంటర్‌' యుద్ధ విమానం ఈ స్క్వాడ్రన్‌లో చేరాయి.

    రఫేల్‌ యుద్ధ విమానాల చేరిక వేడుకను ఆగస్టు ద్వితీయార్ధంలో అధికారికంగా నిర్వహిస్తారు. ఈ వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

***



(Release ID: 1642156) Visitor Counter : 139