ప్రధాన మంత్రి కార్యాలయం
'మన్ కి బాత్'
Posted On:
31 MAY 2020 11:43AM by PIB Hyderabad
నా ప్రియమైన దేశ ప్రజలారా.. నమస్కారం. . కరోనా ప్రభావం ఉన్నప్పటికీ మన 'మన్ కీ బాత్' ప్రజలకు దూరం కాలేదు. నేను చివరి సారి మీతో మాట్లాడినప్పుడు- గత 'మన్ కీ బాత్' సమయంలో ప్యాసింజర్ రైళ్లు, బస్సులు, విమానాలు నడవలేదు. ఈసారి చాలా వరకు నడుస్తున్నాయి. కార్మికుల కోసం ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. ఇతర ప్రత్యేక రైళ్లు కూడా ప్రారంభమయ్యాయి. అన్ని ముందు జాగ్రత్తలతో విమానాలు కూడా ప్రారంభమయ్యాయి. నెమ్మదిగా పరిశ్రమలు కూడా నడపడం ప్రారంభమైంది. అంటే ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలో ఎక్కువ భాగం పునఃప్రారంభం అయింది. ఇటువంటి పరిస్థితిలో మనం మరింత అప్రమత్తంగా ఉండాలి. రెండు గజాల దూరం నియమం కానివ్వండి. ముఖానికి మాస్క్ ధరించే విషయం కానివ్వండి. వీలైనంతవరకు ఇంట్లో ఉండడం కానివ్వండి. ఈ నియమాలన్నీ పాటించండి. వీటిలో ఏమాత్రం వెసులుబాటు ఉండకూడదు.
ప్రతి ఒక్కరి సమిష్టి కృషి కారణంగా దేశంలో కరోనాపై పోరాటం చాలా ప్రభావవంతంగా జరుగుతోంది. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలను చూస్తే, భారతీయుల కృషి నిజంగా ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది. మన జనాభా చాలా దేశాల కంటే చాలా రెట్లు ఎక్కువ. మన దేశంలో వివిధ రకాల సవాళ్లు కూడా వైవిధ్యమైనవి. అయినప్పటికీ ప్రపంచంలోని ఇతర దేశాలలో వ్యాపించినంత వేగంగా కరోనా మన దేశంలో వ్యాపించలేదు. కరోనా మరణాల రేటు కూడా మన దేశంలో చాలా తక్కువ. జరిగిన నష్టానికి మనమందరం బాధపడుతున్నాం. కానీ మనం పొందిన రక్షణ ఖచ్చితంగా దేశ సామూహిక సంకల్ప శక్తి ఫలితమే. ఇంత పెద్ద దేశంలో, ప్రతి పౌరుడూ ఈ యుద్ధంలో పోరాడటానికి నిశ్చయించుకున్నాడు. ఈ మొత్తం యుద్ధం ప్రజలు నడిపించేదే.
మిత్రులారా! దేశవాసుల సంకల్ప శక్తితో పాటు ఈ పోరాటంలో మన గొప్ప బలం దేశవాసుల సేవా భావం. వాస్తవానికి సేవ, త్యాగం మన ఆలోచనల ఫలితం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానమని భారతీయులమైన మనం ఈ మహమ్మారి పై పోరాట సమయంలో చూపించాం. సేవా పరమో ధర్మః . సేవ చేయడం విశిష్టమైన ధర్మమని మనం చూపించాం.
సేవలోనే సుఖం, ఆనందం ఉంటాయి.
ఇతరులకు సేవ చేస్తున్న వ్యక్తి జీవితంలో డిప్రెషన్ లేదా ఉద్రేకం ఎప్పుడూ కనిపించవని మీరు గమనించి ఉంటారు. అతని జీవితంలో జీవితంపై అతని దృక్పథంలో ఆత్మ విశ్వాసం, సానుకూల వైఖరి ప్రతి క్షణమూ కనబడుతూ ఉంటాయి.
మిత్రులారా! మన వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుద్ధ్యం కార్మికులు, పోలీసులు, మీడియా సిబ్బంది చేస్తున్న సేవ గురించి నేను చాలాసార్లు చర్చించాను. మన్ కి బాత్ లో కూడా ప్రస్తావించాను. సేవ కోసం జీవితంలో ప్రతి విషయాన్నీ త్యాగం చేసిన వ్యక్తులు అసంఖ్యాకంగా ఉన్నారు.
