విద్యుత్తు మంత్రిత్వ శాఖ
5000 మంది కార్మికులు, నిరుపేదలకు ఆర్ఈసీ నిత్యవసర సరుకుల పంపిణీ
Posted On:
08 JUN 2020 3:53PM by PIB Hyderabad
విద్యుత్తు శాఖ పరిధిలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ, విద్యుత్తు సంస్థలకు ఆర్థిక సాయమందించే దేశంలోనే అతిపెద్ద సంస్థ 'గ్రామీణ విద్యుదీకరణ కార్పోరేషన్' (ఆర్ఈసీ) లిమిటెడ్ యొక్క కార్పొరేట్ సమాజిక బాధ్యతలను నిర్వహించే ఆర్ఈసీ పౌండేషన్ ప్రస్తుత కోవిడ్ -19 వ్యాప్తి సమయంలో కార్మికులు, పేదలకు బాసటగా నిలిచేందుకు ముందుకు వచ్చింది. కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ వేళ దాదాపు 5000 మంది నిరుపేదలకు, కార్మికులకు నిత్యవసర వస్తువులతో కూడిన ప్యాకెట్లను పంపిణీ చేసేందుకు సంస్థ కంకణం కట్టుకుంది. ఈ ప్యాకెట్లలో (మేటి వస్త్రంతో తయారు చేసిన ఈ సంచీలో) తాగునీరు బాటిల్, వేంచిన శెనగలు, వేరుశెనగలు, మిక్చర్, గ్లూకోజ్ పౌడర్, పాద రక్షలు మరియు తిరిగి ఉపయోగించుకొనేందుకు వీలుండే మాస్క్‌లను అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని బ్యాంకింగేతర విత్త సంస్థ అయిన ఆర్ఈసీ లిమిటెడ్ వివిధ సహకార యత్నాల ద్వారా కార్మికులు మరియు పేదలను పోషించే మిషన్‌ను చేపడుతోంది. ఈ కార్యక్రమంలో మొదటి విడతలో భాగంగా ఈ నెల 4వ తేదీన దాదాపు 500 మంది లబ్ధిదారులకు ఇలాంటి 500 ప్యాకెట్లను పంపిణీ చేశారు. రెండో విడత కార్యక్రమాన్ని ఈ నెల 7వ తేదీన గురుగావ్ మరియు నోయిడాలలో చేపట్టారు. ఇక్కడ దాదాపు 1,000కి పైగా ఇలాంటి నిత్యవసరాలతో కూడిన ప్యాకెట్లను సరఫరా చేశారు. మిగిలిన ప్యాకెట్లు రాబోయే రోజుల్లో పంపిణీ చేయనున్నారు. సామాజిక ప్రయోజనం కోసం స్వచ్ఛందంగా నిలబడిన కార్పొరేషన్ ఉద్యోగులు ఈ ప్యాకెట్లను పంపిణీ చేశారు.
పేదలకు వండిన భోజనం, రేషన్ పంపిణీ..
ఈ చర్యలకు అదనంగా ఆర్ఈసీ దేశ వ్యాప్తంగా వివిధ జిల్లాల అధికారులు, ఎన్జీఓలు మరియు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కామ్స్) సహకారంతో పేదలకు వండిన భోజనం మరియు అవసరమైన రేషన్‌ను అందిస్తోంది. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు గాను దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచి ఆర్ఈసీ ఈ తరహా చొరవను ప్రారంభించింది. ఈనెల 6 నాటికి కార్పొరేషన్ 4.66 లక్షల కిలోగ్రాముల ఆహార ధాన్యాలు, 2.56 లక్షల భోజన ప్యాకెట్లు, 9600 లీటర్ల శానిటైజర్లు, 3400 పీపీఈ కిట్లు మరియు 83,000 మాస్క్‌లను పంపిణీ చేసింది.
ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ యోధులకు భోజనం..
న్యూఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసిన మేటి పోషక విలువలతో కూడిన భోజన ప్యాకెట్లను పంపిణీ చేయడానికి తాజ్‌శాట్స్ (ఐహెచ్‌సీఎల్ మరియు సాట్స్ లిమిటెడ్ జాయింట్ వెంచర్ సంస్థ) తో ఆర్ఈసీ భాగస్వామ్యం కుదుర్చుకుంది. కోవిడ్-19పై పోరులో ముందుండి సేవలందిస్తున్న ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్ యోధులకు ప్రతిరోజూ 300 ఫుడ్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నారు. వారు చేస్తున్న విశేషమైన కృషికి కృతజ్ఞత చర్యగా వీటిని చేపడుతున్నారు. ఈ చర్యల్లో భాగంగా ఇప్పటి వరకు దాదాపు 18,000 మందికి పైగా భోజనాలు పంపిణీ చేయడమైనది.
(Release ID: 1630234)
Visitor Counter : 234