పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

అమెరికా-భారత్ ’ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం’ పై ఉమ్మడి ప్రకటన

Posted On: 17 JUL 2020 9:10PM by PIB Hyderabad

ప్రపంచమంతటా మానవాళికి సమస్యాత్మకంగా మారిన సంక్షోభం ఎంతగానో ప్రభావం చూపుతుండగా అది ఇంధనపు అవసరాల మీద అంతర్జాతీయంగా ఇంధనపు మార్కెట్ల మీద. సుస్థిర ఇంధనపు అభివృద్ధి మీద కూడా ప్రభావం చూపుతోంది. అందుకే అమెరికా-భారత్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం ఇప్పుడు ఎంతో కీలకంగా మారింది. అమెరికా ఇంధన శాఖామంత్రి డాన్ బ్రౌలెట్, భారత పెట్రోలియం, సహజవాయు, ఉక్కు  శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్  ఈరోజు వర్చువల్ పద్ధతిలో జరిగిన అమెరికా-భారత్ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య సమావేశంలో పాల్గొని సహరించుకోవలసిన ప్రాధన్యతా రంగాల గురించి చర్చించుకున్నారు.


ఇరు దేశాల ఇంధన అవసరాల వ్యూహాత్మక అవసరాన్ని. ఇరు దేశాల ద్వైపాక్షిక అనుబంధాన్ని గుర్తించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలకు అనుగుణంగా 2018లో ఈ ఇంధన భాగస్వామ్యం ఏర్పాటైంది. రెండు ప్రభుత్వాల సహకారంతో పరిశ్రమలో లీనమవటానికి దీర్ఘకాలం ఇంధన భాగస్వామ్యం కొనసాగటమే దీని ధ్యేయం.


 ఇంధన భద్రత, ఇంధన అందుబాటు కోసం ఇరుదేశాలూ ఈ వైఖరిని పంచుకుంటాయి.  సహకారానికి నాలుగు స్తంభాల్లాంటి ప్రక్రియలను ఇరువైపులా అమలు చేస్తాయి. అందులో ఇంధన, విద్యుత్ సమర్థత, చమురు, సహజవాయువు, పునరుత్పత్తి ఇంధనం, సుస్థిర అభివృద్ధి అనే అంశాలమీద దృష్టి సారిస్తాయి. వీటిద్వారా అమెరికా, భారత్ పవర్ గ్రిడ్ ఆధునీకరణకు, బలోపేతం చేయటానికి, చౌకగా విద్యుత్ అందుబాటులోకి రావటానికి, సామర్థ్యం పెంచుకోవటానికి, పర్యావరణ నష్టం నివారించటానికి ప్రయత్నిస్తాయి. ఆ విధంగా దీర్ఘకాల ఇంధన అభివృద్ధికి కృషి చేస్తూ సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం కృషిచేస్తాయి. చమురు, సహజవాయు వ్యాపారం ద్వారా ఇంధన భద్రత సాధిస్తాయి. మౌలిక సదుపాయాలు మెరుగుపరచుకుంటాయి. పునరుత్పత్తి ఇంధన వాడకాన్ని విస్తృతం చేసేందుకు నిధుల అందుబాటుకు, సంబంధిత ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టాలి. ఇంధనవ్యాపారానికి, పెట్టుబడికి మార్కెట్ పరమైన అవరోధాలు తొలగించాలి. 

 