అలాంటి వారిలో తమిళనాడుకు చెందిన సి. మోహన్ కూడా ఒకరు. సి. మోహన్ గారు మదురైలో సెలూన్ నడుపుతున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బుతో అతను తన కుమార్తె చదువు కోసం ఐదు లక్షల రూపాయలు పొదుపు చేశారు. కాని ఆయన ఈ మొత్తాన్ని నిరుపేదల కోసం ఖర్చు చేశారు.
అదేవిధంగా అగర్తలాలో, ట్రాలీ నడిపి జీవనం సాగించే గౌతమ్ దాస్ గారు ప్రతిరోజూ తన కష్టార్జితం నుండి ఆదా చేసే డబ్బుతో పప్పులు, బియ్యం కొని అవసరమైనవారికి ఆహారం ఇస్తున్నారు.
పంజాబ్‌లోని పఠాన్‌కోట్ నుండి కూడా ఇలాంటి ఒక ఉదాహరణ నాకు దొరికింది. అక్కడ దివ్యాంగుడైన రాజు ఇతరుల సహాయంతో సమకూరిన చిన్నపాటి మొత్తంతో మూడు వేలకు పైగా మాస్కులు తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ క్లిష్ట సమయంలో అతను సుమారు 100 కుటుంబాలకు సరిపోయే ఆహార పదార్థాలను కూడా సేకరించి, ప్రజలకు అందజేశారు.
మహిళా స్వయం సహాయక బృందాల కృషి కి సంబంధించిన వివరాలు కూడా దేశంలోని అన్ని ప్రాంతాల నుండి వస్తున్నాయి. గ్రామాల్లో, చిన్న పట్టణాల్లో మన సోదరీమణులు, ఆడబిడ్డలు ప్రతిరోజూ వేలాది మాస్కులు తయారు చేస్తున్నారు. ఈ పనిలో అన్ని సామాజిక సంస్థలు వారికి సహకరిస్తున్నాయి.
మిత్రులారా! ప్రతిరోజూ ఇలాంటి ఉదాహరణలు ఎన్నో కనబడుతున్నాయి. మరెన్నో ఉదాహరణలను వింటున్నాం. నమో యాప్ ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా వారి కృషి గురించి ఎంతో మంది స్వయంగా నాకు తెలియజేస్తున్నారు.
చాలా సార్లు సమయం లేకపోవడం వల్ల నేను వివిధ వ్యక్తులను, సంఘాలను, సంస్థలను పేరుపేరునా ఉదహరించలేను. సేవాభావంతో ప్రజలకు సహాయం చేస్తున్నఇలాంటి వారందరినీ నేను ప్రశంసిస్తున్నాను. వారందరినీ సగౌరవంగా, హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఇంకొక విషయం నా మనసును తట్టింది. ఆ విషయం ఈ సంక్షోభ సమయంలో నవీన ఆవిష్కరణలు. గ్రామాల నుండి నగరాల వరకు, చిన్న వ్యాపారుల నుండి స్టార్టప్ సంస్థల యజమానుల వరకు దేశవాసులందరూ కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో కొత్త మార్గాలను కనిపెడుతున్నారు.
నాసిక్ కు చెందిన రాజేంద్ర యాదవ్ ఉదాహరణ చాలా ఆసక్తికరంగా ఉంది. రాజేంద్ర గారు నాసిక్ లోని సత్నా గ్రామానికి చెందిన రైతు. తన గ్రామాన్ని కరోనా సంక్రమణ నుండి కాపాడటానికి అతను తన ట్రాక్టర్‌కు అనుసంధానించడం ద్వారా శానిటైజేషన్ మెషీన్‌ను రూపొందించారు. ఈ వినూత్న యంత్రం చాలా ప్రభావవంతంగా పనిచేస్తోంది.
అదేవిధంగా నేను సోషల్ మీడియాలో చాలా చిత్రాలను చూస్తున్నాను. చాలా మంది దుకాణదారులు రెండు గజాల దూరం వరకు దుకాణంలో ఒక పెద్ద పైప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. దీనిలో ఒక చివర నుండి వారు వస్తువులను పైభాగంలో ఉంచుతున్నారు. మరొక చివర నుండి వినియోగదారులు తమ వస్తువులను తీసుకుంటారు.
