శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

కోవిడ్‌-19 చికిత్స నిమిత్తం సీఎస్ఐఆర్‌-సీడీఆర్ఐ అభివృద్ధి చేస్తున్న‌ ఉమిఫెనోవిర్ ఔష‌ధం మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు డీసీజీఐ అనుమతి

- రికార్డు సమయంలో ఉమిఫెనోవిర్ కోసం ప్రాసెస్ టెక్నాలజీ అభివృద్ధి

Posted On: 18 JUN 2020 5:12PM by PIB Hyderabad

ల‌క్నో కేంద్రంగా ప‌ని చేస్తున్న సీఎస్ఐఆర్‌కు చెందిన సీఎస్ఐఆర్-సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీడీఆర్ఐ) కోవిడ్‌-19 చికి‌త్స నిమిత్తం అభివృద్ధి చేస్తున్న యాంటీవైరల్ ఔష‌ధం ఉమిఫెనోవిర్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌కు
సిద్ధ‌మైంది. సీఎస్ఐఆర్ - సీడీఆర్ఐ అభివృద్ధి చేస్తున్న ఔష‌ధం మూడవ దశ  రాండమైజ్డ్, డబుల్ బ్లైండ్, ప్లేసిబో నియంత్రిత ట్రయల్ ఆఫ్ ఎఫిషియసీ, భద్రత మరియు ఔష‌ధం ప‌నిచేసే కాలం గురించి ప‌రీక్ష‌లు నిర్వ‌హించేందుకు గాను డీసీజీఐ అనుమతి పొందింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (కేజీఎంయూ), డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఆర్ఎంఎల్ఐఎంఎస్‌) మరియు ల‌క్నోలోని ఈఆర్ఏస్ లక్నో మెడికల్ కాలేజ్ & హాస్పిటల్లో నిర్వ‌హించనున్నారు.
సామర్థ్య‌పు అంచనాకు ప‌రీక్ష‌లు..
ఈ ఔషధం మేటి భద్రతా ప్రొఫైల్‌ను కలిగి ఉంది. ఇది మానవ కణాలలోకి వైరస్ ప్రవేశించకుండా నిరోధించడం ద్వారా మరియు రోగనిరోధక వ్యవస్థను మ‌రింత వృద్ధి చేయ‌డానికి వీలుగా ఇది పనిచేస్తుంది. ఉమిఫెనోవిర్ ప్రధానంగా ఇన్‌ప్లూయాంజా చికిత్స కోసం ఉపయోగించబడుతుంది. ఇది చైనా మరియు రష్యాలో అందుబాటులో ఉంది. కోవిడ్-19 రోగులకు దాని సంభావ్య ఉపయోగం కారణంగా ఇటీవల ప్రాముఖ్యత సంతరించుకుంది. భారతీయ రోగులలో దాని సామర్థ్యాన్ని అంచనా వేయడానికి, సీఎస్ఐఆర్ - సీడీఆర్ఐ క్లినికల్ ట్రయల్‌ను చేపట్టింది. దీనికి తోడుగా రికార్డు సమయంలో ఉమిఫెనోవిర్ కోసం ప్రాసెస్ టెక్నాలజీ కూడా అభివృద్ధి చేసింది. గోవాకు చెందిన మెస్స‌ర్స్‌ మెడిజెస్ట్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ‌కు దీని వాణిజ్య తయారీ టెక్నాల‌జీ, త‌యారీ, మార్కెటింగ్ లైసెన్స్‌ జారీ చేసింది. ఈ సంస్థ ఇప్ప‌టికే డీసీజీఐ నుంచి ప‌రీక్ష లైసెన్స్‌ను కూడా పొందింది.
దేశీయ ముడి ప‌దార్థాల‌తో త‌యారీ..
ఈ ఔషధానికి సంబంధించిన అన్నిర‌కాల ముడి పదార్థాలు దేశీయంగా లభిస్తాయని, క్లినికల్ ట్రయల్ విజయవంతమైతే ఉమిఫెనోవిర్ ఔష‌ధం కోవిడ్  మ‌హ‌మ్మారికి  వ్యతిరేకంగా సురక్షితమైన, సమర్థవంతమైన, సరసమైన ఔషధంగా నిలువగ‌ల‌ద‌ని సీఎస్ఐఆర్-సీడీఆర్ఐ డైరెక్టర్ ప్రొఫెసర్ తపస్ కుందు తెలిపారు. ఈ ఔష‌ధం కోవిడ్‌-19కు వ్య‌తిరేకంగా దేశ వ్యాప్తంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మంలో ఇది ఒక భాగం కానుంద‌ని ఆయ‌న అన్నారు. ఈ ఔషధం మేటి రోగనిరోధక శ‌క్తి కోసం వాడ‌డానికి అవకాశం ఉందని వివ‌రించారు.
వీలైనంత త్వరగా అందుబాటులోకి..
కోవిడ్ - 19 కోసం ఔషధాలను తిరిగి తయారు చేసే సీఎస్ఐఆర్ వ్యూహంలో ఈ క్లినికల్ ట్రయల్ ఒక అంతర్భాగమని సీఎస్ఐఆర్ - సీడీఆర్ఐ డీజీ డాక్టర్ శేఖర్ మాండే ఉద్ఘాటించారు. సీఎస్ఐఆర్- సీడీఆర్ఐకు చెందిన నిలాంజనా మజుందార్, అజయ్ కుమార్ శ్రీవాస్తవ, చంద్ర భూషణ్ త్రిపాఠి మరియు నయన్ ఘోష్‌ల‌తో స‌హా స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా ఉన్న‌డాక్టర్ రవిశంకర్ రామచంద్రన్‌ల‌తో కూడిన శాస్త్రవేత్తల బృందాన్ని అభినందించారు. నోడల్ శాస్త్రవేత్త డాక్టర్ రవిశంకర్ రామచంద్రన్ ఈ ఔష‌ధ అబివృద్ధి‌ బృందానికి సమన్వయక‌ర్త‌గా వ్య‌వ‌హరి‌స్తున్నారు. ఈ ఔష‌ధ సూత్రీకరణ, డాక్యుమెంటేషన్ బృందంలో సీఎస్ఐఆర్-సీడీఆర్ఐకి చెందిన పి.ఎస్.ఆర్ మిశ్రా, వి. భోసలే, ఆర్.కె. త్రిపాఠి, ఎస్‌.శ‌ర్మలు పాలుపంచుకుంటున్నారు. కోవిడ్-19 వైర‌స్‌కు వ్యతిరేకంగా డీజీడీఐల‌ చొరవ ప్రకారం క్లినికల్ ట్రయల్స్ నిర్వ‌హ‌ణ‌ను అధిక ప్రాధాన్యతతో చేప‌డుతున్నారు. రోగుల‌కు ఔషధ లభ్యతను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి వీలుగా తదుపరి దశల ప‌నుల‌ను వేగంగా నిర్వ‌హిస్తున్నారు.

***

 


(Release ID: 1632400) Visitor Counter : 245