సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో 'ఇంటి నుంచే పని విధానం' మార్గదర్శకాల్ని వేగవంతం చేయాలని డీఏఆర్‌పీజీని సూచించిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
10 JUN 2020 6:04PM by PIB Hyderabad
కేంద్ర సిబ్బంది, పీజీ మరియు పెన్షన్ల శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ 'పరిపాలనా సంస్కరణలు మరియు ప్రజా ఫిర్యాదుల శాఖ' (డీఏఆర్‌పీజీ) యొక్క కార్యకలాపాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఇంటి నుంచే పని విధానపు మార్గదర్శకాల్ని వేగవంతం చేయాలని సూచించారు. ఈ విషయమై సంబంధిత మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్‌లతో అవరసరమైన సంప్రదింపులను ప్రాధాన్యత ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆయన సూచించారు. సకాలంలో డబ్ల్యూఎఫ్‌హెచ్ మార్గదర్శకాలు జారీ చేయడం వల్ల ప్రధాన మంత్రి గారు సూచించిన 'రెండు గజాల దూరం', సామాజిక దూరం విధానాలకు కేంద్ర సచివాలయ ఉద్యోగులు కట్టుబడేలా చేసి తగు విధంగా ప్రయోజనాన్ని చేకూరుస్తోందని అన్నారు.
ఈశాన్య రాష్ట్రాలలో ఈ-ఆఫీస్ విధానంపై కార్యశాల..
దేశ ఈశాన్య రాష్ట్రాలలో డిజిటల్ స్టేట్ సెక్రటేరియట్లను అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ నెల 12 న ఈశాన్య రాష్ట్రాల వారితో ఈ-ఆఫీస్ విధానంపై కార్యశాలను ప్రసంగించనున్నారు. డాక్టర్ జితేంద్ర సింగ్ వర్క్‌షాప్‌కు సంబంధించి ఈ రోజు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం వెబ్‌నార్‌గా నిర్వహించనున్నారు. 75 కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలలో ఈ-ఆఫీస్ యొక్క పురోగతి డిజిటల్ సెంట్రల్ సెక్రటేరియట్ ఏర్పాటుకు దోహదపడింది. ఇది కోవిడ్-19 లాక్‌డౌన్ కాలంలో ఇంటి నుండే ఆఫీసు పనులు చక్కదిద్దేలా చేసింది. ఈశాన్య రాష్ట్రాల స్టేట్ సెక్రటేరియట్‌లలో ఈ-ఆఫీసును అమలు చేయడం వల్ల ఆయా కార్యాలయాలు కాగిత రహిత స్టేట్ సెక్రటేరియట్‌లుగా మారనున్నాయి. నిర్దిష్ట కాలపరిమితితో వీటిని రూపొందించనున్నారు. దీనికి తగ్గట్టుగా అధికారులకు వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్‌లు, డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్లు మరియు తక్కువ కాంటాక్ట్ గవర్నెన్స్ విధానాన్ని ప్రోత్సహించనున్నారు. ఈశాన్య రాష్ట్రాలలో ఈ-ఆఫీస్ అందుబాటులోకి తెచ్చే విషయమై జరిగే వర్క్‌షాప్‌లో అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, సిక్కింల ముఖ్యమంత్రులు, అస్సాం, మణిపూర్, మిజోరం, మేఘాలయ, త్రిపురాల ఐటీ శాఖ మంత్రులు పాల్గొననున్నారు. ఈ కార్యశాలలో పాల్గొనడానికి ఈశాన్య రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, అదనపు ప్రధాన కార్యదర్శులు మరియు పరిపాలనా సంస్కరణల విభాగపు ప్రధాన కార్యదర్శులు మరియు ఐటీ విభాగాల కార్యదర్శులను ఆహ్వానించారు.
11 భాషలలో ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్లు
కోవిడ్ -19కు సంబంధించి దాఖలైన దాదాపు లక్ష పీజీ కేసులను మార్చి 30, 2020 నుంచి జూన్ 9, 2020 వరకు పరిష్కరించినట్లు డీఏఆర్‌పీజీ తెలిపింది. ఆయా ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను నిర్ధారించడానికి డీఏఆర్‌పీజీ జూన్ 15, 2020 నుండి 11 భాషలలో ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్లను ప్రారంభించనుంది. అన్ని రాష్ట్రాలను కవర్ చేసే విధంగా బీఎస్ఎన్ఎల్ చేత వీటిని నిర్వహించనున్నారు. కోవిడ్ -19కు సంబంధించి నేషనల్ మానిటరింగ్ డాష్‌బోర్డ్‌లో దాదాపు నెలకు పైగా సమయంలో పరిష్కరించబడిన ప్రతి ప్రజా ఫిర్యాదు పరిష్కారాలపై ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్లు నాణ్యత తనిఖీని నిర్వహించనున్నాయి. జూన్ 15 న ఫీడ్ బ్యాక్ కాల్ సెంటర్ల ప్రారంభ సమయంలో మంత్రి డాక్టర్ జితేందర్ సింగ్ ఫిర్యాదుల పరిష్కార విషయంలో నాణ్యతను గురించి ప్రజల నుంచి పత్రక్ష్యంగా తెలుసుకొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాల పౌరులతో నేరుగా మాట్లాడనున్నారు. ఈ సన్నాహక సమావేశంలో డీఏఆర్‌పీజీ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ, డీఏఆర్‌పీజీ శాఖ అదనపు కార్యదర్శి వి.శ్రీనివాస్ డీఏఆర్‌పీజీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయ దుబే మరియు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి.కె.పూర్వర్ తదితరులు పాల్గొన్నారు.
***
(Release ID: 1630763)
Visitor Counter : 242