ఈ సమయంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి విద్యారంగంలో విభిన్న ఆవిష్కరణలు చేశారు. ఆన్‌లైన్ తరగతులు, వీడియో క్లాసులు కూడా వివిధ రకాలుగా కొత్త పంథాను ఆవిష్కరిస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్‌పై మన ప్రయోగశాలల్లో జరుగుతున్న కృషిపై ప్రపంచం మొత్తం దృష్టి నిలిపింది. మనందరికీ కూడా ఈ కృషిపై ఎన్నో ఆశలున్నాయి.
ఏదైనా పరిస్థితిలో మార్పు తేవడానికి సంకల్పం మాత్రమే కాకుండా ఆవిష్కరణలు కూడా అవసరం. వేలాది సంవత్సరాల మానవజాతి ప్రయాణం ఆవిష్కరణల ఫలితంగానే ఇంత ఆధునిక స్థాయికి చేరుకుంది. అందువల్ల ఈ మహమ్మారిపై మన ప్రత్యేక ఆవిష్కరణలు కూడా కరోనాపై విజయానికి ఆధారాలుగా నిలుస్తాయి.
మిత్రులారా! కరోనాపై మనం చేసే ఈ పోరాటం సుదీర్ఘమైంది. ప్రపంచమంతా నివారణ లేని వ్యాధి ఇది. పైగా దీనిపై మనకు పూర్వ అనుభవం కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం కొత్త సవాళ్లను, వాటి నుండి అనేక సమస్యలను ఎదుర్కొంటున్నాము. ప్రపంచంలోని ప్రతి కరోనా ప్రభావిత దేశంలోనూ ఇది జరుగుతోంది. అందువల్ల భారతదేశానికి కూడా దీని నుండి మినహాయింపు లేదు. మన దేశంలో ఈ సంక్షోభం వల్ల కష్టాలు పడని, ఇబ్బందులకు గురికాని వర్గం లేదు. ఈ సంక్షోభం ప్రభావం పేదలు, కూలీలు, కార్మికవర్గంపై ఎక్కువగా ఉంది. వారి బాధలు, కష్టాలు, వేదనలను మాటల్లో చెప్పలేము. వారితో పాటు వారి కుటుంబాల బాధలు తెలియనివారు మనలో ఎవరుంటారు? మనందరం కలిసి వారి బాధలను, కష్టాలను పంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. దేశం మొత్తం ప్రయత్నిస్తోంది.
మన రైల్వే సహచరులు రాత్రింబగళ్ళు పని చేస్తున్నారు. కేంద్రం, రాష్ట్రం, స్థానిక స్వపరిపాలనా సంస్థలు అన్నీ పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్నాయి. రైల్వే కార్మికులు ముందు వరుసలో ఉన్న కరోనా పోరాట యోధులు. లక్షలాది కార్మికులను రైళ్లు, బస్సుల ద్వారా, సురక్షితంగా తీసుకువెళ్ళడం, వారికి ఆహారం, నీళ్ళు అందజేయడం, ప్రతి జిల్లాలో క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అందరినీ పరీక్షించడం, తనిఖీ చేయడం, అందరికీ చికిత్స చేయడం- ఈ విషయాలన్నీ నిరంతరం అధిక పరిమాణంలో కొనసాగుతున్నాయి. మిత్రులారా! ఈ రోజు మనం చూస్తున్న దృశ్యం దేశంలో జరుగుతున్న విషయాలను పరిశీలించేందుకు, భవిష్యత్తు కోసం తెలుసుకోవడానికి అవకాశాన్ని ఇచ్చింది. ఈ రోజు మన కార్మికుల వేదనలో తూర్పు భారతదేశంలో వారు పడ్డ కష్టాలను మనం చూడవచ్చు. కార్మికుల బలంతో దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగల సామర్థ్యం తూర్పు భారత దేశానికి ఉంది. ఆ ప్రాంతంలో కార్మిక శక్తిని వృద్ధి ఇంజిన్‌గా మార్చేందుకు అవకాశం ఉంది. దీనివల్ల దేశ సంతులిత ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశం నాకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చినప్పటి నుండి తూర్పు భారత దేశ ప్రగతికి ప్రాధాన్యత ఇచ్చాము. గడిచిన సంవత్సరాల్లో ఈ దిశలో చాలా కృషి జరిగిందని నాకు సంతోషంగా ఉంది. ఇప్పుడు వలస కూలీల దృష్ట్యా అనేక