సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

దిల్లీ ప్రభుత్వానికి సీసీఆర్‌జీఏ నోటీసు

Posted On: 20 JUL 2020 5:18PM by PIB Hyderabad

ఈనెల 16వ తేదీన దిల్లీ ప్రభుత్వం ఇచ్చిన పత్రిక ప్రకటనపై, సుప్రీంకోర్టు నిర్దేశిత "కమిటీ ఆన్‌ కంటెంట్‌ రెగ్యులేషన్ ఇన్‌ గవర్నమెంట్‌ అడ్వర్‌టైజింగ్‌" (సీసీఆర్‌జీఏ) నోటీసు జారీ చేసింది. ఈ ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో అనేక సందేహాలు వెల్లువెత్తాయి. ముంబై వార్తాపత్రికల్లో దిల్లీ ప్రభుత్వం ప్రకటన ఇవ్వాల్సిన అవసరం ఏంటని, రాజకీయ లబ్ధి కోసమే ఆ ప్రకటన ఇచ్చారని నెటిజన్లు ప్రశ్నలు కురిపించారు. దీనిని సుప్రీంకోర్టు కమిటీ సుమోటోగా విచారణకు తీసుకుంది. దిల్లీ ప్రభుత్వ విద్యా విభాగం, సమాచార&ప్రచార డైరెక్టరేట్‌ ఈ ప్రకటనను ఇచ్చాయి.
  
    2015 మే 13న వెలువడిన సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం.., "ప్రభుత్వ ప్రకటనల్లోని సమాచారం రాజ్యాంగ, చట్టబద్ధ బాధ్యతలకు, పౌరుల హక్కులు, అర్హతలకు సంబంధించి ఉండాలి".

    ఈ మార్గదర్శకాల ప్రకారం దిల్లీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలంటూ, నోటీసు అందుకున్న నాటి నుంచి 60 రోజుల గడువును సుప్రీంకోర్టు కమిటీ ఇచ్చింది. ఈ క్రింది అంశాలకు దిల్లీ ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి:

i. పత్రిక ప్రకటనకు ఖజానా నుంచి చేసిన ఖర్చు
ii. ప్రకటన ఉద్దేశం, దిల్లీ బయటి పత్రికలకు ప్రత్యేకంగా ప్రకటన ఇవ్వడంలో గల ఉద్దేశం
iii. రాజకీయ వ్యక్తుల స్తుతిని అడ్డుకునే సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఈ ప్రకటన ఎలా ఉల్లంఘించదు?
iiii. ప్రకటనకు సంబంధించిన మీడియా ప్రణాళిక, ప్రచురించిన సంస్థల పేర్లు, వాటి సంచికల సమర్పణ

    2015 మే 13వ తేదీన సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా, 2016 ఏప్రిల్‌ 6వ తేదీన, సంబంధిత రంగాల్లో నిపుణులు, నిష్పాక్షికంగా వ్యవహరించే ముగ్గురు సభ్యుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఖర్చుతో అన్ని మీడియాల్లో వచ్చే ప్రకటనల్లోని సమాచారాన్ని పరిశీలించడం ఈ కమిటీ విధి. ప్రభుత్వ ప్రకటనలు సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా ఉన్న సందర్భంలో ప్రజలు ఫిర్యాదులు చేస్తే పరిష్కరించడానికి, తగిన సిఫారసులు చేయడానికి ఈ కమిటీకి అధికారం ఉంది. సుప్రీంకోర్టు సూచనలకు విరుద్ధంగా లేదా దూరంగా ప్రభుత్వ ప్రకటనలు ఉంటే, సుమోటోగా విచారణకు తీసుకోవచ్చు, సరిచేసుకునే చర్యలను సూచించవచ్చు.

    భారత ఎన్నికల విశ్రాంత ప్రధానాధికారి శ్రీ ఓం ప్రకాశ్‌ రావత్‌, ప్రస్తుతం 'సీసీఆర్‌జీఏ'కి అధ్యక్షత వహిస్తున్నారు. ఏసియన్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ అడ్వర్టైజింగ్‌ అసోసియేషన్స్‌కు చెందిన శ్రీ రమేష్‌ నారాయణ్‌, ప్రసారభారతి బోర్డు సభ్యుడు డా.అశోక్‌ కుమార్‌ టాండన్‌ సభ్యులుగా ఉన్నారు.

***



(Release ID: 1639987) Visitor Counter : 198