ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

జాతీయవాదమే భారతీయ ఆత్మ!: ఉపరాష్ట్రపతి

- మన దేశం, మన జాతి, మన సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పు పొంచి ఉందంటే ప్రజలంతా ఏకమవుతారు

- సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వతకు ప్రజాస్వామ్యమే సంకేతం

- జాతీయవాదంతోపాటు వివిధ భావజాలాలను ఆమోదయోగ్యంగా వివరించిన సమర్థుడు శ్రీ జైపాల్ రెడ్డి

- లోతైన అధ్యయనం, స్పష్టమైన ఆలోచనలు అద్భుతమైన వాక్పటిమ కలిగిన అరుదైన రాజనీతిజ్ఞుడు.. నాకు మంచి మిత్రుడు

- ‘పది భావజాలాలు’ పుస్తకావిష్కరణలో గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు

Posted On: 28 JUL 2020 7:30PM by PIB Hyderabad

భారత సాంస్కృతిక ఐక్యతే ఇవాళ దేశప్రజలను సమైక్యంగా మార్చిందని.. మన దేశం, మన నేల, మన జాతి, మన సంస్కృతి-సంప్రదాయాలకు ముప్పువాటిల్లుతుందని గ్రహిస్తే.. ప్రజలంతా ఏకమై ఆ దాడిని ఎదుర్కునేందుకు సిద్ధపడతారని గౌరవ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఇదే జాతీయవాదమని.. భారతీయ ఆత్మలో జాతీయవాదం బలంగా ఉందని ఇటీవలి పరిణామాలు నిరూపిస్తున్నాయని ఆయన అన్నారు.

మంగళవారం మాజీ కేంద్ర మంత్రి శ్రీ జైపాల్ రెడ్డి రాసిన ‘ది టెన్ ఐడియాలజీస్’ పుస్తక తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను ఉపరాష్ట్రపతి ఆన్‌లైన్ వేదిక ద్వారా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మతం, జాతి, భాష అనేవాటిని ప్రతికూల దృక్పథంతో ఆలోచించే ధోరణి సరైనది కాదని నా అభిప్రాయం. అవి మన అస్తిత్వానికి, సంస్కృతికి, సమైక్యతకు సమగ్రతకు తోడ్పడి దేశ శ్రేయస్సుకు ఉపయోగపడడం ఆరోగ్యకరమైన పరిణామమే. ఈ విషయంలో మన దృష్టి కోణాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. 

ప్రజాస్వామ్యం అనేది.. ఒక సామాజిక వ్యవస్థ పరిణామంలో పరిపక్వమైన పరిస్థితులకు సంకేతమన్న ఉపరాష్ట్రపతి.. ప్రజలు తమకు అవకాశం దొరికినప్పుడల్లా ప్రజాస్వామిక ప్రక్రియను ఉపయోగించుకుని తమ పరిపక్వతను ప్రదర్శించిన సందర్భాలు కోకొల్లలని పేర్కొన్నారు. ‘ప్రజాస్వామిక వ్యవస్థల్లో లోపాలు ఉన్నప్పటికీ.. ఈ లోపాలు పరిణామ క్రమంలో ఏర్పడినవే. వాటిపై చర్చిస్తూ, పరిష్కరించుకునే క్రమంలో ప్రజాస్వామ్యం తనను తాను మెరుగుపరుచుకుని అభివృద్ధి చెందుతూనే ఉంటుంది’ అని వెల్లడించారు. 

విద్యార్థిగా ఉన్నప్పటినుంచే విస్తృత అధ్యయనం చేసే ఆసక్తితో.. శ్రీ జైపాల్ రెడ్డిగారు పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారని.. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యకారణ సంబంధాలతో, లాజికల్ గా ఆలోచించడం శ్రీ జైపాల్ రెడ్డి ప్రత్యేకతని ఉపరాష్ట్రపతి అన్నారు. వాదనా పటిమ, లోతైన విశ్లేషణతో, అరుదైన రాజనీతిజ్ఞుడిగా అందరి మనసులు గెలిచిన జైపాల్ రెడ్డి తన ఆలోచనలకు ‘టెన్ ఐడియాలజీస్’ పేరుతో పుస్తకరూపంలో తీసుకొచ్చారన్నారు. ఈ ఇంగ్లీష్ పుస్తకాన్ని స్వయంగా ఆయనే తనను కలిసి బహుకరించిన విషయాన్ని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి గుర్తుచేసుకున్నారు. 

‘ఈ పుస్తకంలో వర్తమాన సమస్యలను పరిష్కరించేందుకు ఒక ఆధునిక సైద్ధాంతిక దృక్పథం అవసరమని జైపాల్ రెడ్డి వివరించారు. భావజాలాల గురించి విశ్లేషించేటప్పుడు జైపాల్ రెడ్డి ప్రపంచంలో చర్చకు వచ్చిన అన్ని సిద్ధాంతాల గురించి ప్రస్తావించడం కాకుండా.. సమాజంలో మార్పులకు దోహదం చేసిన అనేక పరిణామాలను వాస్తవిక దృక్పథంతో విశ్లేషించి వాటికి తాత్విక కోణాన్ని జోడించారు. ‘వ్యావసాయిక సమాజం నుంచి పారిశ్రామిక సమాజం వరకు’ మారే క్రమంలో వివిధ దేశాల్లో  జరిగిన అనేక పరిణామాలను, అన్వేషణలను, ఆవిష్కారాలను, భావజాలాలను అన్వేషించారు. ఇవాళ మనం చూస్తున్న ప్రజాస్వామ్యం, పెట్టుబడిదారీ విధానాలతో పాటు పర్యావరణ వాదం, స్త్రీవాదం, ప్రపంచీకరణ, సంస్కరణల వెనుక ఉన్న మూలాల్ని ఆయన పది భావజాలాలుగా వర్గీకరించారు. ఈ పది భావజాలాల్లో ప్రధానమైనది జాతీయవాదం’ అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. 

రాజకీయాల్లో ఉన్న వారికి తాత్విక దృక్పథం తప్పని సరిగా ఉండాలని.. సిద్ధాంతం, తాత్విక దృక్పథం లేని రాజకీయాలు పూర్తిగా వృధా అని ఆయన అభిప్రాయపడ్డారు. సైద్ధాంతిక విలువలున్న రాజకీయాలు దేశానికి ఒక స్పష్టమైన దిశానిర్దేశాన్ని అందిస్తాయన్నారు. దేశ ప్రజల సమస్యలను పరిష్కరించడంతో పాటు దేశానికి బలమైన ఆర్థిక, రాజకీయ, సామాజిక వ్యవస్థను ఏర్పర్చేందుకు దీర్ఘకాలిక దృష్టిని, కార్యాచరణను అందించేదే ఒక సైద్ధాంతిక దృక్పథమన్నారు.

ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించిన సీనియర్ పాత్రికేయుడు శ్రీ కల్లూరి భాస్కరంను, ఈ పుస్తక ప్రచురణ కర్తలు ‘ఓరియంట్ బ్లాక్ స్వాన్’ సంస్థ వారిని కూడా ఉపరాష్ట్రపతి అభినందించారు.

 

***



(Release ID: 1641878) Visitor Counter : 214