శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

నూతన "సైన్స్, టెక్నాలజీ, ఇన్నోవేషన్ పాలసీ" కోసం సంప్రదింపుల ప్రక్రియ ప్రారంభం

నాలుగు ట్రాక్‌లుగా ఆరు నెలలపాటు సాగనున్న సంప్రదింపుల ప్రక్రియ
స్వావలంబ భారత్‌ నిర్మాణంతోపాటు కొవిడ్‌-19 పాఠాలు కూడా కలిగివుండేలా పాలసీ
అత్యంత కీలకమైన కొవిడ్‌ సమయంలో రానున్న ఐదో 'శాస్త్ర, సాంకేతిక విధానం'

Posted On: 02 JUN 2020 3:39PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు కార్యాలయం (ఆఫీస్‌ ఆఫ్‌ పీఎస్‌ఏ), శాస్త్ర, సాంకేతిక విభాగం (డీఎస్‌టీ) కలిసి, సరికొత్త "శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణల విధానాన్ని" (ఎస్‌టీఐపీ‌-2020) రూపొందించే పనిలో పడ్డాయి. పాలసీ రూపకల్పన కోసం వికేంద్రీకృత, క్షేత్రస్థాయి, సమగ్ర ప్రక్రియను సంయుక్తంగా ప్రారంభించాయి.

    కొవిడ్‌పై భారత్‌ సహా ప్రపంచమంతా పోరాడుతున్న ఈ కీలక సమయంలో ఐదో 'శాస్త్ర, సాంకేతిక విధానం' రూపొందుతోంది.
శాస్త్ర, సాంకేతిక, ఆవిష్కరణలకు (ఎస్‌టీఐ) సంబంధించి కొత్త రూపాన్ని, వ్యూహాన్ని తీసుకురావడాన్ని తప్పనిసరి చేసిన, గత పదేళ్లలో వచ్చిన మార్పుల్లో కొవిడ్‌ సంక్షోభం తాజాది. కొవిడ్‌ సంక్షోభం ప్రపంచాన్ని మారుస్తున్న నేపథ్యంలో, వికేంద్రీకరణ పద్ధతిలో వస్తున్న కొత్త పాలసీ... ప్రాధాన్యతలు, రంగాలవారీ దృష్టి, పరిశోధనలు సాగిన తీరు, దీర్ఘకాలిక సామాజిక-ఆర్థిక సంక్షేమం కోసం సాంకేతికల అభివృద్ధి, అమలు వంటి అంశాల్లో ఎస్‌టీఐ దృక్పథాన్ని మారుస్తుంది.

    నాలుగు అనుసంధానిత ట్రాక్‌లుగా పాలసీ ప్రక్రియను చేపడతారు. 'సైన్స్ పాలసీ ఫోరం' ద్వారా ప్రజలు, నిపుణుల నుంచి విస్త్తృత సంప్రదింపులను ట్రాక్‌-1 లో చేపడతారు. పాలసీ ముసాయిదా తయారీలో, ఆ తర్వాత కూడా ప్రజలు, నిపుణుల బృందాల నుంచి సమాచారాన్ని సేకరించడానికి ఇది ఒక వేదికలా ఉంటుంది. ముసాయిదా తయారీకి సాక్ష్య సహిత సమాచార సిఫారసులు అందించేలా... నిపుణుల సంప్రదింపులను ట్రాక్‌-2 కలిగి ఉంటుంది. ఇందుకోసం 21 నిపుణుల బృందాలను సిద్ధంగా ఉంచారు. ట్రాక్‌-3లో కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు ఉంటాయి. ట్రాక్-4లో అత్యున్నత స్థాయి బహుళ వాటాదారులతో సంప్రదింపులు జరుపుతారు. ట్రాక్‌-3లో భాగంగా రాష్ట్రాల మధ్య, వివిధ విభాగాల మధ్య సంప్రదింపులు జరపడానికి.. రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఏజెన్సీలలో నోడల్‌ అధికారులను నియమిస్తారు. ట్రాక్‌-4లో సంస్థాగత నాయకత్వం, పారిశ్రామిక విభాగాలు, అంతర్జాతీయ భాగస్వాములతో సంప్రదింపులు జరుపుతారు. రాష్ట్రాల మధ్య, మంత్రిత్వ శాఖల మధ్య కూడా ట్రాక్‌-4 ద్వారా అత్యున్నత స్థాయి సంప్రదింపులు జరుగుతాయి.
 
    ఈ నాలుగు ట్రాక్‌ల ద్వారా సంప్రదింపుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమై, ఏకకాలంలో నడుస్తోంది. ట్రాక్‌-2 నేపథ్య బృందాల సంప్రదింపుల ప్రక్రియ.. సమాచార సమావేశాల పరంపర రూపంలో గతవారం ప్రారంభమైంది. "డీఎస్‌టీ పాలసీ కోఆర్డినేషన్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ మానిటరింగ్‌ డివిజన్‌" అధిపతి డా.అఖిలేష్‌ గుప్తా ఈ సమాచార సమావేశాల్లో పాల్గొని అనేక ప్రజెంటేషన్లు ఇచ్చారు. చర్చను ముందుకు నడిపించారు. 21 నేపథ్య బృందాలు, 25 మంది విధాన పరిశోధన సభ్యులు, డీఎస్‌టీ, ఆఫీస్‌ ఆఫ్‌ పీఎస్‌ఏ శాస్త్రవేత్తలు సహా మొత్తం 130 మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. 
 
    "నూతన భారతదేశం కోసం రూపొందించే ఎస్‌టీఐ పాలసీ స్వావలంబ భారత్‌ నిర్మాణంతోపాటు కొవిడ్‌-19 పాఠాలను కూడా కలిగి ఉంటుంది. పరిశోధన&అభివృద్ధి, డిజైన్‌, శాస్త్ర&సాంకేతిక పనితనం, సంస్థలు, భారీ మార్కెట్లు, వైవిధ్యం, సమాచార అంశాల్లో బలాన్ని పెంచుతుంది" అని డీఎస్‌టీ కార్యదర్శి ప్రొ.అషుతోశ్‌ శర్మ చెప్పారు.
 
    ఆరు నెలల ప్రక్రియలో.. విద్యాసంస్థలు, పారిశ్రామిక వర్గాలు, ప్రభుత్వాలు, అంతర్జాతీయ భాగస్వాములు, యువ శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, పౌర సంస్థలు, సాధారణ ప్రజలతోసహా దేశ శాస్త్రీయ పర్యావరణ వ్యవస్థ లోపల, బయట ఉన్న వాటాదారులందరితో విస్త్రత సంప్రదింపులు ఉంటాయి.

    డీఎస్‌టీ-ఎస్ఐటీ విధాన సభ్యులతో కూడిన, విధాన పరిజ్ఞానం, సమాచార మద్దతు ఉండే సెక్రటేరియట్‌ను దిల్లీలోని టెక్నాలజీ భవన్‌లో ఏర్పాటు చేస్తారు. నాలుగు ట్రాక్‌ల మధ్య పూర్తి ప్రక్రియను, పనితీరును ఈ సెక్రటేరియట్‌ సమన్వయం చేస్తుంది.



(Release ID: 1628826) Visitor Counter : 301