భారత్ ను ఇండో -పసిఫిక్ ప్రాంతంలో  బలమైన ఇంధన భాగస్వామిగా నిలబెట్టేందుకు కూడా వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం ( ఎస్ ఇ పి) మద్దతునిస్తుంది.  
పరిశోధన, అభివృద్ధి విషయంలో కూడా ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయి. దీనివలన ఆధునిక గ్రిడ్స్ ఏర్పాటై, ఇంధన నిల్వ ద్వారా విద్యుత్ గ్రిడ్స్ మీద అధారపడే అవకాశం పెరుగుతుంది. అత్యాధునిక మార్గాలలో విద్యుదుత్పత్తికి సంబంధించిన సరికొత్త పరిశోధనా ఫలితాలను ఇరుదేశాలూ  ప్రకటించాయి. విద్యుదుత్పత్తిలో బొగ్గు ఆధార సాంకేతిక పరిజ్ఞానం, హైడ్రోజెన్ ఉత్పత్తి, కర్బన గ్రహణం, వినియోగం, నిల్వ మీద కూదా పరిశోధన తగిన ఫలితాలనిస్తోంది.  ఇలా ఉమ్మడి పరిశోధనల కొనసాగాలని కోరుకుంటున్నట్టు అమెరికా తెలియజేసింది. అదే విధంగా పౌర అణు ఇంధన సాంకేతిక పరిజ్ఞానాల మీద ఉమ్మడి పరిశోధనలకోసం కృషి చేయాలనుకుంటున్నట్టు చెప్పింది.


