ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 మీద డాక్టర్ హర్షవర్ధన్ అధ్యక్షతన మంత్రుల బృందం 17వ సమావేశం



ప్రస్తుత పరిస్థితి, నియంత్రణ చర్యలపై సమీక్ష

Posted On: 27 JUN 2020 3:08PM by PIB Hyderabad

 

కోవిడ్ - 19 మీద కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ హర్ష వర్ధన్ అధ్యక్షతన ఉన్నత స్థాయి మంత్రుల బృందం 17వ సమావేశం జరిగింది. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్మాణ్ భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రితోబాటు విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్, కేంద్ర పౌర విమానయాన శాఖామంత్రి శ్రీ హర్ దీప్ ఎస్. పూరి, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ అశ్విన్ చౌబే కూడా పాల్గొన్నారు.

 

దేశంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ కేసులగురించి, కోలుకుంటున్న తీరు, మరణాల సంఖ్య, వివిధ రాష్ట్రాలలో పరీక్షలు జరుగుతున్న తీరుతెన్నులగురించి మంత్రుల బృందం ముందుగా తెలుసుకుంది. ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేస్, పశ్చిమ బెంగాల్ తో కూడిన ఎనిమిది రాష్ట్రాలలోనే 85.5% మంది చికిత్సలో ఉన్నట్టు, 87% మరణాలు నమోదైనట్టు తెలుసుకున్నారు. ప్రజారోగ్య నిపుణులు, అంటువ్యాధి నిపుణులు, వైద్యులు, సీనియర్ జాయింట్ సెక్రెతరీ స్థాయి అధికారితో కూడిన 15 కేంద్ర బృందాలు ప్రస్తుతం ఈ రాష్ట్రాలకు సాంకేతిక సాయం అందించేందుకు నియోగించబడిన విషయం కూడా మంత్రుల బృందం దృష్టికి తీసుకువెళ్లారు. మరో కేంద్ర బృందం ప్రస్తుతం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణ చర్యలను బలోపేతం చేసే దిశలో పనిచేస్తున్నట్టు కూడా తెలియజేశారు. వ్యాధి సోకినవారి ఆచూకీ తెలుసుకునేందుకు, సోకే అవకాశమున్నవారిని ముందుగా గుర్తించేందుకు ఇతిహాస్, ఆరోగ్యసేతు యాప్ లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విస్తృతంగా వాడుతున్నాయని, తగిన ఫలితాలు కూడా అందుతున్నాయని మంత్రుల బృందానికి నివేదించారు.

 

నివారణ, నిఘా చర్యలమీద రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు క్రమం తప్పకుండా సమాచారం అందిస్తూ నియంత్రణ చర్యలు తీసుకోవటానికి మార్గదర్శనం చేస్తున్నట్టు మంత్రుల బృందానికి తెలియజేశారు. పరీక్షల సామర్థ్యాన్ని ఉపయోగించుకోవటం, వృద్ధులమీద, ఇతర దీర్ఘకాల వ్యాధులున్నవారిమీద దృష్టి సారించటం, ఆరోగ్య సేతు లాంటి డిజిటల్ ఉపకరణాల సాయంతో హాట్ స్పాట్ లను గుర్తించటం, బాధితులను చేర్చుకోవటంలో ఆలస్యం జరగకుండా చూడటం, మరణాలను తగ్గించటం, పడకలు, ఆక్సిజెన్, వెంటిలేతర్లు, రవాణా లాంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూస్తూ కోవిడేతర ఆరోగ్య సేవలు కూడా అందించటం మీద దృష్టి సారించ వలసిందిగా రాష్ట్రాలను కోరింది.