కొత్త చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మనం నిరంతరం ఆ దిశగా పయనిస్తున్నాము. కార్మికుల స్కిల్ మ్యాపింగ్ జరుగుతోంది. ఎన్నో స్టార్టప్‌లు ఈ పనిలో నిమగ్నమై ఉన్నాయి. మైగ్రేషన్ కమిషన్ ఏర్పాటు పై కూడా చర్చలు జరుగుతున్నాయి. ఇవి కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే తీసుకున్న నిర్ణయాల వల్ల గ్రామాల్లో ఉపాధి, స్వయం ఉపాధి, చిన్న తరహా పరిశ్రమలకు సంబంధించిన భారీ అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. సంక్షోభ పరిస్థితుల పరిష్కారం కోసం, ఒక స్వావలంబన కలిగిన భారతదేశం కోసం ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. మన గ్రామాలు స్వయం సమృద్ధి కలిగి ఉంటే- మన పట్టణాలు, మన జిల్లాలు, మన రాష్ట్రాలు స్వావలంబన కలిగి ఉంటే చాలా సమస్యలు ఏర్పడవు. అయితే చీకటి నుండి వెలుగులోకి వెళ్లడం మానవ స్వభావం. అన్ని సవాళ్ళ మధ్య దేశ స్వావలంబన- స్వయం నిర్భర్ భారత్ పై నేడు దేశంలో విస్తృత స్థాయిలో చర్చలు ప్రారంభమైనందుకు నాకు సంతోషంగా ఉంది. ప్రజలు ఇప్పుడు దీన్ని తమ ఉద్యమంగా మార్చడం ప్రారంభించారు. ఈ ఉద్యమ నాయకత్వాన్ని ప్రజలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. చాలా మంది ప్రజలు తమ ప్రాంతంలో తయారు చేసిన వస్తువుల పూర్తి జాబితాను తయారు చేసినట్టు కూడా చెప్పారు. ఈ వ్యక్తులు ఇప్పుడు ఈ స్థానిక ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. స్థానిక ఉత్పత్తులపై ప్రచారాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. మేక్ ఇన్ ఇండియాను ప్రోత్సహించడానికి ప్రతి ఒక్కరూ ముందుకు వస్తున్నారు.
భారతదేశం విదేశాల నుండి దిగుమతులను తగ్గించే రోజును చూడాలని ఉందని బీహార్ కు చెందిన హిమాన్షు నమోయాప్‌లో తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్, ఇంధనం, ఎలక్ట్రానిక్ వస్తువులు, యూరియా, వంట నూనెలు మొదలైన వాటి దిగుమతులను తగ్గించాలని ఆయన అభిప్రాయం. నేను వారి భావాలను అర్థం చేసుకున్నాను. మన దేశంలో ఇలాంటి దిగుమతులపై మన నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు ఎంతో డబ్బు ఖర్చు చేస్తారు. వీటిని మనం భారతదేశంలో సులభంగా ఉత్పత్తి చేసుకోవచ్చు
మహిళలు తయారుచేసిన స్థానిక వెదురు ఉత్పత్తుల వ్యాపారం తాను చేస్తానని అస్సాం కు చెందిన సుదీప్ నాకు రాశారు. రాబోయే 2 సంవత్సరాల్లో తన వెదురు ఉత్పత్తిని గ్లోబల్ బ్రాండ్‌గా చేస్తానని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ దశాబ్దంలో స్వావలంబన భారత ప్రచారం దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళుతుందనే నమ్మకం నాకు ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు నేను ఒక రహస్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. కరోనా సంక్షోభం ఉన్న ఈ కాలంలో నేను చాలా మంది ప్రపంచ నాయకులతో చర్చలు జరిపాను. వారికి 'యోగా', 'ఆయుర్వేదం' అంశాలపై చాలా ఆసక్తి ఉందని వారితో సంభాషణల్లో తెలిసింది. కరోనా కాలంలో 'యోగా', 'ఆయుర్వేదం' ఎలా ఉపయోగపడతాయని కొందరు నాయకులు నన్ను అడిగారు.
