హోం మంత్రిత్వ శాఖ
భారత భూభాగంపై రఫేల్ యుద్ధ విమానాలు దిగడాన్ని "గేమ్ ఛేంజర్"గా అభివర్ణించిన కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా
భారత వాయుసేనకు ఇది చారిత్రాత్మక రోజు, భారత్ గర్వించదగిన క్షణం: అమిత్ షా
భారత్‌ను శక్తిమంత, సురక్షిత దేశంగా మార్చాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ భవిష్యత్ తరం విమానాలు ప్రత్యక్ష సాక్ష్యం: అమిత్ షా
గగనతలంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సత్తా ఉన్న, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత యంత్రం రఫేల్: అమిత్ షా
వేగం నుంచి ఆయుధ సంపత్తి వరకు రఫేల్ అన్నింటికన్నా మిన్న: అమిత్ షా
Posted On:
29 JUL 2020 5:30PM by PIB Hyderabad
భారత భూభాగంపై రఫేల్ యుద్ధ విమానాలు దిగడాన్ని "గేమ్ ఛేంజర్"గా కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అభివర్ణించారు.
ఫ్రాన్స్ నుంచి అంబాలా వైమానిక స్థావరానికి రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్న సందర్భంగా ఆయన ట్వీట్ చేశారు. "భారత వాయుసేనకు ఇది చారిత్రాత్మక రోజు, భారత్ గర్వించదగిన క్షణం" అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఇది యావత్ భారతదేశం గుర్తుపెట్టుకోదగిన రోజని అమిత్ షా తెలిపారు. భారత్‌ను శక్తిమంత, సురక్షిత దేశంగా మార్చాలన్న ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ సంకల్పానికి ఈ భవిష్యత్ తరం విమానాలు నిజమైన సాక్ష్యాలన్నారు. భారత రక్షణ వ్యవస్థను శత్రుదుర్భేద్యం చేసేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ట్వీట్‌లో వెల్లడించారు.
గగనతలంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనే సత్తా ఉన్న, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత యంత్రం రఫేల్ అని అమిత్ షా వర్ణించారు.
ప్రధాని, రక్షణ మంత్రి, ఐఏఎఫ్, దేశ ప్రజలకు అమిత్ షా అభినందనలు తెలిపారు. ఇంతటి తిరుగులేని శక్తిని వాయుసేనకు అందించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు.
"వేగం నుంచి ఆయుధ సంపత్తి వరకు రఫేల్ అన్నింటికన్నా మిన్న, ఈ ప్రపంచ స్థాయి యుద్ధ విమానాలు గేమ్ ఛేంజర్లని తప్పకుండా నిరూపించుకుంటాయి. తన అత్యద్భుత ఆధిపత్యంతో, మన గగనతల రక్షణకు సాయపడతాయి" అని ట్వీట్‌లో కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1642130)
Visitor Counter : 159