శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
అతిసార వ్యాధికి కొత్త ఔషధం తయారీ ప్రక్రియలో ముందడుగు
"ఎంటమీబా హిస్టాలిటికా" ప్రొటోజోవాను అడ్డుకునే నిరోధకం తయారీ
"ఓ-ఎస్టైల్ ఎల్-సెరైన్ సల్ఫ్‌హైడ్రలేజ్"ను రూపొందించిన జేఎన్‌యూ బృందం
Posted On:
14 JUN 2020 2:34PM by PIB Hyderabad
పరాన్నజీవుల వల్ల మనుషుల్లో వచ్చే రోగాలు, మరణాలకు "ఎంటమీబా హిస్టాలిటికా" అనే ప్రొటోజోవాను మూడో పెద్ద కారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది. ఈ ప్రొటోజోవా మనుషుల్లో అతిసారవ్యాధి లేదా జిగట విరోచనాలను కలిగిస్తుంది. ఈ వ్యాధి, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ప్రొటోజోవా ఆట కట్టించే కొత్త నిరోధకాన్ని ఔషధాన్ని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) పరిశోధకులు కనిపెట్టారు.
"ఎంటమీబా హిస్టాలిటికా" వాయురహిత స్థితిలోనూ మనగలదు. ఆక్సిజన్ మోతాదు ఎక్కువైతే జీవించలేదు. ఇది మనిషి శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఎక్కువ మోతాదు ఆక్సిజన్‌ను ఎదుర్కొంటుంది. దీంతో తన రక్షణ కోసం అది పెద్దమొత్తంలో సిస్టీన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందుకోసం రెండు రకాల ఎంజైములను విడుదల చేస్తుంది. ఈ రెండు ఎంజైముల పరమాణు నిర్మాణాలను జేఎన్‌యూ శాస్త్రవేత్తలు వర్గీకరించారు.
వీటిలో ఒక ఎంజైమును నిరోధించేందుకు "ఓ-ఎస్టైల్ ఎల్-సెరైన్ సల్ఫ్‌హైడ్రలేజ్"ను రూపొందించినట్లు జేఎన్‌యూ పరిశోధకుల బృంద నాయకుడు ప్రొ.సముద్రాల గౌరీనాథ్ చెప్పారు. పరాన్నజీవి వృద్ధిని ఈ నిరోధకం సమర్థవంతంగా అడ్డుకుంటుందని వెల్లడించారు. ఎంటమీబా హిస్టాలిటికా వంటి ప్రొటోజోవాల మనుగడకు సిస్టీన్ ఉత్పత్తి చాలా కీలకమన్నారు. వాటిని నిరోధకాలతో సమర్థవంతంగా అడ్డుకోవచ్చని నిరూపించామని, ఔషధ తయారీని ఇది వేగవంతం చేస్తుందన్నారు.
దారావత్ సుధాకర్, రామచంద్రన్ విజయన్, కుష్బూ కుమారి, ప్రియా తోమర్ ఈ పరిశోధన బృందంలో ఉన్నారు. "యూనిరోపియన్ జర్నల్ ఆఫ్ మెడిసినల్ కెమిస్ట్రీ" పత్రికలో ఈ పరిశోధన ప్రచురితమైంది.
(Release ID: 1631510)
Visitor Counter : 300