నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వాణిజ్య, మత్స్యకార నౌకల కోసం భారత నైరుతి జలాల్లో వేర్వేరు మార్గ వ్యవస్థ

భారతీయ జలాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలపై మన నిబద్ధతను ఈ నిర్ణయం ప్రతిబింబిస్తుంది: శ్రీ మన్సుఖ్ మాండవీయ

Posted On: 21 JUL 2020 2:04PM by PIB Hyderabad

దీర్ఘకాలంగా ఉన్న డిమాండ్‌ను పరిష్కరిస్తూ, భారత నైరుతి సముద్ర జలాల్లో వాణిజ్య, మత్స్యకార నౌకల రాకపోకలకు వేర్వేరు మార్గాలను కేంద్ర నౌకారవాణా మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నౌకల భద్రత, రవాణా సామర్థ్యం పెంపును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. 
 
    భారత నైరుతి తీరం చుట్టూ ఉన్న అరేబియా సముద్రం ఎప్పుడూ రద్దీగా ఉండే సముద్ర మార్గం. పెద్ద సంఖ్యలో వాణిజ్య, మత్స్యకార నౌకలు ఈ ప్రాంతంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అప్పుడప్పుడు అవి ఢీకొని ఆస్తి, పర్యావరణ నష్టాలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కూడా పోతుంటాయి.
 
    భారత జలాల్లో స్వేచ్ఛాయుత రాకపోకలను కల్పించడంలో తమ నిబద్ధతను ఈ నిర్ణయం చాటుతోందని కేంద్ర నౌకా రవాణా శాఖ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ మన్సుఖ్‌ మాండవీయ చెప్పారు. "నౌకా ప్రమాదాలు జరగకుండా ఈ నిర్ణయం ఆపుతుంది. అవి సురక్షితంగా, సులభంగా రాకపోకలు సాగించవచ్చు. సముద్ర పర్యావరణ భద్రత సైతం పెరుగుతుంది. షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ తీసుకున్న సానుకూల నిర్ణయమిది" అని మాండవీయ వ్యాఖ్యానించారు.

 

    నైరుతి సముద్ర జలాల్లో మార్గ వ్యవస్థపై, నోటిఫికేషన్‌ "ఎం.ఎస్‌.నోటీస్‌-11 ఆఫ్‌ 2020"ను షిప్పింగ్‌ డీజీ విడుదల చేశారు. ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త మార్గాలు అమల్లోకి వస్తాయి.

 

***
 



(Release ID: 1640207) Visitor Counter : 270