మంత్రిత్వ స్థాయి నిర్ణయాలు


ఇరుపక్షాలూ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం కింద సాధించిన అంశాలను, ప్రాధాన్యాలను ప్రకటించాయి
 ఇంధన భద్రత పెంపు
వ్యూహాత్మక పెట్రోలియం నిల్వల నిర్వహణకు, పరస్పర సమాచార బదలాయింపుకు, ఉత్తమ విధానాలు అవలంబిస్తూ సహకరించుకోవటం మీద ఇరుపక్షాలూ ఒక అవగాహనాపత్రం మీద సంతకాలు చేశాయి. భారత చమురును అమెరికా వ్యూహాత్మక చమురు నిల్వ లో నిల్వచేయటం ద్వారా వ్యూహాత్మకంగా వ్యవహరించే అంశాన్ని కూడా చర్చించారు.
సరికొత్త ఆవిష్కరణల వినియోగం
ఇరుదేశాలూ ప్రభుత్వ-ప్రజల భాగస్వామ్యంతో హైడ్రోజెన్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశాయి. పునరుత్పాదక ఇంధనం, శిలాజ ఇంధనం నుంచి హైడ్రోజెన్ ను ఉత్పత్తి చేసే సాంకేతిక పరిజ్ఞానాలను దీని ద్వారా మెరుగుపరుస్తారు. ఫలితంగా అదనపు ఇంధన భద్రతకయ్యే ఖర్చు తగ్గించవచ్చునని భావిస్తున్నారు. భారతదేశపు తొలి సోలార్ డెకథ్లాన్ కు సహకరించేందుకు కూడా మరో అవగాహన ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. నిర్మాణ రంగ నిపుణులు పునరుత్పాదక ఇంధనం మీద ఆధారపడే భవనాల నిర్మాణానికి కృషి చేసేలా ఈ వ్యవస్థ పనిచేస్తుంది. అమెరికా వారి డిఒఇ నేషనల్ లాబ్స్,  భారత ఇంధన మంత్రిత్వశాఖ పరిధిలోని జాతీయ సంస్థలు ఉమ్మడిగా ఇటీవలే ప్రారంభమైన దక్షిణాసియా ఇంధన బృందంతో కలిసి పనిచేస్తాయి. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం కోసం జరిపే ఈ పరిశోధనలకు యుఎస్ ఎయిడ్ సహకారం అందిస్తుంది.
ఉమ్మడి కార్యక్రమాలు, సుస్థిర జీవ ఇంధన ఉత్పత్తి, వినియోగంలో మరీ ముఖ్యంగా బయో ఇథనాల్, పునరుత్పాదక డీజిల్ తదితర జీవ ఇంధనాల విషయంలో సహకారానికి,  సమాచార మార్పిడికి ఇరుపక్షాలూ అంగీకరించాయి. అదే విధంగా సముద్ర, వాయు మార్గాల్లో సుస్థిర జీవ ఇంధనం వాడకం మీద కూడా  చర్చించారు. విధాన సంబంధమైన. నియంత్రణా పరమైన అంశాలతో మీద కూడా చర్చలు జరిగాయి. జీవ వ్యర్థాలను బయోగాస్ గా మార్చటం వలన కలిగే ఆర్థిక ప్రయోజనాలను బేరీజు వేయటంలో సహకరించుకోవాలని నిర్ణయించారు.  
ఇంధన వ్యవస్థ ఆధునీకీరణ
భారతదేశం తన ఇంధన రంగాన్ని సంపూర్ణంగా మార్చివేసే క్రమంలో పునరుత్పాద ఇంధనం మీద పెద్ద లక్ష్యాలు నిర్ణయించుకోగా ఇరుపక్షాలూ సహకరించుకోవాలని నిర్ణయించాయి. పునరుత్పాదక ఇంధనాన్ని సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో గ్రిడ్ లో అనుసంధానం చేయటం, విద్యుత్ పంపిణీ రంగాన్ని ఆధునీకరించటం, పునరుత్పాదక ఇంధనం విషయంలో రాష్ట్ర స్థాయి ప్రణాళికకు మద్దతు ఇవ్వటం, పంపిణీలో కొత్త సాంకేతికపరిజ్ఞానం వాడకం, ఎలక్ట్రిక్ వాహనాలు, ఇళ్ళపైన సౌర విద్యుత్ వాడకం, బాటరీ స్టోరేజ్ లాంటి అంశాలను ప్రోత్సహిస్తారు. రేయింబవళ్ళు నాణ్యమైన విద్యుత్ అందించటానికి వీలుగా ప్రైవేట్ రంగం భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించి పంపిణీ రంగాన్ని ఆధునీకరించటం లాంటి చర్యలతో సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించారు. 
వినియోగదారుణ్ణి కేంద్రంగా చేసుకొని భారత్ అంతటా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, భారత్ లో స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు ద్వారా గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తీర్చి దిద్దటం లాంటి అంశాలమీద ఏకాభిప్రాయం కుదిరింది. చిన్న, మధ్యతరహా పరిశ్రమ రంగం ద్వారా ఇళ్లమీద సౌరవిద్యుత్ పలకలు ఏర్పాటు చేయించటానికి రెండున్నర కోట్ల డాలర్ల ఋణహామీ కి యు ఎస్ ఎయిడ్, యు ఎస్ ఇంటర్నేషనల్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అంగీకరించాయి.
థర్మల్ విద్యుత్ ప్లాంట్స్ నిర్వహణను సరళతరం చేసే విషయం కూడా పరిశీలనలో ఉంది. ఎప్పటికప్పుడు మారే విద్యుత్ వినియోగానికి తగినట్టుగా విద్యుదుత్పత్తి జరపటం ద్వారా నిర్వహణ వ్యయాల తగ్గింపు, వైఫల్యపు రిస్క్ ల తగ్గింపు మీద కూడా దృష్టి సారిస్తున్నారు. బొగ్గు వాడకపు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కోసం సహకరించుకోవాలని ఇరుదేశాలూ భావిస్తున్నాయి. కార్బన్ గ్రాహకం, వాడకం, నిల్వ ద్వారా కర్బన ఉద్గారాలు అసలే లేకుండా చూడాలన్న ధ్యేయంతో పనిచేయాలని నిర్ణయించుకున్నాయి.


సాంకేతిక సహకారంలోని కొత్త అంశాల్లో ఆర్థిక రంగాల్లో పునరుత్పాదక ఇంధనవాడకాన్ని చేర్చటం, కొత్త వ్యాపార నమూనాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు, కొత్తగా వస్తున్న డిజిటల్ టెక్నాలజీలను, ఆధునిక ఐటి యాజమాన్య పద్ధతులను వాడుకోవటం ద్వారా సైబర్ సెక్యూరిటీ పెంచుకోవటం లాంటివి ఉన్నాయి. 


