రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

"చార్‌ధామ్‌ ఆల్‌ వెదర్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌"పై కీలక సమావేశానికి అధ్యక్షత వహించిన శ్రీ గడ్కరీ

గొప్ప మత, వ్యూహాత్మక, జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్ట్; సంబంధిత వ్యక్తులంతా ఈ దృష్టికోణం నుంచే సంబంధిత అంశాలను చేపట్టాలి: శ్రీ నితిన్ గడ్కరీ

ఈ ప్రాజెక్టు వేగవంతానికి, "భగీరథి ఎకో-సెన్సిటివ్‌ జోన్‌" 'జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌' మార్గం సుగమం చేస్తుంది: శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌

Posted On: 17 JUL 2020 6:05PM by PIB Hyderabad

ఉత్తరాఖండ్‌లో చేపడుతున్న "చార్‌ధామ్‌ రోడ్‌ ప్రాజెక్ట్‌"పై, కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. కేంద్ర పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాశ్‌ జావడేకర్‌, ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్‌ రావత్‌, కేంద్ర రహదారి రవాణా, హైవేల శాఖ సహాయ మంత్రి వి.కె.సింగ్‌, రాష్ట్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర సీనియర్‌ అధికారులు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

    పెండింగ్‌లో ఉన్న సమస్యలను వేగంగా పరిష్కరించాలని, భూ సేకరణను త్వరగా పూర్తి చేయాలని శ్రీ గడ్కరీ సూచించారు. ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాధాన్యత కలిగినదని, సంబంధిత అధికారులంతా ఆ దృష్టికోణంతోనే పనులు జరిపించాలని స్పష్టం చేశారు. పర్యావరణం, భూ సేకరణ సహా రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలోని అన్ని పెండింగ్‌ అంశాలను వ్యక్తిగతంగా సమీక్షించాలని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రిని అభ్యర్థించారు. కఠినంగా పర్యవేక్షించాలని, ఉద్దేశపూర్వక జాప్యాలపై జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. 

    అత్యున్నత స్థాయి కమిటీ సిఫారసుల ఆధారంగా, కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టడాన్ని కేంద్ర పర్యావరణ మంత్రి శ్రీ జవదేకర్ ప్రస్తావించారు. ప్రాజెక్టు త్వరగా పూర్తి కావడానికి తమ మంత్రిత్వ శాఖ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

    "భగీరథి ఎకో-సెన్సిటివ్‌ జోన్‌" కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం రూపొందించిన, జల్ శక్తి మంత్రిత్వ శాఖ అంచనా వేసిన 'జోనల్‌ మాస్టర్‌ ప్లాన్‌' (జడ్‌ఎంపీ)ను ఈనెల 16వ తేదీన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆమోదించిందని జావడేకర్‌ వెల్లడించారు. నదీ పరివాహక విధానంపై జడ్‌ఎంపీ ఆధారపడి ఉంది. అడవులు, వన్యప్రాణుల రక్షణ, వాటర్‌షెడ్ నిర్వహణ, నీటిపారుదల, ఇంధనం, పర్యాటకం, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రహదారి మౌలిక సదుపాయాలు వంటివి దీనిలో భాగం.

    పర్యావరణ, అటవీ అనుమతులకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై, రహదారి రవాణా మంత్రిత్వ శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలతో కేంద్ర పర్యావరణ శాఖ కార్యదర్శి సమీక్షించాలని ఈ సమీక్షలో నిర్ణయించారు.

    భూ సేకరణ వేగవంతంతోపాటు, ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అన్ని అంశాలను వ్యక్తిగతంగా సమీక్షించి పరిష్కరిస్తానని ఉత్తరాఖండ్‌ సీఎం శ్రీ రావత్‌ తెలిపారు. ఉత్తరాఖండ్ వేసవి రాజధాని అయిన గైర్సాయిన్‌ను జాతీయ రహదారితో అనుసంధానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తున్న ప్రతిపాదనను పరిశీలించాలని  గడ్కరీని అభ్యర్థించారు. ఆ ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఆ వివరాలు తనకు అందిన వెంటనే సాధ్యమైనంత త్వరగా పరిశీలిస్తానని గడ్కరీ హామీ ఇచ్చారు.

    ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌ యాత్ర ప్రాంతాలైన యమునోత్రి, గంగోత్రి, బద్రినాథ్‌, కేదార్‌నాథ్‌ను కలిపేలా చార్‌ధామ్‌ ప్రాజెక్టును రూపొందించారు. అన్ని వాతావరణాల్లోనూ ప్రయాణించగలిగే చార్‌ధామ్‌ ప్రాజెక్టు రోడ్డును 826 కి.మీ. మేర నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 12,000 కోట్ల రూపాయలు.

***


(Release ID: 1639510) Visitor Counter : 183