మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక సహాయాన్ని అందించేందుకు 'మనోదర్పణ్'
- 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'లో భాగంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
Posted On:
20 JUL 2020 8:07PM by PIB Hyderabad
విద్యార్థుల మానసిక ఆరోగ్యం, శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక సహాయాన్ని అందించేందుకు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ 'మనోదర్పణ్' అనే
కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (హెచ్ఆర్‌డీ) మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ రేపు జూలై 21, 2020 ఉదయం 11 గంటలకు దీనిని ప్రారంభించనున్నారు. వర్చువల్ విధానంలో జరిగే ఈ కార్యక్రమంలో హెచ్‌ఆర్‌డీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ ధోత్రే కూడా పాల్గొననున్నారు. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ అమిత్ ఖరేతో పాటు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీమతి అనితా కార్వాల్‌తో పాటుగా మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. దీనికి సంబంధించి కేంద్ర మంత్రి పోఖ్రియాల్ ఒక వీడియో ట్వీట్‌ను విడుదల చేశారు. కోవిడ్-19 మహమ్మారి నెలకొన్న ఈ తరుణంలో దేశంలో అకాడెమిక్ వైపు విద్యను కొనసాగించడంతో పాటుగా విద్యార్థులు మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉందని హెచ్ఆర్‌డీ శాఖ భావిస్తోందని ఆయన అన్నారు. కోవిడ్ వ్యాప్తి, ఆ తరువాత సమయంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మానసిక సాంఘిక దన్నును అందించడానికి గాను అనేక రకాల విస్తృత శ్రేణి కార్యకలాపాలతో ‘మనోదర్పణ్’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి తరువాత మన దేశపు ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ఈ ఏడాది మే 5వ తేదీన 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' అనే ఉద్దీపన ప్యాకేజీని ప్రారంభించిన విషయాన్ని మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. దేశంలో మానవ మూలధనాన్ని బలోపేతం చేయడం మరియు ఉత్పాదకతను పెంచడం మరియు విద్యారంగంలో మేటి సమర్థవంతమైన సంస్కరణలను తీసుకురావడంలో భాగంగా ‘మనోదర్పణ్’ చొరవను'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్'లో చేర్చారు. ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడానికి మరియు ఒత్తిడి లేని జీవితాన్ని గడపడానికి దేశంలోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులందరు ఈ ‘మనోదర్పాణ్’లో చేరాలని శ్రీ పోఖ్రియాల్ విజ్ఞప్తి చేశారు.
***
(Release ID: 1640122)
Visitor Counter : 299