 ఇంధన సామర్థ్యం పెంపు, పరిరక్షణ


భవిష్యత్ అవసరాల దృష్ట్యా స్మార్ట్ భవనాల డిజైనింగ్, నిర్వహణ స్మార్ట్ మీటర్స్ మీద అమెరికా, భారత్ కృషి చేస్తున్నాయి. డిమాండ్ కు తగినట్టుగా వేగంగా స్పందించటం, భవనాల సామర్థ్యాన్ని పెంచటం, ఇంధన పరిరక్షణను ప్రోత్సహించటం, ఇళ్ళలో నాణ్యమైన గాలి అందేలా చూడటం మీద ప్రధానంగా దృష్టిపెట్టాయి.ఇంధన వనరులమీద, ఇంధన సామర్థ్యం మీద సాంకేతిక సహాయానికి కూడా అంగీకరించాయి. పారిశ్రామిక రంగంలో ఇంధనం సమర్థ వినియోగ సామర్థ్యం పెంచటానికి కూదా ఇరుదేశాలూ కృషి చేస్తున్నాయి.  ఐ ఎస్ ఓ 50001 కు అనుగుణంగా ఇంధన నిర్వహణ మీద పనిచేస్తాయి. కోవిడ్ సంక్షోభ నేపథ్యంలో యు ఎస్ ఎయిడ్, ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసె ఉమ్మడిగా ఎయిర్ కండిషనింగ్ లో మార్పుల ద్వారా భద్రత, సమర్థత సాధించాలని నిర్ణయించాయి. అప్పుడే ఆరోగ్యకరమైన భవనాలు అందుబాటులోకి వస్తాయని, ప్రభుత్వ భవనాలలో దీనికి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నాయి.
ఇంధన వ్యాపారం, పెట్టుబడిని ప్రోత్సహించటం
వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం మొదలైనప్పటి నుంచి ద్వైపాక్షిక హైడ్రోకార్బన్ వ్యాపారం పెరుగటం పట్ల ఇరుదేశాలూ సంతృప్తికరంగా ఉన్నాయి.  ఈ వ్యాపారం  2019-20 లో 920 కోట్ల అమెరికా డాలర్ల కు చేరుకోవటం ద్వారా 2017-18 కంటే 93% పెరుగుదలను నమోదు చేసుకుంది. అలాగే  ఇరుదేశాల మధ్య హైడ్రోకార్బన్ వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవాలని కూడా నిర్ణయించాయి.
అమెరికా-భారత్ సహజవాయి టాస్క్ ఫోర్స్ ద్వారా రెండుదేశాల పరిశ్రమలు కొత్త  ఆవిష్కరణలతో కూడిన ప్రాజెక్టుల విషయంలో సరికొత్త వాణిజ్య భాగస్వామ్యాలకు నాంది పలికాయి. భారత ఇంధన రంగంలో సహజ వాయువు వాటా పెంచటానికి మార్గదర్శకాలను కూడా రూపొందించింది. ఇరుపక్షాలూ అనేక ప్రభుత్వ-ప్రజల ఉమ్మడి చర్చలు కూడా నిర్వహించి పరిశ్రమ ఆలోచనావిధానాన్ని తెలియజేయటానికి, ఇంధన రంగంలో పెట్టుబడులకు, వ్యాపారానికి ఉన్న అవకాశాలను, ఎదురవుతున్న సవాళ్లను  వివరించటానికి ఉపయోగించుకుంది.
పౌర అణువిద్యుత్ సహకారంలో ఇరుదేశాలూ తమ ప్రభుత్వాల అంకిత భావాన్ని చాటుకున్నాయి. కొవ్వాడలోని వెస్టింగ్ హౌస్ కమర్షియల్ రియాక్టర్ ప్రాజెక్ట్ పురోగతిని స్వాగతించాయి. ఇది ఇరుదేశాల వ్యుహాత్మక భాగస్వామ్యంలో దీన్నొక మైలు రాయిగా అభివర్ణించాయి. ఇంధనరంగంలో జాతీయాభివృద్ధికి సహకరించుకోవాలని ఇరుపక్షాలూ నిర్ణయించుకున్నాయి. అదే విధంగా మంచి అవకాశాలున్న ప్రాజెక్టులలో ఇరుదేశాల సంస్థలూ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాలని కూడా నిర్ణయించాయి.


