శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ఔషధ మరియు సుగంధ మొక్కల ఫొటోగ్రఫీ పోటీని ప్రకటించిన సీఐఎంఏపీ

- ‘మీ ఔషధ మరియు సుగంధ మొక్కలను (ఎంఏపీలు) తెలుసుకోండి’ అనే ఇతివృత్తంలో పోటీ నిర్వ‌హ‌ణ‌

- ఈ పోటీ ద్వారా వివిధ ఔషధ మొక్కల పరిరక్షణ సందేశాన్ని కూడా తెలియజేయాలనుకుంటున్న సీఐఎంఏపీ

Posted On: 14 JUN 2020 2:37PM by PIB Hyderabad

ఔషధ మరియు సుగంధ మొక్కలు ఎల్లప్పుడూ ప్రజల దృష్టిని ఆకర్షిస్తుంటాయి.  వాటిలో కొన్ని చాలా అందంగా ఉండ‌గా మ‌రి కొన్ని సాధారణంగా కనిపించేవిగా ఉంటాయి. మానవులు, జంతువుల ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం వాటి అంతర్గత విలువ కూడా ప‌లు సంవత్సరాలుగా బాగా స్థిరీక‌రించ‌బ‌డుతూ వ‌స్తూ ఉన్నాయి. అదే సమయంలో ఈ మొక్కల యొక్క ఉపయోగం మరియు వాటిలో ఔషధ విలువ గురించి మనలో చాలామందికి పూర్తిగా తెలియదు. ఈ మొక్కల ఉపయోగం గురించి అవగాహన కల్పించే ప్రయత్నంలో 'సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్' (సీఐఎంఏపీ) ఔషధ మరియు సుగంధ మొక్కలపై ఫొటోగ్రఫీ పోటీని ప్రకటించింది. ఈ పోటీ ద్వారా సీఐఎంఏపీ ఔషధ మొక్కల పరిరక్షణ సందేశాన్ని కూడా తెలియజేయాలని అకుంటుంది. ‘మీ ఔషధ మరియు సుగంధ మొక్కలను తెలుసుకోండి’ అనే ఇతివృత్తంతో ఈ పోటీ నిర్వ‌హించ‌నున్నారు. ఈ పోటీలో మొదటి, రెండో విజేతకు వ‌రుస‌గా రూ.5000, రూ.3000 మరియు మూడో విజేత‌కు బహుమతిగా రూ.2000 అందించ‌నున్నారు. దీనికి తోడుగా 10 ఎంట్రీల‌కు రూ.1000 చొప్పున క‌న్సోలేష‌న్ బ‌హుమ‌తులను అందించ‌నున్నారు.
స్వీయ-ప్రకటనతో దాఖ‌లు చేయాలి..
ఈ పోటీకి భారత్‌కు చెందిన ఔత్సాహిక మరియు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లందరూ అర్హులే. ప్రతి ఎంట్రీకి మూడు ఛాయాచిత్రాలను సమర్పించవచ్చు. స్వదేశీ మొక్కలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది మరియు చాలా సాధారణ ఉద్యానవన లేదా అలంకార మొక్కల చిత్రాలను ఈ పోటీలో ఎంట్రీగా పంపించ‌కూడ‌ద‌ని ఇన్‌స్టిట్యూట్ అభ్య‌ర్థించింది. ప్రతి ఛాయాచిత్రంలో సంబంధిత మొక్క యొక్క సరైన లాటిన్ నామ‌ము మరియు స్థానికంగా పిలి‌చే  పేరు మరియు దానిలోని ఔషధ మరియు సుగంధ విలువ‌ల ప్రాముఖ్యతను 20-30 పదాలలో వివ‌రించాల్సి ఉంటుంది.  అసలు డిజిటల్ చిత్రాలు మాత్రమే పోటీకి అంగీకరించబడతాయి. ఎంట్రీలు ఏ4 పేజీలో వివిధ రంగుల‌ ముద్రణలతో పాటు అన్‌మౌంట్ చేయబడతాయి. ఎంట్రీల‌కు పంపే ఫొటో కనీస రిజల్యూషన్ 300 డీపీఐతో డిజిటల్ ఇమేజ్ ఎంట్రీలు 3 ఎంబీ పరిమాణం కంటే తక్కువ ఉండకూడదు. చిత్రాలు జేపీఈజీ లేదా టిఫ్ ఆకృతిలో పోటీకి పంపాల్సి ఉంటుంది. ప్రదర్శన రిజల్యూషన్ 1086 x 768గా ఉండాలి మరియు పొడవైన వైపు 1086 కంటే ఎక్కువ ఉండకూడదు. అవార్డుల కోసం ప్రదర్శన‌కు ఎంపిక చేసిన ప‌క్షంలో ముడి ఇమేజ్ ఫైళ్ళను తరువాత తేదీలో దాఖ‌లు చేయ‌మ‌ని అడగవచ్చు. పోటీలో పాల్గొనేందుకు ఈ-మెయిల్ పంపిన వ్యక్తి తానే స్వ‌యంగా ఈ చిత్రాలను చిత్రీకరించినట్లు స్వీయ-ప్రకటనను దాఖ‌లు చేయాలి.
కాపీరైట్ ఫోటోగ్రాఫర్లదే..
గెలిచిన ఫొటోల‌ కాపీరైట్ ఫోటోగ్రాఫర్ల వ‌ద్దే ఉంటుంది. కానీ సీఐఎంఏపీ ఆయా ఎంట్రీలను ప్రదర్శించే హక్కును క‌లిగి ఉంటుంది. ఔషధ మరియు సుగంధపు మొక్కల ప్రమోషన్ కోసం వాటిని ప్రచార సామగ్రిలో ఉపయోగించుకునే హక్కును కూడా సంస్థ  క‌లిగి ఉంటుంది. ఈ పోటీల‌లో విజేతలను లక్నో సీఎస్ఐఆర్-సీఐఎంఏపీ సంస్థ డైరెక్ట‌ర్ నామినేట్ చేసిన న్యాయమూర్తులు ఎంపిక చేస్తారు. ఈ న్యాయమూర్తుల నిర్ణయ‌మే అంతిమంగా ఉంటుంది. సీఎస్ఐఆర్ - సీఐఎంఏపీ సంస్థ వార్షికోత్స‌వ‌పు రోజున ఈ పోటీ విజేతలను ప్రకటిస్తారు. ఈ పోటీకి డిజిటల్ చిత్రాలను pc@cimap.res.in అనే ఈ-మెయిల్‌కు పంపించాల్సి ఉంటుంది. ఎంట్రీలు సమర్పించడానికి చివరి తేదీ జూన్ 30, 2020. పోటీకి సంబంధించిన‌ మరిన్ని వివరాల కోసం www.cimap.res.in అనే వెబ్‌సైట్ సందర్శించవచ్చు.

***

 


(Release ID: 1631511) Visitor Counter : 342