మిత్రులారా! 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' త్వరలో రాబోతోంది. ప్రజల జీవితాలతో యోగా అనుసంధానం పెరుగుతోన్న కొద్దీ ప్రజలకు తమ ఆరోగ్యం, జాగ్రత్తలపై అవగాహన కూడా పెరుగుతోంది. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలో కూడా హాలీవుడ్ నుండి హరిద్వార్ వరకు ప్రజలు తమ ఇళ్లలో ఉంటూ 'యోగా' పై అమితమైన శ్రద్ధ చూపుతున్నట్లు కనిపిస్తోంది. ప్రతిచోటా ప్రజలు 'యోగా' తో పాటు 'ఆయుర్వేదం' గురించి కూడా మరి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నారు. వాటిని తమవిగా స్వీకరించాలనుకుంటున్నారు. ఎంతో మంది యోగా చేయని వారు ఆన్‌లైన్ యోగా క్లాస్‌లో చేరడమో, ఆన్‌లైన్ వీడియో ద్వారా యోగా నేర్చుకోవడమో చేస్తున్నారు. నిజానికి కమ్యూనిటీ, ఇమ్యూనిటీ, యూనిటీ కోసం 'యోగా' ఉత్తమమైనది.
మిత్రులారా! కరోనా సంక్షోభం ఉన్న ఈ కాలంలో 'యోగా' ప్రాధాన్యత చాలా ఉంది. ఎందుకంటే ఈ వైరస్ మన శ్వాస వ్యవస్థను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. యోగాలో శ్వాసకోశ వ్యవస్థను బలోపేతం చేసే అనేక రకాల ప్రాణాయామాలు ఉన్నాయి. వీటిని మనం చాలా కాలంగా చూస్తున్నాం. ఇవి కాలం పరీక్షించిన పద్ధతులు. వాటికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. 'కపాలభాతి', 'అనులోమ్-విలోమ్', 'ప్రాణాయామం' పరిచయం చాలా మందికి ఉంటుంది. కానీ 'భస్త్రికా', 'శీతలి', 'భ్రామరి' వంటి అనేక రకాల ప్రాణాయామాల వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ జీవితంలో యోగా చేసే అలవాటును పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈసారి ఒక ప్రత్యేకమైన ప్రయోగం చేసింది. 'మై లైఫ్, మై యోగా' పేరుతో అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీని ప్రారంభించింది. ఈ పోటీలో భారతదేశ ప్రజలు మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి ఎవరైనా పాల్గొనవచ్చు. ఇందులో పాల్గొనడానికి మీరు మూడు నిమిషాల వీడియో తయారు చేసి అప్‌లోడ్ చేయాలి. ఈ వీడియోలో, మీరు యోగా చేయడం లేదా ఆసనాలు వేయడం చూపించాల్సి ఉంటుంది. మీ జీవితంలో యోగ వల్ల చోటుచేసుకున్న మార్పుల గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది. మీరందరూ ఈ పోటీలో తప్పక పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఈ విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మీరు భాగస్వాములు కావాలని ఆశిస్తున్నాను.
మిత్రులారా! మన దేశంలో కోట్లాది మంది పేదలు దశాబ్దాలుగా చాలా పెద్ద ఆందోళనతో జీవిస్తున్నారు. తాము అనారోగ్యానికి గురైతే ఎలా అని ఆవేదన చెందుతున్నారు. తమ అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడమా లేదా తమ కుటుంబానికి ఆహారం కోసం ఆలోచించాలా అనే ఆందోళన వారిది. ఈ సమస్యను గ్రహించి, ఈ ఆందోళనను తొలగించడానికి 'ఆయుష్మాన్ భారత్' పథకాన్ని ఒకటిన్నర సంవత్సరాల క్రితం ప్రారంభించాము. కొద్ది రోజుల క్రితం 'ఆయుష్మాన్ భారత్' లబ్దిదారుల సంఖ్య ఒక కోటి దాటింది. అంటే దేశంలో కోటికి పైగా కుటుంబాలు ఈ సేవలు పొందాయి. కోటి కంటే ఎక్కువ మంది రోగులు అంటే ఏమిటి, మీకు తెలుసా? ఒక కోటి కంటే ఎక్కువ మంది రోగులు అంటే నార్వే లాంటి దేశం, సింగపూర్ వంటి దేశం మొత్తం జనాభాలో రెట్టింపు మందికి ఉచితంగా చికిత్స లభించింది. ఆసుపత్రిలో చేరిన తరువాత పేదలు చికిత్స కోసం చెల్లించాల్సి వస్తే సుమారు 14 వేల కోట్ల రూపాయలకు పైగా వారి జేబు నుండి ఖర్చులు చేయాల్సి వచ్చేది. 'ఆయుష్మాన్ భారత్' పథకం పేదల డబ్బు ఖర్చు కాకుండా కాపాడింది. 'ఆయుష్మాన్ భారత్' లబ్దిదారులందరితో పాటు రోగులకు చికిత్స చేసే వైద్యులు, నర్సులు మరియు వైద్య సిబ్బందిని నేను అభినందిస్తున్నాను. దేశంలోని ఏ ప్రాంతంలో అయినా చికిత్స పొందగలిగేందుకు వీలుగా పోర్టబిలిటీ సౌకర్యం కూడా 'ఆయుష్మాన్ భారత్' పథకంలో ఉంది. అంటే బీహార్‌లోని ఒక పేద వ్యక్తి కోరుకుంటే తన రాష్ట్రంలో పొందే సదుపాయాలను కర్ణాటకలో కూడా పొందవచ్చు. అదేవిధంగా, మహారాష్ట్రకు చెందిన ఒక పేద వ్యక్తి కోరుకుంటే అతనికి తమిళనాడులో కూడా అదే చికిత్స లభిస్తుంది. ఈ పథకం కారణంగా ఆరోగ్య వ్యవస్థ బలహీనంగా ఉన్న ఏ ప్రాంతంలోనైనా ఉండే పేదలు దేశంలోని ఏ మూల అయినా ఉత్తమ చికిత్స పొందే సదుపాయాన్ని పొందుతారు.
మిత్రులారా! ఈ పథకం ద్వారా లబ్ది పొందిన ఒక కోటి మందిలో 80 శాతం దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చెందినవారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ లబ్దిదారులలో సగం మంది మన తల్లులు, సోదరీమణులు, కుమార్తెలు. ఈ లబ్ధిదారులలో చాలా మంది సాధారణ మందులతో చికిత్స చేయలేని వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో 70 శాతం మందికి శస్త్రచికిత్స జరిగింది. ఎంత పెద్ద బాధల నుండి వారికి స్వేచ్ఛ లభించిందో మీరు ఊ హించవచ్చు. మణిపూర్ లోని చురా చాంద్ పూర్ కు చెందిన ఆరేళ్ల చిన్నారి కెలెన్సాంగ్ కూడా ఆయుష్మాన్ పథకం నుండి కొత్త జీవితాన్ని పొందాడు. కెలెన్సాంగ్ ఇంత చిన్న వయసులో తీవ్రమైన మెదడు వ్యాధితో బాధపడ్డాడు. ఈ చిన్నారి తండ్రి రోజువారీ కూలీ. తల్లి చేనేత కార్మికురాలు. అటువంటి పరిస్థితిలో పిల్లలకి చికిత్స చేయించడం వారికి చాలా కష్టమైంది. కానీ 'ఆయుష్మాన్ భారత్' పథకంతో వారి కుమారుడికి ఉచిత చికిత్స లభించింది. పుదుచ్చేరికి చెందిన అమూర్తా వల్లి కి కూడా ఇలాంటి అనుభవమే ఉంది. 'ఆయుష్మాన్ భారత్' పథకం ఆమెను ఇబ్బందుల నుండి కాపాడింది. అమూర్తా వల్లి భర్త గుండెపోటుతో విషాదకరంగా మరణించారు. ఆమె 27 ఏళ్ల కుమారుడు జీవాకు కూడా గుండె జబ్బువచ్చింది. జీవాకు శస్త్రచికిత్స చేయమని వైద్యులు సూచించారు. కానీ రోజువారీ కూలీ కార్మికుడైన జీవాకు తన ఖర్చుతో ఇంత పెద్ద ఆపరేషన్ చేయించుకోవడం సాధ్యం కాలేదు. దాంతో అమూర్తా వల్లి తన కొడుకును 'ఆయుష్మాన్ భారత్' పథకంలో నమోదు చేశారు. తొమ్మిది రోజుల తరువాత కొడుకు జీవాకు కూడా గుండె శస్త్రచికిత్స జరిగింది.