సుస్థిర ఆర్థికాభివృద్ధిని ప్రోత్సహించటం


దీర్ఘకాల ఇంధన అభివృద్ధి ని పెంచటం మీద ఇరుదేశాలూ పనిచేస్తున్నాయి. ఇంధన సమాచార నిర్వహణకు అతుత్తమ విధానాలు అవలంబించటం ద్వారా ప్రణాళికలు, వ్యూహాలు రూపొందించుకోవాలని నిర్ణయించాయి. తక్కువ కర్బన ఉద్గారాలు వెలువరించే సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహించాలని కూడా నిర్ణయించుకున్నాయి. డిఒఇ నేషనల్ లాబ్స్ తోను, సంబంధిత అమెరికా ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలతోను కలిసి భారతదేశంలోని ఆలోచనాపరులు, విధాన పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ సంస్థలు  ఈ కార్యక్రమం చేపడతాయి.  యు ఎస్ ఎయిడ్, నీతి ఆయోగ్ ఉమ్మడిగా ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరమ్ ను ప్రారంభించాయి.విధాన పరమైన నిర్ణయాలలో ప్రభుత్వానికి అనుసంధానమై ఈ విభాగం పనిచేస్తుంది.


ఇంధన రంగంలో మహిళాసాధికరత 


వైవిధ్య భరితమైన నైపుణ్యాలను వాడుకుంటూ సిబ్బందిలో సమతుల్యత పాటించాల్సిన అవసరాన్ని గుర్తించారు. అప్పుడే ఇంధన రంగంలో మరిన్ని కొత్త ఆవిష్కరణలకు స్థానం దక్కుతుందని, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోగలమని తేల్చారు. లింగపరమైన వైవిధ్యం సాధించాలని, ఈ వేదిక ద్వారా ఇంధన రంగంలో  మహిళా వ్యాపారులను ప్రోత్సహించాలని సమావేశం నిర్ణయించింది. యుఎస్ ఎయిడ్ ఈ సందర్భంగా ఇంధనరంగంలో దక్షిణాసియా మహిళలు అనే వేదికను ఆవిష్కరించింది. సాంకేతిక రంగంలో మహిళల పాత్రమీద ఈ వేదిక దృష్టి సారిస్తుంది.


వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్య బృందాలు త్వరలో మరోవిడత సమావేశమై ఆయా సహకార రంగాలకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తాయి. తదుపరి సమావేశం 2021లో జరుగుతుంది.
 
*****
అనుబంధం

 అమెరికా-భారత్ వ్యూహాత్మక ఇంధన భాగస్వామ్యం  కింద ఈ దిగువ పేర్కొన్న ఒప్పందాలు, భాగస్వామ్యాలు ప్రకటించారు.  వీటివలన ఇరుదేశాల వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు మరింత మెరుగుపడతాయి:


అమెరికా ఇంధనశాఖ, భారత చమురు, సహజవాయువు మంత్రిత్వశాఖ మధ్య వ్యూహాత్మ ముడి చమురు నిల్వలలో సహకారం మీద అవగాహనా ఒప్పందం
అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ ( యుఎస్ ఎయిడ్ ) కు, ఇండియన్ సొసైటీ ఆఫ్ హీటింగ్ రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనర్స్  కు మధ్య వృత్తి నిపుణులకు నైపుణ్యాభివృద్ధి కోసం ఒప్పందం
ఈ ఈఎస్ ఎల్, ఎన్టీపీసీ, యుఎస్ ఎయిడ్  మధ్య భవనాల లోపల గాలి నాణ్యత, భద్రత పెంచే పరికరాల మార్పిడి అవగాహన ఒప్పందం
భారతదేశపు నేషనల్ ఓపెన్ యాక్సెస్ రిజిస్ట్రీని అభివృద్ధి చేయటానికి పవర్ సిస్టమ్ ఆపరేషన్ కార్పొరేషన్ తో భాగస్వామ్యాన్ని ప్రకటించిన యుఎస్ ఎయిడ్
అమెరికా, భారత్ విద్యుత్ మంత్రిత్వశాఖల మధ్య  అమెరికా-భారత్ క్లీన్ ఎనర్జీ ఫైనాన్స్ టాస్క్ ఫోర్స్ భారతదేశంలోని గ్రిడ్ వ్యవస్థ ఆధునీకరణ పట్ల ఆసక్తి ప్రకటించటం, భారత ప్రజలకు తక్కువ ధరలో విద్యుత్ సరఫరాకు గాను ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించటం కూడా ఇందులో భాగం
అమెరికా వారి ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్, భారత్ లోని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఉమ్మడిగా విద్యుత్ నియంత్రణా విధానాలను పరస్పరం తెలుసుకోవటానికి, విద్యుత్ మార్కెట్లను అభివృద్ధి చేసుకోవటానికి ఒక ఒప్పందం కుదుర్చుకునే విషయం తుది దశలో ఉంది.
ఏషియా ఎడ్జ్ లో భాగంగా భారత్ కోసం అమెరికా వాణిజ్య శాఖ ఏర్పాటు చేసిన ఎనర్జీ ఇండస్ట్రీ వర్కింగ్ గ్రూప్ సరికొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీలతో సహా అమెరికా-భారత ఇంధన సహకారానికి కృషి చేస్తుంది.
స్మార్ట్ గ్రిడ్ నాలెడ్జ్ సెంటర్ ఇకమీదట స్మార్ట్ గ్రిడ్స్ లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా మారటానికి ఒక వ్యూహాత్మక ప్రణాళికను విడుదల చేయటం. విద్యుత్ మంత్రిత్వశాఖ, యు ఎస్ ఎయిడ్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన పవర్ అండ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ  సదస్సు సందర్భంగా జరిగిన రౌండ్ టేబుల్ లో నిర్ణయం


అమెరికా-భారత్ గాస్ టాస్క్ ఫోర్స్ కింద:  


అమెరికావారి ఫెడరల్ ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్, భారతదేశపు ముడిచమురు, సహజవాయువు నియంత్రణామండలి మధ్య నియంత్రణా చట్టం మీద పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక అవగాహనా ఒప్పందం
ఇంధన కణ సాంకేతిక పరిజ్ఞానం మీద బ్లూమ్ ఎనర్జీ, ఇండియన్ ఆయిల్ మధ్య అవగాహనా ఒప్పందం
వర్చువల్ పైప్ లైన్ నెట్ వర్క్ ద్వారా  ద్రవీకృత సహజవాయువు డిమాండ్ ని పెంచటానికి, భారత్ లో ఐ ఎస్ వో కంటెయినర్ల తయారీకి ఎక్సాన్ మొబిల్, చార్ట్ ఇండస్ట్రీస్ ఐఒసిఎల్ మధ్య సహకారానికి లేఖ
భారత్ లో టైప్ IV సిలిండర్లు సహా ఆధునిక స్వచ్ఛ ఇంధన వ్యవస్థల ఉపయోగం, గిట్టుబాటు,  లాభదాయకత అవకాశాలు పరిశీలించటానికి ఎజిలిటీ ఫ్యూయల్ సొల్యూషన్స్, ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మధ్య అవగాహన ఒప్పందం
వర్చువల్ గాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ కు  లాభదాయకత మీద పైలట్ రూపకల్పన అవకాశాల పరిశీలనకు గాస్ వే యుఎస్ఎ,  ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ మధ్య అవగాహనా ఒప్పందం
భారత్ లో సహజ వాయువు అన్వేషణకు సంబంధించి  2019 లో ఎక్సాన్ మొబిల్, గెయిల్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం తగినమ్త పురోగతి సాధించింది.ఇప్పుడు భారీ ద్రవీకృత సహజవాయువు రవాణాకు సంబంధించిన వాణిజ్యపరమైన చర్చలలో నిమగ్నమయ్యారు.

***(Release ID: 1639588) Visitor Counter : 77