ఆర్థిక మంత్రిత్వ శాఖ

కొత్త ఫారం 26ఏఎస్‌ ద్వారా ఆదాయపన్ను రిటర్నుల ఈ-ఫైలింగ్‌లో సౌలభ్యం

Posted On: 18 JUL 2020 1:37PM by PIB Hyderabad

కొత్త ఫారం 26AS అనేది, ఆదాయ పన్ను రిటర్నులను పన్ను చెల్లింపుదారులు త్వరగా, సరైన పద్ధతిలో ఈ-ఫైల్‌ చేసే విధానం. ఈ ఆర్థిక సంవత్సరం నుంచి, ఆదాయపన్ను చెల్లింపుదారులు కొత్త 26ఏఎస్‌ ఫారాన్ని చూస్తారు. వివిధ విభాగాల్లో, స్టేట్‌మెంట్‌ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్జాక్షన్స్‌ (ఎస్ఎఫ్‌టీలు)లో పేర్కొన్న పన్ను చెల్లింపుదారుల ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అదనపు వివరాలు కొత్త ఫారంలో ఉంటాయి. 

    ఎస్‌టీఎఫ్‌లకు సంబంధించి, దరఖాస్తుదారుల నుంచి ఆదాయ పన్ను శాఖ అందుకున్న సమాచారాన్ని ఫారం 26ఏఎస్‌లోని పార్ట్‌ 'ఇ'లో చూపుతారు. స్వచ్ఛంద వర్తింపు, పన్ను జవాబుదారీతనం, రిటర్నుల ఈ-ఫైలింగ్‌ను సులభతరం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. చెల్లించాల్సిన పన్నును సరిగా లెక్కించి, ఆదాయ పన్ను రిటర్న్‌ (ఐటీఆర్‌) సమర్పించడానికి ఈ వివరాలను పన్ను చెల్లింపుదారు ఉపయోగించుకోవచ్చు.

    లావాదేవీ వద్ద తగ్గించిన పన్ను, పాన్‌కు సంబంధించి లావాదేవీ వద్ద తగ్గించిన పన్ను సమాచారం, చెల్లించిన ఇతర పన్నుల వివరాలు, వాపసులు, టీడీఎస్ ఎగవేతలు సహా మరికొంత అదనపు సమాచారం ఇవ్వడానికి గత ఫారం 26ఏఎస్‌ను ఉపయోగించారు. ఇప్పుడు, పెద్ద ఆర్థిక లావాదేవీలను పన్ను చెల్లింపుదారులు గుర్తుకు తెచ్చుకునేలా ఇందులో ఎస్‌ఎఫ్‌టీలు ఉన్నాయి. తద్వారా, ఐటీఆర్‌ ఫైల్‌ చేసేటప్పుడు లెక్కలన్నీ సిద్ధంగా ఉంటాయి. 

    సేవింగ్స్‌ ఖాతాలో నగదు జమలు, ఉపసంహరణలు, స్థిరాస్తి క్రయవిక్రయాలు, కాల పరిమితి డిపాజిట్లు, క్రెడిట్‌ కార్డ్‌ చెల్లింపులు, షేర్లు, డిబెంచర్లు, విదేశీ నగదు, మ్యూచువల్‌ ఫండ్ల కొనుగోళ్లు, షేర్లను తిరిగి కొనడం, వస్తు, సేవలకు నగదు చెల్లింపులు వంటి వివరాలను ఆదాయపన్ను చట్టం-1961లోని సెక్షన్‌ 285 బీఏ ప్రకారం ఆదాయ పన్ను విభాగం స్వీకరిస్తుంది. ఈ చట్టంలో పేర్కొన్న "స్పెసిఫైడ్‌ పర్సన్స్‌" అయిన బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్స్‌, బాండ్లను జారీ చేసే సంస్థలు, రిజిస్ట్రార్లు లేదా సబ్‌ రిజిస్ట్రార్లు వంటి వారి నుంచి; 2016 ఆర్థిక సంవత్సరం నుంచి భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిపిన వ్యక్తులకు సంబంధించిన సమాచారాన్ని తీసుకుంటుంది. ఇప్పుడు, వివిధ ఎస్‌ఎఫ్‌టీల కింద ఉన్న సమాచారమంతా కొత్త ఫారం 26ఏఎస్‌లో కనిపిస్తుంది.

    ఇప్పటినుంచి.., లావాదేవీ రకం, ఎస్‌ఎఫ్‌టీ ఫైలర్‌ పేరు, లావాదేవీ జరిగిన తేదీ, వ్యక్తిగత/ఉమ్మడి పార్టీ లావాదేవీ, పార్టీల సంఖ్య, నగదు మొత్తం, చెల్లింపు విధానం వంటి వివరాలను ఫారం 26ఏఎస్‌లోని పార్ట్‌ 'ఇ' ప్రదర్శిస్తుంది.

    నిజాయతీ గల పన్ను చెల్లింపుదారులు, రిటర్నులు దాఖలు చేసేటప్పుడు ఆర్థిక లావాదేవీల సంపూర్ణ సమాచారాన్ని ఫారం 26ఏఎస్‌ అందించి సాయపడుతుంది. యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ రిటర్న్స్ (ఏఐఆర్‌)లో, 2015-16 ఆర్థిక సంవత్సరం వరకు తీసుకున్న లావాదేవీల సమాచారం కూడా కొత్త ఫారం 26ఏఎస్‌లో ఉంటుంది.

***
 


(Release ID: 1639652) Visitor Counter : 244