నీతి ఆయోగ్
లక్ష్య సమూహాలకు ప్రయోజనాలను నేరుగా విజయవంతంగా బదిలీ చేయడానికి కీలకం - బలమైన డిజిటల్ ఆర్ధిక మౌలిక సదుపాయాలు.
నిరుపేదలకు నగదు మద్దతు చెల్లింపులపై అంతర్జాతీయ వెబినార్ నిర్వహించిన - నీతీ ఆయోగ్ మరియు మైక్రో సేవ్ కన్సల్టింగ్ సంస్థలు
Posted On:
06 JUN 2020 9:27PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో దేశంలోని నిరుపేదలకు భారతదేశం విజయవంతంగా నగదు ప్రయోజనాలను చెల్లించిన విధానం గురించి చర్చించి, ఆ అనుభవాల నుండి పాఠాలను నేర్చుకుని, పంచుకునేందుకు నీతీ ఆయోగ్ మరియు మైక్రో సేవ్ కన్సల్టింగ్ సంస్థలు జూన్ 5వ తేదీన ఒక అంతర్జాతీయ వెబ్‌నార్‌ను నిర్వహించాయి.
ఈ వెబినార్ లో పాల్గొన్న నిపుణుల బృందంలో - నీతీ ఆయోగ్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అమితాబ్ కాంత్; భారతీయ స్టేట్ బ్యాంకు చైర్మన్ రజనీష్ కుమార్; సి.జి.ఏ.పి. ప్రపంచ బ్యాంకు, ముఖ్య కార్యనిర్వహణాధికారి గ్రేట బుల్; భారత జాతీయ చెల్లింపుల కార్పొరేషన్ (ఎన్.పి.సి.ఐ.) ముఖ్య కార్యనిర్వహణాధికారి దిలీప్ ఆస్బె; బిల్ మరియు మెలిండా గేట్స్ ఫౌండేషన్ (బి.ఎం.జి.ఎఫ్.), భారత దేశ డైరెక్టర్, హరి మీనన్ ఉన్నారు.
మైక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థ, గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గ్రాహం రైట్ సంధాన కర్తగా వ్యవహరించి చర్చను నిర్వహించారు.
లక్ష్య సమూహాలకు సకాలంలో ప్రత్యక్ష బదిలీలను విజయవంతంగా చేయడంలో, కోవిడ్ -19 మహమ్మారి కొనసాగుతున్న సమయంలో నిరుపేదలకు ఆర్థిక సహాయం అందించడంలో భారత డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాల పాత్ర గురించి నిపుణుల బృందం సవివరంగా చర్చించింది. గత ఐదేళ్ళలో స్థాపించిన బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాల కారణంగా ఇది సాధ్యమైంది, ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించడానికి అనువైన నమూనాగా ఇది నిలిచింది.
నీతీ ఆయోగ్ ముఖ్యకార్యనిర్వాహణాధికారి అమితాబ్ కాంత్ ఈసందర్భంగా మాట్లాడుతూ, వినియోగదారులందరినీ కేంద్రీకరించడానికీ, ప్రజలతో ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం ఏర్పరచుకోవడానికి, ప్రధాన మంత్రి జన ధన్ యోజన (పి.ఎమ్.జె.డి.వై.) ఎంతగానో ఉపయోగపడిందని, అన్నారు. ఎటువంటి ఖర్చు లేకుండా, ఎటువంటి నిల్వ లేకుండా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడానికి ఈ పధకం విజయవంతంగా పనిచేసింది. ఈ రోజు వరకు తెరిచిన 380 మిలియన్ల పి.ఎమ్.జె.డి.వై. బ్యాంకు ఖాతాలలో 53 శాతం ఖాతాలు మహిళల పేరుతో ఉండటం కూడా గమనార్హం.
భారతదేశంలోని ఆశావహ జిల్లాల్లో సాంకేతికత గొప్ప సహాయకారిగా ఉందనీ, ఏజెంట్లు లావాదేవీలు నిర్వహించడానికి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు మరియు మైక్రో ఏటీఎంలను ఉపయోగిస్తున్నారనీ ఆయన అన్నారు.