మిత్రులారా! నేను కేవలం మూడు, నాలుగు సంఘటనలను ప్రస్తావించాను. 'ఆయుష్మాన్ భారత్' పథకంతో సంబంధం ఉన్న విజయగాథలు కోటి కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విజయ గాథలు బాధల నుండి విముక్తమైన మన కుటుంబ సభ్యులవి. మీకు సమయం దొరికితే 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద చికిత్స పొందిన వ్యక్తితో మీరు ఖచ్చితంగా మాట్లాడాలని నేను మిమ్మల్నికోరుతున్నాను. పేద కుటుంబానికి చెందిన వ్యక్తి వ్యాధి నుండి విముక్తి పొందినప్పుడు అతను పేదరికంతో పోరాడే శక్తిని కూడా పొందుతాడు. 'ఆయుష్మాన్ భారత్' పథకం కింద ఉచితంగా చికిత్స పొందిన పేదలు వారి జీవితంలో పొందిన ఆనందానికి, సుఖానికి కారణం నిజాయితీ కలిగిన పన్ను చెల్లింపుదారులే. నిజాయితీగల పన్ను చెల్లింపుదారులు కూడా ఈ పుణ్యంలో భాగస్వాములే అని నేను వారికి చెప్పాలనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! ఒక వైపు మనం మహమ్మారితో పోరాడుతున్నాం. మరోవైపు తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఇటీవల ప్రకృతి విపత్తును కూడా ఎదుర్కొన్నాము. గత కొన్ని వారాలలో పశ్చిమ బెంగాల్, ఒడిషా లలో సూపర్ సైక్లోన్ అమ్ఫాన్ కలిగించిన వినాశనాన్ని కూడా మనం చూశాము. తుఫాను కారణంగా చాలా ఇళ్ళు ధ్వంసమయ్యాయి. రైతులు కూడా భారీ నష్టాలను చవిచూశారు. నేను గత వారం ఒడిషా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు వెళ్ళాను. పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల ప్రజలు ఆ విపత్కర పరిస్థితిలో ప్రదర్శించిన ధైర్యం, తెగువ ప్రశంసనీయం. సంక్షోభం ఉన్న ఈ కాలంలో దేశం కూడా అన్ని విధాలుగా ఆ రాష్ట్రాల ప్రజల కు సంఘీభావం ప్రదర్శిస్తోంది.
మిత్రులారా! ఒక వైపు తూర్పు భారతదేశం తుఫాను కారణంగా విపత్తును ఎదుర్కొంటున్న ఈ సమయంలో మరోవైపు మిడుతల దాడి వల్ల దేశంలోని చాలా ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. ఒక చిన్న జీవి ఎంత నష్టం కలిగిస్తుందో ఈ దాడులు మళ్ళీ గుర్తుచేస్తాయి. మిడుతల దాడి చాలా రోజులు ఉంటుంది. దీని ప్రభావం అధిక విస్తీర్ణంలో ఉంటుంది. ఈ సంక్షోభం వల్ల కలిగే ఆపదలను నివారించడానికి భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ శాఖ, పరిపాలన యంత్రాంగం రైతులకు సహాయం చేయడానికి ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నాయి. ఇది కొత్త ఆవిష్కరణలకు కూడా దారి చూపుతోంది. మన వ్యవసాయ రంగంలో వచ్చిన ఈ సంక్షోభం నుండి బయటపడి, మన వ్యవసాయాన్ని సంరక్షించుకోగలమని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశ వాసులారా! కొద్ది రోజుల తరువాత జూన్ 5 న ప్రపంచం మొత్తం 'ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని' జరుపుకుంటుంది. ఈ సంవత్సరం 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' థీమ్ - జీవ వైవిధ్యం. ప్రస్తుత పరిస్థితులలో ఈ థీమ్ చాలా ముఖ్యమైనది. లాక్డౌన్ సమయంలో గత కొన్ని వారాలలో జీవిత వేగం కొంచెం మందగించింది. అయితే ఇది ప్రకృతి వైవిధ్యాన్ని, మన చుట్టూ ఉన్న జీవ వైవిధ్యాన్ని దగ్గరి నుండి చూడటానికి కూడా ఒక అవకాశాన్ని ఇచ్చింది. కాలుష్యం ఫలితంగా గాలిలో అదృశ్యమైన పక్షుల కిలకిలరావాలను చాలా సంవత్సరాల తరువాత ప్రజలు తమ ఇళ్ళలో ఉండి వింటున్నారు. జంతువులు చాలా స్వేచ్ఛగా సంచరిస్తున్నాయన్న సమాచారం చాలా ప్రదేశాల నుండి వస్తోంది. నా లాగే మీరు సోషల్ మీడియాలో ఈ విషయాలను చూసి ఉంటారు, చదివి ఉంటారు. తమ ఇంటి నుండి కొండలను చూడగలుగుతున్నామని, చాలా దూరంలో ఉన్న కాంతి ని చూడగలుగుతున్నామని చాలా మంది ప్రజలు రాస్తున్నారు. ఫోటోలు పంచుకుంటున్నారు. ఈ చిత్రాలను చూసిన చాలా మంది ఈ దృశ్యాలను ఇలా కొనసాగించాలన్నసంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాలు ప్రకృతి కోసం ఏదైనా చేయటానికి ప్రజలను ప్రేరేపించాయి. నదులు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండడానికి, జంతువులు, పక్షులకు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించడానికి, ఆకాశం కూడా శుభ్రంగా ఉండడానికి మనం ప్రకృతితో అనుసంధానం చెందాలి. ఈ దిశగా కృషి చేయడం ద్వారా జీవితాన్నిఆనందంగా గడపడానికి ప్రేరణ పొందవచ్చు.
