ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
డిజిటల్ వేదికలు ప్రతిస్పందనా శీలంగా ఉండాలన్న రవిశంకర్ ప్రసాద్
దేశాల సార్వభౌమత్వ అంశాలపై జవాబుదారీ తనం అవసరమని సూచన
వ్యక్తిగత సమాచారాన్ని రక్షించే బలమైన చట్టం భారత్ తీసుకురాబోతోందని వెల్లడి.
సృజనాత్మకతకోసం సమాచారం అందుబాటులో
ఉండేలా చూస్తామని హామీ.
సమాజాన్ని పరివర్తన చెందించే విశ్వసనీయమైన కృత్రిమ మేథో పరిజ్ఞానాన్ని పెంపొందించాల్సి ఉందని ప్రకటన
జీ-20 డిజిటల్ భేటీలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రసంగం.
Posted On:
22 JUL 2020 7:49PM by PIB Hyderabad
డిజిటల్ ఆర్థిక వ్యవస్థపై జి-20 కూటమి దేశాల మంత్రుల స్థాయి వర్చువల్ సమావేశం ఈ రోజు సౌదీ అరేబియా ఆతిథ్యంలో జరిగింది. జి.20 కూటమికి ప్రస్తుతం సౌదీ అరేబియా అధ్యక్ష బాధ్యతలు నిర్వహిస్తోంది. ఈ సమావేశంలో భారత్ తరఫున కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న సంక్షోభ తరుణంలో,..ప్రపంచ స్థాయిలో పటిష్టమైన సరఫరా వ్యవస్థను రూపొందించవలసి ఉందని అన్నారు. ప్రపంచ స్థాయి సరఫరా వ్యవస్థతో సాన్నిహిత్యం ఉండేలా పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రాంతంగా భారత్ ను తీర్చిదిద్దాలన్న ప్రధాని దార్శనికతను గురించి రవిశంకర్ ప్రసాద్ ప్రస్తావించారు.
కోవిడ్-19 సంక్షోభాన్ని ప్రపంచంలోని పలు ఇతర దేశాలకంటే మెరుగ్గా భారత్ ఎదుర్కొందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ పటిమ వల్లనే ఇది సాధ్యమైందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించాలన్నత ప్రధాని సత్వర నిర్ణయం వల్లనే కోవిడ్ వైరస్ వేగాాన్ని అదుపుచేయగలిగామని, భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లకు సన్నద్ధమయ్యే అవకాశం ఏర్పడిందని రవిశంకర్ ప్రసాద్ అన్నారు.
కోవిడ్-19పై పోరాటంలో ఎంతగానో సహాయపడిన డిజిటల్ పరితజ్ఞాన సృజనాత్మకత గురించి కేంద్రమంత్రి సమావేశంలో ప్రస్తావించారు. ఆరోగ్యసేతు మొబైల్ యాప్, క్వారంటైన్ లో ఉన్న కోవిడ్-19 బాధితులపై పర్యవేక్షణకు ఉపయోగపడిన జియో ఫెన్సింగ్ వ్యవస్థ, కోవిడ్-19 సావధాన్ బల్క్ మెస్సేజింగ్ వ్యవస్థ తదితర అంశాల గురించి జి-20 వర్చువల్ సమావేశంలో వివరించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సహాయాన్ని అందించేందుకు భారత ప్రభుత్వానికి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉపయోగపడిందో మంత్రి తెలియజేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంలో సృజనాత్మక వ్యవస్థలైన ప్రత్యక్ష ప్రయోజన బదిలీ, డిజిటల్ చెల్లింపు ద్వారా లాక్ డౌన్ సమయంలో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు వివిధ రకాల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందజేసిన తీరును ఆయన విపులంగా చెప్పారు.
సమ్మిళిత అభివృద్ధికోసం, ప్రత్యేకించి ఆరోగ్య రక్షణ, విద్యా రంగాల్లో ప్రగతి కోసం కృత్రిమ మేధో పరిజ్ఞానం వంటి సాంకేతికతను వినియోగించుకునేందుకు భారత్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని మంత్రి చెప్పారు. సమాజాన్ని పరివర్తన చెందించే విశ్వసనీయమైన కృత్రిమ మేధో పరిజ్ఞానాన్ని రూపకల్పన చేసుకోవలసిన అవసరం ఉందని రవిశంకర్ ప్రసాద్ అభిప్రాయపడ్డారు.
సమాచార సంబంధమైన సమస్యలను, సమాచార గోప్యతను, పౌరుల భద్రతను కాపాడుకునే విషయంలో ఆయా దేశాల సార్వెభౌమత్వపరమైన అంశాలను కేంద్ర మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పౌరుల సమాచార గోప్యతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడమే కాక, సృజనాత్మకతకు, ఆర్థిక అభివృద్ధికి సమాచారం అందుబాటులో ఉండేలా చూసే పటిష్టమైన వ్యక్తిగత సమాచార రక్షణ చట్టాన్ని భారత్ త్వరలో తీసుకురాబోతోందని ఆయన చెప్పారు. సమాచార గోప్యతపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో, పలు దేశాల్లో ఉన్న డిజిటల్ వేదికలు మరింత విశ్వసనీయమైనవి, సురక్షితమైనవిగా రూపొందవలసి ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడి డిజిటల్ సాంకేతిక పరిజ్ఞాన వేదికలైనా ప్రతిస్పందనా శీలంగా ఉండాలన్నారు. అంతేకాక, వివిధ దేశాల రక్షణ అంశాలు, పౌరుల భద్రతా అంశాలు, సార్వభౌమత్వ అంశాలపై తలెత్తే ఆందోళనలపట్ల డిజిటల్ సమాచార వేదికలు జవాబుదారీగా ఉండాలని రవిశంకర్ ప్రసాద్ జి-20 కూటమి మంత్రులకు సూచించారు
***
(Release ID: 1640512)