రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
అమృత్‌సర్‌కు గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే డిమాండ్‌నకు సమ్మతి తెలిపిన మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
02 JUN 2020 3:52PM by PIB Hyderabad
ఢిల్లీ-అమృత్‌సర్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నాకోదర్ నుండి సుల్తాన్‌పూర్ లోధి, గోయింద్వాల్ సాహిబ్, ఖాదూర్ సాహిబ్ మీదుగా అమృత్‌సర్ నగరం వరకు కొత్త గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఈల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ప్రకటించారు. అమృత్‌సర్ నుండి గురుదాస్‌పూర్ వెళ్లే రహదారిని కూడా పూర్తిగా అభివృద్ధి చేసి సంపూర్ణ సిగ్నల్ రహిత రహదారిగా తీర్చిదిద్దుతామని తెలిపారు. దీంతో, ట్రాఫిక్ నాకోదర్ నుండి గురుదాస్‌పూర్ వరకు.. అంటే అమృత్‌సర్ ద్వారా లేదా కర్తార్పూర్ మీదుగా ప్రయాణించేందుకు కూడా అవకాశం లభించనుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ ఏర్పాటు అమృత్‌సర్ నగరానికి మాత్రమే కాకుండా సుల్తాన్ పూర్ లోధి, గోయింద్వాల్ సాహిబ్, ఖాదూర్ సాహిబ్‌తో పాటు పంజాబ్‌లో ఇటీవల అభివృద్ధి చేసిన డేరా బాబా నానక్ / కర్తార్‌పూర్ సాహిబ్ ఇంటర్నేషనల్ కారిడార్‌కు కూడా తక్కువ దూరంతో కనెక్టివిటీతో పాటుగా ప్రత్యామ్నాయ ఎక్స్‌ప్రెస్ కనెక్టివిటీనీ అందించనుంది.
సగానికి తగ్గనున్న ప్రయాణ వేగం..
ఈ ఎక్స్‌ప్రెస్‌వేతో అమృత్‌సర్ నుంచి ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణ సమయం ప్రస్తుతం ఉన్న 8 గంటల నుంచి నాలుగు గంటలకు తగ్గుతుందని శ్రీ గడ్కరీ తెలియజేశారు. ఇది పంజాబ్ ప్రజల దీర్ఘకాల డిమాండ్లలో ఒకటని.. తాజా నిర్ణయంతో ఈ దీర్ఘాకలిక డిమాండ్ నెరవేరనుందని మంత్రి తెలిపారు. ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశ సుమారు 25 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో కూడుకొని ఉంటుందని అన్నారు. భారత్‌మాల పరియోజనలో భాగంగా ప్రభుత్వం ఢిల్లీ -అమృత్‌సర్ -కత్రా రహదారిని ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేపట్టింది. ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటు ప్రక్రియను తొలత 2019 జనవరిలో చేపట్టారు, తాజాగా ఈ ప్రాజెక్టులో భాగంగా భూసేకరణ ప్రక్రియ ప్రారంభించబడింది. అమృత్‌సర్‌కు ఎక్స్‌ప్రెస్‌వే ఏర్పాటు అంశాన్ని ఇటీవల కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీమతి హర్సిమ్రత్ కౌర్ బాదల్, పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పురిలు కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ రోడ్డు సమస్యను రాజ్యసభ ఎంపీ శ్రీ శ్వైత్ మాలిక్, లోక్‌సభ ఎంపీ శ్రీ గుర్జిత్ సింగ్ ఆజ్లా, పంజాబ్ ప్రభుత్వంతో పాటు వివిధ సిక్కు సంస్థలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాయి.
గడ్కరీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ సమావేశం..
ఢిల్లీ- కత్రా ఎక్స్‌ప్రెస్‌వేను తొలత జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం గమనార్హం. ప్రతి సంవత్సరం 40 లక్షల మంది పర్యాటకులు సందర్శించే నగరం యొక్క మత పరమైన ప్రాముఖ్యత ప్రాతిపదికనా ఈ ఎక్స్‌ప్రెస్‌వే అమృత్‌సర్ గుండా వెళ్లేలా ప్రతిపాదించినట్టు మంత్రి గడ్కరీ తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ- అమృత్‌సర్- కత్రా ఎక్స్‌ప్రెస్‌వేను భారత్‌మాలలో భాగంగా చేపట్టినట్టుగా ఆయన వివరించారు. అమృత్‌సర్ వరకు ఎక్స్‌ప్రెస్‌వే అలైన్‌మెంట్ విస్తరణ సమస్యపై చర్చించి పరిష్కరించేందుకు, ఈ రోజు శ్రీ నితిన్ గడ్కరీ అధ్యక్షతన వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) సమావేశం జరిగింది, ఇందులో పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరేంద్ర సింగ్, కేంద్ర ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి శ్రీమతి శ్రీ. హర్సిమ్రత్ కౌర్ బాదల్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ హర్దీప్ సింగ్ పురి, ఈశాన్య ప్రాంత అభివృద్ధిశాఖ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) డాక్టర్ జితేందర్ సింగ్, ఆర్‌టీ అండ్ హెచ్ సహాయ మంత్రి జనరల్ వి.కె. సింగ్, రాజ్యసభ సభ్యుడు శ్రీ శ్వైత్ మాలిక్, లోక్‌సభ ఎంపీ శ్రీ గుర్జిత్ సింగ్ ఆజ్లా, పంజాబ్ ప్రభుత్వపు మాజీ క్యాబినెట్ మంత్రి అనిల్ జోషి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ కార్యదర్శి, ఎన్‌హెచ్ఏఐ ఛైర్మెన్‌తో పాటు ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పంజాబ్ ప్రభుత్వం సహకరించాలి..
అమృత్‌సర్ నగరం ఎప్పుడూ ఢిల్లీ- అమృత్‌సర్ - కత్రా ఎక్స్‌ప్రెస్‌వేలో అంతర్భాగమని మంత్రి పునరుద్ఘాటించారు. గ్రీన్ ఫీల్డ్ మరియు బ్రౌన్ఫీల్డ్ అలైన్‌మెంట్ కలయికగా ఈ ఎక్స్‌ప్రెస్‌వేను రెండు దశల్లో ప్రతిపాదించడమైంది. ప్రతిపాదిత ఎక్స్‌ప్రెస్‌వే కోసం పంజాబ్ రాష్ట్రంలో భూసేకరణను వేగవంతం చేయడానికి వీలుగా ఎన్‌హెచ్‌ఏఐకు తగిన సహాయం అందించాలని శ్రీ గడ్కరీ పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాన్నిఅభ్యర్థించారు.
ఫొటో రైటప్ః
1. అమృత్‌సర్ నగరానికి కొత్త గ్రీన్‌ఫీల్డ్ కనెక్టివిటీని అభివృద్ధి చేస్తున్నట్లుగా మంగళవారం ప్రకటింస్తున్న కేంద్ర రోడ్డు రవాణా, రహదారులు, ఎంఎస్‌ఎంఈ శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ
2. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వేలో భాగంగా నూతన అమరిక నిమిత్తం మంగళవారం న్యూఢిల్లీలో మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన వీసీ సమావేశం
3. అమృత్‌సర్ నగరానికి కొత్త గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వ్యవస్థ అభివృద్ధి చేసినందుకు ఈ రోజు న్యూఢిల్లీలో జరిగిన వీసీ సమావేశపు వీడియో గ్రాబ్
(Release ID: 1628832)
Visitor Counter : 241