2020 ఏప్రిల్ నెలలో ఒక బిలియన్ యు.పి.ఐ లావాదేవీలు మరియు 403 మిలియన్ల ఏ.ఈ.పి.ఎస్. లావాదేవీలు నమోదయ్యాయని ఆయన చెప్పారు.
బి.ఎమ్.జి.ఎఫ్. కంట్రీ డైరెక్టర్ హరి మీనన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారతదేశం యొక్క బలమైన డిజిటల్ మౌలిక సదుపాయాల కల్పన కేవలం ఒక్క రాత్రిలో ఎంతో సులువుగా జరిగిన ప్రక్రియ కాదనీ, డిజిటల్ మౌలిక సదుపాయాలను నిర్మించడం, లక్ష్యంగా ఉన్న జి 2 పి బదిలీ కార్యక్రమాలు, పి.ఎఫ్.ఎం.ఎస్. అనుసంధానం మరియు డిజిటల్ చెల్లింపులను ప్రారంభించడంలో ఎన్.పి.సి.ఐ. పాత్ర వంటి పునాది నిర్మించడానికి నిరంతర ప్రక్రియ కొనసాగిందని పేర్కొన్నారు.
సి.జి.ఎ.పి. ప్రపంచ బ్యాంకు సి.ఇ.ఒ. గ్రెటా బుల్ మాట్లాడుతూ, డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రజా ప్రయోజనంగా నిర్మించాలనే ఉద్దేశపూర్వక రూపకల్పన ఎంపికను స్వీకరించాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం దాని విజయానికి కీలకమైందని అన్నారు. బలమైన డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలను నిర్మించడానికి మూడు కీలకమైన అంశాలను కూడా ఆమె ప్రస్తావించారు. అవి - డిజిటల్ గుర్తింపు, డిజిటల్ డేటా బేస్ మరియు డిజిటల్ చెల్లింపు.
భారత జనాభాలో 65 శాతం మందికి ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నందున, మహమ్మారి సమయంలో ఈ పౌరులకు ఆర్థిక సేవలను అందించడం 62,000 బ్యాంక్ మిత్ర ల యొక్క సమర్థవంతమైన పనితీరు ద్వారా సులభంగా విజయవంతమైందని ఎస్.బి.ఐ. చైర్మన్ రజనీష్ కుమార్ పేర్కొన్నారు.
ఎన్.పి.సి.ఐ యొక్క సి.ఈ.ఓ. దిలీప్ అస్బే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ "వన్ నేషన్ వన్ కార్డ్" వ్యవస్థను ప్రారంభించడం సరైన దిశలో ఒక అడుగు అనీ, ఆర్థిక అక్షరాస్యతపై దృష్టి సారించి, సైబర్ భద్రతను పెంపొందించే సమయంలో మనం కూడా ఆ మార్గంలో పయనించాలని పేర్కొన్నారు.
కోవిడ్ -19 సంక్షోభం నెలకొన్న పరిస్థితులలో దేశాలు, (అత్యవసర) నగదు మద్దతు బదిలీలు, క్యాష్-ఇన్ క్యాష్-అవుట్ (సి.ఐ.సి.ఓ.) ఏజెంట్లు మరియు చెల్లింపు మౌలిక సదుపాయాలు రెండింటినీ కవర్ చేయడం వంటి డిజిటల్ ఆర్థిక మౌలిక సదుపాయాలను ఎలా నిర్మించి, వినియోగించుకోవచ్చో నిపుణుల బృందం చర్చించింది.
ఆహ్వానితులు మరియు ఆన్‌లైన్ ద్వారా ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల బృందం సమాధానాలు ఇవ్వడంతో వెబినార్ ముగిసింది.
వెబ్‌నార్ యొక్క రికార్డింగు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది :
https://www.youtube.com/watch?v=Diim1KSOzUw&feature=youtu.be
****
(Release ID: 1629993)
Visitor Counter : 276