జల శక్తి మంత్రిత్వ శాఖ
'జల జీవన్ మిషన్' (ఇంటింటికీ నీరు) కార్యక్రమం కింద ఒడిశాకు రూ. 812 కోట్లు ఆమోదం
Posted On:
01 JUN 2020 5:53PM by PIB Hyderabad
'జల జీవన్ మిషన్' కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబానికి కుళాయి కనెక్షన్ కల్పించడం ద్వారా క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన మంచి నీరు సరఫరా చేయడానికి భారత ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. సహకార సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కార్యక్రమ లక్ష్యాలను సాధించడానికి రాష్ట్రప్రభుత్వాలు కూడా తమ వంతు కృషి చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటి ముంగిట్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసి 'జీవన సౌలభ్యం' కల్పించాలని నిశ్చయంతో ఉన్నారు. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంత వాసుల జీవనంలో అనూహ్య మార్పులు తేనున్నది. క్రమం తప్పకుండా, దీర్ఘకాలిక ప్రాతిపదికన రోజుకు తలసరి 56 లీటర్ల మంచి నీరు సరఫరా చేయాలని సంకల్పం.
ఈ కార్యక్రమానికి రూ 3.60 లక్షల కోట్లు కేటాయించాలని అంచనా. దానిలో కేంద్ర ప్రభుత్వం రూ. 2.08 లక్షల కోట్లు, రాష్ట్రం రూ. 1.52 లక్షల కోట్లు కేటాయిస్తుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించి 2020-21 కార్యాచరణ ప్రణాళికను పరిశీలించి ఆమోదించవలసిందిగా ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర జలశక్తి శాఖలో తాగు నీరు మరియు పారిశుద్ధ్య విభాగం కార్యదర్శికి సమర్పించింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో ఈ కార్యక్రమం అమలు కోసం భారత ప్రభుత్వం రూ. 812 కోట్లు ఆమోదించింది. ఇది గత సంవత్సరం కేటాయింపు రూ. 297 కోట్లతో పోలిస్తే చాలా పెద్ద మొత్తం. రాష్ట్రంలో మొత్తం 81 లక్షల గ్రామీణ కుటంబాలు ఉండగా 2020-21 సంవత్సరంలో 16.21 లక్షల కుటుంబాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వాలని ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. 2024. నాటికి అన్ని ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నది వారి ప్రణాళిక. నీటి కొరత ఉన్న ప్రాంతాలు, నీటి నాణ్యతలేని ప్రాంతాలు, సంసద్ ఆదర్శ గ్రామ యోజన గ్రామాలు, అభివృద్ధి కాంక్ష ఉన్న జిల్లాలకు చెందిన గ్రామాలు మరియు ఎస్సీ /ఎస్టీలు ఎక్కువగా ఉన్న ఆవాసాలలోని గ్రామాలన్నింటిలో కుళాయి కనెక్షన్లు ఇవ్వడానికి ప్రాధాన్యం ఇస్తారు.
ఇదివరకు పైపులను వేసి ఉన్న గ్రామాల్లో పనులు కొనసాగించడానికి ప్రాధాన్యం ఇస్తారు. గ్రామీణ కార్యాచరణ అమలు కోసం దిశా నిర్దేశం చేశారు. మంచి నీటి వసతిని పరిపుష్టం చేయడానికి వివిధ రకాల ప్రభుత్వ కార్యక్రమాలను సమీకృతం చేస్తారు. పదిహేనవ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ల కింద ఒడిశాకు 2020-21లో రూ. 2,258 కోట్లు కేటాయించారు. దానిలో సగం నిధులను నీరు మరియు పారిశుద్ధ్యానికి ఖర్చు చేయడం తప్పనిసరి.
ఈ కార్యక్రమం అమలు కోసం వివిధ స్థాయిలలో సంస్థాగత ఏర్పాట్లు జరిగాయి. ఆయా గ్రామాలలో పనుల నిర్వహణ, ప్రణాళికలో సామాజిక బృందాలను కలుపుకుంటారు. స్వయం సహాయక బృందాలను, స్వచ్ఛంద సంస్థలను దీనిలో ప్రభుత్వం దీనిలో భాగస్వాములను చేస్తుంది.
నీటి నాణ్యత పరిశీలనను గమనించడానికి స్థానిక పౌర సమాజం ప్రాతినిధ్యాన్ని జల జీవన్ మిషన్ ప్రోత్సహిస్తుంది. ఇందుకోసం ప్రతి గ్రామంలో కనీసం అయిదుగురు మహిళలను గుర్తించి వారికి నీటి నాణ్యత పరీక్షించడంలో శిక్షణ ఇస్తారు. అందుకు అవసరమైన కిట్లు సమకూరుస్తారు. నీటి నాణ్యత పరీక్షల కోసం ప్రస్తుతం ఒడిశాలో ఒక రాష్ట్ర స్థాయి ప్రయోగ శాల మరియు 32 జిల్లా స్థాయి ప్రయోగ శాలలు ఉన్నాయి.
ఒడిశాలో కొన్ని ప్రాంతాలు తీవ్రమైన నీటి కొరతతో అల్లాడుతుండగా, మరికొన్ని ప్రాంతాలు జలమయమై ఉంటాయి. ప్రస్తుతం కోవిడ్ -19 మహమ్మారి వల్ల జనం సతమతమవుతున్న తరుణంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటించి నీరు తెచ్చు కోవడం అవసరం. ఇప్పుడు చాలా మంది వలస కూలీలు తమ స్వరాష్ట్రాలకు తిరిగి వస్తున్నందున వారికి జీవనోపాధి కల్పించవలసిన ఆవశ్యకత ఉంది. జల జీవన్ మిషన్ పనులను వారితో చేయించడం వల్ల వారికి జీవనోపాధి కలుగుతుంది. తద్వారా ప్రతి గ్రామంలో మంచి నీటి సరఫరా పనులు సత్వరం పూర్తవుతాయి. ప్రతి గ్రామీణ కుటుంబానికి తాగు నీటి సౌకర్యం కల్పించాలనే జల జీవన్ మిషన్ లక్ష్యం నెరవేరుతుంది.
(Release ID: 1628461)
Visitor Counter : 266