ప్రియమైన దేశవాసులారా! 'జలం ఉంటేనే జీవితం. నీరు ఉంటేనే మనకు రేపు ఉంటుంది' అని మనం వింటుంటాం. నీటి విషయంలో మనకు కూడా ఒక బాధ్యత ఉంది. వర్షపు నీటిని సంరక్షించాలి. ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాలి. వర్షపునీటిని ఎలా ఆదా చేయాలి? సాంప్రదాయికంగా ఉన్న చాలా సులభమైన ఉపాయంతో మనం నీటిని కాపాడగలం. నీటిని ఐదు నుండి ఏడు రోజులు నిలపగలిగితే భూమాత దాహార్తి తీరుతుంది. ఆ నీరు భూమిలోకి వెళుతుంది. అదే నీరు జీవన శక్తి అవుతుంది. అందువల్ల ఈ వర్షాకాలంలో మనమందరం నీటిని ఆదా చేయడానికి, సంరక్షించడానికి కృషి చేయాలి.
నా ప్రియమైన దేశవాసులారా! స్వచ్చమైన పర్యావరణం మన జీవితానికి సంబంధించిన విషయం. మన పిల్లల భవిష్యత్తు కూడా దీంతో ముడిపడి ఉంది. . అందువల్ల మనం వ్యక్తిగత స్థాయిలో కూడా దీని గురించి ఆలోచించాలి. ఈ 'పర్యావరణ దినోత్సవం' నాడు కొన్ని మొక్కలను నాటాలని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రకృతితో రోజువారీ సంబంధాన్ని కలిగి ఉండేలా ప్రకృతికి సేవ చేసేందుకు నిర్ణయించుకోవాలని కోరుతున్నాను. వేడి పెరుగుతోంది. కాబట్టి పక్షులకు నీరు ఏర్పాటు చేయడం మర్చిపోవద్దు.
- మనమందరం కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇంత కఠినమైన తపస్సుతో , చాలా కష్టాలను తట్టుకుంటూ దేశం కరోనాను ఎదుర్కొన్న విధానాన్ని నీరుగార్చకూడదు. ఈ పోరాటాన్ని బలహీనపరచకూడదు. మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అప్రమత్తతను వీడకూడదు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటం ఇంకా తీవ్రంగా ఉంది. మీరు, మీ కుటుంబం కరోనా నుండి ఇంకా తీవ్ర ప్రమాదంలో ఉండవచ్చు. మనం ప్రతి ఒక్కరి ప్రాణాన్ని కాపాడుకోవాలి. అందువల్ల రెండు గజాల దూరంలో ఉండడం, ఫేస్ మాస్క్‌లు ఉపయోగించడం, చేతులు కడుక్కోవడం - ఈ జాగ్రత్తలన్నీఇంతకుముందు పాటిస్తున్నట్టుగానే కొనసాగించాలి. మీ కోసం, మీ ప్రియమైనవారి కోసం, మీ దేశం కోసం మీరు ఈ జాగ్రత్తలు తీసుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఈ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ, మీరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అనేక కొత్త అంశాలతో వచ్చేనెల మరోసారి 'మన్ కి బాత్' తప్పకుండా నిర్వహిస్తాను.
ధన్యవాదాలు
*****
(Release ID: 1628262)
Visitor Counter : 318
Read this release in:
Punjabi
,
Manipuri
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam