వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

జర్మనీకి చెందిన అనాబిన్‌ డేటాబేస్‌లో 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ డిజైన్‌'కి స్థానం, ఇకపై ఆ సంస్థల విద్యార్థులు జర్మనీలో వర్క్‌ పర్మిట్‌లకు దరఖాస్తు చేసుకోవడం సులువు

Posted On: 15 JUL 2020 1:46PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన 'డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌' ‍(డీపీఐఐటీ).. దేశవ్యాప్తంగా ఐదు 'నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా' (ఎన్‌ఐడీ) విద్యాసంస్థలను ఏర్పాటు చేసింది. రూపకల్పనలకు సంబంధించి ప్రపంచస్థాయి విద్యను అందించడం వీటి లక్ష్యం. ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌ (అహ్మదాబాద్‌, గాంధీనగర్‌, బెంగళూరులో క్యాంపస్‌లు) 1961లో ప్రారంభమైంది. మిగిలిన నాలుగు.. ఎన్‌ఐడీ ఆంధ్రప్రదేశ్‌, ఎన్‌ఐడీ హర్యానా, ఎన్‌ఐడీ అసోం, ఎన్‌ఐడీ మధ్యప్రదేశ్‌ గత కొన్నేళ్లలో ప్రారంభమయ్యాయి. వీటిని జాతీయ ప్రాధాన్యత ఉన్న విద్యాసంస్థలుగా పార్లమెంటు చట్టం ప్రకారం ప్రకటించారు. అంతర్జాతీయంగానూ ప్రశంసలు పొందాయి. ఈ సంస్థల నుంచి పట్టా పొందిన విద్యార్థులు దేశంలోని వివిధ రంగాల్లో పని చేస్తున్నారు. విదేశాల్లోనూ సవాళ్లతో కూడిన అవకాశాలను అందిపుచ్చుకున్నారు.

    ఎన్‌ఐడీ విద్యార్థులు పని చేస్తున్న దేశాల్లో జర్మనీ ఒకటి. సెంట్రల్‌ ఆఫీస్‌ ఫర్‌ ఫారిన్‌ ఎడ్యుకేషన్‌ (జడ్‌ఏబీ) ద్వారా, జర్మనీలో విదేశీ అర్హతలను గుర్తించే ఏకైక ప్రాధికార సంస్థను ఆ దేశం ప్రారంభించింది. జర్మన్‌ డిప్లొమాలు, డిగ్రీలకు సంబంధమున్న విదేశీ డిగ్రీలు, ఉన్నత విద్య అర్హతలను అనాబిన్‌ అనే డేటాబేస్‌లో ఇది పొందుపరుస్తుంది.

    'జర్మన్‌ వర్క్‌ వీసా' లేదా 'జాబ్‌ సీకర్స్‌ వీసా' లేదా 'జర్మన్‌ బ్లూ కార్డ్‌' పొందాలంటే, జర్మనీలో విదేశీ విశ్వవిద్యాలయ స్థాయి అర్హతలను గుర్తించడం తప్పనిసరి. జర్మనీ బయటి విద్యార్హతలు, ఆ దేశ విద్యార్హతతో సమానంగా ఉంటేనే వీసా వస్తుంది. 3 లేదా 4 సంవత్సరాల బ్యాచిలర్ డిగ్రీ ఉంటేనే దానిని జర్మనీలో డిగ్రీగా గుర్తిస్తారు.

    ఎన్‌ఐడీ అహ్మదాబాద్‌ను, 2015లో, అనాబిన్‌ డేటాబేస్‌లో చేర్చారు. మిగిలిన ఎన్‌ఐడీలను ఇటీవలే చేర్చారు. దీంతో, ఈ ఐదు ఎన్‌ఐడీల విద్యార్థులు, తమ విద్యా సంబంధ రంగాల్లో జర్మనీలో పని చేయడానికి వర్క్‌ పర్మిట్‌ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు.

 

***



(Release ID: 1638763) Visitor Counter : 139