 

భారత వైద్య పరిశోధనామండలి డైరెక్టర్ జనరల్ డాక్టర్ భార్గవ పరీక్షల వ్యూహం మీద పరిస్థితిని వివరణాత్మకంగా తెలియజేశారు. సీరమ్ సర్వే, రోజువారీ పరీక్షల నిర్వహణా సామర్థ్యం పెంపు తదితర అంశాలను కూడా వివరించారు. గడిచిన 24 గంటల్లో పరీక్ష చేసిన శాంపిల్స్ 2,20,479 కు పెరగగా, మొత్తం పరీక్షించిన శాంపిల్స్ సంఖ్య 79,96,707 కు చేరింది. భారత్ లో ప్రస్తుతం 1026 లాబ్ లు ఉండగా వీటిలో 741 ప్రభుత్వ ఆధ్వర్యంలో, 285 ప్రైవేటృ ఆధ్వర్యంలో ఉన్నాయి.

 

దేవ్యాప్తంగా పెరుగుతున్న వైద్య మౌలిక సదుపాయాలను కూడా ఈ సందర్భంగా మంత్రివర్గ ఉపసంఘానికి తెలియజేశారు. జూన్ 27 నాటికి 1039 ప్రత్యేక కోవిడ్ ఆస్పత్రులలో 1,76,275 ఐసొలేషన్ పడకలు, 22,940 ఐసియు పడకలు, 77,268 ఆక్సిజెన్ తో కూడిన పడకలు ఉన్నాయి. కోవిడ్ ఆరోగ్య కేంద్రాలు 2,398 ఉండగా 1,39,483 ఐసొలేషన్ పడకలు, 11,539 ఐసియు పడకలు, 51,321 ఆక్సిజెన్ తో కూడిన పడకలు వాడకంలో ఉన్నాయి. 8,958 కోవిడ్ రక్షణ కేంద్రాలు ఉండగా వాటిలో 8,10,621 పడకలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. కేంద్రం ఇప్పటిదాకా 185.18 లక్షల ఎన్95 మాస్కులు, 116.74 లక్షల పిపిఇ కిట్లు రాష్ట్రాలకు కేంద్రపాలిత ప్రాంతాలకు, కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అందజేసింది.

 

కోవిడ్ - 19 సమయంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదుల పరిష్కార సమయాన్ని 60 నుంచి మూడు రోజులకు తగ్గించటాన్ని ఎంపవర్డ్ గ్రూప్-10 చైర్మన్ శ్రీ కె, శివాజీ మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ప్రాధాన్యతా క్రమంలో వాటిని పరిష్కరించగలిగామని చెప్పారు. కోవిడ్ సంబంధిత ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏప్రిల్ 1న ప్రారంభించిన జాతీయ కోవిడ్ డాష్ బోర్డ్ పనితీరును వివరించారు. మార్చి 30 - జూన్ 24 మధ్య కాలంలో కేంద్ర మంత్రిత్వశాఖలకు సంబంధించి 77,307 ఫిర్యాదులు రాగా వాటిలో 93.84% పరిష్కరించామన్నారు. అదే విధమ్గా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన 53,130 కేసులలో 63.11% పరిష్కారమయ్యాయన్నారు.  

 

ఆరోగ్య కార్యదర్శి కుమారి ప్రీతి సుదాన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఒ ఎస్ డి శ్రీ రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సీఈవో శ్రీ అమితాబ్ కాంత్, ఫార్మా కార్యదర్శి శ్రీ పిడి వాఘేలా, డిడబ్ల్యు ఎస్ కార్యదర్శి శ్రీ పరమేశ్వరన్ అయ్యర్, మంత్రిత్వశాఖ డిజిహెచ్ ఎస్ డాక్టర్ రాజివ్ గార్గ్, అదనపు కార్యదర్శి కుమారి ఆర్తి అహుజా, విదేశాంగ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి శ్రీ దమ్ము రవి, ఎన్ సి డిసి డైరెక్టర్ డాక్టర్ ఎస్ కె సింగ్ ఈ వర్చువల్ సమావేశంలో పాల్గొన్నారు.

 

****

 



(Release ID: 1634777) Visitor Counter : 187