విద్యుత్తు మంత్రిత్వ శాఖ

భారత్‌లో వ్యాపార అవకాశాల అన్వేష‌ణ‌కు గాను ఎన్‌ఐఐఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఎన్‌టీపీసీ

Posted On: 16 JUL 2020 5:23PM by PIB Hyderabad

కేంద్ర ప్ర‌భుత్వంలోని విద్యుత్ మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తున్న దేశంలోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ అయిన ఎన్‌టీపీసీ లిమిటెడ్ నేడు 'జాతీయ పెట్టుబడి మరియు మౌలిక సదుపాయాల నిధి'తో (ఎన్‌ఐఐఎఫ్) ఒక‌ అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఎన్‌టీపీసీ సంస్థ‌ ఒక ప్ర‌క‌ట‌న‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. భారతదేశంలో పునరుత్పాదక ఇంధనం, విద్యుత్ పంపిణీ వంటి రంగాలతో పాటు.. ఇత‌ర పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో త‌గిన పెట్టుబడుల అవకాశాలను అన్వేషించడానికి 'నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లిమిటెడ్‌తో' (ఎన్‌ఐఐఎఫ్ఎల్) సంస్థ‌ పని చేయ‌నుంది.
ప్ర‌ముఖుల సమ‌క్షంలో ఒప్పందం..

 

6


ఎన్‌టీపీసీ సంస్థ జీఎం (బీడీ-డొమెస్టిక్‌) శ్రీ‌మ‌తి సంగీత కౌశిక్‌, ఎన్ఐఐఎఫ్ఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీ రాజీవ్ ధార్‌లు వీడియో కాన్ఫ‌రెన్సింగ్ విధానం ద్వారా ఈ అవగాహన ఒప్పందంపై సంత‌కాలు చేశారు. ఎన్‌టీపీసీ సంస్థ సీఎండీ శ్రీ గురుదీప్‌ సింగ్‌తో పాటుగా ఎన్ఐఐఎఫ్ఎల్ సంస్థ సీఈవో శ్రీ సుజోయ్ బోస్‌‌ల స‌మ‌క్షంలో ఈ సంత‌కాల కార్య‌క్ర‌మం జ‌రిగింది. ఎన్‌టీపీసీ సంస్థ డైరెక్టర్ (కమర్షియల్) శ్రీ ఎ.కె. గుప్తా, ఎన్ఐఐఎఫ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీమతి అంబలిక బెనర్జీ, ఎన్‌టీపీసీ సంస్థ డైరెక్టర్ (ఫైనాన్స్) శ్రీ ఎ.కె.గౌతమ్, మేనేజింగ్ పార్టనర్‌ వినోద్ గిరి త‌దిత‌రులు
కూడా ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఎన్‌ఐఐఎఫ్‌ మాస్టర్‌ ఫండ్‌తో పాటు ఇరు సంస్థలకు చెందిన ప‌లువురు ఇతర సీనియర్ ప్రముఖులు దీనికి హాజరయ్యారు. ఈ అవగాహన ఒప్పందంతో దేశంలో స్థిరమైన మరియు దృఢ‌మైన విద్యు‌త్ మౌలిక సదుపాయాలను నిర్మించాలనే భారతదేశ స్వ‌ప్నం సాకారానికి ఎన్‌టీపీసీ మరియు ఎన్‌ఐఐఎఫ్ఎల్ సంస్థ‌లు దోహ‌దం చేయ‌నున్నాయి.
62,110 మెగావాట్ల వ్య‌వ‌స్థాప‌క సామర్థ్యం..
ఈ భాగస్వామ్యంతో ఎన్‌టీపీసీ సంస్థ సాంకేతిక నైపుణ్యంతో పాటు ఎన్‌ఐఐఎఫ్ఎల్ సంస్థ మూల‌ధ‌న‌ స‌మీక‌ర‌ణ సామర్థ్యంతో విద్యుత్‌ రంగంలోని ప్రముఖ సంస్థ‌ల‌తో సంబంధాలను మెరుగుప‌రుచుకుంటూ.. ప్రపంచంలోనే మేటి పద్ధతుల్ని అందుబాటులోకి తేవాల‌ని లక్ష్యంగా పెట్టుకున్నారు. మొత్తం 62,110 మెగావాట్ల వ్య‌వ‌స్థాప‌క సామర్థ్యంతో ఎన్‌టీపీసీ గ్రూప్‌లో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో 24 బొగ్గు, 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / ద‌్ర‌వ ఇంధ‌నం విద్య‌త్ స్టేష‌న్లు కాగా.. ఒక‌ జ‌ల విద్యుత్, 13 రెన్యూవబుల్స్‌తో పాటుగా 25 అనుబంధ‌ మ‌రియు సంయుక్త‌ పవర్ స్టేషన్ల‌ను సంస్థ క‌లిగి ఉంది. 2032 నాటికి పునరుత్పాదక ఇంధన వనరుల నుండి మొత్తం 30 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని క‌లిగి ఉండాల‌ని ఎన్‌టీపీసీ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
4.3 బిలియన్ డాలర్ల ఈక్విటీ క్యాపిటల్..

 

3


మాస్టర్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్ మరియు స్ట్రాటజిక్ ఆపర్చునిటీస్ ఫండ్ అనే మూడు ఫండ్లతో ఎన్ఐఐఎఫ్ లిమిటెడ్ సంస్థ 4.3 బిలియన్ డాలర్ల ఈక్విటీ క్యాపిటల్‌ను ప్రత్యేక పెట్టుబడి వ్యూహంతో నిర్వహిస్తోంది. ఎన్ఐఐఎఫ్ఎల్ అంతర్జాతీయ మరియు భారతీయ పెట్టుబడిదారుల కోసం ఒక సహకార పెట్టుబడి వేదిక. దీనికి ప్ర‌భుత్వం నిర్వ‌హాణ ‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ ఫండ్‌ల‌లోని పెట్టుబడిదారులకు ఆకర్షణీయమైన రిస్క్-సర్దుబాటు రాబడిని సంపాదించే లక్ష్యంతో ఎన్ఐఐఎఫ్ఎల్ సంస్థ భారతదేశంలో మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ ఈక్విటీ మరియు ఇతర వైవిధ్యభరితమైన రంగాలు, వివిధ ఆస్తి తరగతులలో పెట్టుబడుల‌ను పెడుతోంది. ఎన్ఐఐఎఫ్ఎల్ మాస్టర్ ఫండ్ దేశంలోనే అతిపెద్ద మౌలిక సదుపాయాల నిధి. రవాణా మరియు ఇంధనం వంటి ప్రధాన మౌలిక సదుపాయాల రంగాలలో ఇది పెట్టుబడులు పెడుతోంది.
 

***



(Release ID: 1639171) Visitor Counter : 161